Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 12


    సరిగ్గా ఇదే సమయంలో హైదరాబాద్ నివాసి, చాలామంది ప్రజలకు పారిశ్రామికవేత్తగా బహు కొద్దిమందికి అండర్ వరల్డ్ రాకెట్స్ నడిపే బలమైన శక్తిగా పేరుగాంచిన ధనుష్కోటి ఇంటిలో ఫోన్ రింగయింది.


    "ఆర్కెని మాటాడుతున్నాను బాంబే నుంచి."


    రిసీవరు అందుకున్న ధనుష్కోటి అనుచరుడు కంగారుగా ధనుష్కోటికి ఫోన్ అందించాడు. అంత పేరుగల ధనుష్కోటికి ఆర్కె నుంచి ఫోన్ అనగానే అలర్ట్ కావడానికి కారణం ఆర్కెగా పిలువబడే రాంకుమార్ అగర్వాలా ఇండియాలోనేగాక, మలేసియా, థాయ్ లాండ్ వంటి విదేశాలలో సైతం ఇండస్ట్రీస్ గల ప్రముఖ పారిశ్రామికవేత్త.


    "నమస్తే. ధనుష్కోటిని మాట్లాడుతున్నాను" వారి సంభాషణ ఇంగ్లీషులో సాగుతోంది. కాలాన్ని సెకండ్లుగా విడదీసి వెలకట్టి ఆలోచించే ఆర్కె సూటిగా పాయింట్ కి వచ్చేసాడు. "ఇంతకు పూర్వం మీతో వున్న పరిచయంతో మీ దక్షత తెలిసిన వ్యక్తిగా చిన్న అవసరం ఏర్పడింది. "ధనుష్కోటీ! మీకు తెలుసనుకుంటాను నాకు ఒక్కగానొక్క కొడుకు"


    "చెప్పండి..." ధనుష్కోటికి అర్ధమైపోయింది చాలా ఖరీదైన ఒప్పందం జరగబోతుందని.


    "ఆస్తిపాస్తులతో ప్రతిష్టని పెంచుకునే స్థాయిని నేనెప్పుడో దాటేశాను".


    "అది నాకు తెలుసు"


    "ఈ ఏడాది జాతీయస్థాయిలో మావాడు షూటింగ్ కాంపిటేషన్స్ లో మొదటివాడిగా వస్తాడని నిన్నటివరకూ నమ్మేవాడ్ని. మరేం లేదు. చెప్పానుగా నాకు డబ్బుకన్నా ప్రతిష్ఠ ముఖ్యమని".


    "ఇప్పుడేం జరిగింది సాబ్" ధనుష్కోటి భృకుటి ముడిపడింది.


    "మామూలుగా అయితే జాతీయ స్థాయిలో బాగా స్కోర్ చేసే మొదటి ముగ్గురు వ్యక్తులూ అంతర్జాతీయ పోటీలకు పంపబడేవారు. కాని ఈసారి ఫెడరేషన్ వాళ్ళు బడ్జెట్ ప్రాబ్లంతో ఒక్కడ్నే పంపాలని నిశ్చయించారట. ఆ డబ్బు నేను సర్దగలను కావాలంటే. కాని నా కొడుకు ప్రథముడుగా వచ్చాడు అన్న ఆత్మసంతృప్తి నాకు దక్కదుగా" అప్పుడు చెప్పాడు ముందురోజు ప్రిలిమినరీస్ లో నేషనల్ రికార్డును అధిగమించిన శశాంక గురించి...


    ధనుష్కోటికి అర్ధమైపోయింది.


    మరో మూడు రోజులలో ఢిల్లీలో జరగబోయే జాతీయస్థాయి పోటీలో శశాంక ప్రథముడిగా రాకూడదు. ఆర్కె కొడుకు పిస్టల్ షూటింగ్ లో మొదటివాడుగా ఎన్నిక కావాలి.


    "మీరిక రిలాక్స్ కండి ఆర్కెగారూ... శశాంకగా పిలవబడే ఈ అబ్బాయి చరిత్ర పురిటిలోనే సంధి కొడుతుంది. సన్నాఫ్ ఆర్కె ఈజ్ గోయింగ్ టు స్టేండ్ ఫస్ట్...ఓ.కె."


    ఫోన్ క్రెడిల్ చేసిన ధనుష్కోటికి శశాంక వివరాలు సేకరించడానికి పట్టింది కేవలం పదిహేను నిముషాలు.


    తొలి ప్రయత్నంలోనే అసాధారణమైన ప్రజ్ఞను ప్రదర్శించిన శశాంక ఓటమికి కావలసిన పథకం ఆ మరుసటిరోజే సిద్ధమైపోయింది.


    రాత్రి పదకొండు గంటలవేళ...


    నీలాకాశంపై వెన్నెల తోరణం నేలకు ముగ్గులు అద్దుతుంటే ఉత్సుకతగా కిటికీని దాటబోయిన ఒక కిరణం సిగ్గుతో తారగానే ఆగిపోయింది.


    "ప్లీజ్..." భర్త గుండెలపై తలానించి వేళ్ళతో కవిత లల్లుతూ వరమడుగుతున్నట్లుగా అంది "నేనూ వస్తానండి" అని.


    "కృపా" చిరుగాలి అలల తాకిడికే అల్లనల్లన కదులుతున్న యామినీ కుంతలాల్ని సవరిస్తూ నచ్చచెప్పాడు "నువ్వు వట్టిమనిషివి కాదు..." అని.


    "మోసేదాన్ని నేనుగా. మధ్యలో మీకేంటి" పెదవుల్ని విల్లులా వంచి ఉక్రోషంగా చూసింది. మరుసటి రోజు శశాంకతోపాటు ఢిల్లీ వెళ్ళాలని ఉవ్విళ్ళూరుతూందామె.


    "అది కాదు కృపా! స్ట్రెయినైపోతావు."


    "అప్పుడే స్వార్థం. కొడుకెక్కడ అలిసిపోతాడో అని కదూ!"


    "కొడుకైతే ఫర్వాలేదు. నాలా మొండిగా తట్టుకుంటాడు. పాపం కూతురు కదా. చాలా సుకుమారంగా వుంటుంది నీలా. అందుకే నా మాట విని అమ్మాయిని ఇబ్బంది పెట్టకు."


    "ఏంటీ - అంతా మీ ఇష్టమే అయినట్టు అమ్మాయంటారు." చిరుకోపం ఆమె కళ్ళలో.


    "ఇందాక లెక్క చూశాను."


    "ఏంటీ" విస్మయంగా అడిగింది.


    "అదీ... మనకు పెళ్ళయిన ఈ ఏడాదిలో ఎక్కువసార్లు దక్షిణం వేపు గాలి తగిలేట్టే పడుకున్నాం" సీరియస్ గా అనేసరికి నవ్వాపుకోలేకపోయింది.


    "అంటే, మీరు ఆ సమయంలో ఎక్కువ దిక్కులు లెక్కపెట్టుకుంటూ కూర్చునేవారన్నమాట" కృప ఓ అస్త్రాన్ని సంధించేసరికి ఈసారి నవ్వడం శశాంక వంతైంది.


    "అంచేత మాస్టారూ...మీరేం టాపిక్ మార్చేసి నన్ను బుజ్జగించాలని ప్రయత్నించకండి. మనం వస్తున్నాం."


    శశాంక నిశ్శబ్దంగా వుండిపోయాడు.


    "గుర్తుందా, నేను తోడు లేకపోతే మీరేమీ సాధించలేనన్నారుగా."


    "సాధించానుగా".


    "అంటే నా తోడు అవసరం లేదంటారు."


    ఏదో అపశృతి ధ్వనించింది. "కృపా...చాలా చిన్న విషయం గురించి పేచీ పెడుతున్నావు." ఫలానా అని చెప్పలేని ఓ భావం ఇంట్యూషన్ లా ఆమెను కుదిపేసుంటే "మాతోనే వుండాలనుందండీ" అంది దీనంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS