"ఓహో! ఫిలాసఫీ విద్యార్థిని కదా?" అని నవ్వారాయన. దేవదాసిని ఇతడికివ్వాలన్న శ్రీలక్ష్మి ఆలోచన గుర్తువచ్చింది. "కొమ్ముకాస్త మాను అయినట్లుంది. అక్కడి విశేషాలు చెప్పవయ్యా అంటే వేదాంతం ఒలకబోసాడు! ఇతడిక పెళ్ళీగిళ్ళీ అనుకొని సంసారమేంచేస్తాడు?" అనుకొన్నారాయన.
ఈమాటా ఆమాటా మాట్లాడి చివరికన్నారు సూర్యదేవులు! "నాన్నగారి సంగతి ఏం ఆలోచించావు. రామా?"
"సంగతేమిటి" విస్మయం ప్రకటించాడు అతడు.
"ఆయనకిక్కడ మంచి వైద్యసదుపాయమేం జరుగుతుంది? పట్నం తీసుకుపోయి మంచి డాక్టర్లతో ప్రయత్నం చేయవద్దూ?"
"చేస్తే బాగానే ఉంటుంది కాని" మనస్సులో అనుకొన్నాడు. 'పోయేవాళ్ళను పట్టుకొంటే నిలుస్తారా, పిచ్చిగాని!'
"కాని?"
"ఎవళ్ళ దగ్గరికి వెళ్ళాలో, ఏం చేయాలో నాకేం తెలుసు, మామయ్యా?"
'హరి హరీ!' అనుకొన్నారాయన "ఫారిన్ రిటర్న్ డ్ వి! ఎవరిదగ్గరికి వెళ్ళాలో తెలియదంటావేమిటి, రామా? నీలాగా గొప్ప చదువులేవీ చదువని పల్లెటూరివాణ్ణే? నేను చేసుకొస్తానుగదయ్యా, ఇలాంటి పనులు సునాయాసంగా?"
"మీరు అనుభవజ్ఞులు!"
"నువ్వు పాతికేళ్ళ అర్భకుడివి కదా?" పరిహసించారు కన్నతండ్రా, మరొకరా రామా? ఆయన పుట్టెడు రోగంతో మంచాన పడుంటే నీకేమనిపించడంలేదా? చూడు! నీవలె మౌనిని కాక సంసార లంపటుడినే అనుకో. నిరంతరం భార్యాపిల్లలు, సంసారం అంటూ తాపత్రయపడేవాడినే అనుకో. ఇలాంటివాడు నాకు నీతులు నేర్పడమేమిటని అనుకోక! నాక్షేమంకోరి నా పెద్దలు చూపిన దారి నడవడమే నాకర్తవ్యంగా భావించి ఆకర్తవ్య పాలననే ముక్తిసాధనగా చేసుకొంటున్నవాడిని. ఈ సంసారం చేస్తూన్న వాళ్ళందరూ సంసారం మీది వ్యామోహంతోటే చేస్తున్నారని అనుకోకు. ప్రేమించేవారిని నొప్పించలేక తన అభిరుచులను ఆశయాలను త్యాగం చేసి బలవంతాన ఈ సంసారపు కాడి మెడలమీదికి ఎత్తుకొన్నవారు ఎందరో.
"అమ్మా నాన్నకు ఒక్కడివి! అన్ని ఆశయాలూ నీమీదే పెట్టుకొని జీవిస్తున్నారు వాళ్ళు. నీ ఉదాసీన ప్రవర్తన ఆ ప్రేమాహృదయాలను గాయపర్చడం లేదటయ్యా? కన్నవారిని, ఆప్తులను నొప్పించి నువ్వు సాధించే ముక్తి ఏమిటి? పొందే ఆనందమేమిటి?"
అన్ని మాటలూ మౌనంగా విన్నాడు భార్గవరామ్. ఒక్కమాటకూడా ఎదురు చెప్పలేదు. వాదించలేదు. అయితే, ఆయన మాటలు ఖండించలేని అశక్తుడనికాదు. తను చదివిన చదువు సంపాదించిన విజ్ఞానం, ఆయన మాటలు దూదిపింజలా ఎగురగొట్టడానికి చాలకపోవు! కాని పెద్దమనిషి! తనకున్న ప్రజ్ఞ చూపుకొనితన హితవు కోరే పెద్దమనిషిని నొప్పించడం దేనికి? ప్రాజ్ఞత కాదది!
"మధ్యాహ్నం భోజనం చేసుకొని వెడదాముసరేనా?" అని క్రిందికి వచ్చేశారు సూర్యదేవులు.
"మెట్టవేదాంతం వంటబట్టించుకొనివాడూ దూరంగా పారిపోయే! మీరు పంతాలకూ రోషాలకూపోయి దూరంగా ఉండిపోతిరీ! మీరిద్దరు దగ్గరచేరేదెలాగ? వాడికి కాస్త తల్లీ, సంసారం అన్న ధ్యాస కలగాలంటే నీ మాతృప్రేమనంతటినీ అతడిమీద ప్రవహింపజేయాలి, మమతతో కట్టిపడేయాలిగాని, నువ్వూ పట్టించుకోకపోతే ఎలా చెప్పు? కన్నకొడుకా, మరొకటా? వాడికా పిచ్చి ముదిరి ఇల్లూ, పెళ్ళీ అనుకోకుండా సన్యాసి అయిపోతే నీ గుండె భరించగలదా?"
"వాడికాగీతే ఉంటే నేను మాత్రం తప్పించగలనా?" విరక్తిగా నిట్టూర్చింది కృష్ణవేణి.
"కొడుకు వేదాంతం నీకూ సోకింది?"
"కాదు సూర్యదేవా! తల్లీ బిడ్డల మధ్య మమకారమన్నది సహజంగా రావాలిగాని కృత్రిమంగా తెచ్చుకొనేది కాదు" బరువుగా అన్నది.
కొద్దిసేపు మాట్లాడలేదు సూర్యదేవులు. అతడి విపరీతమైన ఆలోచనలు ఆ మమతను త్రెంచుతున్నాయనిపిస్తుంది మరీ "అతడిని ఒంటరిగా ఉండిపోనీయకు, అక్కా! అతడెంతగింజుకొన్నా, అతడిని నలుగురిలో ఉంచే ప్రయత్నం చేయాలి. అప్పుడు కొంతయినా మనకు అనుకూలమైన మార్పు వస్తుంది."
అటువంటి నిర్భంధాలేమైనా ఇక్కడ తగిలితే పత్తా లేకుండా పారిపోగలడు! రెక్కలొచ్చాయి గదా?"
సూర్యదేవుల స్నానానుష్ఠానాలు, భోజనం అయిపోయాయి. భోజనానంతరం ఆయనకు తాంబూల చర్వణం అలవాటుంది. దేవదాసి చిలక చుట్టి ఇచ్చింది తండ్రికి. తాంబూలం నములుతూ చెప్పారు సూర్యదేవులు: దేవతతో అవసరముంటే కొన్నాళ్ళపాటు ఇక్కడనే ఉంచుకోమని చెప్పింది, అక్కా నీ మరదలు!"
