"చాలా అలసిపోయావు కాని ఇక చాలించు. ఇవాళ మనిద్దరం కలిసి సూపర్ మేన్ సినిమాకి వెళ్దాం. నువ్వు రెడీగా ఉండు. నేనలా బయటికి వెళ్ళి ఓ అరగంటలో వచ్చేస్తాను." అన్నాడు రాజారామ్.
"ఓకే"
అటుగా వచ్చిన ఆటోని ఆపి లక్డీకాపూల్ వెళ్ళాడు రాజారామ్. కృష్ణా మాసేజ్ పార్లర్ వేపు చూశాడు. అట్టే జనం లేరక్కడ. పార్లర్ లోకి వెళ్ళగానే రిసెప్షనిస్ట్ పలకరించింది. "కృష్ణారావు గారి కోసం వచ్చాను. ఉన్నారా?" అన్నాడు.
"ఒక్క నిమిషం కూర్చోండి"
అయిదు నిమిషాలు గడిచాయి. నల్లగా చింత మొద్దులా ఉన్న వ్యక్తి గదిలోకి వచ్చాడు. ఎరుపురంగు పాంటు, నీలం రంగు చారల బుష్ షర్టు, ఎర్రగా కళ్ళు నడి నెత్తిమీద నాలుగో అయిదో తల వెంట్రుకలు.
"నా పేరే కృష్ణారావ్. మీరేనా నా కోసం వచ్చిందీ?"
"అవును."
"ఎవరు పంపించారు?"
"ఎవరూ పంపలేదు. నేనే వచ్చాను."
"ఏం పని"
తనొచ్చి అతన్ని డిస్టర్బ్ చేసినట్టు గ్రహించాడు రాజారామ్. అందుకే అతనంత అసహనంగా మాట్లాడుతున్నాడు.
"మీరు నాకో చిన్న సహాయం చెయ్యాలి. నేను సుందరి కోసం వచ్చాను."
"ఆ అమ్మాయి ఇప్పుడిక్కడ పని చెయ్యడంలేదు."
రాజారామ్ ఆలోచిస్తూ నిలబడ్డాడు. కృష్ణారావు ఒకసారి పరిశీలనగా అతని మొహంలోకి చూశాడు.
"శుక్రవారం రాత్రి చూశానా అమ్మాయిని అంతే అప్పట్నుంచీ ఆ అమ్మాయి అజా పజా తెలీదు నాకు! అన్నట్లు ఆ అమ్మాయి మీకేమైనా అవుతుందా?"
"ఏమీ కాదు కాని....సుందరికి ఆస్తి కలిసివచ్చింది ఆ విషయం చెప్పాలని...వచ్చాను. గత మూడు రోజుల్నుంచీ ఆమె కోసం వెతుకుతున్నాను." అంటూ సిగరెట్ పాకెట్ తీసి కృష్ణారావుకి ఆఫర్ చేశాడు. అతను 'నొ థాంక్స్' అన్నాక తను సిగరెట్ వెలిగించాడు.
"ఏదో డబ్బు వస్తుందనీ, ఎవరో డబ్బున్న మారాజు పెళ్ళాడతాడని కబుర్లు చెప్తూ ఉండేది. మె మెవరం నమ్మలేదు. నిజమేనన్నమాట" అన్నాడు కృష్ణారావు.
"అవును అన్నట్టు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ గురించి మీకేమన్నా చెప్పిందా?"
"ఎవరో ఉన్నారని చెప్పింది. కాని అతనెప్పుడూ ఇక్కడికి రాలేదు."
"ఆమె కోసం మరెక్కడ వెదికితే బాగుంటుందో చెప్పగలరా?" అనడిగాడు రాజారామ్ ఇంకా ఆశ చావక.
"అసలా అమ్మాయి ఎక్కడుంటుందో కూడా నాకు తెలీదు. అన్నట్టు మీ పేరేమిటన్నారు?"
"రాజారామ్"
"అలాగా? మీ పనికేమి ఇబ్బంది లేకపోతే నాకో చిన్నపని చెయ్యండి. నేను 'సరుకు' రవాణా మానేసి చాలా కాలమైంది. ఇప్పుడేదో ఈ పార్లర్ని గౌరవంగా నడుపుకొంటున్నాను. నా వెంటపడి టీం వేస్త చేసుకోవద్దని మెహతా సాబ్ కి చెప్పండి." అనేసి చటుక్కున లోపలికి వెళ్లి పోయాడు కృష్ణారావు.
మెహతాసాబ్?
సరుకు అంటే గంజాయి అని అర్ధం!!
మాసేజ్ పార్లర్ ముసుగులో గంజాయి రవాణా చేస్తున్నాడా? గంజాయి రవాణాకి సుందరి అంతర్ధానానికి ఏం సంబంధం? ఇన్ స్పెక్టర్ మెహతా కృష్ణారావు మీద నిఘా వేసి ఉంటాడా?
ఇలా ఆలోచిస్తూ పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గర ఆగాడు. 'ఆంధ్రా టైమ్స్'కి ఫోన్ చేసి అబ్రహాం కోసం అడిగాడు.
"హల్లో" అన్న అబ్రహాం గొంతు__వినగానే__"హలో అబ్రహాం! నేను రాజారామ్ ని. ఆ మిస్సింగ్ గర్ల్ స్టోరీకి మనం మరో ఏంగిల్ చేర్చాలి!
"సారీ రాజారామ్ గారూ!మీకు బేడ్ న్యూస్ చెప్తున్నాను"
"బేడ్ న్యూసా? ఏమిటది?"
"సుందరి గురించి రెండు మూడు రోజుల వరకూ పేపర్లో ఏమీ వెయ్యవద్దన్నారట పోలీస్ కమీషనర్ అప్పారావు గారు కూడా ఓకే అన్నారు. అన్నట్టు రాజారామ్ గారు మీకోసం విరించిగారు ఇవాళ చాలాసార్లు అడిగారు..."
"ఓ పని చెయ్యి అబ్రహాం. ఈ కాల ఆయనకీ ట్రాన్స్ ఫర్ చెయ్యి"
"సరే సర్"
పది క్షణాలు గడిచాక ఫోన్ లో విరించి గొంతు ఖంగుమని మోగింది.
"హల్లో రాజా!"
"స్పీకింగ్"
"నీకోసం గంటసేపట్నుంచీ ట్రయ్ చేస్తున్నాను. ఏమైపోయావ్?"
ఏదో అనబోయాడు రాజారామ్.
"ఓ పావుగంట క్రితం ఏం చేశానో తెలుసా రాజారామ్ నీ రాజీనామా కాగితం చింపేసి బుట్టలో పడేశాను."
"అయాంసారీ మిష్టర్ విరించీ, నా నిర్ణయం మారదు." అన్నాడు రాజారామ్ దృఢంగా.
"అదికాదు రాజా, నేను చెప్పేది విను. నేను అప్పారావుతో సంగతంతా మాట్లాడాను. అతను నీకు క్షమార్పణ చెప్పుకోడానికి రెడీగా వున్నాడు. చైర్మన్ గారితో కూడా నీ సంగతి మాట్లాడాను. ఇవాళ రాత్రి నిన్ను డిన్నర్ కి పిలవమన్నారు. మనం ముగ్గురం కూర్చుని విషయాలు మాట్లాడుకుందాం, ఏమంటావ్?"
"సరే"
"అయితే ఆరున్నరకల్లా మీ ఇంటికి కారు పంపిస్తాను. వచ్చే సెయ్యి"
"అలాగే" అని ఫోన్ పెట్టేశాడు రాజారామ్. 'అప్పారావు కొంచెం తోకముడుచాడన్న మాట?' అనుకుంటూ రోడ్డు మీదికి నడిచాడు.
3
ఆలోచనలతో వేగిపోతూ రాజారామ్ ఇల్లు చేరుకున్నాడు. గుమ్మంలో ఉండగానే లోపల ఎవరో ఉన్న అలికిడి వినిపించింది. కబుర్లు .... కిలకిల నవ్వులు... వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది రెండు క్షణాలు గుమ్మం దగ్గరే ఆగిపోయాడు.
