Previous Page Next Page 
దేవదాసు పేజి 11

    పార్వతి నెమ్మదిగా దగ్గరకు వెళ్ళి నిలుచున్నది. దేవదాసు ఒక్కసారి ముఖం పైకెత్తాడు. మళ్ళీ చాలాసేపటి వరకు శూన్య దృష్టితో నదివైపే చూస్తూ వున్నాడు. "దేవదాదా, నాతో ఏమయినా చెపుతావా?" అన్నది పార్వతి.
    దేవదాసు ఏ వైపుకూ చూడకుండా "రా, కూర్చో!" అన్నాడు.
    పార్వతి కూర్చోలేదు. తల వంచుకొని నిలబడి వుంది. కాని కొంచెం సేపటివరకూ ఏమీ సంభాషణ జరగకపోవడంతో పార్వతి పార్వతి నెమ్మదిగా ఒక్కొక్క అడుగు రేవు వైపుకు వేస్తూ వుంది. దేవదాసు అకస్మాత్తుగా తల ఎత్తి ఆమెవైపు చూసాడు. "వినూ!" అన్నాడు.
    పార్వతి తిరిగి వచ్చింది. అయినా దేవదాసు ఏమీ మాట్లాడలేదు. ఇది చూసి ఆమె మళ్ళీ తిరిగిపోయింది. దేవదాసు స్తబ్దంగా కూర్చొని వున్నాడు. కొంచెం సేపటి తరువాత మళ్ళీ చూశాడు. పార్వతి నీళ్ళు తీసికొని వెళ్ళడానికి సిద్ధపడుతూవున్నది. ఇది చూసి అతడు గాలం ప్రక్కన పడేసి రేవు పైకి వచ్చి నిలబడి "నేను వచ్చాను" అన్నాడు. పార్వతి కేవలం బిందె దించి ప్రక్కన పెట్టింది. ఏమీ  మాట్లాడలేదు.
    పార్వతి కొంచెం సేపు మౌనంగా నిలబడి వుంది. ఆఖరుకు అత్యంత మధురమైన స్వరంతో "ఎందుకూ?" అని అడిగింది.
    "నీవు వ్రాయలేదా?"
    "లేదు!"
    "ఇదేమిటి పత్తో! ఆ రాత్రి విషయం మరచిపోయావా?"
    "లేదు, కాని ఆ విషయంతో ఇక పనేముంది?"
    ఆమె కంఠస్వరం తీవ్రంగానూ, పెళుసుగానూ వుంది. దేవదాసు దాని మర్మం తెలుసుకోలేకపోయాడు. "నన్ను క్షమించు. నేను అప్పుడు ఇంతగా అర్ధం చేసుకోలేకపోయాను." అన్నాడు.
     "ఇక మాట్లాడకు! ఈ మాటలన్నీ నాకు నచ్చవు."
    "నేను ఏ విధంగానైనా సరే మా అమ్మా, నాన్నలను ఇష్టపడేటట్లు చేస్తాను. కేవలం నీవు....!"
    పార్వతి దేవదాసు ముఖం వైపు ఒక్కసారి తీవ్రమయిన దృష్టితో చూసి "అమ్మా, నాన్నలు నీకే వున్నారా? నాకు లేరా? వారి యిష్టా యిష్టాలతో నాకేమాత్రం ప్రయోజనం లేదా?" అన్నది.
    దేవదాసు సిగ్గుపడి "ఎందుకు లేదు పత్తో! అయితే వాళ్ళు ఇష్టపడ్డారు. కేవలం నీవు.....!"
    "వాళ్ళు యిష్టపడ్డారని నీకు ఎలా తెలుసు? వాళ్ళు బొత్తిగా ఇష్టపడటంలేదు."
    దేవదాసు నవ్వడానికి వ్యర్ధ ప్రయత్నం చేస్తూ__"అరే కాదు, వాళ్ళు యిష్టంగానే వున్నారు. ఈ విషయం నాకు బాగా తెలుసు. కేవలం నీవు....!"
    పార్వతి మధ్యలోనే మాటనాపి తీవ్రమయిన స్వరంతో_"కేవలం నేను నీతో ఛీ....!" రెప్పపాటులో దేవదాసు రెండు కళ్ళు అగ్ని కణాల్లాగా మండిపోయాయి. అవరుద్ద కంఠంతో అతడన్నాడు__"ఏం పార్వతీ! నన్ను మరచిపోయావా?"  
    మొదట పార్వతి కూడా కొంచెం ఉద్విగ్నురాలై మరో క్షణంలోనే మళ్ళీ నిగ్రహించుకొని శాంతంగా దృడమయిన స్వరంతో ప్రత్యుత్తర మిచ్చింది. "లేదు, ఎందుకు మరచిపోతాను? చిన్నతనం నుంచీ నిన్ను చూస్తూనే వస్తున్నాను. నాకు తెలివి వచ్చినప్పటినుంచీ నీకు భయపడుతూ వస్తున్నాను. ఆ భయాన్ని నాకు చూపించాలని వచ్చావా? అయితే నన్ను కూడా నీవు గుర్తించలేదా?" అని చెప్పి ఆమె నిర్భయంగా రెండు కళ్ళు పైకెత్తుకొని నిలబడింది.
    మొదట దేవదాసు నోటి నుంచి మాట పెగలలేదు. తరువాత "ఎప్పుడూ నాకు భయపడుతూనే వచ్చావా? ఇంకేమీ లేదా?" అన్నాడు.
    పార్వతి దృఢంగా "లేదు, ఇంకేమీలేదు" అన్నది.
    "నిజమే చెపుతున్నావా?
    అవును, నిజమే చెపుతున్నాను. నీ మీద నాకు శ్రద్ధా శక్తులు లేవు. నేను ఏ వ్యక్తి దగ్గరకు వెళుతున్నానో ఆ వ్యక్తి ధనవంతుడు. బుద్ధిశాలి, శాంతస్వభావుడు, దృఢమయినవాడు. ఆయన ధార్మికుడు. నా తండ్రి నా మేలు కోరేవాడు కావడం చేతనే నీ వంటి అజ్ఞానికి, మనస్సు నిలకడలేని వారికి, నీ వంటి ప్రచండుడైన వ్యక్తి చేతికి ఏ విధంగానూ నన్ను అప్పగించదలచుకోలేదు. నీవు నా దారి కడ్డంగా తప్పుకో!"
    ఒకసారి దేవదాసు కొంచెం అటూ ఇటూ సంశయించాడు. ఒకసారి దారి వదిలేయడానికి కూడా సిద్దపడ్డాడు. కానీ మళ్ళీ దృఢంగా ముఖం పైకెత్తి "నీకు ఇంత అహంకారమా?" అన్నాడు.
    "ఎందుకుండదు? నీవు చేయగలవు. నేను చేయలేనా? నీకు రూపం ఉంది, గుణం లేదు. నాలో రూపమూ వుంది, గుణం కూడా వుంది....నీవు గొప్పవాడివి. కాని నా తండ్రి కూడా భిక్షకుడు కాదే! ఇంతే గాకుండా నేను స్వయంగా కూడా మీ అందరికన్నా ఏ అంశంలోనూ హీనంగా వుండను!"
    దేవదాసు అవాక్కయి పోయాడు. పార్వతి మళ్ళీ అంటూనే వుంది, "నాకు హాని కలుగజేయగలనని అనుకొంటున్నావా? అవును, అంత అధికంగా కాకపోయినా తప్పకుండా కొంత హాని కలుగ జేయగలవు. అది నాకు తెలుసు. సరే, అదే కానివ్వు. నాకు కేవలం దారి మాత్రం ఇవ్వు."
    దేవదాసు నిశ్చేష్టుడై పోయాడు. ఏ విధంగా హాని కలుగజేయగలను?" అన్నాడు.
    పార్వతి తక్షణమే జవాబు చెప్పింది_"అపనింద వేసి అని నీవే అంటాను."
    ఈ మాట విని దేవదాసు నెత్తిమీద పిడుగు పడిందా అన్నట్లుగా చూస్తూ వుండిపోయాడు. అతడి నోటినుంచి ఇదే మాట వచ్చింది__"అపనింద వేస్తానా, నేను?" 
    పార్వతి విషపు నవ్వు నవ్వుతూ అన్నది_"వెళ్ళు, ఇక మిగిలి పోయిన కాలమంతా నా పేరుకు కళంకాన్ని తెచ్చి పెడుతూ వుండు. ఆ రాత్రి నీ దగ్గరకు ఒంటరిగా వచ్చాను. ఈ విషయం నలువైపులా జనంలోవ్యాపింపజేస్తూ వుండు. దీనితో నీ మనస్సుకు చాలా ఓదార్పు లభిస్తుంది." అని అంటూ అభిమానంతో, క్రోధంతో ఆమె పెదవులు వణుకుతూ వణకుతూ ఒక్కసారి స్థిరపడిపోయాయి.
    కాని దేవదాసు హృదయంలో క్రోధంతో, అవమానంతో అగ్ని పర్వతం బ్రద్దలయిందా అన్నట్లు భీషణమయిన అగ్ని రగులుతూ వుంది. అతడు అవ్యక్తంగా "అయితే అసత్యపు అపనిందను మోపితే నాకు ఓదార్పు లభిస్తుందా?" అదే సమయంలో గాలం కర్రను త్రిప్పి పట్టుకొని భయంకరమైన స్వరంతో "విను పార్వతీ, ఇంత రూపం వుండటం కూడా మంచిది కాదు. అహంకారం పెరిగిపోతుంది!" అని చెప్పి కొంచెం నెమ్మదిగా స్వరం తగ్గించి "చూడటం లేదా చంద్రుడు ఇంత అందంగా వున్నాడు" అంచేతనే అందులో నల్లని కళంకపు మచ్చ పడివున్నది. కమలం ఎంతో తెల్లగా వుంది. అంచేతనే అందులో నల్లని తుమ్మెదలు వున్నాయి. రా, నీ ముఖంలో కూడా కళంకపు గుర్తు పెడతాను" అన్నాడు. 
    దేవదాసు సహనం కోల్పోయాడు. గాలం కర్రను గట్టిగా పట్టుకొని విసురుగా పార్వతి తలమీద బాదాడు. తగలగానే తల ఎడమ కనుబొమ్మ క్రిందదాకా పగిలిపోయింది. క్షణంలో పార్వతి ముఖం అంతా రక్తంతో తడిసిపోయింది.
    పార్వతి నేలమీద పడిపోయింది. "ఏం చేశావు దేవదాదా?" అన్నది.
    దేవదాసు గాలం కర్రను ముక్కలు ముక్కలుగా విరిచి నీటిలో పారవేశాడు. "ఎక్కువగా ఏమీ లేదులే! కొంచెం తెగింది" అన్నాడు.
    పార్వతి వ్యాకులంగా ఏడ్చింది_"అమ్మ బాబోయ్ దేవదాదా!"
   దేవదాసు పల్చగా వున్న చొక్కాను చించి నీటిలో తడిపి కట్టుబడుతూ "బయటకు పత్తో, ఈ తేలికపాటి గాయం త్వరలోనే మానుతుంది. కేవలం మచ్చమాత్రం మిగిలి వుంటుంది. ఎవరైనా దీన్ని గురించి అడిగితే అబద్ధపు విషయమన్నా చెప్పు. లేకపోతే నీ కళంకపు విషయాన్ని వెల్లడించు!" అన్నాడు.
    "అమ్మ బాబోయ్!"
    "ఛీ! అలా అనకు పత్తో! వీడ్కోలు అందుకునే ఆఖరు రోజుల్లో కేవలం ఈ గుర్తు వేశాను. ఈ బంగారం లాంటి ముఖాన్ని అప్పుడప్పుడు అద్దంలో చూసుకుంటే....?" అని ప్రత్యుత్తరాన్ని కూడా ఆపేక్షించకుండానే దేవదాసు వెళ్ళడానికి సిద్దపడ్డాడు.
    పార్వతి వ్యాకులంగా రోదిస్తూ "అబ్బా! దేవదాదా!" అన్నది.
    దేవదాసు తిరిగి వచ్చాడు. అతడి కనుకొలుకుల్లో ఓ మూలన ఓ కన్నీటి బిందువు....చాలా స్నేహభావంతో "ఏం పత్తో?" అన్నాడు.
    "ఎవరితోనూ చెప్పవద్దు."
    దేవదాసు క్షణంలోనే లేచి నిలబడి, వంగి పార్వతి కేశాలు పైకి తీస్తూ ఆధరాలతో స్పృశించి "ఛీ! నీవేం పరాయిదానవా? బహుశా నీకు జ్ఞాపకం ఉండకపోవచ్చు. చిన్నతనంలో నేను అల్లరి చేస్తూ అనేకసార్లు నీ చెవులు మెలిపెట్టేవాణ్ని" అన్నాడు.
    "దేవదాదా! నన్ను క్షమించు."
    "ఇది నీవు చెప్పవలసిన పనిలేదు. నిజంగానే నన్ను మరచిపోయావా పత్తో? నేను నిన్ను ఎప్పుడు క్షమించలేదు?"
    "దేవదాదా....!"
    "పార్వతీ నీకు తెలిసే వుంది. నేను ఎక్కువగా మాటలు చెప్పలేను. ఏ పనీ నేను బాగా ఆలోచించి చేయలేను. నా మనసులో ఏది చేయాలనిపిస్తే అది చేసి కూర్చుంటాను." ఇలా అని దేవదాసు పార్వతి తలమీద చేతిని వుంచి ఆశీర్వదిస్తూ "నీవు మంచిపనే చేశావు. నా దగ్గర వుండి నీవు బహుశా సుఖాన్ని పొందలేవు. కానీ యీ దేవదాసుకు తిరుగులేని స్వర్గసుఖం లభిస్తుంది."
    ఇదే సమయంలో ఆనకట్టకు ఆవలివైపు నుంచి అనేక మంది మనుసులు వస్తూ వున్నారు. పార్వతి నెమ్మదిగా నీళ్ళు ముంచుకొనడానికి దిగింది. దేవదాసు వెళ్ళిపోయాడు. పార్వతి ఇంటికి తిరిగి వచ్చేసరికి ప్రొద్దువాలిపోయింది. నాయనమ్మ ఆమెను చూసి "పత్తో, చెరువు నీళ్ళు ఏమైనా తెస్తున్నావా?" అన్నది.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS