"అవును, నువ్వన్నది నిజం. నాకు వాళ్ళిద్దరూ అంటే ఎంతో ఇష్టం. అందులో తిలక్ అంటే మరీను" అన్నారు.
తండ్రి కాబోతున్న సంగతి తెలిసి అయన ఎంత ఆనందించారో! ముఖం అంతా ఆనందంతో విప్పారి, కళ్లల్లో ఆనంద జ్యోతులు వెలుగుతుంటే సంతోషంతో తనను అమాంతం అక్కున చేర్చుకుని "నిజంగానా?' చెప్పు, కౌసల్యా నిజంగానే?" అంటూ మరీ మరీ అడిగారు. తనకు చచ్చేటంత సిగ్గు ముంచుకు వచ్చింది. చేతుల్లో ముఖం దాచుకుంది. చెప్పమని అయన తిరిగి తిరిగి వేధించడంతో, ముఖం మించి చేతులు తీసేయ్య కుండానే అవునన్నట్లు తను తల ఊపింది. ఇప్పుడు తలుచుకుంటే ఒళ్ళు పులకలేత్తుతుంది.
ఇంతలో మాయదారి ఆగస్టు వచ్చింది. గాంధీ గారి క్విట్ ఇండియా తీర్మానం, అయన అరెస్టు -- వీటితో దేశం అంతా అట్టుడికినట్లుడికి పోయింది. తను ఎంత ప్రాధేయపడుతున్నా వినకుండా, అయన ఎన్ని సభలలోనో పాల్గొన్నా రా రోజు. సాయంత్రం చీకటి పడుతుండగా విల్సన్ దొర వచ్చాడు ఆయన్ను అరెస్టు చెయ్యడానికి. మళ్ళీ అయన జైలుకు వెళ్లి పోతారంటే తనకు గుండె ఆగినంత పని అయింది. కడుపులో ఆవేదన, గుండెల్లో మంట . తనకా రాత్రి నిద్ర పట్టలేదు. గది బయట విల్సన్ దొర కాపలా కూచున్నాడు యముడు లాగా.
"మళ్ళీ మీకిది న్యాయం కాదు, నన్ను విడిచి వెళ్లడం. నేనిప్పుడు ఉత్త మనిషిని కూడా కాదు" అంది తను.
"ఎంత కౌసల్యా? అయిదారు నెలల్లో తిరిగి రానూ?"
"అంతేకాని, మానరన్న మాట."
"నువ్వు అలా నా దారికి అడ్డురాకు."
"మీరిలా అన్నారనే ఇంతక్రితం ఊరు కున్నాను. ఈ మారు ఏమైనాసరే , మీరు వెళ్ళడానికి వీల్లేదు."
"నువ్వు అలా అనకు -- నన్ను వెళ్ళనీ."
"మీరు పూర్తిగా నిశ్చయం చేసేసుకున్నారన్న మాట!"
"ఆ! ఇంక దానికి తిరుగు లేదు."
"మీకు భార్యకంటే. సంసారం కంటే రాజకీయాలే ఎక్కువా?" తన మాటకు ఆయనేమీ సమాధానం ఇవ్వలేదు.
"అవును! ఇదొక రకమైన స్వార్ధం. ఈ త్యాగాల వల్లా, దేశ సేవవల్లా వచ్చే కీర్తి కావాలి మీకు. అదే మీ జీవిత ధ్యేయం. దాన్ని చూసుకునే మీరు బ్రతుకు తారు. సంసారమూ, భార్యా మీకు అక్కర్లేదు."
"కౌసల్యా! ఏమిటది?"
"అవును. మీకు అవసరం లేనిదాన్ని నేను. నేనూ , నా రూపం , నా కన్నీళ్లు , ఇవేమీ మిమ్మల్ని కరిగించి నావారిగా చేసుకోలేనప్పుడు ఇంకా ఇవి నాకు ఉండి మాత్రం ఏం లాభం?"
"కౌసల్యా!" అంటూ దగ్గరగా తీసుకో బోయారు.
"నన్ను ముట్టుకోకండి. మీకంత నేను అక్కరలేని దాన్ని అయితే, నాకూ అక్కరలేదు మీరూ, ఈ సంసారమూను."
"కౌసల్యా, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?"
"ఆ. పూర్తిగా తెలిస్తే మాట్లాడుతున్నాను. వినండి-- ఇప్పుడే కనక నా మాట వినకుండా మీరు వెళ్లి పోయినట్లయితే , ఇదే మన ఆఖరి సమావేశం అవుతుంది."
"ఆవేశం లో నువ్వేం అంటున్నావో నీకు తెలియటం లేదు."
"అని మీరను కుంటున్నారు."
"ఆ!"
"అవును."
"అంతేనా?"
"అంతే. ఇంక మీదారి మీది. నా దారి నాది."
"సరే" అని అయన విసురుగా వెళ్ళిపోయారు. ఇంకో అరగంట లో విల్సన్ దొరతో కలిసి కారులో కూర్చున్నారు.
తనకు కోపం, బాధ, అవమానం ముంచుకు వచ్చాయి. పౌరుషం తో తన గుండె మండి పోతుంది. ఎంత అహంకారం ఆయనకు! తిరిగి రాకేం చేస్తుంది అనే కదా అయన ధీమా? చూద్దాం. అదీ చూద్దాం. ఈ పట్టుదలలో ఎవరు నెగ్గుతారో!
మర్నాడు బావగారితో చెప్పి, రామచంద్రాపురం వచ్చేసింది తను. చూచాయిగా అంతా అర్ధం అయిందేమో , ఆయనేం మాట్లాడలేదు. తానూ చెప్పినదంతా విని, తండ్రి తెల్లబోయాడు. కొత్తలో తనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. ఫలితం లేకపోయేసరికి ఊరుకున్నాడు. తనకు అబ్బాయి పుట్టినప్పుడు పుల్లేటి కుర్రు కబురు చెయ్యవలసిన అవసరం లేదని తండ్రితో గట్టిగా చెప్పింది. కాని బావగారి కేలా తెలిసిందో, పది పదిహేను రోజులు పోయాక వచ్చారు. "కుర్రాడి నో మాటియ్యి, ఎత్తుకుంటా" నన్నారు. "మీకూ మాకూ సంబంధం ఏనాడో తెగిపోయింది. మీకు నేను కుర్రాడి ని ఇవ్వనూ అక్కరలేదు; మీరు ఎట్టుకోనూ అక్కరలేదు." అని ఖచ్చితంగా చెప్పింది తను. కుర్రాడికి తిలక్ అని తనే నామకరణం చేసింది. అది అయన కిష్టం అయిన పేరు కదా అని. తర్వాత సంవత్సరం తండ్రి పోయిన రోజుల్లో వచ్చారు తన బావగారు. "మీరు అస్తమానూ వచ్చి మిమ్మల్ని చూస్తూ ఉండనక్కర లేదు. మామానాన్నా మమ్మల్ని బతకనీయండి" అంది తను. దానితో అయన మళ్ళీ రాలేదు.
మూడేళ్ళు పోయాక "తమ్ముడు జైలు నుంచి వచ్చాడు' అని ముభావంగా ఓ కబురు చేశారు వీరి గాడి ద్వారా. ఆ కబురు లో తనను రమ్మని కాని అయన వస్తారని కాని ఏమీ లేదు. తనూ ఊరుకుంది; వాళ్ళూ ఊరుకున్నారు. ఈ పద్దెనిమిదేళ్ళ నుంచి తండ్రి ఎవరో తెలియకుండా కుర్రవాడిని పెంచేటప్పటికి తాతలు దిగివచ్చారు. ఇంట్లో గుమస్తా కూ, వంట మనిషికీ చాలా కఠినమైన ఉత్తరువు లిచ్చింది. తిలక్ ను చుట్టుపక్కల ఇళ్ళకు వెళ్ళి ఆడుకోకుండా కట్టడి చేసింది.
అయన అండ లేకపోయినా , తన జీవితం ఆగిపోలేదు. అంతకంటే మహోన్నతమైన స్తితికే తన కుర్రావాడిని తీసుకు రావాలి--- ఇది తన జీవితంలో సాధిస్తే చాలు. అదే తనకు అమితమైన తృప్తి నిస్తుంది. తన ధ్యేయం బలం కూడా అదే.
ఇలా ఆలోచిస్తున్న కౌసల్య వీధి గుమ్మం లో చప్పుడు అయితే , అటు చూసింది. మొహం అంతా నల్లబడి పోయి , చెమటతో లోపలికి వస్తున్నాడు తిలక్.
"ఎండలో ఎక్కడికి వెళ్లావురా?' అంది కౌసల్య.
"ఇక్కడ మా స్నేహితుడి దగ్గర సెకండు హాండ్ స్కూటర్ ఉందిట. చూసి వద్దామని వెళ్ళాను."
"నీకెందుకు ?' అంది కౌసల్య.
"రేపు మెడిసిన్ లో చేరితే కావద్దూ?"
"మెడిసిన్ కు స్కూటర్ ఎందుకురా?"
"కాలేజీ కి వూరికీ చాలా దూరం ఉంది అమ్మా."
"అలాగా ? అయితే కొత్త మోటారు సైకిలే కొందాం. సెకండు హాండు ఎందుకూ?' అంది కౌసల్య.

7
"అమ్మాయి పి.యు.సి చదివింది. మొన్ననే పరీక్షలు వ్రాసి వచ్చింది. ఫస్టు క్లాసు రావచ్చు" అన్నాడు మాధవరావు వెంకట్రామయ్య తో.
'అలాగా అండీ . బాగుంది." అన్నాడు వెంకట్రామయ్య.
"ఈ ఏడు పిల్లకి పెళ్ళి చేసేసి, ఆపైన అత్తవారు అంగీకరిస్తే బి.ఎస్. సి లో చేర్పిద్దామని ,లేకపోతె మానిపిద్దామనీ మా మాధవరావు ఉద్దేశం " అని వెంటనే మాధవరావు కేసి సాభిప్రాయంగా చూస్తూ అన్నాడు రామదాసు.
'అంతేనండి అబ్బాయికి ఇష్టం అయితేనే చెప్పించడం" అన్నాడు మాధవరావు.
"పూర్వం అయితే ఏ సంగీతమో చెప్పిస్తే సరిపోయేది. ఈ రోజుల్లో అమ్మాయి ఏం చదువు కుంది అని అడుగుతున్నారు ఎవరిని చూసినా . అందుకని...."
వెంకట్రామయ్య చిరునవ్వు నవ్వి "దానికేం లెండి. రోజులు మారుతున్నాయి. రోజులతో పాటే మనమూ మారాలి. పూర్వం మన రోజుల్లో పిల్లని పిల్లాడు కాని, పిల్లాడిని పిల్ల కాని చూసుకోవడం అనే ప్రసక్తే ఉండేది కాదు. పెద్దవాళ్ళు ఏది నిర్ణయిస్తే అది. వాళ్ళయినా వంశ గౌరవం , మర్యాద -- అనే చూసేవారు. ఇప్పుడంతా మారిపోలేదండి?" అన్నాడు.
మాధవరావు ప్రయత్నపూర్వకంగా నవ్వి, "బాగా చెప్పారు. నాకదే ఆశ్చర్యం వేసింది అబ్బాయి తను చూడనక్కర్లేదనీ , మీరు చూస్తె తను చూసినట్టే అని మీ మీద అంత గౌరవం , భక్తీ చూపించి పెళ్లి చూపులకి మిమ్మల్నే పంపాడని , మా రామదాసు నాకు చెప్పినప్పుడు" అన్నాడు.
వెంకట్రామయ్య కు కళ్ళు చెమ్మగిల్లాయి. "కుర్ర మొహం. వాళ్ళ నాన్న పోయేటప్పటికి ఇంత కుర్రాడు. స్కూలు ఫైనలు కూడా ఇంకా పూర్తీ అవలేదు."
"అవునట పాపం. మా రామదాసు చెప్పాడు -- ఆ పిల్లలకి తల్లీ, తండ్రి లేని లోటు తెలియకుండా మీరు చూసుకు వస్తున్నారని , అందుకు తగినట్టు వాళ్ళు కూడా మీరంటే ఎంతో భక్తీ ప్రవత్తులతో ఉంటారనీను."
"అంతా ఆ సర్వేశ్వరుడి కృప. మనం నిమిత్త మాత్రులం."
"అలా అనకండి. ఈ రోజుల్లో అన్నగారి పిల్లల్ని అంత ఇదిగా చూసే వాళ్ళెవరున్నారండి?"
నిర్లిప్తమైన మందహాసం చేసి "నాకెప్పుడూ వాళ్ళు మా అన్నగారి పిల్లలు అని అనిపించదు" అన్నాడు వెంకట్రామయ్య.
"చూశారా? ఇందులోనే మీ ప్రత్యేకత తెలుస్తోంది." అన్నాడు రామదాసు.
వెంకట్రామయ్య కు ఆ సంభాషణ రుచించలేదు. అందువల్ల ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. అతని మౌనాన్ని చూసి వాళ్ళు కూడా అంతటితో ఆ ప్రస్తావన అపు చేశారు.
కొంతసేపు ఊరుకుని , నిశ్శబ్దాన్ని భంగ పరుస్తూ "మీరు రాజకీయాల్లో ఎక్కువగా తిరిగే రోజుల్లో నేను బాగా చిన్నవాడిని. కాని మీరు బలుసు సాంబమూర్తి గారితో కలిసి ఉపన్యాసాలివ్వడం అదీ బాగా జ్ఞాపకం ఉంది" అన్నాడు మాధవరావు.
"ఆ క్విట్ ఇండియా అల్లరు ల్లో మా మాధవరావు కూడా జైలుకి వెళ్ళాడు" అన్నాడు రామదాసు.
"ఆహా! అల్లాగా?" అన్నాడు వెంకట్రామయ్య ఆశ్చర్యంగా మాధవరావు కేసి చూసి.
మాధవరావు పకపకా నవ్వి "నేనూ, నా జైలూ వెళ్ళడమూ ...నన్నో దేశ భక్తుడనుకోనేరు కొంప తీసి" అన్నాడు.
"అదేమిటి అలా అంటారు?"
మాధవరావు నవ్వు ఆపుచేసి, గంబీరంగా చెప్పాడు. "నిజం చెబుతున్నాను. దేశసేవ చేసిన మీలాంటి నిజమైన దేశ భక్తులు చాలా కొద్ది మంది ఉన్నారు. తక్కిన వాళ్ళంతా నాలాంటి వాళ్ళే. పేరుకి మాత్రం మేమూ దేశ సేవకులమే. ఇది ఎలా ఉంటుందంటే వానపాములు మేమూ పాములమే అన్నట్టుంటుంది."
"మీరు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు."
"కాదండీ. నిజం చెబుతున్నాను. ఆరోజుల్లో అంటే మన రాజకీయ మహా సంస్థలు బ్రతికున్న రోజుల్లో త్యాగాలూ, శ్రమలూ కావలసి వచ్చాయి. అప్పుడు మీలాంటి వాళ్ళందరూ అందుకు పూనుకున్నారు. ప్రస్తుతం అవేమీ అవసరం లేదు. అందువల్ల మాలాంటి వాళ్ళం ముందు కొచ్చాం , మిమ్మల్ని వెనక్కి తోసేసి. పైగా దేశంలో మాదే మెజారిటీ . తెలుసా?"
"మీరు చిత్రంగా మాట్లాడుతున్నారు."
"మీరూ చిత్రంగానే మాట్లాడుతున్నారు, లోకాన్నంతా చూస్తూ కూడా , చూడనట్లు నటిస్తూ."
వెంకట్రామయ్య చిన్నగా నవ్వాడు. మాధవరావు, రామదాసూ కూడా నవ్వేశారు.
ఒక్క క్షణం ఆగి , "ఆ , కబుర్ల తో కాలక్షేపం చేసేశాము. అమ్మాయిని చూస్తారా? పిలుస్తాను." అన్నాడు మాధవరావు. అంటూనే "తల్లీ- ఇటురా " అన్నాడు.
అప్పటివరకూ పక్క గదిలో ఏదో నవల పట్టుకు కూచుని వాళ్ళ మాటలు వింటున్న జ్యోతి ఆ పుస్తకం అలా చేతిలో ఉంచుకునే హాల్లోకి వచ్చింది.
జ్యోతిని చూసి వెంకట్రామయ్య దిగ్భ్రాంతుడయ్యాడు. సరిగ్గా అవే పోలికలు -- అందమైన కోలముఖం , చిలిపిగాను , కోరగాను చూసే విశాలమైన నేత్రాలు, కోనదేరిన ముక్కు, సన్నని చిన్ని పెదిమలు , ఆ పెదిమల బిగింపులో కనిపించే పట్టుదల. ఇరవై ఏళ్ళ క్రితం కౌసల్య అచ్చు ఇలాగే ఉండేది. ఇప్పుడెలా ఉందో? తన ఆలోచనకు వెంకట్రామయ్య కు నవ్వు వచ్చింది. ఎలా ఉంటుంది? తను ఎలా ఉన్నాడు? అలాగే వయస్సు మళ్ళి , జీవితానుభవం అనే ముడతలు మొహం మీద పడి , కళ్ళ కింద నీలి నీడలు వ్యాపిస్తూ .....ఆపైన ఊహించలేక పోయాడు వెంకట్రామయ్య. తనూ, కౌసల్యా వయసు మళ్ళి ముసలివాళ్ళు అవుతున్నారు. తనకు నలభై పూర్తీ అయి నాలుగేళ్ళు అయింది. కౌసల్య కు కూడా ఒకటి రెండేళ్ళు తక్కువగా నలబై వచ్చి ఉంటాయి. ఇంత వయస్సు వచ్చినా తమమధ్య పట్టుదలలు పోలేదు.
మళ్ళీ జ్యోతి కేసి చూశాడు. ఏమీ అనుమానం లేదు. తను ఆఖరి సారి కౌసల్య ను చూసినప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు జ్యోతి కూడా సరిగా అలానే ఉంది. మధ్యలో దాదాపు ఇరవై ఏళ్ళు గతించాయనే భావం ఉంది కనక కాని, లేకపోతె, తను ఈ అమ్మాయిని "కౌసల్యా!" అని పిలిచి ఉండును.
"అమ్మాయిని చూశారా అండీ?' అన్నాడు మాధవరావు. పరధ్యానంగా ఉండటం వల్ల వెంకట్రామయ్య ఏం సమాధానం చెప్పలేదు. అక్కడ వాళ్ళు ముగ్గురూ ఉన్నారన్న సంగతే పట్టించుకోకుండా, ఎంతో ఆసక్తి తో చూపులు పుస్తకం మీదే లగ్నం చేసి ఉంది జ్యోతి.
రూపంలో కౌసల్య లాగే ఉంది కదా , మనస్తత్వం లో కూడా అలాగే ఉంటుందా? అనుకున్నాడు వెంకట్రామయ్య. అయినా పలకరించి చూద్దామని "అమ్మా నీ పేరేమిటి?' అని అడిగాడు వెంకట్రామయ్య. అది జ్యోతి వినిపించుకున్నట్లే లేదు.
"తల్లీ, ఏదో అడుగుతున్నారు. చెప్పమ్మా" అన్నాడు మాధవరావు. జ్యోతి పుస్తకం మీద నుంచి దృష్టి మరల్చి మాధవరావు కేసి చూసింది 'ఏమిటి ?' అన్నట్లు.
"నీ పేరు చెప్పమంటున్నారు" అన్నాడు రామదాసు.
"జ్యోతి" అని టక్కున చెప్పి తిరిగి పుస్తకం చదువుకోడం ప్రారంభించింది. వెంకట్రామయ్య కు నవ్వు వచ్చింది. నిర్లక్ష్యం లో కూడా అచ్చు కౌసల్యే!
"తల్లీ, వెళ్ళి కాపీ పట్రా" అన్నాడు మాధవరావు.
"మమ్మీ తెస్తుందిగా?"
"కాదు. తల్లీ , నువ్వెళ్ళు."
"ఊ" అంటూ విసుక్కుంటూ వెళ్ళిపోయింది.
మాధవరావు నవ్వుతూ "అమ్మాయికి చదువంటే అంత ఆసక్తి అండి" అన్నాడు.
