Previous Page Next Page 
వాసన లేని పూలు పేజి 11

 

    రాజుకు మెలకువోచ్చేసరికి సూర్యకిరణాలు వెచ్చగా గదిలోకి తొంగి చూస్తున్నాయి. ఆకాశమంతా నిర్మలంగా ఉంది. బాగా పొద్దెక్కి పోయి నట్లుంది. రాత్రంతా నిద్ర లేకపోవడంతో అలసట బద్దకంగా కళ్ళు తెరవకుండానే పక్కలో తడిమి చూశాడు. వనజ లేదు. రాత్రి జరిగిందంతా కేవలమొక మధుర సన్నివేశమేనా? మత్తు వదిలించుకొని రగ్గు పక్క కు నెట్టి పైకి లేచాడు. పక్క నిండా నలిగి పోయిన సన్నజాజి పూలు....అస్థవ్యస్థ,మైన పరిపూ.....
    వంట గదిలోంచి అప్పల్రాజు బ్రష్హూ పేస్టూ పట్టుకొచ్చాడు. "ఆ అమ్మగారు ఉదయమే కాఫీ తాగి వెళ్ళిపోయారు. మీకు పట్రానా?"
    రాజు అక్కర్లేదని చెప్పి, మళ్ళీ  ముసుగు తన్ని నిద్రపోయాడు.
    రెడ్డి కాబోలు బిగ్గరగా పిలుస్తూ , కుదుపుతూ ఉంటె మెలకువొచ్చింది. బద్దకంగా కళ్ళు తెరిచి "టైమెంతైందిరా ?' అన్నాడు.
    "పదకొండు దాటి పోయింది. ఇక లేవరా బాబూ" అన్నాడు రెడ్డి.
    రాజు స్నేహితుణ్ణి తిట్టుకొంటూనే పైకి లేచాడు. రెడ్డి గది చుట్టూ కలయజూస్తూ "ఆహా, ఏమి సువాసన, అంతా ఆడవాసన లాగే ఉందే?' అని ఆశ్చర్యపడుతూ "ఎవర్రా?' అన్నాడు ఆత్రుతగా.
    వనజ తెల్లవారక ముందే వెళ్ళిపోయినా ఆమె తాలుకూ సుగంధ చ్చాయలు మాత్రం ఇంకా ఆ గదిని వీడలేదు. మంచం మీద నలిగి పోయిన సన్నజాజులు, పగిలి పోయిన గాజు ముక్కలు కధ చెప్తున్నాయి. రాజుకి తప్పించుకొనే మార్గమేమీ కనిపించలేదు.
    రెడ్డీ మళ్ళీ అడిగాడు. "ఎవర్రా?" అని.
    "నీకు తెలుసుగా, నన్నడగటమెందుకూ?"
    రెడ్డి ఆశ్చర్యాన్నేమీ వ్యక్తం చేయలేదు." ఆ నల్ల పిల్లేనా? ఐతే వ్యవహారం ఇంతవరకూ వచ్చిందన్న మాట! నేను అంతా విన్నాను. కాని నమ్మలేక పోతున్నాను. ఒరేయ్ రాజూ, నీకు అనుభవం తక్కువ. ఆకలెక్కువ. ఆ అమ్మాయి విషయంలో జాగ్రత్త సుమా?" అన్నాడు.
    "ఏం . అసూయగా ఉందా?"
    "డామిట్ నువ్వు నన్ను అపార్ధం చేసుకొంటున్నావ్. ఈ విశాఖపట్నం లో దండిగా డబ్బున్న నీలాంటి అబ్బాయి కోసం వల పన్నే ఆడపిల్లలకు కొదవేమీ లేదు. అందుకోసం చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం."
    "స్వానుభవమా?"
    "నాన్సెన్స్." అంటూ ముఖం చిన్న బుచ్చుకొని రెడ్డి తొందర తొందరగా అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
    స్నానం చేసి వేడి వేడి కాఫీ తాగి సిగరెట్ ముట్టించే సరికి రాజు మనస్సు ఏదో అవ్యక్తమైన తృప్తితో నిండిపోయింది. రాత్రి కురిసిన వర్షానికి బయట రోడ్లన్నీ బురదగా ఉన్నాయి. అటూ ఇటూ వెళ్తున్న జనం తాలుకూ గోడుగులూ, వానకు తడిసిన తెల్లని మేడలు నల్ల కప్పు వేసుకుని దిగులుగా కన్పిస్తున్నాయి కిటికీ లోంచి . ఏదో కొంపలు మునిగి పోయినట్టు పరుగులెత్తుతూన్న ఆ సామాన్యజనుల కంటే తనలో ఏదో ప్రత్యేకత వున్నట్లు అనిపించసాగింది జీవితంలో అందరికీ లభించని దుర్లభమైన దేదో తనకు లభించినట్లు భావించసాగాడు.
    కాని బట్టలు వేసుకొని మధ్యాహ్నం కాలేజీకి వెళ్ళి, లెక్చర్ గాలరీలో అందరి మధ్యా కూర్చునే సరికి రాజు హృదయం హటాత్తుగా బరువెక్కి పోయింది. జట్టుజట్లు గా క్లాసు లోకి వచ్చి కూర్చుంటున్న ఆడపిల్లల వేపు చూస్తుంటే, ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ప్రతి అమ్మాయి హృదయం లోనూ ఎన్ని గాడ రహస్యాలు దారి ఉన్నాయో ననిపించింది. ఉన్నట్లుండి తానెంతో పెద్ద వాడ్ని అయిపోయాననుకో సాగాడు. అప్పటివరకూ మృదుమధురంగా గిలిగింతలు పెట్టిన రాత్రి సంఘటనంతా ఇప్పుడు మరో విధంగా కనిపించ సాగింది. తాను మంచీ చెడు అనే విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయాడా? తనతో పాటు మరో వ్యక్తీ కూడా పాప పంకిలం లోకి దిగజారి పోయిందే. దానికి తనెంత వరకు బాధ్యుడో.....చివరకు తప్పంతా తనదేనన్న నిర్ణయాని కొచ్చాడు. దానిలో వనజది కాని వయసుది కాని, ఉద్రేకం కలిగించే  ఆ ఎకాంతానిది కాని, ఉద్రేకం కలిగించే ఆ ఏకాంతానిది కాని కొంచెం కూడా తప్పున్నట్లు అనుభవ శూన్యుడైన రాజుకి తట్టనే లేదు. జరిగిపోయిన పనికి వనజ ఇక తన ముఖం చూడదు కాబోలు.
    వారం రోజులైంది రాజు పంతులమ్మ గారింటికి వెళ్ళి....శాంత మూర్తి , నిష్కల్మష హృదయ యైన పంతులమ్మకు తన ముఖం చూపించ లేకపోయాడు. ఇక అ ఇంటితో తన సంబంధం తెగిపోయిందనే అనుకున్నాడు.
    కాని తాను అనుకొన్నది పొరపాట ని తొందరలోనే తేలిపోయింది. ఆరోజు సాయంత్రం ఇంటి కొచ్చేసరికి లోపల్నుంచి ప్రకాశం మాటలు వినిపించాయి. రాజు మనస్సేందుకో కలవరపడి పోయింది ఇంతకు ముందు ప్రకాశం  రాక రాజుకు సంతోషం కలిగించేది. వనజ సంగతులు చెప్తాడని ఈనాడు ఎటువంటి అశుభం వినవలసి వస్తుందో నని గుండె దడదడ లాడసాగింది. కొంచెం నిగ్రహించుకొని లోపల ప్రవేశించాడు. అప్పలరాజు టిఫిను తయారు చేస్తున్నాడు. ప్రకాశం నీళ్ళ బకెట్ ఒకటి బోర్లించుకుని, దాని మీద కూర్చుని అప్పలరాజు కి ఇంగ్లీషు నేర్పుతున్నాడు.
    "ఇంగ్లీషు లో కప్పుని ఏమంటారు అబ్బాయి గారూ?" అప్పలరాజు అడిగుతున్నాడు.
    "కప్-- కప్-- అంటారు" నొక్కి నొక్కి చెప్తున్నాడు ప్రకాశం.
    అడుగుల చప్పుడు విని ఇద్దరూ తలెత్తి చూశారు.
    "అరె , డాక్టర్ గారు వచ్చేశారు. గుడ్ ఈవెనింగ్ డాక్టర్ సాబ్' పోలీసు ఫక్కీలో సాల్యూట్ కొట్టాడు.
    "ఏం ప్రకాశం. చాలా రోజుల కొచ్చావే?' అన్నాడు రాజు.
    "ఎగ్జామ్స్ సార్ -- ఎగ్జామ్స్ ! బోబార్డ్ గా చదివేస్తున్నాను.
    'అంతా బాగున్నారా?"
    "అల్ ఓ.కే. అడిసరే మీరు మా యింటికి రావటం బొత్తిగా మానివేశారేం? అక్కయ్య వాళ్ళు కంగారు పడిపోతున్నారు. ఇవ్వాళ మిమ్మల్ని తప్పక రమ్మని చెప్పింది. సినిమా ప్రోగ్రాం సార్ -- సినిమా ప్రోగ్రాం?" అన్నాడు ప్రకాశం కన్ను కొడుతూ.
    "అలాగా? నన్ను రమ్మన్నది ఎవరు ప్రకాశం? మీ పెద్దక్కయ్య, చిన్నక్కయ్యా?"
    ప్రకాశం ఇబ్బందిగా బుర్ర గోక్కుంటూ "మీరడిగిన ప్రశ్న ఆల్జీబ్రా లాగా చాల కష్టంగా ఉంది? మొదట వనజక్క మీ విషయం ఎత్తింది. దాని మీద పెద్దక్క నిజమే నన్నది. తర్వాత ఇద్దరూ కలిసి చెప్పారు. ఎక్స్ మైనస్ వై హోల్ స్కేర్ లాగా ఎవరు ఏది చెప్పారో చెప్పలేను-- ఐ మీన్ -- నాకు జ్ఞాపకం లేదు. మొత్తానికి ఇద్దరూ కలిసి చెప్పిందేమీటంటే డాక్టరు గారు చాలా రోజుల్నుంచి రావటం లేదు. ఒరే ప్రకాశం , నువ్వొక సారి వెళ్ళి చూసి సాయంత్రం టీకి రమ్మని చెప్పి రారా" అన్నాడు.
    నోరు తెరుచుకొని ప్రకాశం మాటలు వింటున్న అప్పల్రాజు ఈ అబ్బాయి గారు ఒక్క మాటా తిన్నగా చెప్పరు. అంతా డొంక తిరుగుడే" అన్నాడు.
    రాజు హృదయం లోంచి గొప్ప బరువేదో దించినట్లైంది.
    "మర్చిపోయ్యాను డాక్టరు గారూ. వనజక్క కాలేజీ లో ఉంటానన్నది. మీరు వచ్చేటప్పుడు అటు కాలేజీ వేపు వెళ్ళి తనని పికప్ చేసుకు పొమ్మని మీతో చెప్పమని నాతొ చెప్పింది. "ఒరేయ్ ప్రకాశం మర్చి పొయ్యేవురోయ్ , వెధవా' అని కూడా అన్నది."
    ప్రకాశం కాసేపు అప్పల్రాజు కి ఇంగ్లీషు నేర్పి కాఫీ తాగి వెళ్ళిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS