"కరెక్టే! పాజిటివ్ అప్రోచ్ చూపించాలి యాడ్స్ లో. ఇంకా రేపు కూడా ఉందిగా. ఆలోచిద్దాం. లేకపోతే అదే సబ్ మిట్ చేయొచ్చు" అనుపమ అంది.
గూగుల్ లో వెతుకుతూ, చీరల ప్రకటనలు పాతవి చూస్తూ, కొత్త ఐడియాల కోసం, రకరకాల కొటేషన్స్ తయారుచేస్తూ పనిమీదే మరో ధ్యాస లేకుండా రోజంతా పనిచేసింది మహిమ.
"సీమా ... స్కూటర్ కొనుక్కోడానికి ఆఫీసులో లోన్ ఇస్తారా, నాలా కొత్తగా వచ్చినవారికి..."
"ఆ, ఇస్తారు. అప్పు తీరేవరకు నీ సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ వాళ్ల దగ్గర పెట్టుకుంటారు. ఉద్యోగం మానేసినా, డబ్బు పూర్తిగా చెల్లించనిదే సర్టిఫికెట్స్ దొరకవు. మనం ఇక్కడ ఒకటి రెండేళ్లు పనిచేయడం మంచిది. కంపెనీ పెద్దది. పని నేర్చుకునే అవకాశాలు బాగా ఉన్నాయి. ఎవరో కొద్దో గొప్పో జీతం ఎక్కువ ఇస్తామని ఆశ పెట్టినా వెళ్లకూడదు. ఇక్కడ పని నచ్చక, సరైన గుర్తింపు రాక, జీతం పెంచకపోతే...అప్పుడు కంపెనీ వదలటానికి ఆలోచించాలి. అప్పుడు కూడా ఇలాంటి పెద్ద కంపెనీలను వదిలి వెళ్లాలనుకోవడం తెలివితక్కువతనమే. పనిలో గుర్తుంపు వస్తే చాలా ఆఫర్స్ రావచ్చు. ఇతర కంపెనీలలో ఒకరి సమాచారం ఒకరు తెలుసుకుంటారు. పేరొచ్చిన వాళ్లని మంచి ఆఫర్స్ తో లాగాలని ప్రయత్నిస్తారు. ఆ ట్రాప్ లో మనం ఈజీగా పడకూడదు. పేరెంట్ కంపెనీని అంత తొందరగా వదలకూడదు. వచ్చేవరకు ఇంట్రెస్ట్ చూపి, చేరాక మనల్ని అస్సలు పట్టించుకోరు. నయన అనే అమ్మాయి ఆఫర్ మంచిది వచ్చిందని ఇక్కడినుంచి వెళ్లిపోయింది. ఆరు నెలల తర్వాత గోలపెడుతూ ఫోన్ చేసింది. కంపెనీ బాగోలేదు, ట్రీట్ మెంట్ బాగోలేదని..."
"నాకయితే ఈ కంపెనీని వదిలే ఆలోచనే లేదు. నువ్వు చెప్పినట్లు రెండు మూడేళ్లు పోయాక, మరీ మంచి కంపెనీ, ఇంతకంటే భవిష్యత్తు బాగుంటుందంటే ఆలోచించవచ్చు. మనకు అనుభవం ఉంటే ఎక్కడైనా ఆఫర్స్ వస్తాయి.
"అయితే ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కి వెళ్లి లోన్ అప్లికేషన్స్ ఇవ్వు. వివరాలన్నీ స్రవంతిని అడిగితే చెపుతుంది".
ఇంటికొచ్చి హాల్లోకి అడుగుపెట్టేసరికి, ప్రీతి ఆరాటంగా ఎదురువచ్చి మహిమ చెయ్యపట్టుకుంది. 'ఓ రెండొందలుంటే ఇవ్వు, మళ్లీ ఇచ్చేస్తా'నని చనువుగా అడుగుతున్న ప్రీతిని కాస్త ఆశ్చర్యంగా చూసి, ప్రశ్నార్థకంగా సీమవైపు చూసింది మహిమ.
సీమ 'వద్దన్నట్టు' సైగ చేసింది. "ఏయ్ సీమా! నేను మహిమని అడుగుతున్నాను" కోపంగా అంది ప్రీతి.
"ప్రీతీ ప్లీజ్! డోంట్ మేకిట్ ఏన్ ఇష్యూ ... నువ్వు ఎవరినీ డబ్బులు అడగనని మాటిచ్చాకే, ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాం. మర్చిపోకు. మహిమ కొత్తగా వచ్చింది. ఇబ్బంది పెట్టకు ప్లీజ్..."
"సారీ మహిమ. ఈ ఒక్కసారికే... ఇంకెప్పుడూ అడగను. నాకు పేమెంట్ రాగానే ఇచ్చేస్తా". మహిమ ఇబ్బంది పడుతూ, ఫర్వాలేదు అన్నట్టు చూసి బ్యాగ్ లోంచి రెండు వందలు తీసిచ్చింది.
"ఓ డియర్! స్వీటీ...!" అంటూ బుగ్గలు పుణికి చకచక బయటికి వెళ్లిపోయింది ప్రీతి.
"ఇప్పుడు పోయి సీసా కొనితెచ్చుకుంటుంది. అందుకే వద్దన్నాను"!
మహిమ తెల్లబోయింది. "అందుకా! నేనింకా ఏదో అవసరం వచ్చి అడిగిందనుకున్నాను" గిల్టీగా అంది.
"ఇదిగో ఇలాగే డబ్బంతా తగలేసుకుంది. ఒళ్లు గుల్ల చేసుకుంటోంది. తాగకుండా ఉండలేదు. అంతలా అలవాటయింది. డబ్బు చేతిలో లేకపోతే ఎంతకైనా దిగజారి, అందరినీ అడుగుతుంది. మొదట్లో ఏదో పోనిలే బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి కదా అని అడిగినప్పుడల్లా ఉన్నదానిలో ఇచ్చేవాళ్లం. తీర్చడం అనేది ఎప్పుడూ లేదు. రోజురోజుకీ తాగుడు ఎక్కువయింది. మేం మాత్రం ఎన్నిసార్లు ఇస్తం. లేదంటే తిట్టేది, అరిచేది. అవసరానికి ఆదుకోని మీరేం స్నేహితులు అంటూ ఏడ్చేది. ఈ గోల రోజురోజుకీ ఎక్కువయింది. పొమ్మంటే పోదు. ఎక్కడికి పోతాను అంటుంది దిగులుగా. ఇదంతా న్యూసెన్స్ అయిపోయింది. తన ఉచ్ఛస్థితి కళ్లారా చూసినవాళ్లం. ఇప్పుడీ స్థితిలో తనని రోడ్డున లాగిపడేయలేం కదా..."
రూమ్ లోకి వెళ్ళాక, మహిమ సీమ పక్కనే కూర్చొని అడిగింది. "ఇప్పుడు తనకేం సంపాదన లేదా?"
"నా మొహం సంపాదన. ఎవరో ఒకరో ఇద్దరో ఎప్పుడో చిన్న చిన్న యాడ్స్ కి పిలుస్తుంటారు. ఓ ఐదువందలు చేతిలో పెట్టి పంపిస్తారు"?
"మరి భోజనం... ఇంటద్దె...?" సందేహం వెలిబుచ్చింది మహిమ.
"చెప్పాగా... చేతిలో డబ్బుంటే ఎప్పుడో ఓసారి కాస్తో కూస్తో ఇస్తుంది. రూము ఖాళీ ఉంటే రూములో పడుకుంటుంది. లేకపోతే ఈ హాల్లో పరుపేసుకు పడుకుంటుంది. వెలిగిన రోజుల్లో... మా అందరికీ ఎన్నెన్ని ప్రెజంట్లు, బర్త్ డే గిఫ్ట్ లు, హోటళ్ళలో పార్టీలు, మంచి మంచి డ్రెస్సులు... ఏవేవో కొనిచ్చేది. అందుకే నిర్దయగా పొమ్మనలేకపోతున్నాం. "మాతోపాటే తింటుంది. ఖర్చు అందరం షేర్ చేసుకుంటాం. ఏం చెయ్యమంటావు? తోటి అమ్మాయి... చూస్తే బాధగా ఉంటుంది".
"వాళ్ల ఊరు వెళ్లిపోవచ్చు గదా..."
"ఊర్లో ఎవరున్నారు. వాళ్ల అమ్మ అన్నయ్య దగ్గర ఉంటుంది. వదినగారు ప్రీతి సంగతి తెలిశాక లోపలికి రానీదు... తల్లి నిస్సహాయంగా ఉండిపోయింది".
