Previous Page Next Page 
చైనా యానం పేజి 12


    "I some times wonder
    who is greater
    Chairam Mao, or the Chinese people>
    And I answer my self saying
    Both are equally great."
    
        "అప్పుడప్పుడు నా కనిపిస్తుంది
        ఎవరు గొప్పవారు?
        చైర్మన్ మావో గోప్పవారా
        చైనా ప్రజలు గోప్పవారా? అని
        అప్పుడు నేను జవాబు చెప్పుకుంటాను
        ఉభయులూ సమానంగానే
        గొప్పవారని."

    13-12-76
    ఉదయం 8-45 గం||
    షీబియా చువాంగ్ స్టేషన్ నుంచి ట్రెయిన్ లో బయలుదేరాము. 3 గంటల సేపు నిద్రపోయాము.
    12-45 మధ్యాహ్నము.
    పీకింగ్ చేరుకున్నాము. హోటల్ లో నా రూం 5033
    2 గం|| మధ్యాహ్న భోజనం
    4 గం|| నుండి సాయంత్రం 6 గం|| వరకు.
    ఫ్రెండ్ షిప్ షాపులో.
    మా అమ్మాయి అడిగిన స్టేతస్కోప్ ఒకటీ, ధర్మామీటరు ఒకటీ కొన్నాను. ఇవి చాలా చవక. (మా అమ్మాయి 1977 లో మెడిసిన్ చదువుతానంది.)
    ఉన్ని దుస్తులూ మేజోళ్ళూ కొన్నాను. ఇవి చాలా ప్రియం. ఆ రాత్రి పీకింగ్ హోటల్ లోనే మన ఇండియన్ రాయబార కార్యాలయ వర్గం మా ప్రతినిధులకు స్వాగతపు విందు ఇచ్చింది.
    అందులో కూడా (నేను వినడం ఇది మూడోసారి) మన రాయబారి మహోత్సాహంతో మహోన్నతంగా ప్రసంగించారు. 555 సిగరెట్లు పాకెట్లు ఊదేశాను.

                                               తొమ్మిది


    14-12-76 పీకింగ్ హోటల్ రూమ్ నం. 5033
    6.30 గం. బెడ్ టీ
    బెడ్ టీ అయినా, బెడ్ కాఫీ అయినా పళ్ళు తోముకుని, ముఖం కడుకున్న తర్వాతనే తీసుకునేవాణ్ని. సరిగ్గా ఆరు గంటలకు రూమ్ బాయ్ తలుపు తట్టేవాడు. చైనాలో వున్నంతకాలం నేను తలుపులు వేసికుని పడుకొనే లేదు. అయినా మర్యాదకు అతను తలుపు తట్టడం, నేను లోనికి రమ్మనడం జరిగేది. టీ కావలిస్తే టీ, కాఫీ కావలిస్తే కాఫీ ఆర్డరు చేసేవాణ్ణి. అతని చేతివాచిలో నా వాచీని సరిదిద్దుకునే వాణ్ణి.
    ఆరున్నరలోపు కాలకృత్యాలు పూర్తి చేసుకొని వేడి వేడి టీ (లేదా కాఫీ) పాలూ చక్కేరా వేసుకుని తాగేవాణ్ణి. చలికాలంలో పీకింగ్ లో ఏడు గంటల దాకా చీకటిగానే ఉంటుంది.
    ఉదయం 8 గంటలకు ప్రతినిధి వర్గం అంతా భోజనాలు హోటల్ లో చేసేవాళ్ళం. నేను తరచూ టోస్ట్, వెన్నా ఒక అమ్లేట్టూ , కాఫీ తీసుకునే వాణ్ని. అంతటితో మధ్యాహ్నం భోజనం దాకా ఆకలి వేసేది కాదు.
    ఇవాళ పది గంటలకు మేం అందరమూ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా" చూశాం. ఇది చరిత్ర ప్రసిద్ద మైన చైనా మహాభిత్తిక. దీనిని గురించి తెలియని వాళ్ళుంటారని నేననుకోను. ఉంటే, దాని గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతయినా వాళ్ళకుందని నేనంటాను. ప్రాచీన కాలంలో ఏ చైనా ప్రజలు సుమారు రెండు వేల మైళ్ళ పొడవు గల ఈ మహాకుడ్యాన్ని నిర్మించారో, అదే దేశప్రజలు ఆధునిక యుగంలో చైనా పునర్నిర్మాణాన్ని అంతే తదేక దీక్షతో సాగిస్తున్నారు. చైనా గోడను ప్రపంచంలోని ఎనిమిదవ వింతగా పేర్కొనడంలో అతిశయోక్తి లేదు. ఈజిప్టు లోని పిరమిడ్లకు ఒకవిధమైన ప్రాముఖ్యం ఉంటే చైనాలోని ఈగోడకు ఇంకో విధమైన ప్రాముఖ్యం ఉంది.
    "ఇదిగో ఇక్కడే ప్రెసిడెంట్ నిక్సన్ మరి మెట్లేక్కలేక ఆగిపోయా" డని ఒక స్థలం మాకు చూపించారు. అది దాటి అక్కడ నుంచి చాలా దూరం మీదికి మేం వెళ్ళాము. మాతో పాటు చాలా మంది విదేశీ యాత్రికులు కూడా వున్నారు. వారిలో ఒక కెనడా జర్నలిస్టు తమ జాతీయ చిహ్నమైన మెపిల్ ఆకూ ఆకారంలో ఉన్న బాడ్జిని నా ఓవర్ కోటుకు తగిలించాడు.
    (చైనా నుంచి మరలి వచ్చేటప్పుడు పీకింగ్ విమానాశ్రయంలో ఇక నా కనవసరమని ఓవర్ కోటును చైనా వారి కిచ్చేశాను. అందులో కొద్దిగా చిల్లర డబ్బులూ, కెనడా జాతీయ చిహ్నము ఉన్నాయన్న సంగతి ఆ సమయంలో మరిచిపోయాను.)
    మధ్యాహ్నం భోజనానికి మేము పీకింగ్ హోటల్ కు వెళ్ళలేదు.
    Lunch at 1.P.M . near Ming Tombs. అని నా డైరీలో నోట్ చేసుకున్నాను. మింగ్ చక్రవర్తుల సమాధుల సమీపంలో లంచ్ తీసుకున్నాము. దారి పొడగునా ఒంటెల, ఏనుగుల సింహాల పెద్ద పెద్ద శిల్పాలు మమ్మల్ని ఆకర్షించాయి. నేత్రహస్తులైన మహా రాక్షసుల విగ్రహాలు మాకు కనిపించాయి. బహుశా వీళ్ళూ, ఆ జంతువులూ చక్రవర్తుల ఆత్మలకి ఎటువంటి హానీ కలగకూడదని ఉద్దేశించబడి ఉండవచ్చు. ప్రస్తుతానికి మాత్రం అవన్నీ టూరిస్టు ఆకర్షణలుగా మాత్రమే మిగిలిపోయాయి.
    ఆ రాత్రి పీకింగ్ హోటల్ లో మా ప్రతినిధి వర్గ నాయకుడు డాక్టర్ బాసూ గారి 5036 రూములో టీ.వీ చూశాం. ఆప్పటికే నాకు బాగా నిద్ర వచ్చేస్తోంది. భోజనం చేయనంత సేపు ఎంత రాత్రి వరకైనా మేలుకొని వుండేవాణ్ని. కాని భోజనానంతరం వెంటనే నిద్ర వచ్చేది. ఈ విధంగా నేను రెండు ముఖ్యమైన సినిమా ప్రదర్శనలను మిస్ అయ్యాను. అందులో ఒకటి The Pioneers (మార్గదర్శకులు) అనే కధా చిత్రమూ, ఇంకొకటి చైర్మన్ మావో జీవితం గురించిన డాక్యుమెంటరీ చిత్రమూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS