Previous Page Next Page 
చైనా యానం పేజి 11


    ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారిలో 58 మంది స్త్రీలు, పనిని బట్టి వేతనం, అది స్త్రీలకూ, పురుషులకూ సమానమే.
    మా ప్రతినిధులలో ఒకాయన, "కార్మికులకు సమ్మె చేసే హక్కు ఉందా? లేదా?" అని ప్రశ్నించాడు.
    1949 లో చీనా రిపబ్లికు అవతరించినప్పుడే కార్మికుల సమ్మె హక్కును రాజ్యాంగం గుర్తించింది. కాని నాటి నుండి నేటి దాకా కార్మికులు ఒక్కసారి కూడా తమ హక్కును అమలు చెయ్యకపోవడమే విశేషం. ఎందుకు సమ్మె చెయ్యాలి?" ఎక్కువ జీతం కోసమా? ఎందుకు ఎక్కువ జీతం? ధరలు పెరిగిపోవడం వలనా? చైనాలో ద్రవ్యోల్బణం లేదు. వస్తువుల ధరలు ఆకాశంలో వివరించడానికి వీలులేకుండా వాటి రెక్కలను చీనా ఆర్ధికవ్యవస్థ ఏనాడో కత్తిరించింది.
    అన్ని రంగాలలోనూ కార్మికులు ఉత్పత్తి అధికం చెయ్యాలని పెట్టుబడీ దారీ దేశాలు కోరతాయి. కమ్యునిస్టు రాజ్యాలు కోరతాయి. అయితే ధనస్వామ్య వ్యవస్థకు లాభాసముపార్జన ధ్యేయం. కమ్యునిజం అనే గమ్యాన్ని తమ దేశం త్వరలో చేరడానికి గాను సామ్యవాద రాజ్యాలలో కార్మికులు ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు.
    మేము చూసిన ప్రత్తి మిల్లు నిరుటి సంవత్సరం (1975లో) అనుకున్న దానికంటే 30 శాతం ఉత్పత్తిని పెంచింది. 1976 లో నవంబరు నాటికి కార్మికులప్పుడే 50 శాతాన్ని దాటిపోయారు.
    ఈ సంఖ్యలు వాళ్ళు చెప్పగా మేము రాసుకున్నవే కావచ్చును. కాని, ఇవి వాళ్ళ గొప్పని ప్రకటించుకోడానికి చెప్పిన లెక్కలు కావు. అతిశయోక్తులతోనూ, అభూత కల్పనలతోనూ చేసే అంకెల గారడీలు కావు. సామ్యవాద వ్యవస్థ వైపు చైనా కావిస్తున్న ప్రయాణంలో ఇవి ముఖ్యమైన మజిలీలు . తాము సరియైన దారిలో పయనిస్తున్నామా లేదా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నాలు.
    తమ దేశం నుంచి పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థను తరిమివేసిన నాటి నుంచీ చైనీయులు కమ్యునిజం దిశగా ప్రయాణిస్తున్నారు. కాని "From each according to his ability and to each according to his needs." (అనగా , ప్రతి ఒక్కడి నుంచీ అతని సామర్ధ్యం మేరకు, ప్రతి ఒక్కనికి అతని అవసరాలకు అనుగుణంగా) అనే కమ్యునిస్టు దశకు వారింకా చేరుకోలేదు. ఈనాడు ప్రతి ఒక్కరూ తన సామర్ధ్యం మేరకు శ్రమిస్తున్నా, ప్రతి ఒక్కరికీ అతడు చేస్తున్న పనికి అనుగుణ్యంగా మాత్రమే వేతనం లభిస్తోంది. ఇదే సోషలిస్టు వ్యవస్థ. ఇందులో వేతనాలు ఎక్కువ తక్కువ లున్నప్పటికీ, ఒక వంక కటిక దరిద్రులూ ఇంకోవైపు కోటీశ్వరులూ ఉండే ధనస్వామ్య వ్యవస్థ మాత్రం కాదిది. అన్ని రంగాలలోనూ చైనీయుల వేతనాలకు కనిష్ట గరిష్ట పరిమితులున్నాయి.
    పాతికేళ్ళలోపు వ్యవధిలో చైనా సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి ఒకే ఒక ముఖ్యకారణం ఈరోజు మధ్యాహ్నం నాకు బోధపడింది. 2- 30 గంటలకు ఒక బుద్ద విగ్రహం చూశాము. ఒకప్పుడిది దరిద్రులకూ, దైవోపహతులకూ యాత్రాస్థలం. చీనాలో ఇప్పుడు బౌద్దమతము లేదు. ఆ మాటకొస్తే యే మతమూ లేదు. పీకింగ్ లో ఒక కిరస్తానీ చర్చి ఉందట. నేను చూడలేదు. ప్రతి ఆదివారం అమెరికన్ రాయబార కార్యాలయం వాళ్ళు మాత్రం అక్కడకు వెళతారట. యే దేవుడి గుళ్ళనీ చీనా వారు నాశనం చెయ్యటం లేదు. మానవుడి ఈతిబాధలన్నిటికీ మానవాతీతమైన కారణం ఉందనే భావాన్ని నాశనం చేశారు.
    చైనాకు వెళ్ళక పూర్వం కూడా మన దేశంలో దేవుళ్ళున్నారు. కాని స్వరాజ్యనంతరం దేవుడి చాటున ఇప్పుడు జరుగుతున్నన్ని మోసాలు మరే దేశంలోనూ జరగలేదేమో! పెట్టుబడీదారీ విధానంతో రాజీపడీ మనం స్వతంత్రత సంపాదించాము. దేవుడనే భావాన్ని నిరాకరించి చైనీయులు విమోచనం సాధించారు. విమోచానానికి పూర్వమూ, తర్వాతా చైనాలో వచ్చిన ప్రచండమైన మార్పులు కొట్టవచ్చినట్టు కనపడుతూనే ఉన్నాయి. అయినా, చైనాలోని వాస్తవ పరిస్థితులను మరుగు పరుస్తూ ఎంతో దుష్ప్రచారం జరిగింది. (ఇప్పటికీ జరుగుతూనే ఉంది) కాని, చైనాకు బద్ద శత్రువులమానుకున్న అమెరికా వారు కూడా చైనా వారు సాధించిన ఘన విజయాలను, ఇష్టం లేకపోయినా ఈనాటికి అంగీకరించక తప్పడం లేదు.
    మవోలాంటి మహా నాయకుడు లభించడం వల్లనే చైనా వారింత అభివృద్ధి సాధించగలిగారన్నది పాక్షిక సత్యం మాత్రమే. రెండు వేల మైళ్ళ మహా ప్రస్థానం సాగించాలని ,మావో చెప్పినప్పటికీ అలా సాగించినవారు చైనా ప్రజలే కదా! చైనా ప్రజలు గొప్పవారు కావడం వల్లనే వారికీ మావో వంటి మహా మనిషి నాయకుడయాడని నేననుకుంటాను.
    స్వరాజ్యం వచ్చిన తర్వాత సంవత్సరాలలో భారతీయ ప్రజల నైతిక స్థాయి దిగజారి పోయిందని బాధపడేవాళ్ళలో నేనోకడిని. అదే మనకి సరైన నాయకత్వం లోపించడానికి కారణం. ఈ స్థాయి మళ్ళీ సముచిత  దశను చేరుకున్నప్పుడు మన ప్రజలలో నుంచే ఒక మహా నాయకుడు ఉద్భవిస్తాడు.
    12వ తేదీ రాత్రి షీబియా చువాంగ్ నగరంలో మా ప్రతినిధి వర్గానికి వీడ్కోలు విందు జరిగింది. చాలా మంది నగర ప్రముఖులు, ప్రభుత్వాధికారులు పాల్గొన్న ఆ విందులో మన రాయబారి శ్రీ నారాయాణన్ గొప్పగా ప్రసంగించారు. చైనా, భారత ప్రజల చారిత్రాత్మకమైన మైత్రి మున్ముందు ఇంకా ఇంకా అధికారికంగా వర్ధిల్లాలనేదే వారి ఉపన్యాసపు సారాంశం. ఆ మాటలకు అక్కడున్న అంతమందిమీ నిలబడి కరతాళధ్వనులు చేశాము.
    ఆ రాత్రంతా నేను మావో గురించి , చైనా ప్రజల గురించీ ఆలోచిస్తూనే వున్నాను. స్వదేశానికి తిరిగి వెళ్ళే లోపుగా ఎలాగైనా చైనా మీద నేను రాయాలనుకుంటున్న గీతం పూర్తి చెయాలనుకున్నాను. తర్వాత వారం పది రోజులకు కున్మింగ్ లో ఆ గీతం వ్రాసి ఇంగ్లీషులో తర్జుమా చేసి, తెలుగు ఇంగ్లీషు గీతాలు రెండూ పీకింగ్ రేడియో వారి ద్వారా టేప్ రికార్డు చేశాను. (అది వ్రాసిన తేదీ 24-12-76)
    పూర్తి గీతం కున్మింగ్ పర్యటన విశేషాలతో బాటు ఉదహరిస్తాను. ప్రస్తుతానికి ఆ గీతంలోని ఒక భాగం!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS