అర్ధం కానట్టు చూశాడు సారధి. అది చూడనట్లు తార మాటమారుస్తూ తన ప్రక్కనున్న టేబిల్ మీద నించి ఓ కవరు తీసింది. " అన్నట్టు మర్చిపోయాను. మా చెల్లెలి పెళ్ళి ఈ పదిహేనో తారీఖు తిరుపతిలో. శుభలేఖ ఇదిగో" అంటూ కవరు మీద సారధి పేరు రాసి అందించింది తార.
"మీ చెల్లెలు పెళ్ళా!" కవరందుకుంటూ ఆశ్చర్యంగా అడిగాడు సారధి.
"ఉ ....వల్లి... గుర్తుందా. అప్పటికింకా పరికిణీలు తొడుక్కుంటూ వుండేది. ఆడపిల్లలు ఎంతలో పెద్దవాళ్ళవుతారు."
"అది కాదు అ, అందుకు కాదు, పెద్దదానివి నీవుండగా మీ చెల్లెలికి ముందు పెళ్ళి ఏమిటి అని!" శుభలేక విప్పి చూస్తూ అన్నాడు సారధి. తార మొహం అదో రకంగా అయింది. క్రింది పెదవి కొరుక్కుంది. మరుక్షణంలో మొహంలో భావం మార్చేసి తేలికగా నవ్వుతూ , "పెళ్ళా నాకా! నన్నెవరు చేసుకుంటారు? నా కెవరు చేస్తారు ?" అంది.
"పెద్ద తారవి. నీ .....ఊ, అంటే రేప్పొద్దున్న ,మైలు పొడుగున పెళ్ళికొడుకులు క్యూ తయారవుతుంది. నీకేమిటి ఇంకా గుమాస్తా కూతురు సుందరిలా మాట్లాడుతావేమిటి?"
"అలాగా . అంటే దీనర్ధం? ఈ పెళ్ళి కొడుకులు సుందరిని కాదన్నమాట చేసుకోడానికి వచ్చినది. తార ఆర్జించిన లక్షల నన్నమాటే గాదూ."
సారధి తడబడ్డాడు ఒక్క క్షణం. "ఆఫ్ కోర్స్. ఆ మాట నిజమే అనుకో. కానీ ఏదో ఒక ఎట్రాక్షన్ వుండాలని కోరుకుంటే అది అవతలి వాళ్ళ తప్పు గాదు గదా, మనుషులు ప్రలోభపడడం సహజం గదా!"
"అంటే ....అంటే , ఈ నల్లని సుందరి ఈ మనిషి గాదు కావాల్సింది ఎవరికి, నా డబ్బు, నా ఆర్జన మీదే మోజు అన్న విషయం స్పష్టంగా తెలిసీ చేసుకుమన్నావా! ఆ వచ్చే మనిషి ఈ వున్నవాళ్ళతో జమ అయి నా సంపాదన కోసం రాబందుల్లా కాచుకుని పీక్కుతింటాడన్న సంగతి తెలిసి మరో మనిషిని వీళ్ళు చాలరన్నట్టు జత చేయమన్నావా -" అంటూంటే తార కంఠం రుద్దమయింది. "నేనెవరికీ అక్కరలేదు. నా కష్ట సుఖాలేవారికీ అక్కరలేదు. నామీద సానుభూతి లేదు- నా సంపాదన మీద తప్ప నా మీద యెవరికీ ఇంటరెస్టు లేదు -- వుండదు" ఉక్రోషంగా అంటున్న తార కళ్ళు తడి అయ్యాయి.
"సుందరీ!" సారధి తెల్లబోయాడు.
"నీకు తెలీదు సారదీ. ఈ డబ్బు యెంత పాపిష్టిదో, ఈ మనుష్యులు ఎలాంటివారో. డబ్బు ముందు కన్న తల్లి తండ్రులు సయితం ఎలా మారిపోతారో నీకర్ధం గాదు. నా డబ్బు తింటూ పెళ్ళి కావాల్సినదాన్ని నేనుండగా, నా డబ్బుతోనే నా చెల్లెలి పెళ్ళి ముందు చేసేస్తున్నారు. నాకెలా వుంటుందో ఆలోచించు. నేనూ మనిషినే నాకూ ఓ మనసుంది. నాకూ ఓ భర్త , సంసారం, పిల్లలు -- నావాళ్ళనుకునే వాళ్ళు, నన్ను కావాలనుకునే వాళ్ళు కావాలని ఉండదంటవా!---- తార కళ్ళలో నీళ్ళు! తార ఎందుకో బాధ పడుతుంది.
ఏమనాలో అర్ధం గాని స్థితిలో సారధి అయోమయంగా చూశాడు. "నేనింట్లో వున్నట్టే మరచిపోయారు . నేనూ వాళ్ళ కూతురినని, నాకూ పెళ్ళి చేయాల్సిన బాధ్యత వాళ్ళకి లేనట్టే మరచిపోయి చెల్లెలి పెళ్ళి చేస్తున్నారు. నేను డబ్బు సంపాదించే యంత్రంగా తప్ప మనిషిగా ఎవరికీ కనపడడం లేదు. సారదీ, నేనేదో సుఖపడి పోతున్నాననుకుంటున్నావు నీకు తెలియదు నా మానసిక క్షోభ?" అంటూ కళ్ళు ఒత్తుకుంది తార.
"సుందరీ, అదేమిటి మీ అమ్మ నాన్నగారు అన్న తమ్ముల మధ్య, ఇంత సిరిసంపదల మధ్య నీవు సుఖంగా లేవూ. నిన్ను చూసి అదృష్టవంతురాల వయావని అనుకున్నాను. ఎందుకు బాధపడుతున్నావు. నీకేమిటి లోటు, నీ కిష్టం లేకపోతే వీళ్ళందరిని వెళ్ళి పొమ్మను. వీళ్ళు వాళ్ళు నీకు పెళ్ళి చేసేదేమిటి నీవే చేసుకో. అంతేగాని..." ఆవేశంగా అన్నాడు సారధి. తార ఇటు అటు చూసి లేచి నిల్చుంది.
"సారధి మనం అలా బీచ్ కి వెడదామా. జస్ట్ ఏ మినిట్ చీర మార్చుకు వస్తాను."
"హాయిగా అక్కడ కూర్చుందాం కాసేపు. యీ ఇంట్లోంచి కాసేపు పొతే హాయిగా వుంటుంది ప్రాణం. అక్కడ చెపుతా నీకు కొన్ని సంగతులు." అంటూ లోపలి కెళ్ళింది. సారధి ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు.
"సుందరీ . ఏమిటో చెప్తానన్నావు. నీ కభ్యంతరం లేకపోతే చెప్పు నాకు. నిన్ను చూస్తుంటే నీకెందుకో చాలా బాధపడతున్నట్టు కనిపిస్తుంది." భీచ్ లో దూరంగా నిర్మానుష్యంగా వున్న చోట ఎంచుకొని ఇద్దరూ కూర్చున్న కాసేపటికి , తార ఎంతకీ మాట్లాడకపోవడం చూసి సారధి అడిగాడు ఆరాటంగా.
"అవును చెప్తాను. చెపితే నన్నా కాస్త మనసులో భారం తగ్గుతుందేమో." భారంగా అంది.
"ఒక ప్రశ్న. నీవిలా సినిమాలలో నటించడానికిమీవాళ్ళు ఏమీ అనలేదు, వప్పుకున్నారూ."
తార అదోలా నవ్వింది. "నీ వేంతా పిచ్చివాడివి , తిండికి గతి లేని తల్లి తండ్రులు కూతురు లక్షలు అర్జిస్తుంటే వద్దనేటంత వెర్రివాళ్ళు ఈ లోకంలో వుంటారంటావా?"
"అయితే మీ వాళ్ళకి ఎలా తెలిసింది నీవిలా నటివి అయినట్టు. ఇంటిలోంచి వెళ్ళిపోయాక రాశావా?"
"ఊహు, నేను ఎక్ స్ట్రాగా బ్రతికినన్నాళ్ళూ నా సంగతి ఎవరికీ తెలియదు. నేనూ రాయలేదు. కాని నా మొదటి సినిమా అయ్యాక డబ్బు చేతిలో పడ్డాక, ఏదీ లేక గిలగిలలాడే నా వాళ్ళ దీనావస్థ కళ్ళ ముందు కదిలింది. నేనిక్కడ రాజభోగాలు అనుభవిస్తుంటే వాళ్ళక్కూడా ప్రతి పూట తిండికి తడుముకునే దుస్థితిలో వుండటం తలచుకుంటే కూతురిగా నా తల్లితండ్రులని అదుకోడం నా ధర్మ మనిపించింది.
