Previous Page Next Page 
మొగుడు ఇంకో పెళ్ళాం వజ్రాలు పేజి 11


    "ఇదిగో చూడండి మేడమ్.... అలా మాట్లాడి నన్ను ఇన్సల్ట్ చేస్తే ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో పనిచేయను. మీరెన్నన్నా పడివుండటానికి నేనేం మీ ఆయన్ని కాదు. వంటవాడిని" అన్నాడు ఆవేశంగా.
    కల్నల్ కి వళ్ళుమండి గన్ తీసి వాడి ఛాతీ మీద ఆనించాడు.
    "ఏయ్ భజన్ రావు...! నోరు తెరిచావంటే కాల్చిపారేస్తాను. కేస్ అయితే తర్వాత చూసుకుంటా. నీలాంటి ఇడియట్ ని కాల్చిపారేస్తే ఆ తర్వాత యావజ్జీవం వేసినా హ్యాపీగా అనుభవిస్తాను"
    భజన్ రావుకి భయమేసింది.
    ఓసారి ఏదో గుడి కోసం చందా లడగటానికొచ్చిన గూండాలు అతిగా మాట్లాడటంతో ఒకడిని కాల్చిపారేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడాయన.
    చాలా రోజులు కోర్టులో కేస్ నడిచాక కొట్టేశారు.
    అప్పటినుంచీ భజన్ రావుకి అతన్ని చూస్తేనే భయం.
    నెమ్మదిగా కిచెన్ లోకెళ్ళి కూర్చుండిపోయాడు.
    కనకారావు మళ్ళీ బలవంతం చేసేసరికి సీత కేక్ కట్ చేసింది.
    అందరూ ఆనందంగా తప్పట్లు కొట్టారు.
    డిన్నర్ అవుతూంటే అందరూ ఆ సమయంలో గోపాల్రావ్ లేకపోవటం గురించే చెవులు కొరుక్కుంటున్నట్లు ఫీలయింది సీత.
    అంతమందిలో అవమానం జరిగినట్లనిపించింది.
    అందరూ ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఆత్రుతగా ఎదురుచూస్తోంది.
    "హలో సీతా! థాంక్స్ ఫర్ ఇన్ వైటింగ్ అజ్_ డిన్నర్ చాలా బాగా ఎరేంజ్ చేశారు. అన్నట్లు మీ హజ్బెండ్ ఇంకా రాలేదేమిటి?" అడిగింది ఫ్రెండ్ సునీత.
    "ఆయన అనుకోకుండా సడెన్ గా మద్రాస్ వెళ్ళాల్సి వచ్చింది. ఆఫీస్ పని మీద" అంది సీత.
    "ఓ_ఐసీ! ఒకోసారి అంతే! మన ప్రోగ్రామ్స్ అన్నీ అప్ సెట్ అవుతుంటాయి"
    అప్పుడే కనకారావు వచ్చాడు హడావిడిగా.
    "గోపాల్రావ్ ఆఫీస్ లో కూడా లేడంట. మధ్యాహ్నం మూడింటికే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాడంట" అన్నాడు సీతతో.
    సునీత ఆశ్చర్యంగా చూసింది.
    "అదేమిటి మద్రాస్ వెళ్ళారన్నారుగా" అడిగింది అనుమానంగా.
    సీత మొహం వాడిపోయింది. తండ్రి వేపు కోపంగా చూసింది.
    "అవున్డాడీ_ మద్రాసెళ్ళారట ఆఫీస్ పని మీద" అంది సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ.
    "అంతా బోగస్. మద్రాస్ లేదు, ఏమీ లేదు. మూడింటివరకూ ఆఫీస్ లోనే వున్నాడంటే మద్రాస్ వెళ్ళడమేమిటి?"
    అతిథులంతా ముఖాలు చూసుకున్నారు.
    అందరిలోనూ తను 'ఫూల్' అయిపోవటం సీతకు మరింత చిరాకు కలిగించింది.
    అక్కడినుంచి వేగంగా తన రూమ్ లోకెళ్ళి మంచం మీద వాలిపోయింది.
    గోపాల్రావు మళ్ళీ ఏ అమ్మాయితోనో షికార్లు కొడుతూ ఉంటాడని అనిపించిందామెకి.
    "ఏంటమ్మా సీతా! గెస్ట్స్ అందరూ ఎదురుచూస్తుంటే ఇలా వచ్చేశావు?" సీత తల్లి రత్నప్రభ గదిలోకొస్తూ అడిగింది.
    "నాకు తలనొప్పిగా ఉందమ్మా!"
    "నాకు తెలుసులే. ఇదంతా నీకు ఆ గోపాల్రావు తెచ్చిన తలనొప్పి. నేను మొదటినుంచీ చెప్తూనే వున్నా. అతని ముఖం చూస్తూంటే నాకు నమ్మబుద్ధి కావడంలేదమ్మా అతనిని పెళ్ళి చేసుకోవద్దు అని. వింటేనా? కాదు అతను మంచోడనీ, చూడ్డానికి చాలా ఫ్యాషనబుల్ గా బావున్నాడు అంటూ నువ్వూ, మీ డాడీ నా మాట కాదని చేసుకున్నారు.
    ఇప్పుడు చూడు. నేను ఖచ్చితంగా చెప్పగలను. అతనెక్కడో, ఎవరింట్లోనో మందు కొడుతూ వుంటాడు."
    తల్లి మాటలు వినేసరికి సీతకి మరింత దుఃఖం వచ్చింది.
    "మమ్మీ" అంటూ అమాంతం లేచి తల్లి కౌగిట్లో వాలిపోయింది.
    రత్నప్రభకు కూతురి మీద అమితమయిన జాలి కలిగింది.
    "ఏడవకమ్మా! అల్లుడి అంతు మేమిద్దరం యిక్కడే వుండి తేలుస్తాం గదా. ఈ పిచ్చి వేషాలేమిటో ఇలాంటి ముఖ్యమయిన సందర్భాల్లో బయట ఈ తిరుగుళ్ళేమిటో అన్నీ తేల్చేస్తాం."
    "అవును మమ్మీ! మీరిద్దరూ ఇక్కడే వుంటేగానీ ఆయన దారికి రారు" కన్నీరు తుడుచుకుంటూ అంది.
    "ఇంతకుముందు కూడా ఇలా ఎప్పుడయినా చేశాడా?"
    "చాలాసార్లు ఆఫీస్ లో లేటయిందని చెప్తే నమ్మాను కానీ ఆ మధ్య ఒకరోజు ఎగ్జిబిషన్ లో ఓ పిల్ల కనిపించి "ఏమిటీమధ్య దర్శనం లేదు" అనడిగింది. అంటే అంతకుముందు రెగ్యులర్ గా ఆ పిల్లను కలుసుకుంటున్నట్లేగా?"
    "ఇంకా అనుమానం ఏమిటి? అసలు పెళ్ళయిన కొత్తలో నావైపు కూడా అదోలా చూడటం మొదలెట్టాడు."
    సీత ఉలిక్కిపడింది.
    "ఆ_ నిజంగానా?"
    "ఏమో! అలా అనే నాకనిపించింది మరి."
    సీత మళ్ళీ కళ్ళవెంబడి నీళ్ళు పెట్టుకుంది.
    "నువ్వేం దిగులుపడకు. నేను మీ డాడీతో మాట్లాడతాగా. అల్లుడిని పూర్తిగా సెట్ రైట్ చేయందే మేమిక్కడనుంచి కదలం"
    సీత కన్నీరు తుడుచుకుంది.
    "గెస్ట్స్ అందరినీ నేను పంపించేస్తాన్లే! నువ్వు హాయిగా రెస్టు తీసుకో! టీవీ చూడు" అంటూ టీవీ ఆన్ చేసి వెళ్ళిపోయింది రత్నప్రభ.

                                  *    *    *    *

    ఫైవ్ స్టార్ హోటల్లో చాలా అద్భుతమయిన మ్యూజిక్ ప్రోగ్రాం జరుగుతోంది.
    సినిమా ప్లేబాక్ సింగర్ ఒకతను అద్భుతమయిన ఆర్కెస్టాతో హిట్ సాంగ్స్ పాడుతున్నాడు. ఆ ప్రోగ్రామ్ చూస్తూంటే టైమ్ తెలీటం లేదెవరికీ.
    గోపాల్రావుకి మాత్రం ఆ ప్రోగ్రామ్ కంటే రాణీ అందచందాలు ఎక్కువ కిక్ ఇస్తున్నాయి.
    "డిన్నర్ నువ్వే ఆర్డర్ చెయ్యి రాణీ" అంటూ మెనూ కార్డు ఆమె ముందుకి తోశాడు.
    ఆమె కార్డు చూసింది.
    సూపర్ వైజర్ పాడ్ పట్టుకొచ్చి రాసుకోడానికి సిద్ధంగా నిలబడ్డాడు.
    "టూ_ లార్జ్ _ పీటర్ స్కాట్ బ్రాంది" అందామె.
    గోపాల్రావు అదిరిపడ్డాడు.
    "స్నాక్స్ మేడమ్?"
    "చికెన్ నైన్టీఫైవ్"
    అతను వెళ్ళిపోయాడు.
    "మీరు డ్రింక్స్ తీసుకుంటారా?" ఆశ్చర్యంగా అడిగాడు.
    "ఏం మీరు తీసుకోరా?"
    "అహహహ_ అందుక్కాదు_ జస్ట్ అడిగాను. అంతే!"
    "ఉమెన్స్ కాలేజీ హాస్టల్లో వున్నప్పుడు అలవాటయింది."
    "ఒండర్ ఫుల్"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS