Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 12

 

    సీ.     శ్రీవశిష్టాదు లాశీర్వాదములు సేయుఁ
                గల్యాణ వాద్యముల్ కదిసి మ్రోయ
        సరస పుణ్యంగనాజనము పాటలు పాడ
                 నప్సరస్త్రీలు నృత్యంబు లాడ
        దశరధ జనకాదిధరణీశు లలరంగ
                   బాంధవుల్ మోదసంపదఁ దగంగ
        కౌసల్య మొదలగు కాంత లానందింప
                   నిరువైపులను జెలు లేచ్చరింప

    గీ.    మిధుల శుభవేది నొండోరు మీఁదఁ గదిసి
        పొసఁగి ముత్యాల తలఁబ్రాలు పోసికొనెడు
        రమ్య'మూర్తులు జానకీరామచంద్రు
        లాత్మలో నుండి నను బ్రోతు రనుదినంబు.
        
    సీ.    కౌశికుయజ్ఞంబు గాచిన జయశాలి
                  యలయహల్యను బ్రోచినట్టి ఘనుఁడు
        కాకాసురుని తప్పు గాచిన సదయుండు
                   మౌనిరక్షా ప్రతి జ్ఞానిపుణుఁడు
        శబరీకోరికఁ దీర్చు చల్లని దేవుండు
                    హనుమంతు నేలిన ఘనయశుండు
        సుగ్రీవు వేగ నను గ్రహించిన మేటి
                     దయ విభీషణుఁ బ్రోచు ధర్మమూర్తి
        
    గీ.    ఆర్తరక్షణబిరుదాంకుఁ డైనస్వామి
        వేడుకలు మీఱసీతమ్మ తోడఁ గూడి
        రామచంద్రుఁడు మమ్ము నిరంతరమ్ము
        చింత లేడఁబాపి కరుణ రక్షించుఁగాత
    
    సీ.    శ్యామల కోమలజలదకాయ మువాని
                    కమలసుందర లోచనములవాని
        భానుకోటి ప్రభారితతేజమువాని
                    జిలుఁగుబంగరువల్వ గలుగువాని
        నవ్య'కిరీట సుందరహారములవాని
                     నునుమానికపు మొలనూలువాని
        మాణికంకణాంకితమంజీర ముల వాని
                      ఘనదీర్ఘ బాహుయుగంబువాని
    గీ.    మందహాసంబు వాని సమగ్రవేద
        శాస్త్రముఖసర్వవిద్యలు చదువువాని
        ఘనత పోజ్జేయహాత్మ్యకళలవాని
        నిఖిలయోగీంద్రుఁడగువాని నేఁ దిలంతు

    సి.    శ్రీకరంబైనట్టి సాకేతపురములో
                మాణిక్యమండపమధ్యసీమ
        మందారతరుమాల సుందరమణిజాల
                  సింహాసనంబున జీవరత్న
        కలిత మౌదివ్యాష్టదళపద్మమునఁ దండ్రి
                         తొడను గూర్చుండి ముద్దుగనువాని
        లలితేంద్రనీలకొమలశరీర మువాని
                   కమలవిశాలనేత్ర ముల వాని
        
    గీ.    సోదర త్రయసహస సుఖము వాని
        నతుల మకుటాది భూషితుండైన వాని
        కనక మయ చేలుఁ గౌసల్య కన్న కొడుకు
        ధ్యాన మొనరింతు సేవింతు నభినుతింతు.ఫ

    సీ.    అందంపుఁజుంచుతో నాణి ముత్తేమ్ముల
                 జోకైన నెఱరావిరేక తోడ
        నిద్డంపున వజ్రాల మద్దికాయల తోడ
                 మురువైన చిఱునవ్వు  మొగముతోడ
        బొజ్జపై నటియించు పులిగోరు తాళితో
                  రమణీయమణిక కంకణముల తోడ
        నవరత్న ఖచిత ఘంటల మొలనూలితో
                   నీటైన గిలుకుటందియల తోడ

    గీ.    తోడలక్ష్మణ భరత శత్రుఘ్నులాడఁ
        బరుగు లెత్తఁగ వెనువెంట బరుగులెత్తి
        తల్లి కౌసల్య రార నాతండ్రి యనుచు
        నెత్తిముద్దాడు శ్రీరాము నే భజింతు.

    సీ.    దశరాధసుతుడవై తాటకఁ బరిమార్చి
                  మఘపోషివై శిల మగువఁ జేసి
        శర్వుని విలుద్రుంచి జానకిఁ బెండ్లడి
                   పరుశురాము జయించి గురువు నాజ్ఞ
        వని కేఁగి ఖరుఁ ద్రుంచి కనక మృగం బేసి
                   యినజుని గూడి వాలిని వధించి
        వనధి బంధించి రావణుఁ గీటడంగించి
                    సీత తోడ సయోధ్యఁ జెలగుచుండి

    గీ.    తల్లులును దమ్ములును బ్రమోదమునఁ బొదల
        నాంజనేయాది సహితుఁడవై సమస్త
        రాజ్యమేలేడు పట్టాభిరామమూర్తి!
        క్షేమ మొనగూర్చి మమ్ము రక్షింపవయ్య.

    సీ.    దాశరధరామ నీదయకుఁ బాత్రుఁడ నయ్య
                 రక్షించు జానకీరామచంద్ర
        కౌసల్య రామ చక్కఁగ నేలు కోవయ్య
                  దరిఁజేర్చవయ్య కోదండరామ
        జయరామ నేను నీశరణొందినా నయ్య
                  రఘురామ నాపైఁ బరాకటయ్య
        సాకేతరామ నాసన్నుతి వినవయ్య
                   పట్టాభిరామ చేపట్టవయ్య

    గీ.    అన్న మన్నించు చిన్న రామన్న నన్నుఁ
        గన్న తండ్రివి మాకు నీకన్న నెవరు?
         శీఘ్రముగ మాక భీష్ట సంసిద్దిఁ జేయు
        రామ శ్రీరామ కల్యాణ రామ రామ.

    సీ.    నా చిన్న రామన్న ననుఁగన్న తండ్రి రా        
                  నన్నేలునయ్య నా యన్న రాగ
        నా ముద్దులయ్య నాసామి రాఁగద వోయి
                   అప్ప చక్కదనాలకుప్ప రార
        నా పెన్నిధానమా నా పుణ్యమూర్తి రా
                    నాయింద్రనీల రత్నంబ రార
        బంగారుకొండ నాపాలి భాగ్యము రార
                   అమృతంపుఁ జెలమ రా యయ్య రార

    గీ.    చూత మెవ్వరు వత్తురో చూత మనుచుఁ
        దల్లి పిలువంగ నందియల్ ఘల్లుమనఁగ
        నవ్వి చెలరేఁగి గునగున నడచివచ్చు
        నట్టి కౌసల్య గారాపుఁబట్టిఁ దలఁతు.
       


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS