యోగపంచరత్నాలు
సీ. అష్టాంగ యోగరహస్యంబు లోనఁగూర్చి
బంధత్రయంబు సభ్యాసపఱిచి
కేవలతుంభకక్రియఁ బవను మరల్చి
కుండలీశక్తి మేల్కొనఁగదల్చి
నాదంబు బ్రహ్మరంద్రమున మ్రోవఁగఁజేసి
ముక్తిసింహాసనమునకు వచ్చే
పాంచభౌతికమైన బ్రహ్మాండ పిండాండ
కరణముల్ సాంఖ్య మార్గమునఁ దెలిసి
గీ. అత్మలింగంబు నేత్ర మధ్యమునఁ జూచి
రాజయోగంబు గన్న ధీరాగ్రగాణ్య
ప్రణవ సంధాన తారకపదనిధాన
యోగబలసాంద్ర శ్రీగురు యోగిచంద్ర!
సీ. అంఘ్రిమూలం బొకటడ్డము పదము మ
ధ్యమునఁ గట్టిగ బిగియంగఁ బన్ని
కడమపాద మవలితొడ పిక్కసందుగా
నునిచి యాకుంచనంబునను మెఱసి
కడు పక్కళించి శీఘ్రంబుగా రొమ్మున
గడ్డ మానించి వే కరయుగంబు
ఊరుద్వయంబున నూనిచి కాయంబు
నివిడి ప్రాణు నపాను నెయ్యపఱిచి
గీ. మనసుపవనంబు గూర్చి భ్రూమధ్యదృష్టి
నిలుపుబంధత్రయాఖ్యాస నిరూపమాడ్య
ప్రణవసంధాన తారకపధనిధాన
యోగబలసాంద్ర! శ్రీగురుయోగిచంద్ర!
సీ. ఆధారమున నుండి యాకుంచనంబున
బ్రహ్మనాళంబులో బాటపఱిచి
వదనం బోకించుక వంచి దంతంబుల
మధ్యమ రసనంబు మాటుచేసి
నడుము నిక్కించుక కడు పక్కళించుక
యోష్టముల్ రెండును నొయ్యమూసి
యంగుళద్వయమునఁ బింగళాశశినాడు
లంటి పూరకగతి నంటఁబట్టి
గీ. గంధవహుని సహస్రారకములమందుఁ
గూర్చితిరి కేవలంబైన కుంభకమున
ప్రణవసంధాన తారకపధనిధాన
యోగబలసాంద్ర! శ్రీగురుయోగిచంద్ర!
సీ. తారక యోగవిద్యారహస్యంబు శ్రీ
లించి శిరంబు నిల్లింతవంచి
పూర్ణిమాదృష్టిని బొమలు మీఁదికి నెత్తి
మనసుచేతను బిందు వనుసరించి
మండలత్రయములమధ్య నంతర్లక్ష్య
ముద్ర నీలజ్యోతి మొనకుఁ జేర్చి
కంటిరెప్పలు రెండు నంటకుండఁగ వ్రాల్చి
లో చూపుక నుగంట లోను పఱిచి
గీ. దివ్య తేజంబు చూచి మూర్తీభవించి
యత్మలింగఁబు గనుఁగొంటి వనుభవమున
ప్రణవసంధాన తారకపధనిధాన
యోగబలసాంద్ర! శ్రీ గురుయోగిచంద్ర!
సీ. పంచీకృతంబైన పంచమహభూత
కార్యముల్ కల్లలుగాఁగఁ జేసి
కామంబు క్రోధంబు కడు లోభమోహంబు
మదము మత్సరమును వదలఁజేసి
సంసారముననుండి సంగి యయ్యునుగాక
బురుదలో కుమ్మర పురువు వలెను
శమదమంబులఁ జిత్త మమతల గాలించి
బ్రహ్మంబు నిలుకడ పఱిచి వేగ
గీ. సత్తుచిత్తును నానందసరళి నగుచు
లోనవెలిఁ బూర్జముననుంటి లీనమునను
ప్రణవసంధాన తారకపధనిధాన
యోగబలసాంద్ర! శ్రీ గురుయోగిచంద్ర!
సీ. శ్రుతులు దెమ్మనివేఁడఁ జతురాననుఁడఁ గాను
నమృత మిమ్మిన హరిహయుఁడఁగాను
తనునేత్తుకొను మన ధాత్రినిగాను గం
బమునఁ బుట్టమన డింభకుఁడఁగాను
ఆత్మజుఁగాఁ గోర నదితినిగాను భూ
స్థలి దానమడుగఁ గశ్యపుఁడఁగాను
బ్రహ్మత్వ మర్దింపఁ బవనాత్మజుఁడఁగాను
హరులఁ ద్రోలుమనంగ నరుఁడఁగాను
శరరూప మగుమనఁ బురదాహకుఁడఁగాను
కలి ద్రుంచుమన మౌనిగణముగాను
గీ. పదవులను గోర నీపద పంకజాత
జాతమకరందపాన ప్రశాంతచిత్త
బింబిత స్వప్రకాశకాభిన్న రూప
తత్పదార్ధైక సుజ్ఞానాధారదక్క.
సీ. శరధిఁ జొచ్చుటగాదు గిరి ధరించుటగాదు
ధరణినెత్తుటగాదు నరమృగేంద్ర
తనువుదాల్చుటగాదు దైత్యువెఁడుట గాదు
రాజవీరుల రణరంగమందు
దునుమివైచుట గాదు వనధిఁ గట్టుట గాదు
హలముఁబూనుట గాదు హరిమహీజ
మవనిఁ జేర్చుటగాధు హరశరం బగుటగా
ధశ్వవాహనముగా దస్మదీయ
గీ. మానసాంభోజకర్ణికా మధ్యసీమ
నిరుపమానంద సంస దున్మేషవేష
తరుణతావక దాంపత్య చిర విలాస
గరిమ కరుణించు టెంతటి కార్య మభవ !
రామ నవరత్నములు
సీ. శ్రీజానకీదేవి చెలువుగా వామాంక
తలమున ముద్దులు గులుకుచుండ
నగ్రభాగంబున నాంజనేయుఁడు నిల్చి
పాదంబు లోత్తుచు భక్తీ నేఱప
వెనుక నెమ్మనమున వినయంబు తనరార
సౌమిత్రి మౌక్తికచ్చత్ర మూన
నుభయపార్శ్వంబుల నొదిఁగి వింజామరల్
భరతశత్రుఘ్నులు పట్టి కొలువ
గీ. దండసుగ్రీవుఁడు విభీషణుండు నవల
నంగదుండును జాంబవదాదు లుండఁ
దల్లి చల్లగఁ జూడఁగ నల్లనికళ
లలరునినుఁ గొల్తు నెపుడుఁ బట్టాభిరామ!
