Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 11

చివరికి -
'దాదాపుగా' ఉదయ్ లాగే తయారయ్యాడు ఆ ఫ్రెండు. తాగుడు అలవాటు చేసుకున్నాడు. పరుషమైన పదాలతో అధికారులను అదిలించడం నేర్చుకున్నాడు.
అతను ఇప్పుడు సద్దాం హుస్సేన్ కొడుక్కి డబుల్!
ప్రాణాపాయం వస్తే ముందుగా పోయేది ఉదయ్ ప్రాణాలు కాదు -
డమ్మీ అయిన ఆ ఫ్రెండు ప్రాణాలు!
చటుక్కున గుర్తొచ్చింది సాహస్ కి!
తను ఆలోచనలో పడి సీరియస్ అయిపోతున్నాడు.
సీరియస్ నెస్ ఒక విధంగా భయానికీ, ఆందోళనకీ - పరికితనానికీ కూడా సూచన!
తను సీరియస్ అయిపోతే -
తను ఎదుటివాళ్ళని లక్ష్యం చేస్తున్నట్లు లెఖ్ఖ!
తను నిర్లక్ష్యంగా నవ్వుతూ వుంటే -
తను వాళ్ళని లక్ష్యం చెయ్యట్లేదని హెచ్చరిక!
వెంటనే నవ్వు మొహం పెట్టాడు సాహస్.
"ఏం చెబుతున్నానూ...ఆ! కులాలూ, మతాలూ, జాతీ, రంగూ, ప్రాంతం, భాషా...ఇలా జనాల్ని విభజించి పాలించే వాళ్ళందరికీ ఈ న్యూస్ చాలా దుర్వార్త అని చెప్పాను గదూ! ఈ జోక్ విన్నారా?"
"షటప్...దిసీజ్ నో జొకింగ్ ఎఫయిర్!" అంది ప్రగతి కఠినంగా.
"ఈ ఒక్కటీ విను! ఈ ఇండియా వుందే...దటీజ్ భారత్...ఈ ఇండియాలో పంజాబీలు వుంటారట, బెంగాలీలు వుంటారుట, మహారాష్ట్రులు వుంటారుట, గుజరాతీలు, మలయాళీలు వగైరా వగైరాలు వుంటారుట!
కానీ -
ఈ ఇండియాలో ఇండియన్స్ మాత్రం వుండరుట!" అని చులకనగా నవ్వాడు సాహస్.
"ఇదంతా, ఈ చలాకీ రాజకీయవేత్తల పుణ్యమే!"
"అందుకే మిలిటరీ టేక్ ఓవర్ చేసింది! అందుకే ఫీల్డ్ మార్షల్ సర్వాధికారి సర్వాధికారాలూ తన చేతిలోకి తీసుకున్నారు!" అంది ప్రగతి షార్ప్ గా.
"తీసుకుని ఏం చేస్తాట్ట!" అన్నాడు సాహస్ అవహేళనగా.
"అది సాయంత్రం ఫీల్డ్ మార్షల్ స్వయంగా దేశానికి చెబుతారు...నౌ బడ్డీ... డోంట్ యాక్ట్ టూ స్మార్ట్! యూ ఆర్ ఇన్ ఫర్ అనదర్ షాక్! అటు చూడు!" అంది ప్రగతి.
తిరిగి చూశాడు సాహస్.
షాకయిపోయాడు!
ఈసారి నిజంగానే!
సాహస్ కి ఎదురుగా -
అచ్చం అతని ప్రతిబింబం లాంటి వ్యక్తి -
అయితే - ఇతను ఇందాకటి వాడు కాడు -
ఇతను రెండోవాడు -
సెకండ్ డబుల్!
ఒక్కక్షణంలో, మళ్ళీ తనని తాను అదుపులోకి తెచ్చుకున్నాడు సాహస్.
"మై! మై! సెకెండ్ డబుల్! అవునా!" అన్నాడు చాలా తేలిగ్గా.
"నువ్వు షాకయిపోలేదూ?" అంది ప్రగతి.
"కమిషనర్...సర్..!" అన్నాడు సాహస్ వ్యంగ్యంగా.
"నువ్వు చాలా రెస్పాన్సిబుల్...సారీ...ఇర్రెస్పాన్సిబుల్ అనడం ఎక్కువ కరెక్టేమో... మొత్తానికి నువ్వొక సీనియర్ ఆఫీసర్ వి...లోకం తెలిసిన దానివై వుండాలి. ఈ లోకంలో తిండికీ, నీళ్ళకీ, నీతికీ, నిజాయితీకీ కొరత వుందేమో కానీ వింతలూ విడ్డూరాలకి ఏమాత్రం కొరత లేదు. నీకు జనరల్ నాలెడ్జ్ బాగా తెలిసి వుండాలి. తెలిసి వుంటే, ఇటాలియన్ ప్రభువు ఉంబెర్టో విశేషాలు కూడా తెలిసే వుండాలి"
ప్రగతి చురుగ్గా ఏదో అనే లోపలే -
ప్రగతి చేత పులిబోనులోకి తోసెయ్యబడి అక్కడే ట్రాప్ అయిపోయి వున్న అంకుష్ అందుకుని, త్వరత్వరగా చెప్పడం మొదలెట్టాడు.
"ఉంబెర్టోనా...ఉంబెర్టో సంగతి నాకు తెలుసు! ఇటాలియన్ కింగ్ ఉంబెర్టో! పంతొమ్మిది వందల సంవత్సరం జూలై 28వ తారీఖున తన ఎయిడ్-డీ కాంప్ అంటే, తన అంగరక్షకుడూ ప్లస్ సెక్రటరీ లాంటి వాడితో కలిసి - మిలన్ దగ్గర వున్న మోంజా అనే ఊరికి వెళ్ళాడు. ఆ రాత్రికి, వాళ్ళిద్దరూ కలిసి, అక్కడే వున్న ఒక చిన్న రెస్టారెంట్ కి వెళ్ళారు. ఆ హోటల్ ఓనర్ ని చూసి దిగ్భ్రాంతి చెందాడు ఉంబెర్టో రాజు. ఎందుకంటే ఆ హోటల్ ఓనర్ ముమ్మూర్తులా ఈ రాజులాగే వున్నాడు! వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మొదలెట్టారు. వాళ్ళ మాటల్లో అతి విచిత్రమైన విషయాలు బయటపడ్డాయి" అన్నాడు అంకుష్.
"అవును! చాలా విచిత్రమైన విషయాలే" అన్నాడు సాహస్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS