"ఇంటర్వ్యూకు వెళుతున్నాను" అనబోయి "పనిచేస్తున్నాను!" అన్నాను మరికొంచెం రాగయుక్తంగా.
ఆ తర్వాత అడగబోయే ప్రశ్న ఏమిటో నాకు తెలుసు. అందుకే ఆ అవకాశం ఇవ్వకుండానే "నువ్వేం చేస్తున్నావూ?" అన్నాను.
నేనేదో అడగరాని ప్రశ్న అడిగినట్టు సీట్లో కదిలి నిటారుగా కూర్చుని, ఏవగింపుగా చూసింది.
"నేనేమీ చెయ్యను. చెయ్యాల్సిన అవసరం నాకు లేదు." అన్నది పోట్లాటకు సిద్ధంగా వున్న ధోరణిలో.
ఉద్యోగం చెయ్యడం, స్వతంత్రంగా జీవించడం హేయమైనట్టూ, ఆ అవసరం ఏర్పడటం మహా పాపం అన్నట్టూ చాలామంది మాట్లాడతారు.
"ఏమో! ఎందుకు అవసరం లేదో?" అన్నాను వ్యంగ్యంగా.
"ఎందుకేమిటి? మాది చాలా పెద్ద కుటుంబం. మా నాన్నగారు చాలా గొప్పవారు. ఎం.పి." అంది తడుముకోకుండా.
పనిచేసే వాళ్ళంతా తక్కువ కుటుంబాల వాళ్ళంనట్టూ, బీదతనం అపరాధం అని వున్న ఆమె ధోరణికి నా వళ్ళు మండిపోయింది. ఆమెకు ఒక పాఠం నేర్పించకుండా వదలకూడదనిపించింది.
"మీ నాన్నగారి పేరేమిటి?" ఆమె కళ్ళలో సూటిగా చూశాను.
"రామానుజం!"
"ఆ పేరుగల వాళ్ళెవరూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎం.పి. లేరే?"
ఆమె కొంచెం యిబ్బందిగా కదిలి సర్దుకుంది.
"రిటైర్ అయ్యారు."
నేను నోరు తెరుచుకు చూశాను. "ఎం.పి.గా రిటైర్ కావడం ఏమిటీ?" అన్నాను. ఆవిడ తన పొరపాటు గ్రహించి ముఖం ముడుచుకుంది.
"అంటే ఎక్స్ ఎం.పి. అనా మీ ఉద్దేశ్యం?"
ఆవిడ అనుకోకుండా పకపక నవ్వింది. నేను విస్తుబోయి చూశాను. ఇందులో అంతగా నవ్వాల్సిన విషయం ఏముందో నాకు బోధపడలేదు.
"సరదాగా మా నాన్నగార్ని రిటైర్డు ఎం.పి. అని ఎగతాళి చేస్తారు. పొరపాటున అదే మాట అనేశాను." అన్నది. తన తెలివికి తనే మరోసారి పగలబడి నవ్వింది.
నేను కళ్ళప్పగించి చూస్తూ వుండిపోయాను ఏమనాలో తోచక.
"ఏం పని చేస్తున్నావ్?" ధీమాగా అడిగింది కాలు మీద కాలు వేసుకుంటూ.
"ఆఫీసు సూపరింటెండెంట్"
"జీతం ఎంత వస్తుంది?"
"ఆరు వందలు" తడుముకోకుండా అనేశాను.
నా సమాధానం ఆమెకు కొరడా దెబ్బలా తగిలినట్టుంది. ముఖంలో ఏదో బాధ, కళ్ళలో ఈర్ష్య. నా మందు పనిచేస్తోంది. అంతటితో ఆమెను వదలదల్చుకోలేదు.
"మా నాన్నగారు కూడా చాలా చాలా గొప్పవారు. మంత్రిపదవి చేసి వదిలేశారు. నాకీ ఉద్యోగం అక్కర్లేదు. ఏదో సరదాగా చేస్తున్నాను" అన్నాను ఆమెను రెచ్చగొడుతూ.
"మంత్రి పదవా? ఎప్పుడు? ఎక్కడ?" కోపంగా అడిగింది.
"మీ నాన్నగారు ఎం.పి.గా చేసినప్పుడే. ఆయన వున్నచోటే" అన్నాను ముసిముసిగా నవ్వుతూ.
ఆమె ముఖం తెల్ల కాగితంలా మారింది ఓ క్షణం.
"నీకు పెళ్ళయిందా!" మాట మార్చటానికి అడిగిందనుకున్నాను.
"కాలేదు ... కాదు ... చేసుకోలేదు." అన్నాను.
"మా ఆయన కలెక్టర్!" ఇప్పుడు చెప్పు ఎం చెబుతావో అన్నట్టు వుంది కంఠం.
"బిల్లు కలెక్టరా?" అడగాలనిపించింది. కాని అంత అసభ్యంగా ప్రవర్తించలేక మానుకున్నాను.
మరోసారి ఆమెను పైనుంచి కిందకు చూశాను. పత్తర్ ఘట్టిలో దొరికే చౌకబారు సిల్క్ చీరా, లాడ్ బజారులో అమ్మే పూసల దండా, చేతికి మట్టి గాజులూ ...
