సాలోచనగా చూస్తూ "మంచి భర్త దొరికినపుడు" అన్నాడు.
"దొరికాడే అనుకోండి ఆ తరువాత?"
"ఆ తర్వాతంటే..." కొద్దిగా ఆలోచించి "జీవితాంతం అతడు మంచివాడిగానే వున్నప్పుడు" అన్నాడు టక్కున.
"ఉహూ... మట్టి బుర్ర... అది కాదు"
"కాదా... అయితే అతడు ఆమె వూహలమేరకి ఎదిగినపుడు"
"షిట్" నవ్వేసి ఆకతాయిగా చూసింది. "వాట్ యూ హిస్టరీ వాట్ యు మిస్ డ్ నౌ ఈజ్ మిస్టరీ"
"నాకు అర్థం కావడం లేదు"
"చిక్కెన్ బ్రెయిన్... చూడండి మాస్టారు... పది గ్రాముల బరువున్న ఓ తూటా అయిదు కేజీల బరువు ఒక మీటరు పొడవు వున్న రైఫిల్ బేరల్ నుంచి సెకండుకి నాలుగు వందల మీటర్ల వేగం చొప్పున దూసుకుపోయింది. అప్పుడు బేరల్ పొడవునంతా దాటి బులెట్ బయటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో చెబుతారా" అడిగింది సూటిగా చూస్తూ.
ఫిజిక్స్ లో పోస్టు గ్రాడ్యుయేట్ అయిన శశాంక మనసులోనే లెక్కని మననం చేసుకున్నాడు.
జవాబు చెప్పడానికి నాలుగు నిముషాలకన్నా ఎక్కువ పట్టలేదు. "పాయింట్ నాట్ నాట్ ఫైవ్ సెకెండ్స్"
"చూశారా! బులెట్ బేరల్ టార్గెట్ అనేసరికి టక్కున జవాబు చెప్పారు. కాని నేనడిగిన ప్రశ్నకి మాత్రం నీళ్ళు నమిలేస్తున్నారు స్పీడుగా"
"ఇదంటే కాలుక్యులేషన్"
"అదీ అంతే మాస్టారూ! మీ బుర్ర బుల్లెత్స్ పేరెత్తగానే మహా షార్ప్ గా పనిచేస్తుంది. అదే భార్యాబిడ్డల ప్రసక్తి వచ్చిందనుకోండి..." అసంకల్పితంగా నోరు జారింది.
"కృపా" ఒక్క ఉదుటున ఆమెను దగ్గరకు లాక్కున్న శశాంక "నిజమా... కంగ్రాచ్యులేషన్స్" గొంతు ఉద్వేగంతో పూడుకుపోతుంటే సిగ్గుతో అతడిలో ఒదిగిపోతున్న కృపని చూస్తూ "రాగానే చెప్పలేదేం" అన్నాడు.
"డాడీ వున్నారుగా"
"వుంటే"
"ఈ విషయం ముందుగానే చెప్పాలనుకున్నాను" పక్కకు ఒత్తిగిలి చేతిని ఆమె భుజాలపై వుంచి నిశ్శబ్దంగా వుండిపోయాడు చాలా సేపటిదాకా.
పట్టలేని ఆనందాన్ని అతడు ప్రకటించేది నిశ్శబ్దంతోనే అని తెలిసిన కృప ఎవరో తట్టినట్టు తల పైకెత్తి చూసింది.
శశాంక కళ్ళనుంచి నీళ్ళూరుతున్నాయి.
"ఏయ్... ఏంటిది" ఒక పసికందును లాలించే తల్లిలా అతడ్ని చూస్తూ అంది "మిమ్మల్నే"
ఉప్పెనలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న దుఃఖాన్ని నిభాయించడానికన్నట్టు తల పక్కకు తిప్పుకున్నాడు.
అతడి ఉచ్చ్వాస నిశ్వాసాలనుబట్టి శశాంక మానసిక స్థితిని అంచనా వేయగల సంపూర్ణతను సిద్ధించుకున్న యువతి కృప. "అత్తయ్య గుర్తుకొచ్చింది కదూ"
"బహుశా నేను కడుపులో పడినప్పుడు అమ్మ కూడా ఇలాగే సంబరపడిపోయుంటుంది" గాద్గదికంగా అన్నాడు. "ఊహించి వుండదు అమ్మగా మార్చిన నేనే పొట్టన పెట్టుకుంటానని"
ఏ అమ్మ మనసు కదిలిందో కృప కళ్ళు కూడా నీటి కుండలయ్యాయి.
కాని తన కన్నీళ్ళు కనిపించకుండా జాగ్రత్తపడింది. అలా మానసికంగా నలిగిపోయే భర్తను ఎలా మామూలు మూడ్ కి రప్పించాలో ఆమెకు బాగా తెలుసు. అది ఆమె స్వయంకృషితో సాధించిన గొప్ప కళ.
"అవునూ... మనం చాలాసార్లు అదే ఆ సమయంలో ఇలా ఉత్తరం గాలి తగిలేట్టే పడుకునేవాళ్ళం కదూ" అంది మామూలుగా.
అర్థం కాలేదు శశాంకకి "అయితే"
"అదే నిజమైతే మనకి అబ్బాయి పుడతాడు"
"ఎలా తెలుసు?" తేరుకుంటూ ఆమె మెడ చుట్టూ చేతులు వేశాడు.
"సింపుల్. అరిస్టాటిల్ ఏమన్నాడో తెలుసా? మెక్ లౌ ఇన్ ది నార్త్ విండ్ టు కన్ సివ్. మేల్ చైల్డ్ ఎండ్ ఇన్ ది సౌత్ విండ్ ఫర్ ఫిమేల్ చైల్డ్"
"ఉత్తరం గాలే కాదు, దక్షిణం గాలి తగిలేట్టు కూడా చాలాసార్లు... పడుకున్నట్టు గుర్తు"
"మై గాడ్... అయితే ప్రాబ్లమే..."
నవ్వేశాడు శశాంక హాయిగా.
ఆ నవ్వుని సైతం అలా కొనసాగనివ్వనట్టు కృప అతడ్ని మీదికి లాక్కుని కిటికీ వేపు చూసింది. "చూడండి ... సౌత్ విండ్"
ఆ మరుసటిరోజు ఉదయమే తాను తాత కాబోతున్నట్టు తెలుసుకున్న రిటైర్డ్ కల్నల్ రాజమణి డైనింగ్ టేబుల్ దగ్గర తనే పసిపిల్లాడిగా మారిపోయి కూతుర్ని అల్లుడ్ని చాలా హాడావుడి పెట్టేశాడు.
"చూడమ్మా... నేను పూర్తిగా రెస్ట్ తీసుకునే రోజు ప్రారంభమయ్యాయి అనడానికి తార్కాణం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు సంఘటనలే. నేను మీ ఆయన్ని ఫాలో అయ్యేది ఢిల్లీలో ఫైనల్స్ వరకే. ఆ తర్వాత బాధ్యతను నీకప్పచెప్పి నేను రెస్ట్ తీసుకుంటాను. మీ ఆయన ఫారిన్ టూర్స్ కి వెళ్ళినపుడు నిన్ను ఇబ్బంది పడనివ్వనులే. మనవడ్ని నా దగ్గరే వుంచుకుంటాగా"
బిడియంతో తలవంచుకున్న కృపనే చూస్తున్నాడు శశాంక.
