Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 110


    ఆమె తల్లి కాఫీ తీసుకొచ్చింది ఇద్దరికీ. చాలా రోజుల తరవాత వాళ్ళింటికి వెళ్ళాడు మోహన్ రెడ్డి. పవిట కొంగుతో కళ్ళనీళ్ళొత్తుకుంటూ, లోనకి వెళ్ళింది.
    రెండు నిమిషాలు మౌనంగా
    "మా బాధకంటే నీ బాధ చూస్తోంటే మరీ బాధగా అనిపిస్తోంది బాబూ" అన్నాడు రామనాధం.
    మౌనంగా లేచి బయటికి వచ్చాడు మోహన్ రెడ్డి. నడుస్తున్నాడు.
    బస్ డిపో. వనపర్తి బస్సు.యెక్కి కూర్చున్నాడు.
    బస్సు వెళుతోంది వేగంగా. బయటికి చుట్టూ చూస్తున్నాడు. అతని కళ్ళలో కాంతి.
    దిగి నడుస్తున్నాడు. వాళ్ళ వూరు. అప్పటికీ ఇప్పటికీ, యిదే రావటం నాలుగేళ్ళు దాటిపోయింది.
    చూసి అతని తల్లి సంతోషం పట్టలేక __ గొంతు పెగలక __ కళ్ళలో నీళ్ళు నిండి__ కావిలించుకుంది కొడుకుని. అతని కళ్ళు చెమ్మగిల్లాయి.
    తమ్ముడు కరుణాకర్ రెడ్డి__గ్రాడ్యుయేషన్ పరిక్షలు. వచ్చేయేడు సిటీలో పీ.జీ.కోర్సులో చేరదలిచాడు.
    అతను వెళ్ళిన గంటన్నరకి తండ్రి వచ్చి చూసి__సంతోషాన్ని అణిచిపెట్టి, "యెంతసేపాయె మీ అన్న వచ్చి?" అన్నాడు చిన్నకొడుకు వంక చూసి.
    "యెప్పుడో వచ్చిండు"
    "వచ్చినట్లు కబురు చెయ్యకపోతివి?" అన్నాడు చిన్నకొడుకుతోనే.
    రాత్రి భోజనాల వేళ.
    "మన వెంకట్ రెడ్డి బిడ్డను అట్లనే వుంచిన్రు నీకిచ్చి లగ్గం చేసేటందుకు" అన్నాడు తండ్రి గోడవైపు చూస్తూ.
    "చాలా మంచిగుంటది. గుణవంతురాలు. మ్యాట్రిక్ నో యేమో చదివింది" అంది తల్లి.
    "పోలీసోళ్ళు ఖాతం చేసిన్రట గద?" అన్నాడు తండ్రి.
    "అసలు అరెస్ట్ చేసినట్లే రికార్డ్ లేదట. మిస్టరీ లెక్కున్నది." అన్నాడు తమ్ముడు కరుణాకర్ రెడ్డి.
    మోహన్ రెడ్డికి పెండ్లి సంబంధం గురించి ఏవేవో మాట్లాడుతున్నారు.
    ఐదు నిమిషాలు.
    భోజనం ముగించి ఆరుబయట మంచం వేసుకుని పడుకున్నాడు మోహన్ రెడ్డి.
    ఉదయం ఏడుగంటలకి బయల్దేరాడు.
    "యెవరింటికో వచ్చినట్లు __ ఇన్నేండ్ల కొచ్చి అప్పుడే పోతున్నవా? రెండు దినాలుంటే పిల్లను చూస్కొని పక్కా అన్కొంటే" అంటున్నాడు తండ్రి.
    "మరలా నాలుగు దినాలకు వస్తవా?" అని తమ్ముడు,
    "రాత్రి వొస్తివి లేస్తనే పోతున్నవు" అని తల్లి కళ్ళలో నీళ్ళు నింపుకుంది.
    మోహన్ రెడ్డి లేచాడు.
    "రెండు దినాలల్ల మరలా రా. ఆడ్నె వుండకు" అన్నాడు తండ్రి.
    ముగ్గురివంకా చూశాడు మోహన్ రెడ్డి. కళ్ళలో చెమ్మ వుబికింది.
    చూపు పక్కకి తిప్పుకుని__ తల వూపినట్లుగా కదిపి__అడుగులు వేశాడు.
    బస్సు.
    సిటీలో నడుస్తున్నాడు.
    హోటల్లో భోజనం.
    బస్సెక్కి యూనివర్శిటీ క్యాంపస్ లో దిగాడు.
    క్యాంటీన్ కి వెళ్ళాడు.
    ఒక టేబిల్ దగ్గిర శ్రీపతి రామ్మూర్తి మరొకతను కూర్చుని వున్నారు.
    "మోహన్ రాత్రి వస్తే లేవు. ఏమైపోయావు?" అన్నాడు శ్రీపతి.
    "మా వూరెళ్ళిన."
    "నమ్మమంటావా?" అన్నాడు శ్రీపతి.
    "నమ్మక తప్పదు" అన్నాడు మోహన్ రెడ్డి.
    "వాళ్ళ వాళ్ళు పెళ్ళిసంబంధం చూసి పిలిపించి వుంటారు" అన్నాడు రామ్మూర్తి.
    "ఐతే వెళ్ళి వుండడు" అన్నాడు శ్రీపతి.
    "నువ్వు రావటానికి ముందు, మొన్న నవంబరులో దివితాలూకాలో తుఫాన్ విశేషాలు చెప్తున్నాడు శ్రీపతి. అక్కడి పరిస్థితులూ, ఆ శవాలని మనుషులెట్టా పీక్కుతింటున్నదీ వగైరా" అన్నాడు రామ్మూర్తి.
    శ్రీపతి, చూసి రావటానికి ప్రత్యేకం వెళ్ళొచ్చాడు.
    "తుఫానులొచ్చినప్పుడు రెవెన్యూ డిపార్టుమెంట్ వాళ్ళ రొట్టె విరిగి నేతిలో పడ్తది" అన్నాడు మోహన్ రెడ్డి.
    "హిమాలయాలో సి.ఐ.యె. వాళ్ళు పెట్టివుంచిన అణుపరికరం అంతరార్ధం ఇంకా అంతుపట్టలేదు మన జనతా ప్రభుత్వానికి" అన్నాడు రామ్మూర్తి.
    పక్క టేబుల్ దగ్గిర దర్బా వీరభద్రరావు మరో ఇద్దరు కూర్చుని వున్నారు. మిగతావాళ్ళు యేదో మాట్లాడుతుంటే వీరభద్రరావు, "గుడివాడ వెళ్ళాను గుంటూరు పోయాను" అని పాటపాడుతూ బల్లమీద దరువు వేస్తూ వాళ్ళు మాట్లాడుతున్నది వింటున్నాడు. వాళ్ళు మాట్లాడుతూ ఇతని పాటా వింటున్నారు.
    "శివ దీక్షా పరురాలనురా నే శీల మెంతైనా విడువజాలనురా" అని గొంతులో శృతించుకుంటూ వస్తూ, మోహన్ రెడ్డిని చొసి, "నేడెంత సుదినం. న్యాయస్థానమే ఇక్కడికి తరలివచ్చింది." అన్నాడు వరాహశాస్త్రి.
    "మన మోహనుడు న్యాయం కోసం పోరాడతాడు. డబ్బు కోసం కాదు" అన్నాడు రామ్మూర్తి.  
    "న్యాయం కావాల్నంతే డబ్బు కావాలి. న్యాయం చాలా ఖరీదై డబ్బుంటే న్యాయం అక్కర్లేదు" అన్నాడు మోహన్ రెడ్డి.
    "అతి ఖరీదైంది న్యాయం. చాలా పెట్టుబడి పెట్టాలి. అతి చవకైంది కార్ల్ మార్క్స్ కేపిటల్. ఆయన కేపిటల్ కి పెట్టుబడి అతిస్వల్పం. మూడువేల మేలిరకం ముద్రణ పేజీలు  మూడైదులు పదిహేను రూపాయలు. భారతం తరవాత భారతం అంతటి పెద్ద కావ్యం" అన్నాడు శ్రీపతి.
    "మనలో మాట. మార్క్స్ కేపిటల్ నేను చదవలేదు గానీ అది కవిత్వమా?" అన్నాడు రామ్మూర్తి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS