Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 111


    "ఒకానొక కొత్త పొలిటికల్ ఎకానమీని అంత చక్కగా రాసినప్పుడు కవిత్వంలాగే అనిపిస్తుంది. యూరోపియన్ పెట్టుబడిదారులు ఆ కవిత్వాన్ని ఆస్వాదించి, ఆ చిరు మేనిఫెస్టోని ఆరగించి, కార్మికులు పోయేది శృంఖలాలేగా అని తెంచేసుకుంటారేమోనని బంగారం గొలుసులు వేశారు." అన్నాడు శ్రీపతి.
    అవతల బల్ల దగ్గిర వీరభద్రరావు "చిలక కొట్టుడు కొడితే" అని పాట లంకించుకున్నాడు, చేత్తో బల్లమీద కొడుతూ.
    "మన జనతా వాళ్ళు ఇందిరమ్మకి గొలుసులు తగిలించబోతే తెలివిగా తప్పించుకుంది" అన్నాడు రామ్మూర్తి.
    "అంత తెలివి హీనంగా అరెస్టు చెయ్యటం దేనికి? ఆ సీనియర్ అధికారులకి ఆ మాత్రం రూల్స్ తెలియదా? ఇదేదో గృహమంత్రి చరణ్ చౌదరి అంతర్నాటకం యేదో ఐవుంటుంది" అన్నాడు శ్రీపతి.
    అవతల బల్ల దగ్గిర సినిమా ప్రోగ్రాం గురించి చర్చిస్తున్నారు.
    "జయమాలినుంటే వస్తా" అన్నాడు వీరభద్రరావు.
    "తెలుగు సినిమా అంటున్నాంగా! జయమాలిని లేకుండా తెలుగు సినిమా యెట్లా వుంటుందోయ్ వెర్రి భద్రం"
    "ఆమె రాత్రులుకి వెళ్దాం" అన్నాడు వీరభద్రరావు. ఆ వాల్ పోస్టర్లు కళ్ళలో మెదులుతూంటే.
    "'ఆమె రాత్రులు' పేరు 'హర్ నైట్స్' అని మలయాళం సినిమా"
    "దాన్లో జయమాలిని లేదా?" అన్నాడు వీరభద్రరావు.
    "జయమాలిని దేనికి దాన్లో యమమాలిని వుంది తెల్లార్లూ"  
    "దెన్ ఓకే" అన్నాడు వీరభద్రరావు వుత్సాహంగా.
    ఆ వుత్సాహంలో "వో లమ్మీ తిక్కరేగిందా __ తిమ్మిరెక్కిందా" అని పాట అందుకుని, తొడమీద చేత్తో వాయించుకొంటున్నాడు.
    "యీ దర్భారావుగాడి యమగోల భరిస్తూ కూచోటం కంటే చెట్టు నీడన ఆఖరికి యెండలో ఐనా సరే నుంచోటం హాయి" అన్నాడు శ్రీపతి.
    "వెడలెను కోదండపాణి" అంటూ లేచాడు వరాహశాస్త్రి.
    బయటికొచ్చారు. రామ్మూర్తి క్లాసుందని లోనకి వెళ్ళాడు.
    వరాహశాస్త్రి లాబ్ లో వర్కుందని సైన్సు బిల్డింగులవైపు నడిచాడు. "రాగసుధా రససానము జేసి రంజిల్లవే వో మనసా" అనుకుంటూ.
    "మోహన్" అన్నాడు శ్రీపతి.
    "చెప్పు శ్రీపతీ" అన్నాడు మోహన్ రెడ్డి.
    "చాలా కాలానికి నీ కళ్ళలో వెనకటి మెరుపు చూస్తున్నాను" అన్నాడు శ్రీపతి.
    "అట్లనా?"
    "అవును" అని, "కోర్టుకి వెళ్ళలేదా?" అన్నాడు.
    "లే."
    హాస్టల్ గదికి చేరుకున్నారు.
    "యీ రాత్రికి ఇక్కడే వుండిపోరాదూ? తెల్లారి లేచి కోర్టుకి వెళుదువు" అన్నాడు.
    "ఇక కోర్టుకి వెళ్ళను" అన్నాడు మంచంమీద పడుకుంటూ.
    "శుభం నీ వొంటికి కోర్టు సరిపడదోయ్"
    "మనసుకి కూడా" అన్నాడు మోహన్ రెడ్డి.
    "నాకు రాత్రి కలలో గాయత్రి కనిపించింది" అన్నాడు శ్రీపతి.
    "వూఁ"
    "ఆ కలలో నువ్వు లేవు"
    "వుఁ"
    "యీ మధ్య మన రామ్మూర్తికీ రవికీ పరిచయం పెరిగింది. రవి ద్వారా ప్రయత్నిస్తే ఏమన్నా ఆచూకీ దొరుకుతుందేమో__"
    "వద్దు."
    "మోహన్, దీనంతటికీ వెనక యెవరిదో ప్రైవేటు వ్యక్తో వ్యక్తులదో ప్రమేయం వుండాలి...." అని ప్రారంభించాడు.
    మోహన్ రెడ్డి నిద్రపోయాడు.
    లేచేసరికి సాయంత్రం ఐదున్నర.
    శ్రీపతి, విలియం వైట్ పుస్తకం "ది ఆర్గనైజేషన్ మ్యాన్" చదువుతూ వున్నాడు. మోహన్ రెడ్డి లేవటం గమనించి, "స్నానించి రా" అన్నాడు.
    మోహన్ రెడ్డి బాత్రూంలోకి వెళ్ళివచ్చాడు.
    "వెళ్ళి టీ తాగుదామా?" అన్నాడు శ్రీపతి.
    "యీ రాత్రికి వుండిపోవూ?" అన్నాడు శ్రీపతి.
    "వుఁహూఁ"
    "రేపు నేను రానా?"
    "వుఁహుఁ"
    "మళ్ళీ యెప్పుడొస్తావు?"
    "వచ్చినప్పుడు" అని మోహన్ రెడ్డి శ్రీపతి దగ్గిరికి వెళ్ళి అతని చెయ్యి అందుకున్నాడు. శ్రీపతి లేచి నిలుచున్నాడు.
    మోహన్ రెడ్డి, శ్రీపతి చుట్టూ చేతులు వేసి గట్టిగా కావలించుకున్నాడు మోహన్ రెడ్డి కళ్ళలో చెమ్మ.
    నాలుగు క్షణాలు.
    విడివడి, "బస్సుదాకా రా" అన్నాడు మోహన్ రెడ్డి.
    శ్రీపతి గోడకి వున్న మేకుకి తగిలించి వున్న తాళం తియ్యటానికి అడుగులు వేశాడు.
    మోహన్ రెడ్డి, తన జేబులోంచి తాళం చెవుల గుత్తి తీసి శ్రీపతి టేబుల్ మీద పెట్టి, శ్రీపతి వైపుకి అడుగులు వేసి, అతని భుజంమీద చెయ్యి వేసి గుమ్మంలోకి నడిచాడు.
    గదికి తాళం వేశాడు శ్రీపతి.
    బస్టాపు. బస్సు ఖాళీగా వుంది. కదలబోతోంది.
    మోహన్ రెడ్డి ఫుట్ బోర్డు మీద కాలువేసి, పక్కకి తిరిగి శ్రీపతి వంక చూస్తూ చెయ్యి వూపాడు, మెరుస్తున్న కళ్ళతో.
    కోఠీలో బస్సు దిగాడు. రిక్షా యెక్కి రైలుస్టేషను దగ్గిర దిగాడు.
    అరగంట స్టేషన్లో కూర్చున్నాడు. రైలు కదులుతోంది. యెక్కి నుంచున్నాడు.
    రాత్రంతా కూర్చుని మేలుకుని చూస్తున్నాడు__యెక్కడో.
    తెల్లవారుజాము నాలుగున్నర.
    రైలు ఓ చిన్న స్టేషన్ లో ఆగింది.
    దిగాడు.
    నడుస్తున్నాడు.
    కంకరరోడ్డు, నడుస్తున్నాడు.
    పల్లెటూళ్ళు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS