శ్రీపతి మౌనంగా వుండిపోయాడు.
"మీరు కాదంటే ఆజన్మాంతం బ్రహ్మచారిణిగా వుండిపోతాను" అంది.
"అలా వుండిపోవటం డాన్స్ కి మంచిదే" అన్నాడు.
"నన్ను టీజ్ చెయ్యకండి. ప్లీజ్ మై హార్ట్ ఈజ్ సో హెవీ విత్ లవ్ ఫర్ యూ__"
రెండు నిమిషాల మౌనం.
"ఇఫ్ ఐ కాంట్ మ్యారీ యూ__" అంటోంది.
"పెళ్ళి అనేది అనూహ్యం. అలా అని వివాహ వ్యవస్థకి వ్యతిరేకిననీ కాదు. నాకు పెళ్ళి అన్న ఆలోచన వస్తే పొట్ట చెయ్యలయ్యేటంత నవ్వొస్తుంది" అన్నాడు.
రెండు నిమిషాల నిశ్శబ్దాన్ని ఫ్యాను మోత జోరీగలా చుట్టేసింది.
"ఒకరంటే ఆ భావం కలిగింది కాబట్టి యెప్పుడో అప్పుడు ఇంకొకరంటే కలగవొచ్చు. అప్పుడు భరతనాట్యం మానేసి సంసార నాట్యం ప్రారంభించండి" అన్నాడు.
ఆమె కళ్ళలో నీటి పొర.
"అది అసంభవం మరెవరితోనూ నన్ను వూహించుకోలేను. కనీసం ఒక్కసారి నన్ను మీలో కలిపేసుకోండి. ఆ అనుభవంతో జీవితం అంతా ఒంటరిగా గడిపేస్తాను" అని ముందుకి వంగి అతని ఒళ్ళో ముఖం ఆన్చింది.
"వందనా__" అని భుజాలు పట్టుకుని పైకి లేవనెత్తి, "ప్లీజ్ కంట్రోల్ యువర్ ఫీలింగ్స్" అన్నాడు.
"నేను మీకు మంచిగ అనిపించలేదా?" అంది.
"నాట్ ఎటాల్. యు లుక్ సో ఫైన్. కానీ నేను వొకలాంటి తిరుగుబోతుని. ఐకెన్ డు ఇట్ విత్ సమ్ పర్సన్స్ ఐ కెన్ యాజ్ వెల్ డు ఇట్ విత్ యు. కానీ ఆ తరవాత మీరు జీవితాంతం అందుకు బాధపడతారు. వందనా మైడియర్ ప్యూర్ వందనా, రిమెయిన్ ప్యూర్. చెప్పానుగా వొకరంటే ఆ భావం కదిలింది కాబట్టి యెప్పుడో అప్పుడు ఇంకొకరంటే కలగొచ్చు. నాలాంటివాడు కాక, జీవితాన్ని అర్పించుకుని పంచుకోతగిన వ్యక్తితో సార్ధకమవండి" అని ఒకక్షణం ఆగి, "వందనా, యు నీడ్ లోన్లీ నెస్. నే వెళతాను" అన్నాడు.
అతని ముఖంలోకి చూడబోయి చూపు కిందకి వాల్చింది.
లేచాడు.
ఆమె లేవబోతూంటే, "మీరు ఇక్కడే కూర్చోండి. నే వెళతాను" అని గది బయటికి అడుగులు వేశాడు శ్రీపతి.
ఆ మూడో రోజున అతనికి వచ్చిన నాలుగైదు ఉత్తరాలలో ఒక ఉత్తరం వందన రాసిన ఉత్తరం.
ప్రియాతి ప్రియమైన శ్రీపతిగారూ, అంత స్వల్పమైన క్షణికమైన కోర్కె కూడా తీర్చకుండా కాఠిన్యంగా వెళ్ళిపోయారు. బహుశా అందుకేనేమో మీరంటే మరింతగా ఇనుమడించిన ప్రేమ, ఆరాధన. ఏమో ఇదీ ఒకందుకు మంచిదేనేమో__మిమ్మల్నే నా హృదయంలో నిలుపుకుని మీ వందనగా యీ జీవితమంతా ఒంటరిగా బ్రహ్మచారిణిగా నాట్యంతో గడిపేస్తాను__వందన. అని క్లుప్తంగా ఇంగ్లీషులో__ తెల్లని ఆర్ట్ పేపర్ మీద స్కెచ్ పెన్ తో రాసిన అందమైన పచ్చని అక్షరాలు.
'వందనం వందనా నువ్వెంత తియ్యని వందనవి! ఇంత చక్కని వుత్తరం, వుంచతగ్గదేగానీ, యే కుళ్ళు కళ్ళలోనో పడితే ఆ నేరం నాదవుతుంది__' అని మనసున అనుకుని__ చిన్న చిన్న ముక్కలుగా చించి నీళ్ళగ్లాసులో వేశాడు. నీటిలో వుంచిన చిన్ని చిన్ని మైనం శిల్పాల్లా, నీలం గ్లాసులోని నీళ్ళలో కదులుతున్న అందమైన పచ్చని అక్షరాలు.
122
సాయంత్రం నాలుగూ పావు.
సుల్తాన్ బజార్ కోఠీ దగ్గిర్లో వున్న సిటీ సివిల్ కోర్టులో కూర్చుని వున్నాడు మోహన్ రెడ్డి.
"మోహన్ సాబ్ మీరేమిటి సీరియస్ గా ప్రాక్టీస్ చెయ్యరు?" అన్నాడు వొక సాటి లాయరు తీరికగా కూర్చుని.
"యీ న్యాయవ్యవస్థ మీద నమ్మకం లేకే."
"మరెందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు?"
"కొందరి పేదలనైనా కొన్ని చిన్న చిన్న కష్టాల నుండి తప్పించుదమని" అని లేచి బయటికి వస్తున్నాడు మోహన్ రెడ్డి.
యెదురుగా వచ్చిన వ్యక్తి ఒక చిన్న కవరు అందించాడు.
కవరు మీద యేమీ రాసిలేదు. యేమిటన్నట్లుగా అతనివంక చూశాడు మోహన్ రెడ్డి. కవరు చూడమన్నట్టుగా చూపుతో సూచించాడు అతను.
కవరు చించాడు.
గాయత్రి దస్తూరి.
మోహన్ రెడ్డి గుండె సంతోషంతో వుద్వేగంగా కొట్టుకుంటోంది వేగంగా.
నేనిక్కడున్నాను__చిన్నారి అరుణతో__ అని పదమూడు అక్షరాలూ తప్ప మరేమీ లేదు ఆ పెద్ద కాగితం మీద.
"మీరెవరు?" అని అతనిని అడిగాడు మోహన్ రెడ్డి.
"తరవాత తెలుసుకుంటారులెండి" అన్నాడు అతను.
"యెక్కడ వుంది?" అన్నాడు మోహన్ రెడ్డి.
యెక్కడో, రెండు పొడి ముక్కల్లో చెప్పాడు అతను. చెప్పిన వెంటనే చకచకా నడిచి వెళ్ళిపోయాడు.
మోహన్ రెడ్డి నడుస్తున్నాడు.
సుధీర్ ఎదురుపడ్డాడు దగ్గిరున్న ఇరానీ హోటల్లోకి దారితీశాడు.
"ఎమర్జన్సీ ధమ్కీ తోటి మనవాండ్లు నీరసించి సాయుధపోరాట తత్వం నుండి సాంస్కృతిక ధోరణికి బదలాయిస్తున్నారు" అని ప్రారంభించి విమర్శిస్తున్నాడు సుధీర్.
మౌనంగా వింటున్నాడు మోహన్ రెడ్డి.
పది నిమిషాలు మాట్లాడి, "ఏమిటట్లుంన్నావు? యు మస్ట్ ఓవర్ కమ్ ఆల్ దట్. ఖతమ్ చేసి వుంటారు అన్నాడు సుధీర్ దిగులుగా.
బయటికొచ్చారు. "మరలా కలుస్త యింటికొచ్చి" అని సుధీర్ అటు నడిచాడు.
మోహన్ రెడ్డి గాయత్రి వాళ్ళింటికి వెళ్ళాడు. ఆమె తండ్రి రామనాధం అప్పుడే వచ్చాడు ఆఫీసు నుంచి. అతనికి ఇంకో ఐదేళ్ళ సర్వీసుంది.
