Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 11

    కన్నారావు తీవ్రంగా ఆలోచించసాగాడు.

    ఇప్పుడు ఆ అమ్మాయిని అల్లరిపెట్టాలి! అంటే ఏం చెయ్యాలి?

    జడపట్టుకుని లాగాలా? పైట పట్టుకుని లాగాలా?

    "అమ్మో!..." గుండె మీద చెయ్యేసుకున్నాడు.

    'నేను అలా చెయ్యగలనా?' అనుకున్నాడు మనసులో.

    పోనీ ఏదైనా తెలుగు సినిమాలో హీరో హీరోయిన్ని ఏడిపిస్తూ అనే ద్వంద్వార్థం డైలాగు ఒకటేదైనా అంటేనో?!...

    మరీ అంత వల్గర్ గా మాటలు అంటే బాగుంటుందా? ఒక పని చేస్తే? మెల్లగా విజిలేస్తాను... ఆ అమ్మాయి కంగారుపడుతూ వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడు... అప్పుడు అప్పుడేమనాలి?

    బుర్ర గోక్కున్నాడు... ఏదో ఒకటి అనాలి!... ఏమైనా సరే!!...

    చిరాకుగా ఆలోచిస్తున్నాడు.

    ఆ అమ్మాయి మెల్లగా నడుస్తుంది. కన్నారావు ఆమెతో ఏమనాలో అని ఆలోచిస్తూ నడుస్తున్నాడు. వీళ్ళిద్దర్నీ కాస్త దూరంలో చిట్టబ్బాయ్ ఫాలో అవుతున్నాడు.

    'ఊరికే మాటలు అంటే లాభంలేదు... కామెంట్సు భరిస్తూ వెళ్ళిపోవచ్చు. చెయ్యిపట్టుకుని లాగితే ఠారెత్తిపోతుంది... ఆ టైంలో వచ్చి చిట్టబ్బాయ్ డిష్యూం డిష్యూం అంటాడు. నేనేమో పరుగుతీస్తాను... చిట్టబ్బాయ్ కి ఈ అమ్మాయి థాంక్స్ చెప్పి ఇంటికి టీకి ఆహ్వానిస్తుంది. చిట్టబ్బాయ్ ఈ అమ్మాయిని మర్నాడు సినిమాకి ఆహ్వానిస్తాడు... తరువాత పార్కులూ, రెస్టారెంట్లూ... ఆ విధంగా చిట్టబ్బాయ్ ప్రేమలోపడి కథ సుఖాంతం అవుతుంది" అనుకున్నాడు కన్నారావు.

    కన్నారావు మెల్లగా తల తిప్పి వెనక్కి చూశాడు.

    కాస్త దూరంలో తమని ఫాలో అవుతూ వస్తున్న చిట్టబ్బాయ్ కనిపించాడు.

    కన్నారావు తనని చూడగానే చిట్టబ్బాయ్ విసుగ్గా మొహం పెట్టి ఆ అమ్మాయిని చూపిస్తూ ఏదో ఒకటి చెయ్యమన్నట్టుగా సైగ చేశాడు.

    కన్నారావు ముందుకు తిరిగి ఆ అమ్మాయి వంక చూశాడు. ఆ అమ్మాయి తాపీగా నడుస్తుంది.

    'ఇందాక అనుకున్నా ప్రకారం మొదట విజిలెయ్యాలి!' అనుకున్నాడు కన్నారావు.

    కన్నారావు ఆ అమ్మాయివంక చూస్తూ స్టయిల్ గా విజిలేసాడు.

    ఆశ్చర్యం!!

    కన్నారావు నోటివెంట "తుస్ తుస్" అని గాలి వచ్చింది తప్ప విజిల్ రాలేదు.

    "ఓహ్... ఈ వేళ నాకేమైంది? కంగారుపడ్డాడు కన్నారావు.

    ఈసారి మళ్ళీ ప్రయత్నించాడు.

    "తుస్ స్ స్..."

    కన్నారావు కి కంగారు ఎక్కువైంది.

    నోటివెంట విజిల్ రాదేం? కంగారు, ఆతృతవల్ల విజిల్ వేయడం రావడం లేదు!!... కాస్త మనసుని అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా విజిల్ వేయాలి.

    కన్నారావు ఒకసారి రెండు చేతుల్తో బుగ్గలు సవరించుకుని, పెదాలు తడుపుకుని విజిల్ వేసాడు.
    "పుయ్ య్ య్ ..."

    ఆ అమ్మాయి ఆగి వెనక్కి తిరిగింది.

    కన్నారావు గుండె క్షణంకాలం ఆగి మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించింది.

    ఆ అమ్మాయి గట్టిదే!... కేవలం విజిళ్ళకి భయపడే రకంలా లేదు. చేయి పట్టుకోవాల్సిందే!!!" అనుకున్నాడు కన్నారావు.

    అనుకున్నదే ఆలశ్యం చటుక్కున ఆ అమ్మాయి చేయిపట్టుకున్నాడు.

    ఆ అమ్మాయి అరవలేదుగానీ చిట్టబ్బాయి మాత్రం గావుకేక పెడ్తూ మెరుపులా దూసుకువచ్చి కన్నారావు గెడ్డం కింద కొట్టాడు. కన్నారావు రోడ్డు మీద వెల్లకితలా పడిపోయాడు. అతని కళ్ళముందు ఓ రెండు డజన్ల రంగు రంగుల నక్షత్రాలు గిర్రున కొన్ని క్షణాలు తిరిగాయి.

    కన్నారావు తరువాత తేరుకుని రోడ్డు మీది నుండి లేచి నిలబడి బట్టల కంటిన మట్టి దులుపుకుని చిట్టబ్బాయని తిట్టడం మొదలుపెట్టాడు.

    "ఒరేయ్ నీకు బుద్ధుందా?.... ఏంట్రా అంత గట్టిగా కొట్టావ్?? కాస్త మెల్లగా కొట్టలేవా? నా గడ్డం పగిలింది తెల్సా?" చేత్తో గడ్డం రుద్దుకున్నాడు.

    "ఇంకా మాట్లాడితే ఈసారి నీ తల పగుల్తుంది తెల్సా?... లేకపోతే ఒంటరిగా అమ్మాయి కనిపించింది కదా అని పిచ్చి వేషాలేస్తావా?...." అన్నాడు చిట్టబ్బాయి జబ్బలు చరుస్తూ.

    "అబ్బే... అతనేమీ పిచ్చివేషాలు వెయ్యడం లేదండీ..." అంటూ ఆ అమ్మాయి ఏదో చెప్పబోయింది.

    "మీరూర్కోండీ .... మీకేం తెలీదు! వాడు నిజంగానే పిచ్చివేషాలు వేస్తున్నాడు!!..." అన్నాడు చిట్టబ్బాయి ఆ అమ్మాయిని మాట్లాడనివ్వకుండా.

    "అవునోయ్... పిచ్చివేషాలు వేస్తాను! అది నా ఇష్టం!!... నువ్వెవరివి అడగడానికి?" గట్టిగా అన్నాడు కన్నారావు.
    చిట్టబ్బాయ్ ఆ అమ్మాయివైపు చటుక్కున తిరిగాడు.

    "చూసారా, చూసారా... పిచ్చివేషాలు వేస్తున్నట్టు వాడే ఒప్పుకుంటున్నాడు మీరేమో వాడిని అమాయకుడని అనుకుంటున్నారు" అన్నాడు.

    "అవునోయ్... పిచ్చివేషాలు వేస్తాను. వెర్రివేషాలు వేస్తాను... ఏం చేస్తావేం?" రెట్టించి అడిగాడు కన్నారావు.

    ఏం చేస్తానా?... చూడు!" చిట్టబ్బాయ్ కన్నారావు దవడమీద గట్టిగా కొట్టినట్టు నటించాడు.

    "అబ్బా!" బాధ నటిస్తూ రెండడుగులు వెనక్కి తూలాడు కన్నారావు.

    "ఇంకోసారెప్పుడైనా అమ్మాయిల్ని ఇలా వెంటబడి వేధిస్తావా?"

    ఈసారి పొట్టలో గుద్దినట్టు చేసాడు.

    "బాబోయ్..."

    బాధపడ్తున్నట్టు రెండు చేతులూ పొట్టమీద పెట్టుకుని ముడుచుకుపోతూ కిందికి వంగాడు కన్నారావు.

    చిట్టబ్బాయ్ కన్నారావుని మెడపట్టి నిటారుగా లేపి నిల్చోబెట్టి గెడ్డం కింద పిడికిలితో కొట్టాడు.

    కన్నారావు "హమ్మోయ్..." అంటూ నాలుగడుగులు వెనక్కి తూలాడు. "పాపం అతన్ని వదిలేయండి" అంది ఆ అమ్మాయి చిట్టబ్బాయ్ తో.

    చిట్టబ్బాయి చెంగున ముందుకు దూకి కన్నారావు కాలరు పట్టుకుని చెవిలో మెల్లగా కసిరాడు.

    "ఏంట్రా ఇందాకట్నుండీ అమ్మా. అబ్బా అంటూ ఇక్కడే చస్తున్నావ్? ఇంకెంతసేపు ఫైటింగ్ సీన్ లో నటించాలనుకుంటున్నావ్, నువ్వు ఇప్పుడు ఇకడ్నుంచి వెంటనే పారిపోకపోతే నిన్ను నిజంగా తంతా."

    "నువ్వు ఒక్క దెబ్బ కొట్టగానే నేను పారిపోతే నన్ను మరీ ఏబ్రాసిగాడని అనుకోదూ ఆ అమ్మాయి?" గొణిగాడు కన్నారావు.

    "ఆ అమ్మాయిని ఇంప్రెషన్ కలగాల్సింది నా మీద - నీ మీద కాదు.... నువ్విక వెళ్తావా?' పళ్ళు కొరుకుతూ అన్నాడు చిట్టబ్బాయి.

    కన్నారావు బుద్దిగా తల ఊపాడు.

    "అతన్ని వదిలేయండి పాపం!" అంది ఆ అమ్మాయి.

    "హు... ఆ అమ్మాయి మొహం చూసి నిన్ను వదిలేస్తున్నా... మళ్ళీ ఈ చాయల్లో కనిపించావో నీ ఎముకలు ఏరేస్తా..." అంటూ చిట్టబ్బాయి కన్నారావు చొక్కా కాలరు వదిలి ఛాతీమీద చెయ్యిపెట్టి వెనక్కి ఒక్క తోపు తోసాడు.

    కన్నారావు వెనక్కి తూలి కిందపడకుండా నిలదొక్కుకుని రెండు క్షణాలు ఆగి రయ్యిమని పరుగెత్తుకుని వెళ్ళిపోయాడు.
    "హ... ఏమనుకున్నాడో మన దెబ్బలంటే".

    చిట్టబ్బాయి జబ్బలు చరచుకుంతూ వెనక్కి తిరిగి ఆ అమ్మాయి వంక చూసి "హి హి..." అని నవ్వాడు.

    ఆ అమ్మాయి కులుకుతూ, మెలికలు తిరిగిపోతూ పళ్ళన్నీ కనిపించేలా తను కూడా నవ్వింది.

    ఆమె పళ్ళు చూసిన చిట్టబ్బాయ్ డంగైపోయాడు.

    కారణం ఆమె పళ్ళన్నీ గారపట్టి ఉన్నాయి.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS