Previous Page Next Page 
విధి విన్యాసాలు పేజి 11

 

    "వద్దు, మధూ!....నీకా మాత్రం ....నీకూ ఓ అండ కావాలి. బాబును నువ్వే తీసుకో....మామగారు , తల్లీనీ, బిడ్డనీ వేరు చేసేంత ధైర్యస్తూడిని కాను. అంత గట్టి గుండె కాదు నాది.... ఇన్నాళ్ళ నా సర్వీసు లో మీరూ, నా సహచర్యం లో మధూ నన్నిలా అర్ధం చేసుకుని అవమానించినందుకు బాధపడుతున్నాను , వెళుతున్నాను. మరి ఈ జన్మలో ....వద్దు.... వద్దు....నా బాబు....." అంటూ గబగబా మెట్లు దిగాడు ప్రసాదరావు.
    "నీ సామాన్లు తీసుకుపో. నిన్ను గుర్తు తెచ్చేవేవీ ఉండకూడదీ ఇంట్లో. "దుఃఖావేశంలో ఊగిపోతున్నారు వెంకట్రామయ్య.
    చివాలున వెనుతిరిగి చెమ్మగిలిన కళ్ళు తుడుచుకుంటూ అందరి వైపూ కలియజూచి, వేదాంతి లా నవ్వి "నా సామాన్లు, అంటే గిన్నె చెంబూ వగైరా తీసుకు పోయినంత మాత్రాన గుర్తుకు రాకుండా పోతానా> మామయ్యా?' అన్నాడు సవాలు చేస్తున్నట్టు ప్రసాదరావు.
    క్షణం తరువాత బాధగా నిట్టూర్చి, కళ్ళలో నీరు కమ్ముకుంటూ ఉంటె , తర్జని ఎత్తి చూపిస్తూ "సామాన్లు మళ్ళీ కొంటాను. కాని, అంతకన్నా విలునైన నా అనుకునే వ్యక్తులు వాళ్ళని వదిలి పోతున్నాను. మళ్ళీ వాళ్ళ నేలాకొనగలను?...డబ్బిచ్చి కొనగలనా?.... చాలా మంది వ్యసనపరులు ఉండవచ్చు.... తప్పుడు పనులు చేసిన వారు ఉండవచ్చు కాని....కాని.... ఇలా ఇంటి అల్లుణ్ణి బజార్లో అవమానించడం న్యాయం కాదు. మధు ఇంకా లోక జ్ఞానం తెలియని మనిచి" అని దృష్టి నిలిపి అనేస్తూన్న ప్రసాదరావు వైపు చూసిన మధుమతి తల వాల్చింది. వెంకట్రామయ్య మినహా మిగతా వారు తలుపు వారలకి తప్పుకున్నారు.
    వెనక్కి వెళ్ళిపోబోతున్న మధుమతి ని "మధూ, వీరందరితో పని లేదు. నేను నాతొ రమ్మంటున్నాను. బాబును తీసుకుని వచ్చేయ్. చివరిసారిగా అర్ధిస్తున్నాను. వచ్చేయ్ నాతొ.... ఈ ఇంట్లోంచి పోదాం.... వీరందరూ శాశ్వతంగా నిన్నాదుకోరు.... ఆఖరిసారిగా అడుగుతున్నాను-- నా మాట మన్నించు" అన్నాడు. ఖంగున  స్థిరంగా ధ్వనించింది ప్రసాదరావు కంఠం.
    ఒక్కసారి అతని వైపు నిరసనగా చూసి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది మధుమతి. ఈ తగువు వినోదంగా చూస్తున్నా ఆడా, మగ "ఔరా!' అంటూ ముక్కు మీద వేలేసుకున్నారు.
    తోకతొక్కిన తాచులా బుస కొడుతూ , అవమాన భారంతో , విసురుగా వీధి గేటు తీసుకు రోడ్డేక్కాడు ప్రసాదరావు.
    "ఫో, వెధవా! ఫో...." కసిగా , అసహనంగా అరిచారు వెంకట్రామయ్య. అతను కనిపించినంత మేరా చెక్కుల మించీ కన్నీళ్ళు బొట్లు బొట్లుగా జారిపోతుంటే చూసి, స్పృహ కోల్పోయారు తహసీల్దారు వెంకట్రామయ్య.

                                            *    *    *    *
    గతం కసిగా హృదయాన్ని నలిపింది. మొహం పీక్కుపోయింది. కళ్ళు ఎర్రబడి నీళ్ళు చిమ్మాయి. గది అంతా చీకటి ఆవరిస్తుంది. చివాలున లేచి నిలుచుని, స్విచ్ వేసి, నమస్కరించి బాత్ రూమ్ వైపు నడిచాడు ప్రసాదరావు.
    తిరిగి వచ్చేసరికి గదిలో కూర్చున్న గోపాల్రావు వైపు ఆదరపూర్వకంగా చూస్తూ, "ఏమిటింత ఆలస్యం చేశావు? కాస్త కాఫీ తాగు, మాట్లాడుకుందాం" అంటూ ఫ్లాస్కు లో కాఫీ వంచబోతున్న ప్రసాదరావు ని "నాకు వద్దు. మీరు తీసుకోండి" అని వారించాడు గోపాల్రావు.
    కొంచెం కాఫీ తాగి కూర్చుంటూ, "మరేమిటి విశేషాలు? మా వాడి కిప్పట్లో సెలవులెం ఉండవా?" అన్నాడు ప్రసాదరావు.
    "దసరా సెలవులుంటాయిగా? వాడు నేరుగా మీ దగ్గరి కొచ్చేస్తాడని అనుకోలేదు సుమండీ" అంటూ వాసు తన దగ్గిరికి వచ్చిన్ చెప్పిన విషయాలూ, ప్రసాదరావు అడ్రసు అడగడం చెప్పాడు గోపాల్రావు మధ్య మధ్య నవ్వుతూ.
    వింటున్న ప్రసాదరావు సంతోషాన్ని పట్టలేనట్టు నవ్వుకుంటున్నాడు. గోపాల్రావు చెప్పడం అయిపోయిన తరవాత "నిజంగా నేను మళ్ళీ జన్మ లో వాణ్ణి చూస్తాననుకోలేదు. వాడలా నా దగ్గిరికి వస్తాడని కలలో నూ ఊహించలేదు. చూడు, అనేక రకాలుగా ఇప్పుడు పిల్లా పెద్దా మాయమాటలు చెప్పి డబ్బులు గుంజుకు పోతున్నారు. అలాంటి రకమనుకుని కసిరి పొమ్మన్నాను. ఏడుపు లంకించుకున్నాడు. ప్చ్... వాడన్నీ నీకు చెప్పాడుగా. దైవ మలా ప్రోత్సహించింది కాబోలు మరి." అన్నాడు ప్రసాదరావు తృప్తిగా నవ్వుకుంటూ.
    "పోనీ, మంచికేగా? తండ్రి కొడుకూ కలుసు కున్నారు..... బావా, నాకు తెలియ కడుగుతాను... అక్కయ్యా, మీరూ , నాన్నా-- అందరం అంత ఆత్మీయంగా ఉండేవారం కదా ఎందు కొచ్చాయి గొడవలు? నేను ఇంటి దగ్గర లేనుగా! ట్రెయినింగు నుంచి వచ్చి, హోల్డాలు ఇంట్లో పెట్టానో లేదో ఒకటే గందరగోళం... మీరింట్లోంచి వెళ్ళిపోవడం ఆరోజే అంటూ ఆసక్తిగా ప్రసాదరావు మొహంలోకి చూశాడు గోపాల్రావు.
    ఒక్కసారి ఇబ్బందిగా కదిలి కూర్చుని, "ప్చ్! అంటూ శూన్యం లోకి చూస్తూ మౌనంగా ఉండి పోయాడు ప్రసాదరావు.
    రెండు క్షణాలు దొర్లిన తరవాత, "అభ్యంతర మైతే పోనీండి. కానీ మీరిల్లు వదిలి వచ్చాక ఉద్యోగం రిజైన్ చేశారు కదా? మళ్ళీ..." అంటూ ఆగి, "మీరు పెళ్ళి చేసుకున్నారని విన్నాం." అంటూ సంశయంగా ఊరుకున్నాడు గోపాల్రావు.
    "చెపుతాను. పదహారు సంవత్సరాలు దొర్లి పాత కధయ్యాక ఇక చెప్పడానికి అభ్యంతర మేమిటి? నేనిల్లు విడిచి వచ్చాక ఎమనుకునేవారు చెప్పు? మీ నాన్నగారేలా పోయారు? వాసు అయిదేళ్ళ వాడుగా ఉన్నప్పుడు బస్సులో చెప్పాడు.. అసలు ఎప్పుడన్నా నా ప్రసక్తి నాన్నని అడిగేవాడా వాసు?' కళ్ళలో ఏదో వింత కోరిక మెరుస్తుంటే అడిగాడు ప్రసాదరావు.
    "బాగుంది. ఇప్పుడంటే కాస్త పెద్ద వాడై కొన్ని అర్ధం చేసుకు ఊరుకున్నాడు కాని ఓసారి స్కూలు నుంచి వస్తూనే అక్కయ్య భుజాలు కుదిపి, 'మా నాన్నగా రెక్కడున్నారో చెప్పు" అంటూ మారాం పెట్టాడు. అది చిరాగ్గా రెండు పడేసింది. "యుద్దంతో కెళ్ళాడు , వస్తాడు. ఎందుకీవేళ నాన్న నడుగుతున్నావు' అని మా అమ్మ అడిగింది లాలనగా. వాడి నాన్న నింట్లోంచి తగిలేశారని ఎవరో అన్నారట. నిజమా, కాదా? అంటూ అందర్నీ నిలదీసి, మా నాన్నని దేముడు తీసుకు పోయాడని అనేసరికి అక్కయ్య వాడి నోరు నొక్కి ఏడవడం మొదలు పెట్టింది. ఆరోజు ఇల్లంతా గందరగోళం చేశాడు. కొన్నాళ్ళందర్నీ వేధించే వాడు "నాకూ నాన్నా కావాలి' అంటూ. అడుగడుగునా నాన్న అన్నావంటే నేను దేవుడి దగ్గిరికి వెళ్ళిపోతానని అక్కయ్య బెదిరించింది. అప్పటి నుంచీ తన నడగడం మానేశాడు.' అంటూ నవ్వి , "మీరిల్లు వదిలి వచ్చేశాక ఏముంది? ఏడుపులూ, మొత్తుకోళ్ళతో వారం గడిచింది. మా నాన్నగారు మాత్రం మానసికంగా దెబ్బతిన్నారేమో! పిచ్చిపిచ్చిగా మాట్లాడేవారు. అక్కయ్య చాలా కాలం దాకా ఏకాంతంగా కుమిలికుమిలి ఏడ్చేది. మీరు వెళ్ళిన తరవాత ఇప్పటివరకూ మా అక్కయ్య విందులకి, వినోదాలకి హాజరు కాలేదు. అంతదాకా ఎందుకు? మా అన్నదమ్ముల పెళ్ళిళ్ళ కు తాను రాలేదు. ప్చ్" అని బాధగా నిట్టూర్చి క్షణం తరవాత "ఓ నెల పోయాక చేతి సంచీతో బజార్లో నాన్న కెదురాయిందట రాజమ్మ" అన్నాడు గోపాల్రావు. ఫకాల్న నవ్వాడు ప్రసాదరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS