Previous Page Next Page 
మూసిన తలుపులు పేజి 11


    "ఏమిటన్నయ్యా ఇది?" అడిగింది కోపంగా.
    "ఏమీ లేదు సుగుణా! షర్టు చినిగిపోయి వుంటే...."
    "నేనేం చచ్చి పోయాననుకున్నావా?"
    "సుగుణా!" నోరు మూశాడు బాధగా రాజ్.
    "మరి ఏమిటన్నయ్యా! నీకెన్ని సార్లు చెప్పాను, ఇలా ఆడవారు చేయవలసిన పనులు చేయద్దని?"
    రాజ్ మౌనం వహించాడు.
    సుగుణ ఆ పని పూర్తీ చేసింది.
    ఆ చొక్కా తొడుక్కొని బయట పడ్డాడు రాజ్. తిన్నగా రజియా వాళ్ళిల్లు చేరుకొన్నాడు.
    "ఇంకాసేపట్లో నువ్వు రాకుంటే నేనే నీ గదికి వచ్చేద్దామనుకున్నాను." అంది అతని కోసమే ఎదురు చూస్తున్న రజియా.
    "అంతపని మాత్రం చేయకు" అనుకొన్నాడు మనసులో రాజ్.
    రజియా కాఫీ తీసుకు వచ్చింది. దాన్ని త్రాగుతూ 'అరగంట లో రెండు కాఫీ లు త్రాగితే అయిన విషమంతా కడుపులోనే పెరుకొంటుంది." అన్నాడు.
    "ఏం? మీ చెల్లాయి గారు తన ముద్దు చేతులతో త్రాగించిందా?"
    "ఆ, మా చెల్లాయి తన ముద్దు చేతులతో అభిమానంతో త్రాగిస్తుంది. నువ్వు నీ ప్రియమైన చేతులతో ప్రేమగా త్రాగిస్తావు." అన్నాడు కోపం, నవ్వు మిళితమైన భావాలను వ్యక్తపరుస్తూ.
    నవ్వును ఆపడానికి ప్రయత్నిస్తూ పై పెదవిని క్రింది పళ్ళతో నొక్కి పట్టింది.
    "ఎందుకు రజీ, నవ్వుతున్నావు?"
    "నీ కోపం చూసి."
    "ఎందుకో జీవితం పై విసుగు పుడుతోంది. రజీ" అని తన దుస్తుల వైపు చూసుకొన్నాడు.
    "అప్పుడే విరాగివై పొతే ఎలా? జీవితమంటే ఎంత మధురమైనదో చూపించే ఒక ఇంగ్లీషు పిక్చరు ఆడుతోంది. చూద్ద్దాం పద."
    అయిష్టం వ్యక్త పరిచాడు రాజ్.
    "పోనీలే. నీకు కష్టం కలిగించేపని నాకిష్టం లేదు. పోనీ ఇక్కడే కేరమ్స్ ఆడదామా?"
    'అలాగే."
    "రాజన్నా!' కేకవేసింది రజియా.
    "అమ్మా!" అంటూ నౌకరు వచ్చాడు.
    "టేబుల్ వేసి కేరమ్స్ బోర్డు పెట్టు."
    ఆ పని చేయడానికి వెళ్ళిపోయాడు రాజన్న.
    "మరి నాకు చేత కాదె, రజీ!"
    "మనం పందెం వేయడం లేదుగా? చేతనైనంత వరకు ఆడు."
    "పందెం లేకుంటే అట రక్తి కట్తదే అని నా బాధ."
    "అయితే నువ్వే చెప్పు. ఏం పందెం వేద్దాం?"
    "నీ యిష్టం."
    "నా సర్వస్వం నీకర్పించాను. ఇంకా ఫణంగా ఏం పెట్టమంటావు?"
    "అబద్దాలాడటం నేర్చుకున్నావు."
    'అంటే?"
    "ఏం లేదులే. ఆటాడదాం రా" అన్నాడు రాజ్.
    అతని అభిప్రాయాన్ని అర్ధం చేసుకొని సిగ్గు పడింది రజియా. "అందుకే నీదే అభ్యంతరం ' అంది ఆమె మనస్సు.
    మొదట బొత్తిగా చేతకాని వాదులా ఆడి అట గెలిచిన రాజ్ ను ఆశ్చర్యంగా చూసి అతని నేర్పు, గురి మెచ్చుకో లేకుండా ఉండలేక పోయింది.
    "ఓడిపాయాను , రాజ్. ఏం కావాలి?"
    "నువ్వే" అన్నాడు రాజ్ చిలిపిగా.
    " నే నేనాడో నీకంకితమై పోయాను గా!"
    "నిజామా" అన్నట్లు చూశాడు రాజ్. "నా మాట నమ్మలేవా" అన్నట్లు బదులు చెప్పింది. అదే తృప్తి , ఆనందం , సౌఖ్యం నిలిచి పొతే బాగుంటుంది.
    ఇంతలో ఖాన్ గారు లోపలికి వచ్చారు. అయన గారి వెంట మరో ఆవిడ ఉంది. ఆమె వయసు లో నలభై మించినా అలంకరణ లో, శరీరసౌష్టవం లో ముప్పై ఏళ్ళ లోపు గానే ఉన్నట్లు కనిపిస్తుంది.
    ఖాన్ ఆమెతో "సరూ, ఈ అమ్మాయి నా కూతురు రజియా. ఇతడు ఆమె ఫ్రెండ్ రాజశేఖర రావు" అని వారిని పరిచయం చేశాడు.
    "నమస్తే " అన్నారిద్దరు ఆమెను పరికించి చూస్తూ.
    "ఈవిడ నా బాల్య స్నేహితురాలు , సరోజినీ దేవి. ఇక్కడ మహిళా మండలి కార్యదర్శి ' అని ఆమెను వారికి పరిచయం చేశాడు.
    సరోజినీ దేవి చిరునవ్వు తో "మిమ్మల్ని ఇంత ఆలస్యంగా కలుసు కుంతున్నందుకు చాలా విచారిస్తున్నాను. ఎంచేతంటే ఈ ఊళ్ళో నే ఉండి, ఖాన్ , మిమ్మల్ని నాకు ఈదినం పరిచయం చేస్తున్నాడు. మరి మీరొక వైపు, మేము మరొక వైపు కేరమ్స్ ఆడదామా?" అంది.
    తలలాడించారు రాజ్ , రజియాలు.
    ఖాన్ లో ఉత్సాహం ఎక్కువగా ఉంది. అతని కళ్ళు దేన్నో వెతికి కనుగొన్నట్లు వెలుగుతున్నాయి. గంబీరత్వం మాయమై ఆనందం అలుముకోంది. అది గమనించింది రజియా. బహుశా బాల్య స్నేహితురాలిని కలుసుకొన గలిగినందుకు సంతోషిస్తున్నారను కొని సరిపెట్టు కొంది.
    ఆటలో ఖాన్ జుట్టు ఓడిపోయారు.
    "నువ్వు చాలా బాగా అడతావబ్బాయ్" అంది సరోజినీ దేవి.
    సిగ్గుపడ్డాడు రాజ్.
    "మరి బాబా! గేమ్ గెలిచినందుకు మా కేమిటి బహుమానం?' అంది రజియా.
    ఖాన్ గారు అయోమయంగా సరోజినీ వైపు చూశారు.
    "ఏం కావాలో నువ్వే చెప్పమ్మా!" ఆప్యాయంగా అడిగిందామె.
    ఆ ఆప్యాయత కు పులకరించి పోయింది రజియా. "మీరిద్దరూ స్వయంగా కాఫీ కాచి తీసుకు రావాలి."
    నివ్వెర పోయారు ఖాన్ గారు. తీక్షణంగా రజియాను చూశాడు రాజ్.
    "సరే , పద సరూ . ఓడిపోయాం గా? చెప్పి నట్లు చెయ్యాలి? అని ఖాన్ గారు, సరోజినీ దేవితో వంటగదికి పోయారు.
    "రజీ , నీ ధోరణి నాకేం నచ్చలేదు" అన్నాడు రాజ్ కాస్త కోపంగానే.
    "అదేమిటి రాజ్, నేనేం చేశాను?' ఆశ్చర్య పోయింది రజియా.
    "వాళ్ళిద్దరి నీ అలా ఆజ్ఞాపించడం లో అర్ధముందా? పెద్దవాళ్ళన్న మాట మరిచి పోయావా?"
    'అది కాదు, రాజ్. నేనేదో తమాషాకన్నాను. అంతే."
    "రజీ , మన దృష్టి లో అది తమాషా కావచ్చు. కానీ ఎన్నాళ్ళ తర్వాత ని మీ నాన్నగారికి అతిధి గా వచ్చిందావిడ. ఇంటి కొచ్చిన అతిధి చేత పనులు చేయించడం నీకు తమాషా కాబోలు!"
    "క్షమించు రాజ్!"
    "ఊ" అంటూ బాధగా మూలిగాడు రాజ్.
    "ఖాన్, అమ్మాయి అసాధ్యురాలు గా వుందే!ఇంటి కొచ్చిన అతిధి కే పనులు పురమాయించింది." అంది సరోజినీ నవ్వుతూ.
    "రజియా ఏమీ తెలియని పిల్ల, సరూ! తగిన వయసూ లేదు, అనుభవమూ లేదు. ఇంకా చాలా నేర్చుకోవాలి."
    "కానీ, ఆ అబ్బాయి మాత్రం అందుకు బాధ పడ్డాడు."
    "అతడు చాలా తెలివైన వాడు. కొన్ని విషయాల్లో మనకే బుద్ది నేర్పగలిగే శక్తి గలవాడు. అందుకే అతని సాహచర్యం లో మా రజియాను వదిలాను."    
    "సరేగాని, చక్కర ఇలా అందుకో."
    "ఏమిటి అజ్ఞ?"
    ఆ రెండు మాటలూ వారిలో ఏవో వారి పాత స్మృతులను జ్ఞాపకం తెప్పించి వారి మధ్య మౌనాన్ని తాండవింపజేశాయి.
    కాఫీ తీసుకు వచ్చి చెరొక కప్పూ ఇచ్చింది. రాజ్, ముళ్ళ మీద కూర్చొనున్నట్లు బాధపడ్డాడు.
    రజియా తల ఎత్తలేక "క్షమించండి. మీకు కష్టం కలిగించాను" అంది.
    సరోజినీ దేవి , రాజ్ ను చూసింది. అంతవరకు రజియా ను చూస్తున్న రాజ్ చటుక్కున తల వంచేసుకున్నాడు. జరిగిన విషయం అర్ధం చేసుకొన్న సరోజినీ దేవి నవ్వుకొంది. అది గ్రహించాడు రాజ్.
    "ఫర్వాలేదమ్మా! నీకు తల్లి లాంటి దాన్ని. ఏం చేసినా తప్పులేదు."
    రజియా ఉలిక్కిపడి ఆమె కళ్ళలోకి చూసింది. ప్రశాంత గంబీర వదనంతో మూర్తీభవించిన  మాతృమూర్తి లా ఉన్న ఆమెను చూసి రజియా మనస్సు అస్పష్టంగా స్పందించింది. ఆమె దర్శనమే తనకు ఏదో తెలియని ఎరుగని తృప్తి నిస్తుంది. వెదికి వెదికి వేసారి పొందలేక పోయిన సుఖాన్ని తిరిగి పొంద బోతున్నట్లు సూచిస్తుంది. సరోజినీ దేవి తీరని ఆశతో అలమటించి పోతున్న దానిలా రజీయాను తిలకస్తుంది. క్రొత్త ఆశతో గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఖాన్ గారు ఏదో అవాంతరం జరగనున్నట్లు భయపడి పోయారు.
    కాఫీ త్రాగుతూ సరోజినీ దేవి మాటలు విన్న రాజ్ ఆ మాటల వెనక నున్న అర్ధాన్ని బయటికి లాగాలని ప్రయత్నించి చూశాడు. ఆమె చూపులు, ఆత్రుత, తహతహ అతని కేదో సందేశాన్నిచ్చాయి.
    "మీరు మాట్లాడుతుండండి" అని ఖాన్ గారు సరోజినీ దేవిని పిలిచుకొని బయటికి వెళ్ళిపోయారు. ఆమెను సాగనం'పుతూ "సరూ, ప్రశాంతంగా వున్న ఆ లేత హృదయాలను అనవసరంగా కలవర పెట్టడం బాగుండదు." అన్నాడు.
    "అంతమాత్రం నాకు తెలియదా ,ఖాన్!"
    "అప్పుడప్పుడు వస్తుంటావు కదూ!"
    "తప్పకుండా. అమ్మాయి కోసమైనా వస్తుంటాను."
    కారులో కూర్చొని అతని కళ్ళలోకి చూసింది సరోజినీ దేవి. ఏ భావాలనూ కనుగొన లేకపోయింది. ఇప్పుడే కాదు, ఇంతకూ ముందు కూడా ఎప్పుడూ అది చేత కాలేదు తనకు. నిట్టూర్చి ముందుకు సాగిపోయింది. ఏదో ఆలోచిస్తూ హల్లో సోఫా లో చతికిల బడ్డాడు ఖాన్.
    గదిలో రాజ్ రజియాల మనసులు ఆందోళన గా ఉన్నాయి. సరోజినీదేవి , వారికి కలలో కనిపించి అర్ధం కాని సందేశాన్నిచ్చి మాయమైన దేవత వలె ఉంది. ఒకరిలో కలవరాన్ని, మరొకరి లో అంతం లేని ఆలోచనలను లేపి సముద్ర తరంగం లా మాయమై పోయింది.
    కేవలం ఒకసారి చూడడం తోనే ఒకరు మనకు పూజితులవుతారు. వారికి, మనకు ఏదో తీరని సంబంధం ఉన్నట్లు అనుకొంటాం. ఆ ఆత్మీయత లేక అర్ధం కాని ఆవేదన ఎందుకో? మన దృష్టి లో కొందరు కారణం లేకుండానే గొప్పవారుగా కనబడతారు. ఆ గొప్పతనానికి అర్ధం, అంతర్యం కనుగొన్నప్పుడు వారి మీద మనకు గౌరవం ఎక్కువవుతుంది.
    "ఆమెను చూస్తుంటే విధికి బలికా బడ్డ దురదృష్టవంతురాలులా ఉంది, రజీ" అన్నాడు ఆలోచనల నుండి తేరుకొని రాజ్.
    "ఆమెను చూసినప్పటి నుండి నాలో ఏదో కలవరం బయలుదేరింది రాజ్! నా హృదయం ఆవేదనా భరితమై పోయింది. ఆమె పలుకులు నాలో దాగి వున్న ఏదో ప్రేమను మేలు కొలుపు తున్నాయి. ఆమె తల్లి లాంటి దాన్ని అన్నప్పుడు నా మనసు క్షణికానందానికి గురైంది. ఆమె మా అమ్మ అయి ఉంటె బాగుండునెమో అనిపిస్తుంది."
    "ఎంత ప్రయత్నించినా ఆమెను కాని, మీ నాన్నను గాని అర్ధం చేసుకోలేకున్నాను. వారి హృదయపు లోతులను కనుగొన లేకున్నాను. కానీ మీ నాన్న గంబీర్యం వెనుక దాగి వున్న నిరాశా నిస్పృహలను పూర్తిగా పోగొట్టగలిగే శక్తి ఆమె కుందని గట్టిగా చెప్పగలను."
    "అవును, రాజ్ , నాకు తెలిసినప్పటి నుండి మా నాన్న లో అధికారం, హుందా , గంబీరత్వము వీటిని మాత్రమే చూడ గలిగాను. కానీ, నేడు ఆయనలో చలాకీతనము, ఉత్సాహం వెల్లి విరుస్తున్నాయి."
    "ఆమెకు నీపట్ల దాచుకోలేని ప్రేమాభిమానాలున్నాయి. వాటిని ఎందు చేతనో బయట పెట్టలేక పోతోంది. కన్నతల్లి తన బిడ్డకు దూరమై పడే ఆవేదన, ఎన్నో సంవత్సరాల తర్వాత అనుకోని ఆనందాన్ని పొంద బోతున్నట్లు సూచించే ఆ కన్నులలో ప్రేమ, కాంక్ష మోదులుతున్నాయి. నా ఊహ పొరపాటు కూడా కావచ్చు. ఆమెకు నీ వయసు లోని కూతురు వుండి ఆమెకు దూరమై పోయి కాని, లేక చనిపోయి ఉంటేనో , ఆమెలో నీలో చూచుకొని బాధపడుతూ తృప్తి పడుతోంది. బాధలో తృప్తి ని పొందడం విచిత్రం కదూ!"
    "ఏమో! ఆమెను ఇంకోసారి చూడాలని పిస్తోంది. కనిపిస్తుందో లేదోనని భయంగా వుంది."
    "ఆమె అప్పుడప్పుడు మీ యింటికీ వస్తుంటుందని చెప్పగలను."
    " అలా జరిగితే అది నిజంగా నా అదృష్టమే."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS