Previous Page Next Page 
మూసిన తలుపులు పేజి 10


    ఇంతలో "లతా, ఏమిటలా నిలబడ్డావు?' అన్న మరొక గొంతు విని లత ముందుకు కదిలి పోయింది.
    గోపీ అక్కడ ఎక్కువ సేపు నిలబడలేక పోయాడు. వెనుదిరిగి పోబోయి ఎదురుగా వస్తున్న ఇద్దరు వ్యక్తులను చూసి ఆశ్చర్యంగా కళ్ళు నులుముకొని "రాజా" అన్నాడు మెల్లిగా.
    అప్పుడే రజియా తో మాట్లాడుతూ నవ్వుతూ వస్తున్న రాజ్ , గోపీ ని చూసి నివ్వెర పోయాడు. రాజ్ ని చూసి సంతోషం పెల్లుబకగా కౌగలించు కొందామని ముందు కడుగేసి ప్రక్క నున్న రజియా ను చూసి ఆ ప్రయత్నం విరమించు కొన్నాడు. అది చూసి మెల్లిగా నవ్వుకొంది మనసులోనే రజియా.
    "ఒరే గోపీ, నువ్వు ఊళ్ళో నే ఉండి ఇన్నాళ్ళ కట్రా కనపడ్డం" కోపం తెచ్చుకుంటూ అడిగాడు రాజ్.
    గోపీ సంతోషం తో ఏమీ మాట్లాడలేక పోయాడు. ఇంతలో రజియా ఇచ్చిన టికెట్ల ను గేటు కీపరు అలాగే చేతిలో పట్టుకొని గోపీ వైపు చూశాడు. గోపీ ఏదో సైగ చేయగానే, "అలాగే, సార్" అని అతడు క్రిందికి వెళ్ళిపోయాడు. అర్ధం కాక రజియా అక్కడే నిలబడి పోయింది.
    "ఏమిట్రా ?' అన్నాడు రాజ్ అయోమయంగా.
    "నోరు మూసుకొని నువ్వు పదరా" అని అతడిని లోపలికి తీసుకు పోతూ రజియాను చూసి "రండి అన్నాడు.
    అతన్ని అనుసరించారు వారు.
    "నువ్విక్కడెం చేస్తున్నావురా? ఆనాడు మాయమై ఇప్పుడు కనిపిస్తున్నావు? ఈ ఊళ్ళో నే ఉండే నన్ను మరిచావన్నమాట." సంతోషంగా గబగబా మాట్లాడేశాడు రాజ్.
    ఇంతలో గేటు కీపర్ డబ్బులు తీసుకొచ్చి "సార్" అని అవి గోపీ చేతికి యిచ్చాడు.
    "అదేమిట్రా, డబ్బులు వాపస్ తెప్పించావు?' అయోమయంగా అడిగాడు రాజ్.
    "ఒరేయ్ , నీకు డబ్బు లేక్కువగా ఉంటె ఆ తర్వాత నే తీసుకొంటానులే. మా దియేటర్ కు నీ దగ్గర టికెట్టు తీసుకొనే అర్హత లేదు" అని రాజ్ చేతిలో ఆ డబ్బులు ఉంచాడు.
    'సరే, నీ కధేమిటో చెప్పు ముందు."
    "ఏముందీ! డిస్మిస్ కాగానే యింటికి వెళ్ళాను. మనసులో ఏమనుకొన్నా పైకి ఏమీ అనలేదు మా నాన్న. ఏం జరిగిందో తెలియదు. ఆ మరురోజే మా మామయ్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఇక్కడ మేనేజరు గిరీ వెలగ బెడుతున్నాను. ఈ దియేటర్ మా మామయ్యదేలే. అంటే మనదే అనుకో. ఇంకెప్పుడైనా టికెట్ కొనుకోచ్చావా, అది లాక్కొని నిన్ను మెడ బట్టి బయటికి గెంటిస్తాను. జాగ్రత్త!" క్లుప్తంగా ముగించాడు గోపీ.
    ఆ కధ విని తేలికగా నిట్టూర్చాడు రాజ్.
    ఆ తర్వాత గోపీ ని రజియాకు పరస్పరం పరిచయం చేశాడు.
    తను ముందే కూర్చొని అప్పుడప్పుడు తమ వైపు చూస్తున్న లత ను గుర్తు పట్టాడు రాజ్.
    గోపీని మోచేత్తో పొడుస్తూ "ఏరా, నీ హేమ కూడా వచ్చినట్లుందే!" అన్నాడు.
    అవునని తలూపాడు గోపీ.
    "ఆ తర్వాత ఎప్పుడైనా ఆమెను కలుసు కొన్నావా?"
    "ఇంతవరకు లేదు. అయినా నేను ఆమెను కానీ, ఆమె నన్ను గానీ కలుసు కోవలసిన అవసర మెందుకుంటుంది?"
    "ఉంటుంది లే" అని పిక్చర్ చూడడం లో నిమగ్నుడయ్యాడు రాజ్.
    "సార్, ఫోన్ కాల్ వచ్చింది. " గేటు కీపరు గోపీతో చెప్పాడు.
    "లేడని చెప్పు పోవయ్యా" అనగానే అతడు వెళ్ళిపోయాడు. "ఎప్పుడూ ఏదో ఒకటి క్షణ మన్నా విశ్రాంతి లేకుండా. ఈ బాధ్యతతో చస్తున్నాను." విసుక్కున్నాడు గోపీ.
    "బాధ్యతను మరచి పోగూడదురా. వెళ్లి రా." అన్నాడు రాజ్ అతని విసుగు కు నవ్వుకొంటూ .
    "నీతో ఇదొక గొడవ. అదెప్పుడూ ఉండేదేలే" అన్నాడు కోపంగా గోపీ.
    కానీ అతని చూపు చూసి విధి లేక అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు.
    చిన్నగా నవ్వుకొని "రజీ" అన్నాడు.
    "ఏమిటి రాజ్" అడిగింది రజియా.
    "మా గోపీ నిచూశావు కదూ? ఇక ఆ హేమ లతను చూడు" అని లతను చూపించాడు.
    "ఆమెలో ఏదో తీరని బాధ గూడు కట్టుకొని వుంది చూశావా, రాజ్!"
    "చూశాను. కానీ వీడి విషయమే కాస్త చక్కగా ఉంది. గంబీరంగా ఉన్నట్లుండే ఒక్కసారి గా బుడగ లా ప్రేలి పోతాడు."
    "ఇలా ప్రతి సినిమా హల్లో నూ మేనేజరు మనవాడయితే ఖర్చు తగ్గుతుంది కదూ, రాజ్!"
    "అప్పుడే కూడబెట్టు కోవాలనే బుద్ది పుట్టిందా? నువ్వు డాక్టరు వై ప్రాక్టీసు పెట్టేంత వరకైనా ఓపిక పట్టు."
    తృప్తిగా నవ్వుకొన్నారు యిద్దరూ.

                           

                                      7
    "అన్నయ్యా , రేపు మా స్కూల్ డే. నేను డాన్స్ చేస్తాను వస్తావు కదూ?" అని అడిగింది సుగుణ ముద్దుగా."
    "అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. నువ్వు పిలిస్తే, రాకుండా మరెవ్వరు పిలిస్తే వస్తానమ్మా!" అన్నాడు రాజ్ ఆప్యాయంగా.
    "సుగుణ!"
    "ఏమిటన్నయ్యా?"
    "మీ పరీక్ష లెప్పుడు?"
    "ఇంకా రెండు నెలల పైగా ఉన్నాయన్నయ్యా."
    "బాగా చదువు తున్నావు కదూ?"
    "బాగానే చదువుతున్నానన్నయ్యా!"
    "నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవాలి. వైద్యం చదివి లేడీ డాక్టరు వైనప్పుడు నేను నీ దగ్గర కే వస్తాను. అప్పుడు ఎంత ఫీజు తీసుకొంటావో చూడాలి."
    "పో అన్నయ్యా! నీకెప్పుడూ తమషాలే! అయినా నీ దగ్గర ఫీజు తీసుకుంటే నాకు పాపం చుట్టుకోదూ?"
    "ఎందుకమ్మా? స్వంత అన్నయ్య ల దగ్గర , స్వంత చెల్లెళ్ళ దగ్గర ఖండితంగా ఫీజు పుచ్చుకుంటున్నారు. ఇక నేను నీకు పరాయి వాడినే కదా!"
    "వాళ్ళకు బుద్ది లేదు. నువ్వు అలాంటి మాటలు మాట్లాడితే నాకు కోపమొస్తుంది."
    "నీకు కోపమొస్తేనే గా నాకు ఉత్సాహమొచ్చెది?"
    "నిజం చెప్తున్నానన్నయ్యా! నాకు స్వంత అన్నయ్య ఉన్నా నీ దగ్గరి నుండి పొందే ఆప్యాయతా ఆదరాభిమానాలు , ప్రేమ అతని వద్ద నుండి లభించేవి కావేమో!"
    "నువ్వూ నాకు చెల్లెలు లేని లోటు తీరుస్తున్నావు సుగుణా! నీ మేలు మరిచి పోలేను."
    సుగుణ అతని ఒడిలో తలపెట్టి, "చిన్నప్పుడు ఎవ్వరూ తోబుట్టువులు లేరని నా లేత హృదయం ఎంతగానో బాధపడేది. అందరిలా నాకూ ఒక అన్నయ్యా గానీ, తమ్ముడి గానీ ఉండి వుంటే వాడితో ఆడుకొంటూ భాత్రు ప్రేమ అంటే ఏమిటో తెలుసుకొనేదాన్ని. మా తరగతి లో ఎప్పుడైనా అక్కా, తమ్ముడూ గిల్లి కజ్జాలు పెట్టుకొని ఆడుకొని ఆనందిస్తుంటే ఆ అదృష్టాన్ని నాకు ప్రసాదించ లేదని ఎడిచేదాన్ని . ఆ అమాయకపు ఆనందాన్ని తిరిగి ఈనాడు నీనుండి పొంది ఆ బాధను మరిచి పోగలుగుతున్నాను."
    "సుగుణా! నావారంటూ లేని ఈ ప్రపంచం లో ఒక సహోదరీ ప్రేమను నీనుండి పొంద గలిగి ఎంతగా ఉప్పొంగి పోయానో తెలుసా? ఏ జన్మ లో మనిద్దరికీ ఉన్న బంధాన్ని తిరిగి ఇలా కలిపాడో భగవంతుడు!"
    "అన్నయ్యా, నాకివ్వేళ అంతులేని ఆనందం కలుగుతుంది . ఇలా నీతో మనసు విప్పి మాట్లాడుతుంటే నా చిన్నారి మనసు ఏదో ఆనంద లోకాలలో విహరిస్తోంది. సంతోషం కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది. ఈ ఆనందాన్ని నాకెప్పుడూ ప్రసాదించనయ్యా?"
    "అలాగేనమ్మా" అంటూ రాజ్ ఆమె తల నిమిరాడు.
    "మరి నువ్వు ఒక్కడివే కాదు. నీ స్నేహితురాలు రజియాను కూడా తీసుకు రావాలి."
    "ఆవిడ వస్తుందో రాదో నేనెలా చెప్పగలను?"
    "ఉత్త అమాయకుడులా మాట్లాడకన్నయ్యా! నీతో అంత స్నేహంగా ఉన్న వాళ్ళెవరూ నీ కోరిక నిరాకరించరని నాకు తెలుసు."
    "ఊ. అయితే నన్ను గురించి బాగా తెలుసుకున్నావన్న మాట!"
    "ఆహా. కంఠపాఠం చేసినట్లు గా తెలుసుకొన్నాను."
    "కంఠపాఠం చెయ్యవలసింది నన్ను కాదు, నీ పాఠాలను."
    "అలాగే" అని లోపలికి తుర్రు మంది సుగుణ.
    సంతృప్తిగా నవ్వుకొని రాజ్ పెట్టె లో నుండి ఒక చొక్కా తీశాడు. అది చిరుగు పడింది. అది చూసి తన జీవితం పైనే నవ్వొచ్చింది రాజ్ కు. సుదీ దారం తీసుకుని దాన్ని కుట్ట బోయెంతలో సుగుణ వస్తున్న చప్పుడు వినిపించగా ఆ చొక్కాను దూరంగా ఉన్న దండెం పైకి విసిరేశాడు. అది క్రింద పడిపోయింది.
    సుగుణ చేతిలో ఉన్న టిఫిను, కాఫీ క్రింద పెట్టి, "ఊ త్వరగా టిఫిన్ ముగించన్నయ్యా! కాఫీ చల్లారి పోతుంది." అంది.
    "సుగుణా, నీకెందుకీ శ్రమంతా చెప్పు?"
    "శ్రమా లేదు, గిమా లేదు. ముందు తినమంటుంటే?' ఆజ్ఞాపించింది.
    "ఇదంతా నే తినలేను. కాస్త సాయం చెయ్యి."
    "ఆ పప్పులెం ఉండకవు. అంతా తినెయ్యవలసిందే!"
    "నువ్వు తినకుంటే పోనీ నాకు తినిపించవూ?"
    "ఎందుకనీ ? నువ్వేం బుజ్జి పాపవా?"
    "అవును. సుగుణా . ఇవేళ నువ్వు తినిపించాలి. నే తినాలి. అంతే."
    "అబ్బ! నీతో పెద్ద చిక్కే వచ్చింది. సరే, కూర్చో" అంటూ వస్తున్న నవ్వు నాపుకొంటూ అతని ప్రక్కనే కూర్చొంది.
    ఇడ్లీ ముక్క అతని నోట్లో పెట్టింది. రాజ్ మెల్లిగా ఆ వేలు కొరికాడు.
    "అబ్బ!' అని "ఇలా చేశావంటే నేనసలు మాట్లాడను పో" అని అలిగింది.
    "ఛీ, ఛీ! ఇడ్లీ ఏం బాగులేదు. ఉప్పగా ఉంది" అన్నాడు విసుగు మొహం పెట్టి.
    అలుగంతా ఎగిరిపోయి ఆశ్చర్య పోయింది సుగుణ. 'అదేమిటన్నయ్యా అమ్మ చేతి వంటకు పేరు పెడతావు?"
    "కావలిస్తే తిని చూడు."
    "బాగుందే" అంది సుగుణ రుచి చూసి.
    "అలా కాదు. ఆ పచ్చడి తో తిను."
    అలాగే చేసింది సుగుణ. "నిక్షేపంగా ఉందే౧ దీనికేం?' అంది అర్ధం కాక.
    "అదీ వరస! అలాగే ఈ కాస్త కూడా నోట్లో పెట్టుకో" అని రాజ్, సుగుణ నోట్లో ఇడ్లీ కుక్కాడు.
    జరిగిన మోసం గ్రహించి ఏదో అనబోయిన సుగుణ ఇడ్లీ నోటి కడ్డు పడగా ఊరుకొంది.
    రాజ్ ఏమీ జరగనట్లు పైకి చూస్తూ తినసాగాడు. అతనితో పాటు సుగునా తినసాగింది.
    అది చూచి, "ఏయ్, దొంగ పిల్లా! అప్పుడు వద్దన్నావే, ఇప్పుడు భాగానికి ఎందు కొచ్చావు?' అన్నాడు.
    "నా యిష్టం" అంది పై కప్పు కేసి చూస్తూ. "కాఫీ కూడా చిన్న పిల్లలకు పట్టినట్లు పట్టనా?' కొంటెగా అడిగింది.
    'అంత అదృష్టమా! ఆ పని చేస్తే నాకు శ్రమ తగ్గినట్లుంటుంది."
    "అబ్బ! ఎంత ఆశ " అంటూ కాఫీ గ్లాసు అతని కందించింది.
    "ఊహూ" అన్నాడు.
    "ఏమిటి?"
    "మామూలే. ఫేప్టీమ ఫిప్టీ!"
    నవ్వుకొని అలాగే చేసింది.
    "సుగుణా, వచ్చే జన్మ లో నీ కడుపున పుట్టి ఆ కోరిక తీర్చు కోవాలనుందమ్మా" అన్నాడు రాజ్.
    "ఛీ, ఫో! అన్నయ్యా" అని లేచి క్రింద పడి ఉన్న చొక్కాను చేతికి తీసుకొని చూసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS