దెబ్బతిన్న పక్షి మాదిరిగా విలవిల్లాడి పోయింది. ఖంగారుగా చేతులు తిప్పుతూ భర్తని అల్లుకుని భోరున యేడ్చింది.' ఇంజనీరింగు వొద్దు పాడూ వొద్దు. మనకున్న డబ్బుతో పిల్లలు హాయిగా బ్రతకగలరు. చదువు లింక మాన్పించి , యే ఉద్యోగం అయినా చూడండి.'
గోవింద కి జీవితంలో తగిలిన దెబ్బ చాలా బలమైనది. ఆ దెబ్బ ధాటికి ఆవిడ కోలుకోవడం చాలా కష్టమే అయింది. చటర్జీ చిన్నగా నవ్వి అనునయంగా గోవింద ని దగ్గరికి తీసుకున్నాడు. 'పిచ్చిదానివి నువ్వు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ అల్పాయుష్కులే అవుతారా నీ వెర్రి కానీ. వాళ్ళ భవిష్యత్ మన మూడ నమ్మకాలతో కూల్చేస్తున్నాం. చూడు గోవిందా! ఖర్మని తప్పించేందుకు మానవుడి చేతిలో యే ఆయుధం లేదు. జరిగేది విధాత చేతిలో కూడా లేనప్పుడు ఆఫ్టరాల్ మనుష్యులం మనం యెంత?'
'గోవింద సజల నయనాలని అతని మొహంలోంచి తప్పించి మౌనంగా ఊరుకుంది. చటర్జీ కోరికని శ్రీకాంత్ బలపరిచాడు. రిజల్ట్స్ వచ్చిన రోజున అతను తండ్రి దగ్గరకి వచ్చి 'నాన్నగారు ! నాకు మెకానికల్ యింజనీరింగ్ చదవాలనుందండీ. అమ్మ దేనికో వద్దని అంటోంది.' అన్నాడు అమాయకంగా.
చటర్జీ అతని భుజం తట్టి 'డోంట్ వరీ అలాగే చదివిస్తాను, ' అని శ్రీకాంత్ కోరిక తీర్చాడు.
ఉమేష్ యిప్పుడు తండ్రి లాగే బి.యస్.సి చదివాక లా చదవాలను కుంటున్నాడు. అతను బి.యస్.సి సెకెండియర్ లో వున్నాడు.
ఉపేంద్రనాద్ తన కూతూర్ని కూడా బి.యస్.సి వుమేష్ చదివే కాలేజీ లోనే చదివిస్తున్నాడు.
చటర్జీ యిప్పుడు సాయంత్రం పూట బాతాఖానీ కొట్టేందుకు చాలామంది మిత్రులే దొరికారు.
ఉపేంద్రుడు ఒకప్పుడు పరిహాసానికి అనేవాడు తన కూతుర్ని ఆ యింటి కోడలిగా చేసుకోమని . కానీ యిప్పుడతను వుమేష్ తో సరిగా చదివిస్తూ నిజంగానే తన కోరికని చటర్జీ ముందుంచాడు.
కొన్నేళ్ల క్రితం ఈ విషయానికి చటర్జీ యెంత విలువనీ, ప్రాధాన్యతనీ యిచ్చాడో యిప్పుడూ అదే విధంగా మిధ్యా భావం లో 'వూ' 'ఆ' ల మధ్యస్థంగా వుండిపోవాలనుకున్నాడు. కానీ ఉపెంద్రుడు ఆడపిల్లని కన్నతండ్రి. అతనికి మొదటి నుంచీ చటర్జీ పైనా అతని ఈ తల్లి తండ్రుల పైనా యెనలేని గౌరవం వుంది. తన కూతురికి పెళ్ళి కాదేమో నన్న భయం మాత్రం అతనికి లేదు. కానీ సంప్రదాయాలూ, సంఘం లో వున్నతమైన స్థానం వున్న ఆ యింటి కోడలు అవుతే చాలని అందరి ఆడపిల్లల తండ్రి మాదిరి గానే అతనూ కోరుకున్నాడు.
6
మంచిరోజు చూసుకుని భార్యతో వో ఆదివారం నాడు పదిగంటల తరువాత వుపెంద్రుడు రాగానే చటర్జీ గోవిందా సాదరంగా ఆహ్వానించారు.
చటర్జీ కొంతసేపు మాట్లాడాక అన్నాడు; 'భోజనానికి లేవండి ,' అంటూ .
ఉపెంద్రుడు భార్య మొహంలోకి చూశాడు. ఆవిడ నవ్వి వూరుకుంది. గోవింద కూడా బలవంతం చేయగానే ఉపేంద్రుడు జాప్యం చేయకుండా తను వచ్చిన విషయం కదిపాడు. 'చూడు చటర్జీ యిన్నాళ్ళూ మీ వుమేష్ కి మా కృష్ణ మోహినిని యిస్తాను అని నేను నవ్వుతాళికి అనలేదు. మా పిల్లని నువ్వు రోజూ చూస్తూనే వున్నావు. నా బిడ్డ అందచందాలూ, తెలివి తేటలూ గురించి నేను చెప్పడం సబబు కాదు. ఆడపిల్లని కన్నవాడిని , మీ వుమేష్ మీద చిన్నప్పటి నుంచీ ఆడదాని కన్నా అన్యాయంగా ఆశలు పెంచుకుని, ప్రేమిస్తున్న వాడిని. యిద్దరూ బి.యస్.సి చదువుతున్నారు. యివాళ మంచిరోజని నీ నోటి నుంచి 'వూ' అనిపించుకునేందుకు వచ్చాం. కుతుకుతే అతకదనే సంగతి తెలీదా.'
చటర్జీ కనుబొమ్మలు అప్రయత్నంగా అరసెకండు కాలం ముడుచుకున్నాయి. అతను బయటికి మనసులో జరిగే యే సంచలనాన్నీ వ్యక్తం చేయకుండా జాగ్రత్త పడ్డాడు.
ఉపేంద్రుడు చెప్పుకు పోతున్నాడు: 'యిప్పుడే యీ క్షణం లోనే పెళ్ళి చేయాలని నేనేమీ అనను భయ్యా. నీ యిష్టం. యెప్పుడు నువ్వు 'ముహూర్తం పెట్టించు వుపెంద్రా' అంటే అప్పుడు నేను సిద్దంగా వుంటాను.
చటర్జీ దీర్ఘంగా శ్వాస విడిచి నెమ్మదిగా అన్నాడు. 'పెద్దవాడు శ్రీకాంత్ ని వదిలి పెట్టి చిన్నవాడికి ముహూర్తం పెట్టించమని నువ్వు అడగడం న్యాయం కాదు. ఆడపిల్లని కన్నవాడిని కనుక నీకా బాధ వుంటుంది కాదనను కానీ నన్నూ అర్ధం చేసుకో!"
ఉపేంద్ర నవ్వు మొహంతో "అందుకే కద భయ్యా ముహూర్తం యెప్పుడైనా ఫరవాలేదని అన్నది. యిప్పుడే యీ క్షణం లోనే వున్న మాటున చేయాలని నేను అనడం లేదు. నువ్వు నాకు హామీ యివ్వు చాలు.' అన్నాడు.
చటర్జీ కాస్సేపు అలోచించి 'మా రాధిక తో ఒక్క మాట చెప్పనీ ఉపేంద్రా . అదీ చిన్నప్పటి నుంచీ ఉమేష్ మీద ఆశలు పెట్టుకుంది, యిప్పుడు మాట మాత్రం అయినా అనకుండా నీకు వాగ్ధానం చేశానంటే పక్కన పుట్టిన చెల్లెలు అది బాధపడి నన్ను నిందితుడి ని చేస్తే తరువాత చింతించాలి నేను. అమ్మా నాన్నా వున్నప్పుడే అదంటే పంచ ప్రాణాలు పెట్టె వాళ్ళం. యిప్పుడు అది ఒక్కగానోక్కతి చెల్లెలు నాకు. నేను ఈ పెళ్లి విషయం దానితో సంప్రదించకుండా స్థిర పరిచానంటే అది కుళ్ళి కుళ్ళి యేడుస్తుంది. ఈర్ధ్యతో కాదు సుమా!" అన్నాడు.
గోవింద అక్కడే కూర్చుని వుంది. చటర్జీ చాలా తెలివి తేటలుగా మరీ గుంభనంగా మాట్లాడుతున్నాడు. ఎక్కడా పట్టుబడేందుకు ఆస్కారం యివ్వడం లేదు. గోవింద కి అతని సంభాషణ లు వింటుంటే తల మునకలయ్యే ఆశ్చర్యంగా వుంది. కాకపోతే 'రాధిక చిన్నప్పటి నుంచీ ఉమేష్ మీద ఆశలు పెట్టుకుంది.' అని అనడం లో అర్ధం లేదు. చటర్జీ చూసేందుకు ఎన్నేళ్ళ సహచర్యం లోనూ వట్టి అమాయకుడిలా కనిపించాడు. కానీ యీ క్షణం లోనే గోవింద హృదయంలో అగాధం లాంటి భావం ఏర్పడింది. చటర్జీ తను అనుకున్నంత అమాయకుడు కాడు. చాలా ఘటికుడు. ఎత్తులతో యెదుటి వ్యక్తుల్ని చిత్తుగా వోడించేయగల సమర్ధుడు. చటర్జీ బొంకుతున్నాడని అక్కడున్న యే ఒక్కరూ కూడా గ్రహించ లేరు.
ఉపేంద్రుడు చిన్న బుచ్చుకోలేదు. యిది వరకు మాదిరిగానే కులాసా గా నవ్వుతూ చమత్కారంగా మాట్లాడుతూనే వున్నాడు.
చటర్జీ మాట మాత్రంగా అన్నట్లు 'నువ్వు భొజననికి వుండక తప్పదు' అన్నాడు.
'నో! థాంక్స్ దేవుడు ఉనికిని నేను అపహాస్యం చేసే మనిషిని కాను చటర్జీ. అయన దయామయుడు. ఈరోజు కాకపోతే మరోరోజు కనికరంగా చూస్తాడు నన్ను. నా మీద నాకు అచంచలమైన విశ్వాసం వుంది. నేను భోజనం చేయలేదని యేమీ అనుకోకు. మన స్నేహం లో కల్మషాలు , కృత్రిమాలూ వుండడం నాకు యిష్టం లేదు. భవిష్యత్ లో యేది యెలా జరిగినా సరిపెట్టుకునే తత్త్వం నాది.'
'రాధిక నీకు చెల్లెలైనంత మాత్రం లో నాకు ఆత్మీయురాలు కాకపోదు. ఆడపిల్లలున్న యే మనిషైనా పెళ్లి విషయంలో ఆశలు పడడం సహజం. స్వంత అన్న గారివి యిలా జరిగే పెళ్లి అయినా నాకు చాలా ఆనందదాయకం అయిన విషయం. సంబంధాలు కుదరలేదనీ, నువ్వు యిష్ట పడడం లేదనీ నేను మనసులో శంక పెట్టుకుని స్నేహానికి కళంకం తీసుకు రాను. మరి వస్తాను;' అంటూ భార్యతో సహా లేచాడు. అతను వెడుతుంటే మలుపు తిరిగాక చటర్జీ చిత్రంగా నవ్వాడు. గోవింద అతని మొహంలోకి చూసి త్రుళ్ళిపడింది. ఆ నవ్వులో అనేక రకమైన వ్యంగ్యార్ధాలు ధ్వనిస్తున్నాయి. గోవింద కి అతని నవ్వుని భరించాలని లేదు. దూరంగా యెక్కడి కైనా పారిపోవాలని వుంది.
గోవింద వంట యింట్లో పని చేస్తోందన్న మాటే గానీ యెక్కడా ఉత్సాహం లేదు. యాంత్రికంగా మనసు పురి కొల్పుతుంటే విధి చేస్తోంది. ఆదివారం కావడం మూలాన శ్రీకాంత్ చెరువు గట్టు వైపు వెళ్లాడు. కలకత్తా లో అతను యెక్కువగా యిష్టపడేది చేపలు పట్టడం. అతను నూటికి నూరు పాళ్ళు శాఖాహారి అయినా అతను స్నేహితులతో సరదాగా ఆదివారం వస్తే చేపలు పడతాడు. ఉమేష్ టెన్నిస్ ఆడేందుకు వెళ్ళాడు.
గోవింద వంట చేయడం ముగించి వంట యింట్లో నే కుర్చీ మీద కూలబడి పోయింది. యిన్నేళ్ళూ, మనసు కి' చేష్టలకి చాలా వ్యత్యాసం వున్న వ్యక్తీ తో కాపురం చేశానే అనే వూహ గుండెల్ని చిల్లులు పొడుస్తోంది. శ్రీకాంత్ ని అతనంత ప్రేమగా చూడడం లో కూడా యిప్పుడు కృత్రిమం గా కనిపిస్తోంది. ఆడది సవతి బిడ్డలని ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడు ప్రాణ ప్రదంగా చూసే సంఘటనలు ,స్త్రీ లో అసహనశక్తి ని భగవంతుడు నూతిలో ఐదుగురి కైనా వరప్రసాదం లా యివ్వడం తను యెరుగును. పురుషుడు...వొహ్ యెంత చిత్రమైన వాడు యీ మగవాడు. మాటలకీ చేతలకీ మధ్య యెటువంటి సామ్యాన్ని చాకచక్యంగా చొప్పించగలడు? ఆడదాని మనసు అగాధం మాత్రమే అయితే సముద్రపు లోతు లాంటి మగవాడిని యెవరు మాత్రం క్షుణ్ణంగా చదవగలరు?

రాధిక యెన్నడూ కూడా తనతో ఉమేష్ ని అల్లుడిగా చేసుకుంటానని అనలేదే? అదే నిజం అయితే శ్రీకాంత్ కి, అడగక పూర్వమే వోమేగా రిస్టు వాచ్ కొని పంపుతూ 'నా అల్లుడు శ్రీ కి' అని యెందుకు రాస్తుంది. రాధిక కూడా ఒక వేళ అన్నలాగే .......గోవింద కి ఆపైన ఆవిడ మీద నేరారోపణ చేస్తూ ఆలోచించాలని అనిపించలేదు. యెంత అపుకుందాం అని ప్రయత్నం చేసినా కన్నీరు ఆగడం లేదు. ఎన్నో యేళ్లకి యివాల్టి రోజున దుఖం కట్టలు తెంచుకుని గోవిందతో ప్రమేయం పెట్టుకోకుండా వరద వెల్లువలా నరనరాల్నీ తోడేస్తూ ప్రవహిస్తున్నది. కళ్ళు తుడుచుకుందాం అనుకుని కూడా అశక్తు రాలై పోయింది.
చటర్జీ వంట యింట్లోకి రాగానే వులిక్కి పడింది. అతని అడుగుల చప్పుడు విని కన్నీళ్లు తుడుచుకుంది. అయినా దుఖపు చారికలు చెంపల మీద వెల్లువ తీసిన తరువాత యేర్పడే కాలువల తాలుకూ అనవాళ్ళ మాదిరిగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను భార్యకి దగ్గిరగా వచ్చి నిశితంగా చూస్తూ దోసిళ్ళ తో రెండు చేతులూ మధ్యగా గోవింద మొహాన్ని వుంచి తన కళ్లలోకి దృష్టిని నిలిపెట్టు చేశాడు.
గోవింద దృష్టిని మరల్చుకునేందుకు అవకాశం లేక పోయింది. 'యెందుకు గోవిందా యేడుస్తున్నావు. నిన్ను నేను యేమీ అనలేదు కదోయ్. ఏం జరిగింది? దెబ్బ తగిలిందా? వంట చేస్తుంటే యేదైనా కాలిందా?'
'అయ్యో యెంత మాట? మీరు నన్ను యెప్పుడైనా యేదైనా అన్నారని అన్నానా? అలా అని వున్నా యెంత తృప్తి పడేదాన్ని, దెబ్బ శరీరానికి తగల్లెదండి? కాలడమా? విష్ణుమూర్తి పోయిన రోజునే గోవింద కాలిపోయి మసైపోయి వుండవలసింది. యిన్నేళ్ళ తరువాత యిప్పుచు పశ్చాత్తాప పడి లాభం యేమిటి?' గోవింద యే ఒక్కమాటా పైకి అనలేదు. గొంతు లోంచి మాట జారిపోకుండా జాగ్రత్తపడి అతని వైపు దీనంగా చూస్తుండి పోయింది.
చటర్జీ కొంచెం దూరం జరిగి డైనింగ్ టేబిల్ దగ్గరే మరో కుర్చీలో కూర్చుని గొంతు సవరించు కున్నాడు. అంటే వుపోద్ఘాతం ప్రారంభించ దలుచుకున్నాడన్న మాట.
ఉపేంద్ర యిన్నాళ్ళూ తన కూతుర్ని ఈ యింటికి కోడలిగా చేసుకోమంటే తమాషా కి అనుకున్నాను గోవిందా. నిజంగానే అతను పెళ్ళి సంబంధం మాట్లాడే సరికి నా ఆశ్చర్యానికి అంతు లేదనుకో."
నాన్నా అమ్మాపోయినా నేను యెంతో ఫార్వార్డ్ గా వుంటానని అభిప్రాయ పడినట్లున్నాడు. వెర్రివాడు. మన పూర్వికులు దద్దమ్మ లు కారు. కులగోత్రాలనీ, వావి వరుసలని , నియమ నిష్టలనీ యేర్పరచి పెట్టి సంఘానికి పునాది రాళ్ళు దృడంగా వేశారు. వాటిలో ఏ ఒక్కటి వుల్లంఘించినా సౌధం యెగుడు దిగుడు గా వస్తుంది. ఒకవేళ అందంగా వున్నదని మనం కళ్ళని భ్రమ పెట్టినా కూడా అది యెంతో కాలం నిలవదు.'
'యువకులు వుద్రేకం లో యేవేవో తప్పటడుగులు వేస్తారు. ఫర్ యాగ్జాంపుల్ ...ఉపేంద్ర మనోమోహిని అందం చూసి అయిన వాళ్ళందర్నీ కాలదన్నాడు. అచ్చా! బాగానే వుంది. యిద్దరూ యే పోరపాచ్చాలు లేకుండా సుఖంగానే జీవితాన్ని వెళ్ళ బుచ్చుతున్నారు. యిప్పుడు కృష్ణ మోహిని ఆడపిల్లగా పుట్టి అతనికి సమస్య అయి కూర్చుంది. డబ్బు యెంత వుంటే మాత్రం యేమిటి? ఆ పిల్లని యిటు మన వాళ్ళకి యిస్తాడా? అటు మనో మోహిని తాలుకూ వాళ్ళకి యిస్తాడా? వాళ్ళు సంతోషంగా ఒప్పుకుంటారు మతంలో చేర్చుకుని పిల్లాడిని యిచ్చిందుకు. మనవాళ్ళే వొప్పుకోరు.'
