"పద్మావతమ్మ ఎల్లిపోయినట్టు యీ అమ్మ ఏడబోతది- ఆ అమ్మ అంటే జమీందారి బిడ్డ" గౌరమ్మ పూలమొక్కలన్నీ వరసగా పాతించడానికి తోటలో వచ్చిన వాణిని చూడలేదు. యిద్దరూ- వాణి ఆ మాటలు విననే వింది.
వాణి వచ్చి మూడురోజులే అయింది. ఆ మూడురోజులలో పనివాళ్ళు హేళనగా వ్యంగ్యంగా తన గురించి ఆ ముందు భార్య గురించి అనుకునేమాటలు, అనసూయమ్మ సీతమ్మతో అన్న మాటలు అన్నీ కలిపి వాణి మనశ్శాంతి హరించసాగాయి-తీరికగా రాత్రి పడుకుంటే యీ మాటలన్నీ గుర్తువచ్చి ఒకటీ ఒకటీ గుణించుకున్న కొద్ది వాణిలో అలజడులు ఆరంభించింది-అందరి మాటల సారాంశం ఒకటే- రాజారావు పద్మావతి తిన్నగా కాపురం చెయ్యలేదు- రాజారావు తిన్ననైనవాడుగాదు- పద్మావతి చనిపోలేదు వెళ్ళిపోయిందా యీ రాజారావు మనిషి మంచివాడు గాదా! చెడుఅలవాటున్నాయా? భార్యని సరిగా ఏలుకోలేదా? ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది? అసలేమిటి జరిగింది యిద్దరిమధ్య? భార్య చనిపోయిందని రాజారావు తనతో అబద్దం ఎందుకాడాడు యిందులో ఏదో మోసం వుంది! తన అదృష్టంకొద్ది యింత గొప్ప సంబంధం వచ్చిందన్న మాట అబద్దం కాదుగదా యిప్పుడేం చెయ్యడం? ఎవరిని అడగడం?ఏమని అడగటం?
* * * *
"నమస్కారం అమ్మాయిగోరూ-" కిషోర్ నవ్వుతూ అన్నాడు చేతులు జోడించి.
ఉదయం తొమ్మిదిగంటలకి వాణి కింద పనులు పూర్తిచేసుకుని. పూజచేసి అనసూయమ్మకి హార్లిక్స్ పట్టుకు పైకి వస్తుంటే మేడ మెట్లు మీద నించి కిషోర్ కిందకి దిగి వస్తున్నాడు, వాణి కెవరినో ఆప్తుడిని చూసినట్లు అయింది-"అరే ... నీవా, మీరా.... యిలా....ఎప్పుడు వచ్చారు- ఎంతసేపయింది?" అంది సంబరంగా.
"పొలంలో కాసిన కూరలు తెచ్చాను. పెద్దమ్మగారికి కనపడి వెడదామని"
"అయితే .... నా కోసం రాలేదన్న మాట- యింకా నాకోసం వచ్చారనుకున్నాను."
యింకా నయం. అసలు మీకోసం, మీ పాటకోసం వచ్చాను. కూరగాయల వంక పెద్దమ్మగారి కోసం" చమత్కారంగా నవ్వి అన్నాడు కిషోర్.
కిషోర్ తెల్లపైజామా లాల్చి తొడుక్కున్నాడు-ఖరీదయిన చెప్పులు, చేతికి వాచి .... కిషోర్ ని చూస్తుంటే పెద్దింటి బిడ్డ అనిపిస్తూంది తప్ప పొలంపని చేసే రైతంటే నమ్మలేక పోతుంది వాణి.
"అయితే వుండండి, యీ హార్లిక్స్ ఆవిడకి యిచ్చేసి వస్తాను...."
"ఆ....అలాగే- యీలోగా బండిలోంచి కూరలు తీయిస్తాను."
"మేడమీదకి రాకూడదూ ఆవిడతో ఆ రోజు మీ గురించి చెప్పాను....చూపిస్తాను."
"బలేవారే- పెద్దమ్మగారికి నేను తెలియనివాడినికాను-మేడ మీదకి వెళ్ళి ముందు పెద్దమ్మగారి దగ్గిర నాకెంత చనువనుకున్నారు. యింతప్పటినించి నన్ను చూస్తున్నారు - యీ యిల్లు మాయిల్లులా తిరిగేస్తూంటాను- అసలు మా అమ్మమ్మ గారికి పెద్దమ్మగారు ఏదో చుట్టాలంట- బీరకాయ పీచు అనుకోండి" హాస్యంగా అన్నాడు.
"రండి-హార్లిక్స్ చల్లారిపోతూంది" అంది వాణి మెట్ల మీదకి దారి తీస్తూ - కిషోర్ వెనకాతల నడిచాడు. అనసూయమ్మనిచూసి వాణి "ఆ రాత్రి యీయన బండిలోనే వచ్చాను అత్తయ్యగారూ "అంది కిషోర్ ని చూస్తూ "వీడిని నాకు తెలియకపోవడం ఏమిటి బలేదానివే" అంది అనసూయమ్మ ముసిముసి నవ్వులు నవ్వి.
"ఏరా, మళ్ళీ వచ్చావేం, కాఫీ తాగావా, ఫలహారం" కూడా చెయ్యి. వాణీ... వీడికీ ఫలహారం, కాఫీ యియ్యి.
"పెద్దమ్మగోరు కాఫీ ఫలహారంతో సరిపెట్టేద్దామనుకున్నట్లున్నారు- భోజనం చెయ్యందే కదలను- భోంచేసి కొత్త కోడలమ్మగారి పాటలు వినిగాని వెళ్ళను పెద్దమ్మగోరూ ముందే చెపుతున్నాను" కిషోర్ చనువుగా నవ్వుతూ అన్నాడు.
వాణి సిగ్గుగా తల దించుకుంది.
"అలాగే విందాం- ఏది వచ్చిందగ్గర నించి యిల్లు సర్దడం పెట్టుకుని పనిలో మునిగి కూర్చుంది- బాగా పాడుతుందని విన్నానని నీవు చెప్పేవరకు ఆ మాటే గుర్తు లేదు నాకు- వాణీ యీ పూట భోజనాలు కాంగానే పాడుదువుగాని- పని పూర్తి చేసుకో- ముందు వాడికి కాస్త ఫలహారం కాఫీ యియ్యి."
"పెద్దమ్మా .... పెద్దమ్మగోరూ- బోలెడు కూరలు తెచ్చాను- లేత మువ్వంకాయలు మీకిష్టమని బుట్టెడు-తెచ్చాను- పెద్దమ్మగారూ మీరు మంచం ఎక్కారు మువ్వంకాయలు ఎవరొండుతారు?" కిషోర్ విచారం నటించాడు అనసూయమ్మ నవ్వింది.
"మీకు మువ్వంకాయలు యిష్టమా, నేనుచేసి పెడతాలెండి" అంది వాణి చనువుగా.
"అయితే కొత్తకోడలమ్మగారి వంట, పాట అన్నీ రుచిచూసే భాగ్యం వుందన్నమాట. అబ్బో పెద్ద ప్రోగ్రామే వుంది.... పదండి- పదండి" అంటూ పరుగు పెడుతూ కిందకి దిగాడు.
"వీడు వచ్చాడంటే చాలు సందడి-వాణీ-వాడికి ఏం కావాలో దగ్గిరుండి చూడు సుమా, భోజనాలు అవి చేసిరండి. పాడుదువుగాని-"అంది అనసూయమ్మ-వాణి తల ఊపి కిందకి వెళ్ళింది.
