Previous Page Next Page 
తీరం చేరిన నావ పేజి 12


    కిషోర్ అంటే అనసూయమ్మకి మంచి అభిమానం వుందని. కిషోర్ తో దూరపు బంధుత్వంకూడా వుంది కనక ఆ యింట్లో అతన్ని ఎవరూ పై వాడిగా చూడడంలేదని వాణి కొద్దిసేపట్లోనే గుర్తించింది.
    కిషోర్ ని చూస్తూ "మీరు యింట్లో యింత చనువుగా మసులుతారని యిక్కడ అందోరో మీకు తెలుసునని నాకు తెలియదు- నేనింకా మీరేదో....మామూలు..." ఏం అనాలో అర్ధంకాలేదు వాణికి.
    "బండివాడ్ని అనుకున్నారు ఏదో పొలం పని చేసుకునే రైతుగాడ్ని అనుకున్నారన్నమాట. మీరనుకున్న దాన్లో అబద్దం లేదు లెండి-నేను భూమిని నమ్ముకున్న రైతునే-ఎటొచ్చి కాస్త పాలిష్ డ్ రైతుని.... అంతే...." కొంటెగా అన్నాడు- కిషోర్ కళ్ళల్లో మెరిసే కొంటెతనం వానిని గిలిగింతలు పెట్టింది- కిషోర్ తో ఎన్నాళ్ళబట్టో పరిచయం వున్నట్టు చనువుగా అన్పించాడు. ఎంతో ఆప్తుడిగా, స్నేహితుడుగా అన్పించింది. కిషోర్ మాటలు వింటుంటే అతను ఎంతో చదువు, సంస్కారంగల వాడుగా కన్పించాడు.
    "మీరు కూర చేయండి- నేనలా కాస్త తోటలో తిరిగి చూస్తాను" అన్నాడు కిషోర్.
    "ఒక్కక్షణం వుండండి, నేను వస్తాను - తోటలో కొన్ని మార్పులు చేయించాలని కొన్ని పూలమొక్కలు అవీ సరిగా పాతించాలని అనుకుంటున్నాను. ఎలా బాగుంటుందో కాస్త చెప్పండీ, రైతులుకదా మీరు" అంది వాణి.
    "అబ్బ-అప్పుడే యీ యింటిమీద ఇంత శ్రద్ధ మీకు. వచ్చీరాగానే యిల్లంతా మార్చేశారు- తప్పు ఎడ్రసుకి రాలేదుకదా అనుకున్నాను యింట్లోకి రాగానే -నిజంగా మీ శ్రద్దాశక్తులని మెచ్చుకుంటున్నాను -మీలాంటి యిల్లాలు దొరికిన మగాడు ఎంత అదృష్టవంతుడు?" అన్నాడు అభినందన పూర్వకంగా కిషోర్ - వాణి మొహం సిగ్గుతో ఎర్రబడింది.
    తోటలో యిద్దరూ కాసేపు తిరిగారు-సుమారు ఎకరం స్థలంవున్న ఆ తోటలో అడ్డదిడ్డంగా వావివరుస లేకుండా వున్న రకరకాల పూలమొక్కలని ఓ వరుసగా లైన్లవారీగా వేయించాలని వుందని వాణి అంది -కిషోర్  అంగీకారంగా తల ఆడించి "కాని యిప్పుడు కాదు. వర్షాకాలం వచ్చేవరకు ఆగండి కాస్త, అనవసరంగా చచ్చిపోతాయి" అన్నాడు. "కాసేపిక్కడకూర్చోండి, పాపం అల్సిపోయారు." అన్నాడు కిషోర్-ఓ పెద్దమామిడి చెట్టుకింద సిమెంటు చప్టాచూపిస్తూ- దుమ్ము దులిపాడు ఓ మామిడి కొమ్మవిరిచి-యిద్దరూ కూర్చున్నారు.
    "అది సరే ...మీకీ యిల్లు, పెద్దమ్మగారూ అంతా నచ్చిందా- ఏమనిపిస్తూంది మీకు యిలా రావడం కొత్తగా వుందా?" అన్నాడు కిషోర్ వాణి తలెత్తి నవ్వింది.
    "యింటికేం- యింకో అన్నిరోజులు చేసినా తరగని చాకిరి వుంది- యింత పెద్ద యిల్లు ....చూస్తూంటేనే ఎలా బాబూ యీయింట్లో మసలడం, శుభ్రంగా వుంచడం అని భయంగా వుంది-మీ పెద్దమ్మగారు మంచి ఆవిడలా కనిపించారు-ఆప్యయంగానే మాట్లాడుతున్నారు.."
    "ఆవిడ చాలా ఉత్తమురాలు- పాపం ఆవిడమాట యీయింట్లో చెల్లదు-భర్త వున్నన్ని రోజులూ ఒక్కనాడూ ఆవిడ సుఖపడలేదు తాగుడు తందనాలు, రేస్ లు, క్లబ్బులు, పేకాట- ఒకటేమిటి వుండాల్సిన అన్ని వ్యసనాలు వుండేవిట-అందుకే ఆస్థి అంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది. నెలకి పట్టుమని నాలుగురోజులు యీ పల్లెలో వుండకుండా సిటీలో తిరిగేవారుట. తాగితాగి చెడుతిరుగుళ్ళు తిరిగి వళ్ళు యిల్లు గుల్లచేసుకుని చచ్చిపోయాడు ఆయన- లేకపోతే యీ మాత్రమన్నా మిగిలేదికాదు యింకా బతికివుంటే...సారీ....యివన్నీ నేనిలా చెప్పడం.... తప్పనుకుంటాను- ఏదో మీరడిగితే నాకు పెద్దమ్మగారిమీదవున్నా అభిమానంతో బాధలో చెప్పేశాను "నొచ్చుకుంటూ అన్నాడు.
    "లేదు....లేదు-పనివాళ్ళు వాళ్ళు ఏవేవో అనుకుంటూంటే నాచెవిన కొన్ని పడ్డాయి కాని ఎవరిని ఏం అడగాలో తెలియక తటపటా యిస్తున్నాను. నా సందేహాలు కొన్ని మీరుతీర్చాలి- యీ యింటి విషయాలు మీకు బాగా తెలుసు- నాకు ఒకమాట చెప్పండి..... యీయన .... రాజారావుగారు ఎలాంటి మనిషి?"....వాణి కుతూహలంగా ఆరాటంగా అడిగింది-కిషోర్ వాణి వంక స్థిరంగా చూసాడు.
    "ఎందుకలా అడుగుతున్నారు?..."
    "ఎందుకో తరువాత చెపుతాను- ముందు నాప్రశ్నకి సమాధానం చెప్పండి."
    "ఎలాంటివారంటే ఏ విషయంలో?" కిషోర్ సాలోచనగా అడిగాడు- వాణికి ఎలా చెప్పాలో తెలియకతడబడింది "అదే .... అదే- ఆయనా తండ్రిలాంటి వారేనా ఆయన భార్యతో సరిగా వుండేవారు కాదా?...." తడబడ్తూ అంది.
    కిషోర్ వాణి వంక చూసాడు "మీ కెవరు చెప్పారు యివన్నీ" ఎదురుప్రశ్న వేశాడు.
    ..... వాణి తన చెవినబడ్డ మాటలు అన్నీ చెప్పింది "యీ మాటల్లో నిజం ఎంత- అసలు రాజారావు గురించి అంతా చెప్పండి" అంది. కిషోర్ వాణికి జవాబు చెప్పలేని వాడిలా చూపు మరల్చుకున్నాడు.
    "క్షమించండి- యీ విషయాలు నేను చెప్పడం బాగుండదు- మీ కాబోయే భర్త గురించి నేను చెప్పడం ఏం బాగుంటుంది- రేపు పెళ్ళయ్యాక మీగురించి యీకిషోర్ గాడు యిలా అన్నాడని ఆయనచేత తన్నిస్తారు" అన్నాడు తమాషాగా.
    "ప్లీజ్. హాస్యంగాదు-సిన్సియర్ గా అడుగుతున్నాను-యీ మాటలన్నీ విన్నాక నా మనస్థితి ఎలా వుంటుందో ఊహించండి- దయచేసి చెప్పండి" అభ్యర్ధనా పూర్వకంగా అంది. కిషోర్ మొహం సీరియస్ గా అయింది.
    "యింతకీ విని ఏం చేస్తారు-అసలు ముందు మీరు యీయన గురించి ఏం తెలుసుకోలేదా-అసలెలా తటస్థపడ్డారు ఆయన మీకు" కుతూహలంగా అడిగాడు-వాణి జరిగిందంతా చెప్పుకొచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS