"మిస్ మహిమా! మీ రెండు కాప్షన్స్ రియల్లీ సూపర్బ్. అడ్వర్టయిజింగ్ రంగంలో బాగా రాణిస్తారు మీరు. కీపిటప్! మా కంపెనీకి ఎస్సెట్ గా భావిస్తున్నాను మీరు మా కంపెనీలో జాయిన్ అవడం ..." భేషజం లేకుండా మనస్ఫూర్తిగా మొదటిరోజే మెచ్చుకున్న బాస్ ని మనసులోనే మెచ్చుకుంటూ, సంతోషంగా, "థాంక్యూ సర్ మీ కాంప్లిమెంట్ నేనింకా బాగా పనిచేయడానికి దోహద పడుతుందని నమ్ముతున్నాను. ఇక్కడ ఉద్యోగం నాకెంతో ప్రోత్సాహాన్ని, ఆత్మ విశ్వాసాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను".
మర్యాదగా, పొందికగా చక్కని ఉచ్ఛారణలో ఇంగ్లీషు మాట్లాడుతున్న మహిమని ఈ ఉద్యోగంలోకి తీసుకోడం తమ కంపెనీకి లాభం అనిపించిందతనికి.
"బై ది బై ... ఈ రైతు కాప్షన్ అన్ని భాషల్లోకి వెడుతుంది. ఐ హోప్ ఇట్ విల్ బి ఎ సక్సెస్! బాగుంది ... "నీళ్లు కురవాల్సింది రైతు కంటకాదు. రైతు పంట పొలంలో మా బోరు పంపు వాడితే రైతు ఇంట సిరులు కురుస్తాయి".
ఆర్టిస్ట్ దానికి తగిన బొమ్మవేశాక మరింత బలం వస్తుంది కాప్షన్ కి. రెండోది షుగర్ మందు. "షుగర్ ని మీ ఇంట్లో డబ్బాలో దాచుకోండి ...
ఒంట్లో దాచుకుంటే ఒళ్లు గుల్లవుతుంది.
మీ సమస్యకి జవాబు ఇదిగో 'నో షుగర్' ఆయుర్వేద మాత్రలు!"
రెండూ చాలా అర్థవంతంగా, చాలా సులువుగా జనంలోకి వెళతాయి. కంగ్రాట్స్ మహిమ!" అని మరోసారి చెప్పాడు.
"థాంక్స్ సర్!"
"ఇది ఒక విజువల్స్ ఆర్డర్. చాలా పెద్ద ప్రోడక్ట్. కాస్ట్ లీది వచ్చింది. రిచ్ గా ఉండాలి. కొత్తగా ఓపెన్ అవబోయే చీరల షాప్. చాలా ఖర్చుప్త్తి మంచి మోడల్స్ తో ప్రెజెంట్ చెయ్యాలి. దీనికి కాప్షన్ అట్రాక్టివ్ గా ఉండాలి. విజువల్స్ గనుక స్క్రిప్టు పెద్దగా ఉండదు. కొత్త కాన్సెప్ట్ తో ప్రెజెంట్ చెయ్యాలి. రెండు రోజులు టైమ్ తీసుకున్నా పరవాలేదు, ఆలోచించండి. రెండు మూడు వెర్షన్స్ రాసి పంపండి. షాపువాళ్లు ఇచ్చిన వివరాలు ఇవిగో. వాళ్లకేం కావాలో చెప్పారు. మీకు ఉపయోగపడతాయి. కస్టమర్ శాటిస్ ఫాక్షన్ ఇంపార్టెంట్. ఓ నిమిషం, రెండు నిమిషాల వీడియోకి కోట్లు ఖర్చుపెడుతున్నారు అన్నది మనం మరవకూడదు. మీకేదన్నా హెల్ప్ కావాలన్నా, గిరీష్, అనుపమ ముగ్గురూ కలిసి చెయ్యొచ్చు..." వివరించాడు.
"ఐ విల్ ట్రై మై బెస్ట్ సర్ ..." కాగితాలు తీసుకుని బయటికి నడిచింది. అప్పుడే ఆమె బుర్రలో ఆలోచనలు గిరగిర తిరగడం మొదలుపెట్టాయి. ఓ పక్కన ఆరాటం, చేసి మెప్పించాలి అన్న ఆత్రుత, చెయ్యగలనా అనే కాస్తంత భయం అన్నీ చోటుచేసుకున్నాయి. సీట్ లోకి రాగానే అనుపమ, గిరీష్ లతో చెప్పింది. "కంగ్రాట్స్... ప్రయత్నించు... ఒక ఆలోచన వచ్చాక డిస్కస్ చేద్దాం ముగ్గురం.." అని అభయం ఇచ్చారు ఇద్దరూ.
* * * *
పెద్ద ఖరీదయిన పెళ్ళి సెట్టు, పట్టుచీరలు, నగలు, అందమైన ఆడవాళ్లు ... అట్టహాసంగా పెళ్ళి జరుగుతోంది. 'వరమాల' సీను. వధువు, వరుడు 'జయమాల' మార్చుకునే సీను. పురోహితుడు మంత్రాలు చదువుతూ, 'ఇప్పుడు వధువు వరుడు వరమాల మార్చుకోండి' అంటాడు. వరుని చేతికి వరమాల ఇస్తారు. వరుడు మాలవేయకుండా అమ్మాయిని పైనించి కిందవరకు అబ్బురపడుతున్నట్లు చూస్తుండిపోతాడు. 'మాల మెడలో వెయ్యి బాబూ..." అన్నా వినిపించుకోడు. వధువు తరఫువారు ఆరాటంగా చూస్తారు. ఎవరి మాటా విననట్టు తన్మయత్వంతో ఉండిపోతాడు వరుడు.
"భయ్యా ..." చెల్లెలు అన్నగారిని పిలుస్తుంది. చేతిమీద తడుతుంది. ఉలిక్కిపడి చూస్తాడు వరుడు. 'అన్నయ్య మాలవెయ్యి' మళ్లీ అంటుంది. పెళ్ళికూతురు కాస్త సిగ్గు, బిడియంతో ఆరాటంగా చూస్తుంది. 'ఏమిటలా చూస్తున్నావు బాబూ... దండలు మార్చుకోవాలి త్వరగా' పురోహితుడు మళ్లీ అంటాడు. పెళ్ళికూతురు తల్లి మొహంలో గాభరా. 'ఏమయిందన్నయ్యా...?' అంటోంది చెల్లెలు. తేరుకున్నట్టు 'ఏం లేదు పెళ్ళికూతురు బాగుందా, ఆమె చీర బాగుందా? చీర వల్ల ఆమెకి అందం వచ్చిందా, ఆమె వల్ల చీరకి అందమా...? తేల్చుకోలేక ...' కొంటెగా అంటాడు. అందరి మొహాలలో రిలీఫ్. పెళ్ళికూతురు సిగ్గుపడుతుంది.
'వదినగారూ, చీర బాగుంది. ఎక్కడ కొన్నారు?' వియ్యపురాలు ఆరా తీస్తుంది. 'ఈ చీరే కాదు, మీ అందరి చీరలు చాలా బాగున్నాయి...' అడుగుతుంది. ఇవన్నీ మేము, కొత్తగా ప్రారంభించిన 'శుభమస్తు' షోరూమ్ లో కొన్నామంటుంది. 'మరి మాకూ అక్కడే కొన్నారా' అని వియ్యపురాలు అడిగితే, మనందరికీ అక్కడే' అంటుంది పెళ్ళికూతురి తల్లి గర్వంగా. అప్పుడు కెమెరా షాపులోని రిచ్ నెస్, పట్టుచీరల దొంతరలు, వేలాడదీసిన ఖరీదైన అందమైన చీరలు ... అన్నింటినీ చూపుతుంది. షాపు గొప్పతనాన్ని అన్ని కోణాల నుంచి చూపిస్తుంది. షాపు ఎంట్రన్స్ బోర్డు, పెద్ద పెద్ద చీరల డిస్ ప్లేలు, షాపు మొత్తం కవర్ చేసి 'మీ శుభముహూర్తాలకి మా 'శుభమస్తు'కు విచ్చేయండి' అంటూ ప్రకటన ముగుస్తుంది.
'కంప్యూటర్ లో టైపు చేసిన స్క్రిప్టు చూపిస్తూ, "ఎలా ఉంది వెర్షన్ ... బాగుందా?" గిరీష్ అనుపమలకి చూపించి ఉద్వేగంగా అడిగింది.
"గుడ్! బాగుంది. విజువల్స్ రిచ్ గా తీస్తారు కనుక చాలా అట్రాక్టివ్ గా తయారవుతుంది" అన్నాడు గిరీష్.
'ఇంకోటి ఏదన్నా తయారుచేశావా...రెండూ కంపేర్ చేసి చూద్దాం..."
"చేశాగాని అది నాకంతగా నచ్చలేదు. పెళ్ళి జరుగుతుంటుంది. పెళ్ళివారికి అందరికీ బట్టలు పెడుతుంటే చీరలు చూసి పెదవి విరిచి మొహాలు చూసుకుంటారు. 'మేం 'శుభమస్తు'లో చీరలు కొనమంటే ఎక్కడ కొన్నారు'? కోపంగా అడుగుతుంది వియ్యపురాలు. 'అప్పటికింకా శుభమస్తు షాపు ప్రారంభించలేదండి. అప్పటికే కొనేశాం' అంటుంది పెళ్ళికూతురి తల్లి. వియ్యపురాలు చీర ఇచ్చేస్తూ 'చీరలు మార్చి అక్కడ కొనండి' అంటుంది. ఇది నెగెటివ్ అప్రోచ్ తో ఆరంభమవడం, పెళ్ళివేళ గొడవ పడడం అన్నది శుభసూచకంగా ఉండదు అది నాకే నచ్చలేదు".
