పెద్ద డాక్టరుకి వయసు మళ్ళింది. చెతికందివచ్చిన కొడుక్కి తన ప్రాక్టీసంతా అప్పగించి రిటైరయిపోయాడాయన.
చిన్న డాక్టరుగారి మొట్టమొదటి కేసు. చిరకాలం దీర్ఘవ్యాధితో బాధపడుతున్న ఒక లక్షాధికారి నాడి పరిశీలించాడో లేదో, నాన్నగారు ఈ కేసు నయం చేయకుండా ఇంతకాలం జాప్యం చేశారేమిటని యువక వైద్యుడనుకున్నాడు. అలాగయితే "ఇరవై నాలుగు గంటలలోగా వ్యాధి కుదుర్చుతా" నన్నాడు. అలాగయితే "ఇరవై వేలిస్తాను. ఇన్ని సంవత్సరాలుగా, మీ నాన్నంతవారు కుదర్చలేని ఈ రోగాన్ని నిజంగా నువ్వు కుదర్చగలవా?" అన్నాడు రోగి.
సాయంత్రానికల్లా వ్యాధి నిర్మూలించాడు వైద్యుడు. ఇరవై వేల రూపాయల చెక్కుతో ఇంటికి వచ్చి, తాను చేసిన ఘనకార్యాన్ని సగర్వంగా తెలియజేశాడు నాన్నగారికి!
"ఓరి కుర్ర నాగమ్మా! ఎంతపని చేశావుర ా? నాకు చేతకాక నయం చెయ్యలేదనుకున్నావా. ఎవరి డబ్బుతో నీకు బి.ఏ చెప్పించాను? మెడిసిన్ చదివించాను? ఫారిన్ పంపించాను? రేపోద్దుట నువ్వు వెళ్ళి పది రూపాయలిమ్మంటే ఇస్తాడా ఆ పిసినిగొట్టు? అయినా ఇరవై వేలకి చెక్కేమిటిరా? ఆదాయపు పన్ను వాళ్ళు నిన్ను బతకనిస్తారా? కనీసం పదిహేనయినా బ్లాకులో తీసుకోవాలని తోచక పోయిందా నీకు? ఈ ప్రపంచంలో ఎలా బతకాలో ఇంకా నువ్వు నేర్చుకోవలసింది బోలెడుందిరా! వాడ్ని బతికించావు గని బంగారపు గుడ్లు పెట్టె బాతును చంపెశావురా?" అంటూ నెత్తీ నోరూ మొట్టుకున్నాడు పెద్దాయన.
మనిషిలోని మానవత్వానికి ధనస్వామ్యం పరమ శత్రువుని చైనా వారికి బాగా తెలుసు. అందుకే కేపిటలిస్ట్ రోడ్డును అసహ్యించుకుంటూ, తాము చేరబోయే గమ్యస్థానం వైపు చేసే ప్రయాణంలో అడుగడుగునా అతి జాగ్రత్తగా సరిచేసుకుంటూ నడుస్తారు.
ఆ నడవడిక చీనాలోని చిన్న పిల్లలతో ఆరంభమవుతుంది.
డిసెంబరు పదో తేదీ రాత్రి బోజనా నంతరం రెడ్ గార్డుల సాంస్కృతిక ప్రదర్శన చూశాం. బూర్జువా సంస్కృతీకన్నా, ప్రాలేటేరియన్ సంస్కృతీ ఎన్నో రెట్లు మిన్న అని నాకెప్పుడో తెలుసు. ఆనాటి చిన్నపిల్లల ప్రదర్శనం చూసిన తర్వాత నాలోని నమ్మకం మరింత బలపడింది.
వాళ్ళు పాటలు పాడేరు, నాట్యాలు చేసేరు. నత్యంలోనే సర్కస్ ఫీట్లు చేశారు. పాటల్లో భావాల్ని నా ప్రక్క కూర్చున్న మిత్రుడు వివరిస్తుంటే ఆ పాటల్లో నాకు భవిస్యత్తులో వేసిన బాటలు కనిపించాయి.
పిల్లి మొగ్గలు వేస్తుండగా ఒక పిల్లవాడు కాలుజారి పడ్డాడు. సాధారణంగా అలాంటి దృశ్యం చూసిన మిగిలిన పిల్లలు నవ్వుతారు. హేళన చేస్తారు. అక్కడలా జరగలేదు. ఇంకో కుర్రవాడు వెంటనే అతన్ని లేవనెత్తి కాళ్ళ మీద నిలబెట్టాడు. నిలబడ్డాడో లేదో ఆ కుర్రవాడు ఇదివరకటి కన్నా ఉత్సాహంతో ఇంకా జోరుగా సర్కస్ ఫీట్లు చేశాడు.
ఇది జరిగింది ఒక రాష్ట్ర ముఖ్య పట్టణంలో. ఆ మర్నాడు ఒక గ్రామాన్ని చూశాము. అక్కడో పాఠశాల . అక్కడ కూడా పిల్లలు చలికాలం కాబట్టి అందరూ ఉన్ని దుస్తులు ధరించారు. ఆ సాయంత్రం వాళ్ళ సాంస్కృతిక ప్రదర్శనలు కూడా చూశాము. నగరంలో చూసిన వాటికన్నా ఇవేమీ తీసిపోలేదు. ముఖ్యంగా వాళ్ళ బృందగానాలు నన్ను చాలా చాలా ఆకర్షించాయి.
ఎనిమిది
ఆ గ్రామం పేరు చుంగ్. మేము వెళ్ళగానే, గ్రామ విప్లవ కమిటీకి చెందిన ముగ్గురు ఉపాధ్యాక్షులు మాకు స్వాగతమిచ్చారు. (అద్యక్షుడొక సమావేశంలో పాల్గొనడానికి పీకింగ్ వెళ్ళినట్లు చెప్పారు) పది గంటలదాకా కమిటీ హాలులో వాళ్ళ ఆతిధ్యం స్వీకరిస్తూ వాళ్ళు చెప్పింది వింటూ, మధ్య మద్యని ప్రశ్నలు వేస్తూ గడిపాము. మనదేశంలో ఎక్కడకు వెళ్ళినా బ్లాక్ మార్కెట్ ప్రత్యక్షమయేటట్లు చీనాలో బ్లాక్ తీ (అనగా పాలూ చక్కేరా లేని తేనీరు) లభించేది.ఆ చలికాలంలో అది తాగుతుంటే ఎంతో హుషారుగా ఉండేది.
మనదేశంలాగే ప్రధానంగా చైనా కూడా వ్యవసాయత దేశం. విప్లవానికి పూర్వం భూస్వాములదీ, వడ్డీ వ్యాపారులదీ పైచేయి. ఇప్పుడీ రెండు రకాల పురుగులూ ఆ దేశంలో లేవు. ఒకప్పుడు గ్రామాలలో నేలకు బానిసలుగా ఉన్న ప్రజలే ఇప్పుడు ఆ నేలకు అధికారులు. ఒక్కొక్క గ్రామం ఒక లక్షాధికారి, తొలి సంవత్సరాల సహకార వ్యవసాయం ఇప్పుడు సమష్టి వ్యవసాయం అయింది.
చుంగ్ గ్రామంలో ఫలవృక్షాల తోటలున్నాయి. వీటిలో ప్రొడక్షన్ బ్రిగేడ్ (ఉత్పత్తి చేసే సైన్యం) పని చేస్తుంది. రోజుకు పది గంటల పని, రెండు షిప్తుల్లో పనిచేస్తాయి. అనగా ఒక్కొక్కరికి రోజుకి అయిదు గంటల పని. వేరే ఆదివారాల సెలవంటూ లేదు. రోజూ పని వుంటుంది. రోజూవారి వేతనం సుమారు తొమ్మిది రూపాయలు ఇక్కడ కూడా ఎనిమిదవ తరగతి దాకా బాల బాలికలకు విద్య ఉచితం. అందరికీ ఉచిత వైద్య సహాయం.
కిందటి సంవత్సరం చుంగ్ గ్రామం 10 లక్షల 20 వేల యెన్ లు అర్జించింది. (ఒక యెన్ సుమారు 4 రూపాయలకు సమానం.)
ఈ డబ్బంతా గ్రామానికే చెందుతుంది. గ్రామంలోనే ఖర్చు చేస్తారు. ప్రజోపయోగ కార్యక్రమాల కిందా , అభివృద్ధి కార్యక్రమాలకీ వినియోగిస్తారు.
చైనాలో ఎక్కడా ఆదాయపు పన్ను లేకపోవడం విశేషం. ద్రవ్యోల్భణమూ, ధరల పెరుగుదలా లేకపోవడం మరో విశేషం. పాతికేళ్ళ కింద ఒక కోడిగుడ్డు ఖరీదు ఎంతో నేడూ అంతే. ఇలాంటి ఇలాంటి విషయాల్లో మన దేశం సాధించిన అభివృద్ధిని చూసి చీనావాళ్ళు సిగ్గుతో తల పంచుకోవలసిందే.
12-12-76 . ఈరోజు ఊడా హూప్ రాష్ట్ర ముఖ్య పట్టణంలోనే ఉన్నాము. రేపు ఉదయం పీకింగ్ కు తిరుగు ప్రయాణం.
ఇవాళ ఉదయం 8.00 గంటలకు ఒక ప్రత్తి ఫ్యాక్టరీ చూశాము. (ఇది గవర్నమెంటు ఫ్యాక్టరీ అని వేరే చెప్పనక్కరలేదు. కమ్యునిస్టుదేశాలలో ఉత్పత్తి సాధనాలు వ్యక్తుల చేతుల్లో వుండవు.)
ఈ ఫ్యాక్టరీ ప్రభుత్వానిది. అనగా ప్రజలది. ముఖ్యంగా అందులో పనిచేస్తున్న కార్మికులది. దీని పేరు 'స్టేట్ కాటన్ మిల్ నం. ఒకటి.' ఇందులో 4000 మంది కార్మికులూ, పాలక సంఘం వాళ్ళూ పనిచేస్తున్నారు. ఫ్యాక్టరీ పాలకవర్గంలో కార్మికులకు పూర్తి ప్రాతినిధ్యం ఉంటుంది.
