తన నరనరాల్లోనూ ఇంగ్లీషు రక్తం ప్రవహిస్తున్నమాట అక్షరాలా నిజమేగానీ...కానీ..
ఆ రక్తం ఇండియన్ సెంటిమెంట్లతో ప్రభావితం అయిపోయి ఉండడం కూడా నిజమే!
ఒక మనిషికి ఒక పాము పడగపట్టడం అంటే, పట్టబోయే రాజయోగానికి సూచన అని కదా అంటారూ!
ఆ ఊహని సమర్థిస్తూ, చరిత్రలో ఒక కథ కూడా వుంది.
ఢిల్లీలో అబూ హసన్ అనే ఒక ముస్లిం కుర్రవాడు ఉండేవాడు. అతను 'గంగూ' అనే బ్రాహ్మణుడి దగ్గర పనిచేస్తూ వుండేవాడు. ఒకరోజున అతను పనులు చేసి చేసి అలసి సొలిసి ఆదమరిచి నిద్రపోతున్నాడు. అటువైపే వచ్చిన యజమాని గంగూ ఒక అద్భుత దృశ్యం చూశాడు. నిద్రపోతున్న అటూ హసన్ కి ఎండపొడ తగలకుండా ఒక పాము పడగ పడుతోంది! అది చూసిన గంగూ, ఆ పిల్లవాడికి రాజయోగం పట్టబోతున్నదని గ్రహిస్తాడు. అదే చెబుతాడు ఆబూ హసన్ తో. ఆ కుర్రాడికి అది నమ్మశక్యంగా అనిపించదు.
కానీ ఆ తరువాత అతను దక్షిణాదికి వచ్చేసి, ఇక్కడి ముస్లిం ప్రభువుల కొలువులో చేరి, కాలక్రమాన పెద్ద పెద్ద పదవులు అధిష్టించి, చివరికి తనే ఒక రాజు అవుతాడు. అలనాడు ఆ బ్రాహ్మడు చెప్పిన జాతకం నిజం కావడంతో, కృతజ్ఞతా పూర్వకంగా తన పేరుని అబూహసన్ గంగూ అని పెట్టుకున్నాడనీ, ఆ కారణం వల్లనే అతని వంశం పేరుకూడా బహమనీ (బ్రాహ్మణ) వంశంగా చెలామణి అయిందనీ ఒక గాధ ఉంది.
అట్లాగే- ఇప్పుడీ అమ్మాయికి కూడా రాజయోగం పట్టబోతుందా?
అదెలా సాధ్యం? రాజయోగం అంటూ ఎవరికన్నా పడితే, అది తనకే గదా పట్టాలీ!
అందుకోసం తను గ్రహాల స్థితిగతులని మార్చేయడానికి కూడా సిద్ధం!
రాజు కావాలనే తన ఆశయానికి ఈ అమ్మాయి యోగం జతపడితే?
లేదా -
ఆ అమ్మాయినే తన సొంతం చేసేసుకుంటే?
రాణిని పెళ్ళాడితే తను రాణీగారి మొగుడవుతాడుగానీ రాజు కాలేడు గదా!
బ్రిటిష్ రాణి ఎలిజబెత్ ని పెళ్ళాడిన ఫిలిఫ్ సంగతి ఏమయిందీ?
ఆమె క్వీన్ ఎలిజబెత్ -
కానీ ఆయన కింగ్ ఫిలిప్ కాలేదు. కాలేడు కూడా! కేవలం ప్రిన్స్ ఫిలిప్! రాణి గారి మొగుడు!
అంతే!
రాజయోగం గీగం లాంటివి నిజమే గనక అయి ఒకవేళ ఈ అమ్మాయికి నిజంగానే రాజయోగం పట్టేటట్లుగా ఉంటే-
ఆమెని అడ్డం పెట్టుకుని తను ఒక దేశాధినేత కాగలడా ఏం?
ఇప్పుడు ఈ కుర్రాడు చెబుతున్న పాము పడగ విషయం గనక నిజమే అయితే, ఈ అమ్మాయి తన పాచికలాటలో మరోపావుగా పనికి రావచ్చును.
అతనికి ఇంకో ఆలోచన కూడా వచ్చి నవ్వొచ్చింది.
లేదా-
ఆమె తనకి ప్రత్యర్థి కూడా కావచ్చును!
ఆఫ్టరాల్ ఒక ఆడపిల్ల -
ఈ అభిరాంకి ప్రత్యర్దా?
ఇంతకీ- ఎవరా అమ్మాయి?
అసలు- ఎవరీ అబ్బాయి?
ఒక సర్పం, తనకు ఆహారం కాబోయే కప్పవైపు చూసినట్లుగా, సూరజ్ వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయాడు అభిరాం-
యదు వెళ్ళిపోయిన కొద్దిసేపటి తర్వాత, తను కూడా నిస్సత్తువగా లేచాడు సూరజ్.
తక్షణం-తనుకూడా లేచాడు అభిరాం.
చురుగ్గా కదిలి, యధాలాపంగానే తాకినట్లుగా సూరజ్ ని తగిలాడు. క్షణంలో సగంలో ఇందాక సూరజ్ జేబులో పడేసిన మినియేచర్ మైక్రోఫోన్ మళ్ళీ అభిరాం జేబులోకి ట్రాన్స్ ఫర్ అయిపోయింది!]
తనని అతడు రెండుసార్లు తగిలాడని కూడా గమనించే స్థితిలో లేడు సూరజ్.
అభిరాం నవ్వుకున్నాడు.
"పూర్ ఫెలో, ఇతడికి తెలియదు - ఈ అభిరాం ఒకసారి తగిలాడంటే ఇంక వదలడని!" అనుకున్నాడు అభిరాం, సూరజ్ వెళ్ళిన వైపే చూస్తూ. 'ఇవాళ కాస్త కాలక్షేపం కావడమే కాదు. కొన్ని కొత్త విషయాలు తెలిశాయి కూడా!' అనుకున్నాడు సంతృప్తిగా.
* * * *
చాలా అసహనంగా అనిపించింది సూరజ్ కి. తను చెబుతున్నది అర్థం చేసుకోవడానికి ఏ ఒక్కళ్ళూ ప్రయత్నించరేం?
తను ఈ ఎద్దుగాడికి చెప్పబోయింది ఏమిటీ?
పాము పడగ మీద ఉండే మణిని కాదూ - పడగ కింద వున్న మణిలాంటి అరుణని చూశానని కదా!
కానీ వాడు పూర్తిగా వినిపించుకుంటేనా?
ఆ రోజు జరిగింది ఇంకా కళ్ళకు కట్టినట్లే ఉంది సూరజ్ కి.
ఇంతకీ ఆరోజు జరిగిందేమిటీ?
* * * *
సరిగ్గా సంవత్సరం క్రితం.
ఆ కుటీరం గేటు దగ్గరికి వెళ్ళీ వెళ్ళగానే సూరజ్ కి మొట్టమొదటిగా కనబడింది ఒక దేవగన్నేరు చెట్టు. చెట్టునిండా విరగబూసి ఉన్న తెల్లటి పూలు - సన్నటి సువాసన.
కాలింగ్ బెల్ నొక్కాడు సూరజ్.
అది మోగలేదు. బహుశా పాడయిపోయిందేమో!
గేటు తీసుకుని, కాస్త బెరుగ్గానే లోపలికి వెళ్ళాడు సూరజ్.
అక్కడ ఎవ్వరూ కనబడలేదు.
కాస్త తటపటాయించి, "ఏమండీ?" అని పిలిచాడు.
లోపల గణగణ గంటల చప్పుడు.
ఎవరో పూజ చేసుకుంటున్నట్లుగా ఉన్నారు. అగరొత్తుల పరిమళం నాసికా పుటాలకు సోకుతోంది.
ఏం చేయాలో తోచక, కాసేపు అక్కడే నిలబడిపోయి పరిసరాలని పరిశీలించాడు సూరజ్.
కుటీరం వెనక వైపున అరటి చెట్లు వున్నాయి. ఆ పక్కనే ఒక గున్నమామిడి చెట్టు. ఇంకొంచెం పక్కగా ఒక పచ్చ సంపెంగ చెట్టు. కాస్త పరీక్షగా చూస్తే, ఆకుల్లో ఆకుల్లాగా కలిసిపోయి ఉన్న సంపెంగపూలు కనబడ్డాయి. మత్తెక్కించే సువాసన!
ఈ పచ్చ సంపెంగ ఎక్కడ వుంటే అక్కడ పాములు కూడా ఉంటాయని విన్నాడు తను. పాములకి ఈ వాసన అంటే బహుప్రీతి అని అంటారు.
నిజమేనా?
ఆలోచిస్తూనే రెండు అడుగులు ముందుకు వేస్తే - అప్పుడు కనబడింది అతనికి ఆ దృశ్యం!
అక్కడొక అరుగు.
అరుగు మీద శేషతల్పశాయిలా శయనించి ఉంది ఒక అమ్మాయి. పక్కనే ఒక పుస్తకం.
చెట్టు నీడలో పడుకుని చదువుకుంటూ, అలానే నిద్రలోకి జారిపోయి ఉండాలి ఆ అమ్మాయి.
చెట్టునీడ పక్కకి జరిగిపోయిందిగానీ ఆమె మొహం మీద మాత్రం ఎండ పొడ పడటం లేదు.
కింగ్ కోబ్రా సైజులో ఉన్న ఒక మహా సర్పం పడగవిప్పి, ఆ అమ్మాయి మొహానికి నీడ పడుతోంది!
కళ్ళార్పకుండా, నోటమాట రానట్టుగా దిగ్భ్రమగా చూస్తూ ఉండిపోయాడు సూరజ్.
ఇది కలా? నిజమా?
ఈ అమ్మాయి దివినుండి భువికి దిగివచ్చిన దేవకన్య కాదుగదా!
అతను అట్లాంటి భ్రమకి లోనుగావడానికి ఆ పరిసరాలూ, పరిస్థితులూ బాగా దోహదం చేశాయి.
కుటీరంలో అడుగు పెట్టినప్పటినుంచీ శుభప్రదంగా దేవగన్నేరులూ, అగరొత్తులూ, జేగంటలూ, అరటి బోదెలూ, మామిడాకులూ, సంపెంగ పూలూ.
పాము పడగ కింద ఈ అమ్మాయి!
అంతలోనే
ఇంట్లోనుంచి ఉద్వేగభరితంగా ఒక పాట వినబడటం మొదలయింది.
"అయిగిరి నందిని నందిత మోదిని
విశ్వవినోదిని నందినుతే,
గిరివర వింధ్య శిరోధినివాసిని
విష్ణు విలాసిని జిష్ణునుతే.
భగవతి హేశితి కంఠ కుటుంబిని భూరి
కుటుంబిని భూరికృతే
జయజయతే మహిషాసుర మర్దిని రమ్య కపర్థిని శైలసుతే...
