Previous Page Next Page 
వైరం పేజి 10


    "అఖండమైన నీ తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది" అన్నాడు వరదరాజన్.
    "నమ్మకముంటే నమ్మకస్తుడివిగానే ఎప్పటికీ ఉండిపో! నన్ను నమ్మి చెడినవాళ్ళు లేరు - ఆడపిల్లలు తప్ప!" అన్నాడు అభిరాం లైన్ కట్ చేసేస్తూ.

                       *    *    *    *

    కోపాన్ని కంట్రోల్ లోకి తెచ్చుకున్న తర్వాత సూరజ్ తో అన్నాడు యదు.
    "సారీరా! కోపం వస్తే నేను నిజంగా ఎద్దు మొద్దు స్వరూపాన్నే! డోంట్ ఫీల్ బ్యాడ్! నీ మంచి కోసమే చెప్పాను ఇదంతా! నీ సంగతి వదిలెయ్! నేను అంతమంది అమ్మాయిలని చూశాక, ఎవరిని సెలెక్టు చేసుకున్నానో అడగవేం?"
    "నీకు నచ్చిన అమ్మాయే అయి ఉంటుంది"
    తల వెనక్కి వంచి నవ్వాడు యదు.
    "అరె తెరీ అమ్మాయ్ కో గోలీమారో!
    అమ్మాయ్ కాదురా - ఆ అమ్మాయ్ వాళ్ళ నాన్న నాకు బాగా నచ్చాడు. వాళ్ళ నాన్నకంటే అయన డబ్బు నాకు ఇంకా నచ్చింది. కరోడ్ పతీ హై బాప్! కోట్లకి కోట్లు మూలుగుతున్నాయట - డాలర్లు! మల్టీ మిలియనీర్! చూడరా! చూడరా! ఈ ఎంగేజ్ మెంటు రింగు చూడరా! వన్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ టరా! చూడు బాస్!" అంటూ తన చేతిని ముందుకు జాచాడు యదు.
    అతని ఉంగరపు వేలుకి ఉంది ఆ ఉంగరం. ఉంగరం కనబడనంత సైజులో పెద్ద గోలీలా వుంది అందులో పొదిగిన వజ్రం! కళ్ళు మిరుమిట్లు గొలిపేలా మెరిసిపోతుంది!
    కాసేపు కళ్ళార్పకుండా వజ్రం వైపే చూశాడు సూరజ్. ఆ తర్వాత యదు మొహంలోకి చూశాడు.
    "సారీ యదూ!" అన్నాడు నెమ్మదిగా.
    నుదురు చిట్లించి చూశాడు యదు.
    "సారీనా! ఎందుకూ?"
    "ఈ డైమండ్ ఒరిజినల్ ది కానందుకు"
    "అంటే?"
    "పేరుకి ఇదీ వజ్రమే! కానీ యాభైలక్షల విలువ చేసే వజ్రం కాదు."
    కొద్దిక్షణాల పాటు నోరు తెరుచుకుని అలాగే ఉండిపోయి, ఆ తర్వాత, "వాట్ ది హెల్?" అన్నాడు యదు తీవ్రంగా.
    "నీకు కాబోయే మామగారి సంగతి నాకు తెలియదు యదూ! కానీ, ఈ వజ్రం మాత్రం నకిలీ! అన్నాడు సూరజ్, చాలా ధృఢంగా. "అవును. ఈ వజ్రం నకిలీ! కానీ నీకు కాబోయే భార్య మాత్రం అసలు సిసలైన జాతి రత్నమై ఉండాలని కోరుకుంటున్నాను - అరుణ లాగా!" కాసేపు నిశ్చేష్టుడయి ఉండిపోయి, షాక్ లో నుంచి తేరుకున్న తర్వాత ఒక్కసారిగా భుజాలు ఎగరేసి, సిగరెట్ అంటించాడు యదునందన్.
    "సూరజ్! మీ నాన్నగారిది వజ్రాల వ్యాపారం. తరతరాలుగా మీ కుటుంబ వ్యాపారం అదే! నువ్వు కంప్యూటర్ ఇంజనీర్ వయినా కూడా నీ జీన్సులోనే ఉంది డైమండ్స్ గురించిన ఎక్స్ పర్ టైజు! నువ్వు చెబుతున్నావు కాబట్టి నమ్మక తప్పదు సూరజ్!"
    "నాకు వ్యాపారం మీద ఇంట్రెస్టులేదుగానీ వజ్రాలు అంటే ఫాసినేషన్ ఉంది. డబ్బుకోసం గాదు. అదొక మిస్టరీ! చెట్లూ చేమలూ భూగర్భంలోకి చేరుకుని, లక్షలాది సంవత్సరాలపాటు విపరీతమైన వేడిమికీ, ఒత్తిడికీ గురి అయి, బొగ్గుగా మారడం - ఆ బొగ్గే వజ్రం కావడం - ఈ ప్రకృతి చేసే అద్భుతాలలో ఒకటి కాదూ?
    అట్లాగే అందరూ బొగ్గు అని భ్రమపడుతున్న అరుణ సానబెడితే మేలిమి వజ్రం అవుతుందని నాకు తెలుసు. తను అవుతుంది ఒక కోహినూర్!
    పక్క టేబుల్ దగ్గర కూర్చుని అదంతా వింటున్న అభిరాం అలర్టుగా అయిపోయాడు.
    కోహినూర్!
    ఆ వజ్రం చరిత్ర తనకి బాగా తెలుసు.
    ఇక్కడ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లోని కొల్లేరులో దొరికిన ఆ వజ్రం - ఎందఱో రాజుల చేతులు మారి, ఇప్పుడు బ్రిటిష్ రాణి కిరీటంలో ఉంది.
    సూరజ్ వైపు ఆసక్తిగా చూశాడు అభిరాం.
    వజ్రాల గురించి ఇతనికి చాలానే తెలుసే! ఆ లెఖ్ఖన ఏదో విధంగా ఎప్పుడో ఒకప్పుడు తనకి పనికి వస్తాడేమో!
    మనసులోనే నోట్ చేసుకుని పెట్టుకున్నాడు అభిరాం.
    ఇంకా చెబుతూనే ఉన్నాడు సూరజ్.
    "బ్రిటీష్ రాణి కిరీటంలో వున్న కోహినూర్ శిరోమణిలాంటిది కదా!"
    మాట్లాడకుండా వింటున్నాడు యదు.
    "శిరోమణి అంటే శిరస్సున ఉండే మణి. కొన్ని పాముల తలల మీద కూడా మణులు ఉంటాయని అంటారు.
    "యదూ! పాము పడగలో మణి వుండడం అనేది నిజంగా జరుగుతుందో లేదో గానీ, పాము పడగ కింద ఉండిన ఒక మణిని చూశాను నేను - వింటున్నావా?"
    "వింటున్నా చెప్పు!" అన్నాడు యదు విసుగ్గా.
    పక్క టేబుల్ దగ్గర అభిరాం కూడా - శ్వేతనాగు ఒకటి తలెత్తి పడగ విప్పినట్లుగా నిటారుగా కూర్చుని వింటున్నాడు.
    "అరుణ ఒక శిరోమణిలాంటిదని నేను ఎప్పుడు కనిపెట్టానో తెలుసా?"
    బోర్ గా చూస్తున్నాడు యదు.
    నిట్టూర్చి, చెప్పడం మొదలెట్టాడు సూరజ్.
    "ఆరోజు - అరుణని నేను మొట్టమొదటిసారిగా చూసిన శుభదినం..."
    'దుర్దినం' అనుకున్నాడు యదు, మనసులోనే మంటగా.
    "అరుణా, వాళ్ళ అమ్మ జాహ్నవిగారూ ఉండే ఇల్లు ఒక ముని వాటిక లాంటిది. అతిశయోక్తి కాదు. నిజమే! కొండలలో కాస్త పెద్దదే అనిపించే స్థలంలో చాలా చిన్నది అనిపించే పెంకుటిల్లు. చుట్టూతా చెట్టూ చేమలూ - పక్షులూ పాములూ యధేచ్చగా సంచరిస్తూ ఉంటాయి.
    ఆరోజున నేను గేటు తీసుకు లోపలికి వెళ్ళగానే అక్కడ ఎవ్వరూ లేరు. ఎవరైనా కనబడతారేమోనని నేను అటూ ఇటూ చూస్తున్నాను. కొద్ది అడుగులు ముందుకు వేస్తే అక్కడ కనబడింది. ఆ అద్భుత దృశ్యం!" అన్నాడు సూరజ్.
    వింటున్నాడు యదునందన్.
    వింటున్నాడు అభిరాం కూడా.
    "అవును! అత్యద్భుత దృశ్యమే! నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. ఆ ఇంటి వెనక ఒక అరుగు వుంది. ఆ అరుగు మీద పడుకుని వుంది ఒక అమ్మాయి. ఆమె చేతిలో ఒక పుస్తకం. ఆ పక్కనే ఒక చిన్న గున్నమామిడి చెట్టు. బహుశా ఆ చెట్టు నీడన పడుకుని చదువుకుంటూనే నిద్రలోకి జారిపోయి ఉండాలి ఆమె.
    పొద్దెక్కుతున్నకొద్దీ చెట్టునీడ పక్కకి జరిగిపోయింది.
    కానీ -
    ఆ అమ్మాయి మొహం మీద మాత్రం ఎండ పొడ పడటమే లేదు. నీడగానే ఉంది.
    "ఎలా?" అన్నాడు యదు అప్రయత్నంగానే.
    ట్రాన్స్ లో ఉన్నట్లుగా చెప్పుకుపోతున్నాడు సూరజ్.
    "ఆ అమ్మాయి మొహం మీద మాత్రం నీడ పడుతూనే ఉంది.
    పడగ నీడ!
    నిజంగానే యదూ!
    కింగ్ కోబ్రానేమో అనిపించేటంత పెద్ద సైజులో ఉన్న మహా సర్పం ఒకటి, అరుణ మొహానికి ఎండ పొడ తగలకుండా పడగవిప్పి నీడ పడుతోంది!"
    అసహనంగా అన్నాడు యదు.
    "ఆ కొంపలో పాములు పాకుతూ ఉంటాయని చెప్పావుగా! ఏదో ఒక పాము, ఏదో మూడ్ లో ఆ అమ్మాయి పక్కనుంచే పాకుతూ ఉన్నప్పుడు పడగవిప్పి వుండవచ్చును. కాకతాళీయం! అది చూసి ఇంక నువ్వు ఆ పాము ఆ అమ్మాయి సేవలో పడగ విప్పిందని భ్రమపడి వుంటావు. అట్టర్లీ నాన్సెన్స్! సెంటిమెంటల్ స్టఫ్! పాములు పడగపట్టడం, పగబట్టడం - రేయ్ రేయ్ -ఇన్నీ అమ్మమ్మల కబుర్లురా! ఉత్త మూఢ విశ్వాసాలు!"
    "నన్ను నమ్ము యదూ! ఆ అమ్మాయి అరుణ, సో వెరీ స్పెషల్!"
    నిరసనగా అన్నాడు యదునందన్.
    "దోస్త్! నాకు తెలిసిన ఒక మంచి సైకియాట్రిస్టు వున్నాడు. నీకు అత్యవసరంగా సైకియాట్రిక్ హెల్ప్ కావాలి. పూర్తిగా మతి పోయిందిరా నీకు! అడ్రస్ ఇస్తా! అతని దగ్గరికి వెళ్ళు"
    "యదూ, నేను చెబుతున్నది..."
    చటుక్కున లేచి నిలబడి,
    "గో టూ హెల్" అని కటువుగా చెప్పి, చేతులు రెండూ గాల్లోకి ఎత్తి, 'దేవుడే దిక్కు' అన్నట్లుగా ఆకాశం వైపు చూసి, విసవిసా నడుస్తూ, అక్కడ నుంచి వెళ్ళిపోయాడు యదునందన్.
    కానీ -
    అక్కడికి దగ్గరలోనే కూర్చుని అంతా వింటున్న అభిరాం మాత్రం అలర్టుగా అయిపోయాడు. అతను సూరజ్ పాకెట్ లో పడేసిన మినియేచర్ మైక్రోఫోన్ మహా పవర్ ఫుల్! ఒక్క అక్షరం మిస్ కాకుండా అంతా చాలా క్లియర్ గా వినబడుతోంది!
    నెమ్మదిగా, దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు అభిరాం - అలియాస్ అబ్రహాం!
    ఒక మనిషికి ఒక పాము పడగబట్టింది అంటే అర్థం ఏమిటి?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS