Previous Page Next Page 
వైరం పేజి 12


    మహిషాసుర మర్దిని అమ్మవారి స్తోత్రం!
    ఈ అమ్మాయేనా ప్రత్యక్షదేవత?
    మగత ఆవరిస్తున్నట్లుగా అయిపోయింది సూరజ్ కి.
    అప్పుడు జరిగింది అది!
    సంపెంగ చెట్టుమీద నుంచి కొత్త తొడిమలా కనబడుతున్న ఆకు పచ్చటి పువ్వు ఒకటి టప్పున రాలి, ఆ అమ్మాయి పాదాల మీద పడింది-
    'దేవతలు కురిపించబోయే పూలవానకి తొలకరి చినుకులాగా!' అనిపించింది సూరజ్ కి.
    నెమ్మదిగా కళ్ళు తెరిచింది ఆ అమ్మాయి.
    కళ్ళు తెరిచీ తెరవగానే ఆమెకి పాముపడగా-ఆ పడగకింద కళ్ళజోడులాగా కనబడే తాచుపాము తాలూకు మార్కు కూడా కనబడిపోయే వుండాలి.
    ఆ భయనాక పరిస్థితులలో మామూలుగా అయితే ఒక మామూలు ఆడపిల్ల ఏం చేయాలీ?
    ఏం చేస్తుందీ?
    ఆడపిల్లే ఏమిటి?
    కొమ్ములు తిరిగిన మొగవాడయినా ఏమి చేసి ఉండేవాడూ?
    చివాలున లేవడానికి ప్రయత్నించడం - తక్షణం పాము కాటందుకోవడం -
    ఆ వెనువెంటనే చావుకేకా!
    లేదా! భయంతో బిర్ర బిగుసుకుపోయి మాట పడిపోయినట్లుగా ఉండిపోవడం!
    పరిస్థితి ఇంకా వికటిస్తే-
    షాక్ తో గుండె ఆగిపోయి మరణించడం!
    కానీ -
    ఈ అమ్మాయి విషయంలో ఇవేవీ జరగలేదు.
    కళ్ళు తెరిచీ తెరవగానే, తన మొహం మీదగా ఉన్న పాము పడగని చూసింది ఆమె.
    నిశ్చలంగా!
    కొద్దిక్షణాలు అలాగే!
    ఫ్రీజ్ షాట్ లో లాగా!
    ఆ తర్వాత పాము నెమ్మదిగా పాకుతూ పక్కకి జరిగి, అరుగుమీద నుంచి జారి, గడ్డిలో అదృశ్యమైపోయింది.
    అప్పుడు నిదానంగా లేచి కూర్చుంది ఆ అమ్మాయి.
    భయమన్నది తెలియదా ఆమెకి?
    ఆమె మొహంలో భయం తాలూకు ఛాయలు లేవు.
    కళ్ళలో కలవరం లేదు.
    కాళ్ళలో వణుకు లేదు!
    బతికి బయటపడ్డానన్న ఊరట కూడా లేనేలేదు!
    సమాధి స్థితిలో ఉన్న మహా యోగినిలాగే నిర్వికారంగా ఉండిపోయింది ఆమె.
    ఆ తర్వాత - ఆమె చూపులు సూరజ్ మీద పడ్డాయి.
    "ఎవరూ?" అన్నట్లు ప్రశ్నార్థకంగా చూసింది.
    "నేను ఎవరైతేనేమి లెండి! మీరు మాత్రం మహా గ్రేట్! మీ ధైర్యానికి నా జోహార్లు!" అన్నాడు సూరజ్, సంభ్రమంగా.
    "పాము సంగతేనా? ఇందులో ధైర్యం ప్రసక్తి ఏమి ఉందీ? పాముని చూస్తే మనిషికి ఎంత భయమో, మనిషిని చూస్తే పాముకీ అంతే భయం! ఇవాళ నాకు పాము కనబడకూడదని మనిషి ప్రార్థిస్తే, మనిషి కంట పడకూడదని పాము ప్రార్థిస్తూ వుంటుందిట. పాము తను పడగ విప్పేది భయపడినప్పుడు గానీ, లేదా భయపెట్టడానికి గానీ అంతే! పడగ కింద వున్న నేను భయపడితే పాము మరింత భయపడి కాటందుకునేది. నేను కదలకుండా మెదలకుండా ఉండిపోవడంలో ధైర్యంకంటే కామన్ సెన్సే ఎక్కువ ఉంది" అంది ఆ అమ్మాయి తేలిగ్గా.
    అదిగో! అది మొదలు.
    ఇంక ఆ క్షణం నుంచీ ఆమెను గురించి అతిశయోక్తులతో తప్ప మామూలుగా ఆలోచించలేక పోతున్నాడు సూరజ్.
    "ముల్లోకాలలోనూ మీలాంటి అమ్మాయి ఉండదూ- ఉండబోదు కూడా!" అన్నాడు భావావేశంతో.
    ఇబ్బందిగా చూసింది అరుణ.
    "అరుణ - అంటే మీరేనా?" అన్నాడు సూరజ్ మళ్ళీ.
    అవునన్నట్లు ముభావంగా తలపంకించింది అరుణ.
    "నేను సూరజ్"
    ప్రశ్నార్థకంగా చూసింది అరుణ.
    "భావనతో చెప్పానందే - మీ ఇంట్లో ఒక రూము ఖాళీగా ఉందనీ...అదే...మొన్నమొన్నటిదాకా భావన ఉండి వెళ్ళిన రూము... నా గురించి మీకు చెప్పానని కూడా చెప్పిందే!"
    "ఎవరో ఆడపిల్లని పంపిస్తున్నానని చెప్పింది." అని సందిగ్ధంగా అని, అంతలోనే ఇంకేదో తోచినట్లుగా మాట సగంలో ఆపేసింది అరుణ.
    'నన్ను గురించే అయి వుంటుంది లెండి. తను నన్నెప్పుడూ 'ఏయ్ అమ్మాయ్!' అని పిలిచి ఆట పట్టిస్తూ ఉంటుంది." అన్నాడు సూరజ్.
    అతన్ని ఆపాదమస్తకం ఒక్కసారి పరిశీలించింది అరుణ. అతను మరీ 'అమ్మాయి' లాంటివాడు కాకపోయినా, అతి తెలివిగల గడుగ్గాయ్ మాత్రం కాదని గట్టిగా అనిపించింది. ఉత్త భోళా శంకరుడిలా ఉన్నాడు.
    భావన అల్లరి తనకు తెలుసు. కార్టూనిస్టులు మనుషుల్లో ఏదో ఒక స్పెషల్ ఫీచర్ ని పట్టేసుకుని, దాన్నే అతిగా చేసి తమాషా పోలికలు తెప్పించినట్లుగా, ప్రతివాళ్ళలోనూ ఏదో ఒక లక్షణాన్ని ఇట్టే పట్టేసుకుని నిక్ నేములు పెట్టేస్తూ ఉంటుంది భావన. ఆ మాటకి వస్తే, భావన తనని మాత్రం "ఏయ్ అబ్బాయ్" అని పిలిచి ఆటపట్టించేది కాదూ!
    లేకపోతే - తనని 'మిస్టర్ అరుణ' అని పిలిచేది. సగటు ఆడపిల్లలా భయం భయంగా బతికేయడం లేదనేనా?
    "ఆ గది లేడీస్ కి తప్ప ఇంకెవరికీ అద్దెకివ్వకూడదని అనుకున్నాం" అంది అరుణ.
    "మరి భావన ఎందుకు నన్ను రికమెండ్ చేసిందంటారూ?"
    అతని మాట పూర్తికాకముందే, అతని సెల్ ఫోను గొంతు విప్పింది.
    "నేనే! భావన! ఫోన్ అరుణకివ్వు"
    అరుణకి ఫోన్ ఇచ్చాడు సూరజ్.
    ఉపోద్ఘాతం లేకుండా మొదలెట్టింది భావన.
    "అతను వానపాము లాంటివాడు. రూము ఇవ్వు. అతనివల్ల నీకే డేంజరూ ఉండదుగానీ ఎవరివల్లా నీకే డేంజరూ లేకుండా అతను తోడుగా వుంటాడు. నదీ గ్యారంటీ!" అంది భావన.
    "గ్యారంటీ" అన్నదిగానీ, ఎన్నాళ్ళకు గ్యారంటీ అన్నది మాత్రం చెప్పలేదు.
    దేనికైనా జీవితాంతం గ్యారంటీ ఇవ్వడం అనేది చాలా అరుదుగా కదా జరిగేదీ!
    ఏదైనా కొంటే, సాధారణంగా ఓ సంవత్సరానికి గ్యారంటీ ఇస్తారు.
    లేదా రెండేళ్ళకు.
    మహా అయితే పదేళ్ళకు!
    కానీ -  
    భావన ఇచ్చిన 'గ్యారంటీ' క్షణం సేపు కూడా నిలవలేదు!
    అరుణని చూడగానే ఫ్లాట్ గా పడిపోయాడు సూరజ్ - ప్రేమలో!
    'ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లుగా, పాముపడగ కింద ప్రాణభయం అనేది లేకుండా పడుకుని ఉండిన అరుణని చూసీ చూడగానే అతని మనసులో ఒక ముద్ర పడిపోయింది.
    లవ్ ఎట్ ఫస్ట్ సైట్!
    మేబీ అబ్సర్డ్!
    బట్ అబ్సల్యూట్ లీ ట్రూ!
    అట్ లీస్ట్ ఇన్ హిజ్ కేస్!  
    అతను భావుకుడు! అందుకనే!
    అదే గనక యదునందనయితే -
    స్టయిలిష్ గా మాట్లాడే యదు ఇంగ్లీషులో గ్రామరు వుండదు.
    అట్లాగే, 'ప్రేమ'కి కూడా గ్లామరే తప్ప గ్రామరు ఉండదనీ, రూల్సూ రెగ్యులేషన్సూ కూడా ఏమీ వుండవనీ అతనిలాంటి వాళ్ళకి అర్థం కావు.
    హృదయద్వారం దగ్గర 'ప్రవేశములేదు' అని బోర్డు పెట్టినా సరే, దురాక్రమణ చేస్తున్నట్టు దూరిపోతుంది ప్రేమ. గుండెని కబ్జా చేసేస్తుంది. రూల్సుకి అతీతం!
    "ఇంతకీ మీరు నాకు రూము ఇస్తున్నట్లే కదా! నా వర్క్ స్పాట్ ఇక్కడికి చాలా దగ్గరేనండీ! నడిచి వెళ్ళే దూరమే! ఈ రూములో ఉంటే నా ప్రాణానికి చాలా సుఖంగా ఉంటుంది. పైగా, ఇది ఒక మునివాటికలాగా ఉన్న ఇల్లు కదా. నాకు ఇట్లాంటి అట్ మాస్ ఫియరు అంటే భలే ఇష్టం!" అన్నాడు సూరజ్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS