Previous Page Next Page 
మొగుడు ఇంకో పెళ్ళాం వజ్రాలు పేజి 10


    రాంబాబుకి రాణి మొహంలోకి చూడాలంటే భయం వేసింది.
    "విక్కీగాడు నాకే చెక్మా యిచ్చాడన్నమాట."
    "పొద్దున్న మనం అటు వెళ్ళగానే వాడిటు వచ్చి కాజేసుంటాడు."
    "ఇప్పుడేమిటి చేయటం?" నిరాశగా అడిగాడు.
    "నీకెందుకు చెప్పాలి...? మనిద్దరం వేరే సెటప్ పెట్టుకుని లైఫ్ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి నాకే హాండివ్వడానికి రడీ అయ్యావంటే నువ్వు ఎంత కేడీ నెంబర్ వన్ వో తెలుస్తోంది."
    "రాణీ! నిజం చెపుతున్నాను. విక్కీని మోసం చేద్దామనుకున్నాను గానీ నిన్ను మోసం చేయాలనుకోలేదు."
    "డబులాక్షనొద్దు. పద విక్కీ ఇంటికెళదాం... ఇంట్లోనే ఎక్కడో దాచి వుంటాడు."
    ఇద్దరూ జీప్ లో విక్కీ ఇంటికి చేరుకున్నారు.
    వీర్రాజు వాళ్ళను చూస్తూనే కంగారుపడ్డాడు.
    "విక్కీ_ఎక్కడ దాచాడ్రా_వజ్రాలు?" అడిగాడు రాంబాబు.
    "వజ్రాలేంటి"
    "నీ యబ్బ_ డ్రామాలాడకు!"
    ఇద్దరూ ఇల్లంతా వెతికారు. సామాన్లన్నీ చిందరవందర చేశారు. రాంబాబు వేరే గదిలో వెతుకుతూండగా ఫిష్ ఎక్వేరియంలో రాళ్ళ మధ్యలో కనిపించినయ్ వజ్రాలు రాణికి.
    అమాంతం వాటిని ఏరి తన పర్సులో వేసుకుని బయటకు పరుగెడుతూంటే వీర్రాజు చూశాడు.
    "వీటినమ్మేశాక నీ దగ్గరకొస్తా_ అప్పుడు మనిద్దరం పెళ్ళి చేసుకుందాం_" అంటూ పరుగెత్తింది.
    రాంబాబు ఇల్లంతా వెతికి బయటికి వచ్చి ఆమె లేకపోవటం చూసి జీప్ దగ్గరకు పరుగెత్తి వైర్ లెస్ లో మెసేజ్ ఫ్లాష్ చేశాడు.
    రాణి వజ్రాలు తీసుకుని పారిపోతోంది పట్టుకోమని.
    కొద్ది నిమిషాల్లో నగరమంతా రాణికోసం గాలింపు ప్రారంభమయింది. ఆ న్యూస్ ఒక షాపులో టీవీలో చూసిన రాణీకి తను వజ్రాలతో సహా దొరికిపోవటం తప్పదని అర్థమయిపోయింది. అయినాగానీ ఆఖరి ప్రయత్నంగా ఓ సూపర్ బజారులో దూరింది.
    అక్కడ కౌంటర్ మీద బోలెడు ఫ్యాన్సీ పెన్ లు పడివున్నాయ్... లావుగా వున్న ఆ చెక్క పెన్నులకు పెద్దపులి తలలూ, సింహాల తలలూ, గుర్రాలూ, ఏనుగుల తలలూ అమర్చి వింతగా కనబడుతున్నాయి.
    ఓపెన్ తీసుకుని తల వూడదీసి చూసిందామె.
    లోపల ఖాళీ...
    తన పర్సులోని వజ్రాలు తీసి ఆ పెన్ లో వేసి రెడ్ ఇండియన్ తల అమర్చి స్క్రూటైట్ చేసింది.
    "ఇదెంత?" అడిగింది క్యాష్ కౌంటరు దగ్గరకొచ్చి.
    "ఫార్టీ రూపీస్."
    ఆమె డబ్బిచ్చి పెన్నుతో బయటకు నడిచింది.
    బయట కానిస్టేబుల్ ఒకడు తనవంకే అనుమానంగా చూస్తున్నాడు.
    వాడిని ఎలాగైనా తప్పించుకోగలిగితే మంచిది.
    హఠాత్తుగా ఆ జనప్రవాహంలో పరుగు ప్రారంభించిందామె.
    పోలీస్ విజిల్స్ మార్మోగిపోయాయ్.
    ఆ సమయంలో ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఒంటరిగా కూర్చుని మెనూ కార్డ్ చూస్తున్న గొపాల్రావ్ కనిపించాడామెకి.
    ఆమెను చూసి, ఆమె ఒంపుల శరీర సౌష్టవానికి స్టన్ అయి కళ్ళప్పగించి చూస్తూ వుండిపోయాడతడు.
    విజిల్స్ అన్నివేపుల నుంచీ దగ్గరవుతుండటంతో ఆమె వడివడిగా వచ్చి గోపాల్రావ్ పక్కనే కూర్చుని అతనివేపు చూసి చిరునవ్వు నవ్వింది.
    అతడు నిశ్చేష్టుడైపోయాడు.
    అంత అందమైన సెక్సీ గాళ్ తనను చూసి నవ్వి తనపక్కకొచ్చి కూర్చుంటే అతనికి వళ్ళంతా పులకరించేసింది.
    "హలొ౧ మిమ్మల్ని ఇంతకు ముందెక్కడో చూసినట్లు గుర్తు...." అంది తీయగా.
    అతను పూర్తిగా ఐసయిపోయాడు.
    "అఫ్ కోర్స్...! నేనూ అదే ఆలోచిస్తున్నాను... ఎక్కడ కలుసుకున్నామా అని. ఎక్కడబ్బా.... ఎక్కడబ్బా...."
    "పోనీండి. ఎక్కడ కలుసుకుంటేనేం... వుయార్ ఫ్రెండ్స్... కదూ?"
    "షూర్_ షూర్! క్లోజ్ ఫ్రెండ్స్."
    "అయితే మరి నాకో మాంఛి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయవచ్చు కదా?"
    "అయిదు నిమిషాల్లో తెప్పిస్తాను...." అంటూ బేరర్ ని పిలిచి ఐస్ క్రీమ్ తెప్పించాడు.
    ఇద్దరూ ఐస్ క్రీమ్ తింటూండగా పోలీసులు వచ్చారు.
    "సార్! ఇటెవరైనా ఓ అమ్మాయి పరుగెత్తుకొచ్చిందా?" అడిగాడు గోపాల్రావుని.
    "ఎవరూ రాలేదు" చెప్పాడతను.
    వాళ్ళు మళ్ళీ పరుగుతో వెళ్ళిపోయారు.
    "మీ పేరు చెప్తే మనం ఇంతకు ముందెక్కడ కలుసుకున్నామో గుర్తొస్తుందేమో" అన్నాడతను.
    "నా పేరు రాణి."
    "వాటే లవ్లీ నేమ్!"
    "మీ పేరు?"
    "గోపాల్రావు."
    అతను సీతను పూర్తిగా మర్చిపోయాడు. అంతకు ముందురోజు ఎగ్జిబిషన్ లో జరిగిన సన్నివేశాలు మర్చిపోయాడు.
    సీతకిచ్చిన మాట మర్చిపోయాడు.
    కబుర్లతో రెండు గంటలు గడిచిపోయింది.
    రాణి కింకలేచి తన దారిన తను పోవాలనుందిగానీ, ఓ కానిస్టేబుల్ దూరంగా నిలబడి తననే అబ్జర్వ్ చేయటం భయం కలిగించింది.
    టైమ్ ఎనిమిదై పోయింది.
    "మిస్టర్ గోపాల్! నిజంగా మీ కంపెనీ ఎంత లవ్లీగా వుందో చెప్పలేను. వదిలి వెళ్ళాలనిపించటం లేదు. సరదాగా ఎక్కడైనా మూన్ లైట్ డిన్నర్ కెళ్దామా?"    
    "ఓ షూర్! పదండి."
    ఇద్దరూ అతని కారులో ఫైవ్ స్టార్ హోటల్ కి చేరుకుని రూఫ్ గార్డెన్ లో కూర్చున్నారు.
    అదే సమయానికి గోపాల్రావు ఇంటి దగ్గర సీత వాడిపోయిన మొహంతో కూర్చుని వుంది. అందమైన ఆమె కళ్ళు ఏ క్షణాన్నయినా వర్షించేందుకు సిద్ధంగా వున్నాయి. ఆమె చుట్టూ ఆమె స్నేహితురాండ్రు ఆమె తండ్రి కల్నల్ కనకారావు, ఆమె తల్లి ప్రభ నిలబడి వున్నారు. మధ్యలో పెద్ద కేక్ సిద్ధంగా వుంది.
    "కమాన్ బేబీ! గోపాల్ ఏదో అనుకోని ప్రాబ్లెమ్ తో ఎక్కడో హెల్డప్ అయిపోయి వుంటాడు. లేకపోతే రాకుండా ఎలా వుంటాడు? అదీ నేను ఇంట్లో వుండగా నా డాటర్ ని ఇన్సల్ట్ చేయడానికి ఎన్ని గుండెలుండాలి?" అన్నాడు కనకారావు.
    "అవున్సార్! మీ కోసమైనా తప్పకుండా వచ్చేసేవాడు" అన్నాడు భజన్ రావు.
    అతని మాటకు సీతకు వళ్ళు మండిపోయింది.
    "నువ్వు నోర్మూసుకో కాసేపు" అంది కోపంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS