Previous Page Next Page 
తృప్తి పేజి 11


    "ఇంకా రాలేదమ్మా. ఈపాటికొస్తూనే వుండాలి"చెప్పారు రామారావుగారు.
    "దాన్ని చూడాలనే వచ్చానమ్మా. ఈ మధ్య కల్లోకొచ్చింది రెండుమూడుసార్లు" అంటూ బ్యాగ్ లోంచి పొట్లం తీసి "దానికిష్టమని ఆకు పకోడి తెచ్చాను" అంది.
    ఇంతలో శరత్ వచ్చాడు. "హాయ్ అక్కా! ఒక్కదానివే ఇలా వచ్చావేమిటి? ఏమన్నా ముఖ్యమైన పనా?" అడిగాడు చనువుగా వచ్చి పక్కనే కూర్చుని.
    "మీ అందర్నీ చూడాలనిపించి వచ్చానురా. నీ సంగతేమిటి? టైపూ, షార్టుహ్యాండ్ ఎంతవరకొచ్చింది?"
    "పీకలదాకా వచ్చింది. ఇంక పరీక్షలే మిగిలాయి" నవ్వుతూ చెప్పాడు.
    ఈలోగా ప్లేట్లో పకోడీలూ, పల్లీ పాకం సర్ది పట్టుకొచ్చింది కాత్యాయిని. తల్లీతండ్రితో ఆ కబురూ, ఈ కబురూ చెప్తూ ఓ గంట కూర్చుంది కావేరి. మధ్యమధ్య గడియారం కేసి చూడసాగింది. "రోజూ ఇలాగే ఆలశ్యమవుతుందా దీనికి లేక ఇవాళేనా?" అనడిగింది తల్లిని.
    "దాదాపుగా అవుతుంది. బస్సులవీ దొరకవుట. ఏమిటో ఆడపిల్లలు కష్టపడ్తుంటే కూర్చుని తింటున్నాము" బాధగా అన్నారు రామారావుగారు.
    "అమ్మా! నీ ఒంట్లో ఎలా వుంది? ఆయాసం రావడంలేదు కదా! చలికాలం... ఎక్కువగా నీళ్ళల్లో తిరక్కు" అంటూ జాగ్రత్తలు చెప్పింది.
    "నీళ్ళల్లో తిరక్కుండా నాకు పనెలాగవుతుందే" నవ్వింది కాత్యాయని.
    "అక్కా! టైపుకి టైమయింది వెళ్ళొస్తా" తయారై బయటికొచ్చి చెప్పాడు శరత్.
    "ఆగరా, నన్నూ బస్ స్టాప్ లో దింపేద్దువుగాని, చీకటిపడిపోయింది" లేస్తూ చెప్పింది.
    "యమునని చూడకుండానే వెళ్ళిపోతావుటే" అడిగింది తల్లి.
    "దాన్నే ఆదివారం రమ్మనమ్మా. పిల్లలు కూడా పిన్ని రావట్లేదంటున్నారు"
    "అలాగయితే కాఫీ తీసుకొస్తానుండు. అదొచ్చాక ఇద్దరికీ ఇద్దామని ఊరుకున్నాను" అంటూ "ఒద్దమ్మా" అంటున్నా వినిపించుకోకుండా వంటింట్లోకి నడిచిందావిడ.
    కాఫీ తాగి యమునని ఆదివారం పంపించమని మళ్ళీ చెప్పి శరత్ తో కలసి బయల్దేరింది కావేరి. బస్ స్టాప్ కొస్తూ కూడా యమునా ఎదురుపడ్తుందేమోనని చూస్తూనే వుంది. కానీ యమున జాడలేదు.


                            *    *    *    *


    "ఏయ్! ఇవాళ శనివారం కదా, నైట్ షోకెళ్దాం. త్వరగా పనులన్నీ పూర్తిచేసుకో" బస్ స్టాప్ లో దింపేటప్పుడు చెప్పాడు సుధాకర్.
    "రేపైతే మ్యాటనీకి అత్తయ్యగారినీ, పిల్లలనీ కూడా తీసుకెళ్ళచ్చు గదండీ!
    "నాకు తెలుసు! తోకలాగా ఏదో ఒకటి అంటావనీ" కోపమభినయించాడు.
    "సరే... సరే!" నవ్వింది కావేరి. ఇంతలో బస్ రావడంతో ఎక్కేసింది. ఏ సినిమాకెళ్తే బావుంటుంది? ఆలోచిస్తూ బస్ లోంచి ప్రతిబోర్డుని చూడసాగింది. 'గజదొంగ', 'ఖూనీ', 'కిలాడీ', 'దగాకోరు', 'కర్కోటకుడు' అన్నీ ఇలాంటి పేర్లే కనిపించాయి. వాటిల్లో హీరో ఎన్ని చెడ్డపనులు చేసినా చివరికి గొప్పవాడని అందరూ మెచ్చుకోవడం, వీలైతే ప్రభుత్వం కూడా సత్కరించడం చూపిస్తారు. ఏమీ తెలియని బుల్లి మెదళ్లలో ఇవన్నీ దూరి వాళ్ళని నానా గజిబిజి చేస్తాయి. అమ్మాయిల్ని ఏడిపించడం, సరదాగా దొంగతనాలు చెయ్యడం, తాగి తందనాలాడ్తూ పాటలు పాడటం, సభ్యతలేని పదాలు మాట్లాడటం ఇవన్నీ హీరోయిజం అని చూపించే చిత్రాలు. వాళ్ళని అనుకరిస్తూ పిల్లలు "రఫ్ఫాడించేస్తాను', ఒడుపు చూసి పొడుస్తా', 'రేగిపోతే అనగ్గొట్టేస్తా' అంటూ చిన్నా పెద్దా లేకుండా వాడేస్తున్నారు. 'తప్పురా!' అంటే "మరి హీరో అంటే అందరూ చప్పట్లు కొడ్తూ చూస్తారు కదా!" అని ఎదురుప్రశ్న వేస్తారు. ఎప్పుడైనా ఆదివారం టి.వి.లో సినిమా అత్తగారూ, భర్త, పిల్లలతో కలిసి చూడాలంటేనే ఇబ్బందిగా వుంటుంది కావేరికి. పెళ్ళి సీనవగానే "ఇప్పుడు పాలగ్లాసుతో ఆ అమ్మాయి గదిలోకెళ్ళలేదేమిటి?" అని అడిగేస్తారు పిల్లలు. ఇక రేప్ సీను విషయానికొస్తే అదేమిటో అర్థంకాక వాళ్ళు చాలా కకావికలైపోతుంటారు. ఇప్పుడా అమ్మాయిని అబ్బాయి కొడ్తాడా? చంపేస్తాడా? ఏం చేస్తాడు? పాడయిపోవడం అంటే ఏమిటి? లాంటి ప్రశ్నలు మధు ఎన్నిసార్లో వేశాడు. తనేదో సర్ది చెప్తుంది. ఇంక ఎడ్వర్ టైజ్ మెంట్లు సరేసరి! స్త్రీలకు మాత్రమే పనికొచ్చేవి, గుప్తమైనవీ అయిన విషయాలను విపులంగా విప్పి చెప్తూ చూపిస్తారు. భర్తతో కలసి చూడడానికే లజ్జాకరమైన విషయాలను అన్నదమ్ములతో, తండ్రితో, మామగారు, బావగారు లాంటి బంధువులతో చివరకు ఇంటికొచ్చిన ఏ భర్త స్నేహితుడితోనో కలసి చూడాల్సొస్తుంది. ఇంక విదేశాలలో చాలా లోస్టాండర్డ్ గా తీసిన చెత్త చిత్రాలు కూడా ఈ మధ్యనొచ్చిన 'నక్షత్రం'లో చెలామణి అయిపోతున్నాయి. ప్రతివారికీ ఓ గదీ, గదికొక టీవీ పెట్టుకునే స్తోమత లేని మధ్యతరగతీ, క్రింది తరగతీ కుటుంబాలలో వీటిల్లో వచ్చే కార్యక్రమాలు కొన్ని బాధాకరమనే చెప్పుకోవచ్చు.
    నవ్వొచ్చింది కావేరికి. తనిలా మాట్లాడితే 'పాత చింతకాయపచ్చడి' అని వెక్కిరిస్తాడు సుధాకర్. తనకు మాత్రం ఆ పాత చింతకాయ పచ్చడే బాగుంటాయి. చిన్నప్పుడు సెలవులకి పెదనాన్నగారి పిల్లలూ, అత్తయ్య పిల్లలూ వాళ్ళు వచ్చినప్పుడు నాన్నగారు సినిమాలకి తీసికెళ్ళేవారు. అప్పుడు చూసిన "చక్రపాణి", "మాయాబజార్", "పెళ్ళిచేసిచూడు" లాంటి సినిమాలు ఎన్నిసార్లు చూసినా ఎవరితో చూసినా బావుంటాయి. అందరూ కలసి మళ్ళీ మళ్ళీ ఆ డైలాగ్స్ చెప్పుకుని కడుపుబ్బ నవ్వుకునేవారు. ఇప్పటి సినిమాలు అప్పటికప్పుడు నవ్వించినా, ఎవరితోనూ పంచుకోలేనివి. మరోసారి అనుకుంటే మనకే సిగ్గేసేవి.
    ఇంటికొచ్చేటప్పటికి పిల్లలు బయట ఆడ్తూ కనిపించారు. "స్కూల్ డ్రెస్ కూడా మార్చుకోలేదేమిటి? లోపలికి పదండి" అంటూ లోపలికి తీసుకొచ్చింది.
    "బాబిగాడు నా నోట్సు చింపేశాడు" ఏడుస్తూ చెప్పాడు మధు. బాబిగాడు ఆడబడుచు కొడుకు. వాడికి తొందరతనం ఎక్కువ. ఎప్పుడూ ఒక్కక్షణం ఒక్కచోట కుదురుగా వుండడు. ఏ వస్తువైనా కొత్తగా కనిపిస్తే పాడుచేసేదాకా నిద్రపట్టదు వాడికి.
    "నువ్వెందుకు జాగ్రత్తగా పెట్టుకోలేదు?" కొడుకునే కోప్పడింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS