లోపలికడుగుపెట్టగానే పెద్ద కత్తెరొకటి తీసుకొని టేబుల్ క్లాత్ కత్తిరిస్తూ కనపడింది అపర్ణ. అది ఆడబడుచు కూతురు. దాన్ని కోప్పడి కత్తెర లాక్కుని దాచి "బామ్మ ఏదర్రా?" అని అడిగింది.
"తలనొప్పిగా వుందని పడుకుంది" చెప్పింది అపర్ణ.
కాళ్ళు కడుక్కుని గదిలోకెళ్ళి "అత్తయ్యా! తలనొప్పా?" అని అడిగింది.
"ఊ" అని భారంగా మూలిగి కళ్ళు మూసుకుని పడుకుంది వర్ధనమ్మ. నుదుటిమీద చెయ్యేసి చూస్తే ఒళ్ళు కాలిపోతోంది. వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి, పిల్లలకి పాలు కలిపి అందరికీ ఇచ్చి, అత్తగారికి కాఫీ తీసుకెళ్ళి ఇచ్చింది.
"వద్దమ్మా" అని మూలిగిందావిడ. "ప్రభ స్కూల్ నించి ఇంకా రాలేదా? తను రాగానే పిల్లల్ని అప్పజెప్పి డాక్టర్ దగ్గరకెళ్దాం" అంది.
"అది స్కూల్ నించొచ్చి పక్కింటావిడతో ఎక్కడో చీరలు సగం ధరకే ఇస్తున్నారని వెళ్ళిందమ్మా" నీరసంగా చెప్పిందావిడ.
"మరి మీకప్పుడు నలతగా లేదా?" అనుమానంగా అడిగింది.
"ఉంది, అప్పటికీ రేపెళ్ళకూడదుటే అన్నాను. వింటేనా!" బాధపడిందావిడ.
గబగబా వంట పూర్తిచేసి సుధాకర్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది కావేరి. కాస్త ఆలశ్యంగానే వచ్చాడు. హుషారుగా అడిగాడు. "పనంతా అయిపోయిందా? రెడీనా!" అని.
"ముందు అత్తయ్యగార్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి" చెప్పింది.
"ఏమయిందమ్మకూ" అంటూ కంగారుగా లోపలికెళ్ళాడు. మూలుగుతూ కనిపించింది వర్ధనమ్మ. "ఇంతసేపు ఏం చేశావు? రాగానే డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళద్దూ" కోప్పడ్డాడు కావేరిని.
"పిల్లల్నెక్కడ పెట్టి వెళ్ళనూ? మీ చెల్లెలి పిల్లలసలే తుంటరివాళ్ళు" అని అనలేదు కావేరి. మౌనంగా బాబీ, అపర్ణా, మధూ, పూజాలకి అన్నం కలిపి పెట్టడంలో నిమగ్నమయింది. తల్లిని డాక్టరుకి చూపించి మందులు కొని ఇంటికొచ్చేటప్పటికి ఎనిమిదిన్నరయింది. ప్రభా ఆమె భర్త ఫల్గుణరావు కూడా వచ్చారు. అందరికీ కంచాలు పెట్టింది కావేరి.
"వద్దండీ వెళ్ళిపోతాము" మొహమాటపడ్డాడు ఫల్గుణరావు.
"ఇంట్లో నేనేం చెయ్యలేదీపూట, ఇక్కడ మీరు మొహమాటపడ్తే పస్తే" చెప్పేసింది ప్రభ.
"ఫర్వాలేదు...వంట చేసేశానుగా" చెప్పింది కావేరి. అత్తగారికి బ్రెడ్ కాల్చి పాలతో పెట్టింది. ఆవిడో ముక్క కొరికి ఇక సహించక అలాగే పడుకుంది. "నేనీపూట అత్తయ్యగారి పక్కన పడుకుంటాను. లేవలేకపోతే పిలవడానికి మొహమాటపడ్తారు" అని చెప్పింది. పిల్లల్ని టి.వి. పెట్టనివ్వలేదు. రొదగా ఉంటుందని.
మర్నాడు ఆదివారం. ఆదివారమనగానే కావేరికి మనసులో పెద్ద బెంగ. ఆరోజు తన చీరలన్నీ ఉతికి, గంజిపెట్టడమనే డ్యూటీ ఉంటుంది. ఇంక మిగతా రోజుల్లో ఎలాగూ కుదరదని ఇల్లు సర్దడం సరేసరి! పులుసు పొడీ, కూరపొడీ, చారుపొడీ, కందిపొడీ అని అవీ ఇవీ చేసి పెట్టుకుంటేనేగానీ మిగతా రోజుల్లో ఇబ్బంది లేకుండా ఉండదు. ఇక ఆదివారమని ఎవరో ఒకరు ఆయన స్నేహితులో, అత్తగారివైపు బంధువులో లేక తనవైపువారో చూడటానికి వస్తారు. "మిగతారోజుల్లో మీరు దొరకరని ఇవేళ వచ్చాము అంటారు కొందరు" ఏదో ఉద్ధరించేసినట్లు. వాళ్ళవైపు నించి వాళ్ళొక్కరోజే వచ్చారు కాబట్టి ఏమీ అనిపించదు. కానే ఒక్కోళ్ళు ప్రతి ఆదివారం చొప్పున వస్తుంటే ఉద్యోగస్తులైన భార్యాభర్తలకి ఎంత ఇబ్బందో ఆలోచించరు! మగవాళ్ళు ఎలాగోలా తప్పించుకుని బయటపడ్తారు. కానీ ఆడవాళ్ళకి వంటింటి ఖైదు తప్పదు. సుధాకర్ ఆదివారమోస్తుందీ అంటే రకరకాల ప్లాన్లేస్తాడు. "మధుకి చెస్ నేర్పిస్తాను ఆదివారం" అనో లేక "పిల్లల్ని ప్లానిటోరియం తీసుకెళ్తాను' 'వీడు మేథ్స్ లో వీక్, వీడితో ఓ రెండుగంటలు కూర్చుని వీడికి లెక్కలంటే ఇంట్రెస్ట్ పుట్టిస్తాను.' అనో చెప్తుంటాడు. కానీ అలా అనుకున్నదనుకున్నట్టు జరిగితే మధ్యతరగతి కుటుంబాలన్నీ బాగుపడిపోవూ? కావేరి "అత్తయ్యా! రేపు ఆదివారం పిల్లలకి కాస్త కారప్పూస చేస్తాను. నాలుగురోజులు తింటారు" అంటే వర్ధనమ్మగారు సాయంత్రం వచ్చేటప్పటికి చేసి తయారుగా వుంచుతారు. "ఎందుకత్తయ్యా?' అంటే "ఆదివారం అనేది అలసట తీర్చుకోవడానికి గానీ అవిధిపడడానికి కాదే" అంటారు. "మా కోడలు రోజంతా నిలబడి పనిచేస్తుందా మందుల కంపెనీలో. మళ్ళీ ఇంటికొచ్చాక ఒక్కపూట విసుక్కోదు" అంటూ అందరితో గర్వంగా చెప్పుకుంటుంది ఆవిడ.
ఉదయం పిల్లలకి తలంటుపోసి, తనూ పోసుకుని దేవుడికి దీపం పెట్టేటప్పటికి పాదయిపోతుంది కావేరికి. వర్ధనమ్మగారికి జ్వరం కాస్త తగ్గింది కానీ నీరసంగా వుంది. ప్రొద్దుటే ఇడ్లీ వేసి అత్తగారికి బలవంతానా రెండు తినిపించి మందేసింది.
వంట చేస్తుండగా ప్రభ వచ్చింది. "వదిన! నీకిష్టమని గోంగూర తెచ్చాను. పచ్చడి చేస్తే నాక్కూడా పంపించు" అంటూ గోంగూర అక్కడ పెట్టి "టిఫినేం చేశావు, నేనేం చెయ్యలేదు" అంది. మళ్ళీ నాలుగు ఇడ్లీలు వేసింది కావేరి.
ఇంతలో "పిన్నొచ్చింది... పిన్నొచ్చింది" అంటూ కేరింతలు కొడ్తూ వచ్చారు పిల్లలు. యమునని చూడగానే కావేరికి కూడా చాలా సంతోషమేసింది. "సారీ అక్కా! నువ్వొచ్చినప్పుడు నేను లేను..." అంటుంటే "ఫర్వాలేదులే రా కూర్చో" అంటూ ఆప్యాయత తొణికిసలాడ్తుండగా ఆహ్వానించింది.
"పిన్నీ ఏం తెచ్చావు?" అంటూ పూజ అడుగుతుంటే "తప్పు. అలా అడగొచ్చా?" అని కోప్పడితే "అయినవాళ్ళదగ్గరేమిటే బాబు ఈ ఆంక్షలు?" అంటూ అడ్డుపడింది యమున. పిల్లలకి క్యాడ్ బరీస్ లూ, బిస్కట్లూ ఇచ్చి పంపించి, అక్కగారి చేతికో సంచీ ఇచ్చి "అమ్మ చెగోడీలు, బిళ్ళకాజాలు పంపింది" అంది.
"మీ అమ్మగారే నయం! ఏదో ఒకటి పంపుతుంటారు" అంది ప్రభ వెంటనే. కావేరి వాటిని సగంచేసి డబ్బాలో పోసి "పిల్లలకి పెట్టు" అని ప్రభకు అందించింది.
"మరదలు మాణిక్యమ్మొచ్చినట్లుంది" అంటూ బయటినుంచి కూరల సంచితో వచ్చాడు సుధాకర్.
"మరే! బావగారు మరీ బంగారప్పూసైపోయారు" అంటూ నవ్వింది యమున.
"చూశావా! అందర్నీ నల్లపూసైపోయారు అంటారు కానీ నన్ను చూస్తే ఆ మాట ఎవరికీ అనబుద్ధికాదు" అన్నాడు గర్వంగా.
సుధాకర్ కావేరి కంటే రంగు ఎక్కువ. అందుకే ఎప్పుడూ ఏడిపిస్తుంటాడు. "నల్లపూసైపోయారు అంటే మళ్ళీ మీ రంగు గురించి ఉపన్యాసం వినాల్సొస్తుందని అలా అన్నాను. అయినా తప్పలేదు నాకు" అంది యమున.
