గుండె, ఊపిరితిత్తులూ ప్రాణం పోసుకొని, తేరుకొంటున్నట్లు మానిటర్ చెపుతోంది!
"సార్! డాక్టర్ రఘు కేసు పంపించారు. మీరు చూడాలట!"
అసిస్టెంట్ కిరణ్ మాట విని.
"వస్తున్నాను!" అన్నాడు బి.పి. చూస్తూ.
చలపతిరావు భార్యాపిల్లలూ రికవరీ రూమ్ బయట గోడవారగా వేసున్న కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. అతని భార్యకి నిన్నటినుండి కంటతడి ఆరలేదు. తన బ్రతుకునెవరో లాక్కుపోతున్నంత దీవంగా ఆమె ఏడుస్తోంది. ఎవ్వరి ఓదార్పులూ ఆమె భయానికీ, దుఃఖానికీ ఆనకట్ట వేయలేకపోతున్నాయి!
క్రిములు చేరుతాయన్న కారణంగా రికవరీ రూమ్ లోకి డాక్టర్లనీ, సిబ్బందిని తప్ప మరెవర్నీ రానివ్వరు. ఎప్పటికప్పుడు రోగి పరిస్థితి చెబుతుంటారే తప్ప లోపలికి వెళ్ళి చూడనివ్వరు.
అంచేత, ఆపరేషన్ తర్వాత భర్తనింతవరకూ ఆమె చూసుకోలేదు. ఆయనెలా ఉన్నాడో తెలీదు. ఫరవాలేదని డాక్టర్లు చెపుతున్నారని పిల్లలూ స్నేహితులూ ఓదారుస్తున్నా - వాళ్ళు నిజమే చెబుతున్నారన్న నమ్మకం కలగలేదు. ఆయన్ని తిరిగి సజీవంగా చూడగలుగుతానా అన్న భయం పదేపదే పీడిస్తోంది.
రికవరీ రూమ్ లోంచి డాక్టరుగానీ, నర్సుగానీ చివరికి వార్డుబాయ్ బయటికొస్తున్నా.... తన భర్త పోయాడన్న భయంకరమైన వార్త చెప్పడానికే వస్తున్నట్లు కంపించిపోతోంది!
అకస్మాత్తుగా భూకంపం వచ్చి ఇల్లు కూలిపోయినట్లూ, తామంతా తప్పించుకొని భర్త ఒక్కడూ ఆ శిధిలాల్లో చిక్కుకుపోయి, బయటకి తీయడానికి కూడా వీలుపడక ఎలా ఉన్నాడో - ఏమైపోతున్నాడో కూడా తెలీని స్థితిలో ఉన్నట్లూ తోచి బెదిరిపోతోంది ఆమె మనసు!
భర్తనే తలచుకుంటూ కళ్ళొత్తుకొంటున్న ఆమె భుజమ్మీద ఎవరిదో చెయ్యి పడడంతో తిరిగి చూసింది.
ఎప్పుడొచ్చాడో తను గమనించలేదు. అరవైఏళ్ళ వృద్ధుడు తన ప్రక్క కుర్చీలో కూర్చుని ఉన్నాడు. నారలా వ్రేలాడుతున్న సగం నెరిసిన గడ్డం, తలమీద టోపీ అతను ముస్లిం అని చెబుతున్నాయి.
"ఏడవకు బేఠీ! అల్లా అంతా మంచే చేస్తాడు. నీ భర్త క్షేమంగా తిరిగొస్తాడు." కళ్ళనిండా కారుణ్యం నింపుకొని ఆమెనే చూస్తూ అన్నాడు.
బాధనొక్కక్షణం మర్చిపోయి అతనెవరా అని అలాగే చూసింది.
ఎప్పుడూ చూసిన గుర్తుకూడా రాలేదు. అయినా, అతని చూపు, మాట ఎంతో దగ్గరివాడిలా అనిపించింది. ఆత్మీయుణ్ణి చూసినట్లూ కన్న తండ్రి అండగా నిలబడినట్లూ దుఃఖం బయటికి పొర్లింది.
"మావా....రు.... మా.... వారు.... చాలా సీరియస్!" దుఃఖపు పొరల్లోంచి చెప్పింది. ఏడ్చి ఏడ్చి పీక్కుపోయిన ఆమె మొహంలోకే చూస్తూ.
"తెలుసమ్మా! మీ అబ్బాయి చెప్పాడు. చాలాసేపటిగా నిన్ను గమనిస్తూనే ఉన్నాను. గుండెని దిటవుచేసుకో తల్లీ....! అల్లా అంతా చూస్తాడు" అన్నాడు.
దుఃఖపు ఉద్వేగం తగ్గిన తర్వాత, "మీరు-?" అంది సందేహంగా.
"నా కొడుకు ఆరు నెలల క్రితం రైలు ప్రమాదంలో పోయాడమ్మా. అప్పటికే నా కోడలు గర్భవతి. వారం రోజుల క్రితం మగపిల్లవాడిని ప్రసవించింది. నా కొడుకు మళ్ళీ పుట్టాడని గుండెదిటవు చేసికొనేలోపే, వాడు గుండెజబ్బుతో పుట్టాడన్న నిజం మమ్మల్ని కృంగదీసింది బేఠీ! బాబుని ఇక్కడే చూపించాము. మరో డాక్టరు చూడాలట!"
అప్పుడతని మొహంలోకి పరిశీలనగా చూసింది. వయోభారంతో పాటు దుఃఖభారం మనిషినెంత కృంగదీస్తుందో అప్పుడు తెలిసింది.
గంభీరంగా వుండడానికి ప్రయత్నం చేస్తూ -
"మీరు.... మీరు.... నాకు ధైర్యం చెబుతున్నారా బాబాయ్ గారూ?" అప్రయత్నంగా అనేసింది. ఆమె గొంతులో వ్యక్తమైన ఆత్మీయతకి ఆయన చలించిపోయాడు.
"కష్టాన్ని అనుభవించిన మనిషినమ్మా! నీ కష్టం ఎంతటిదో నా మనసుకి తెలుసు బేఠీ!" అన్నాడు. అప్పటికే అతని కళ్ళు చెమ్మగిల్లాయి.
"బాబుకి తగ్గిపోతుంది. బాధపడకండి!" ఓదారుస్తున్నట్లు అంది. దైన్యం దైన్యానికి ధైర్యమిస్తున్నట్లు ఇప్పుడామె గొంతులో అయిదునిమిషాల క్రితం ఉన్న బేలతనం లేదు.
నీ భర్త నా మనవడూ బాగుంటారు! ధైర్యం ఉన్నచోట అల్లా వుంటాడు. ధైర్యంగా వుండు బేఠీ!" అన్నాడు.
అప్పుడే శరత్ చంద్ర బృందం ఆయన మనవడి గదివైపు వెళుతుండటం చూసి, "మళ్ళీ కలుస్తాను బేఠీ!" అంటూ లేచాడు.
"మీ పేరు....?" వెళ్ళిపోతున్నారా.... అన్నంత దిగులుగా అడిగింది.
"ఖాదర్!" అంత ఆత్మీయంగానూ చెప్పి, తలమీద చేత్తో నిమిరి వెళ్ళిపోయాడు.
"ఖాదర్ బాబాయ్! నీ మనవడు బాగుండాలి!" అనుకొంటూ కొద్దిసేపు తన బాధని మర్చిపోయి అతనికోసం ప్రార్ధన చేసింది.
కష్టం మనుషుల్ని క్షణాల్లో ఎంత ఆత్మీయుల్ని చేస్తుందో నమ్మకం కలగదేమో గానీ కృత్రమత్వంతో బ్రతుకుతున్న మనుషుల్లో మనసులింకా చచ్చిపోలేదని ఇలాంటి సమయాల్లోనే రుజువవుతుంటుంది. దుఃఖానికి మానవ సంబంధానికీ ఉన్న అవినాభావ సంబంధం అది!
* * * *
బాబుమి పరీక్ష చేస్తూనే భృకుటి ముడిపడింది.
"టెట్రాలజీ ఆఫ్ ఫాలూ!" అసిస్టెంట్స్ నుద్దేశించి పైకి అన్నాడు.
గుండె గదుల మధ్య పెద్దరంధ్రం - గుండె నుండీ రక్తం ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే మార్గం మూడువంతులు మూసుకుపోయి ఉంది. దానివల్ల ఊపిరితిత్తులకి కావాల్సినంత రక్తప్రసరణ లేదు.
గుండెనిండా మిగతా శరీర భాగానికి రక్తాన్ని పంప్ చేసే అయోర్టా సరైన స్థితిలో లేదు. గుండెలోకి కుడివైపు గదులు రెండూ ఉండవలసిన పరిమాణంలో లేవు.
"పసివాడి నిమ్మకాయంత హృదయంలో ఎన్ని లోపాలు?? ఇదే జబ్బుతో కదూ తన చెల్లెలుపోయింది!?" నిట్టూరుస్తూ అనుకున్నాడు.
అయితే, ఇవన్నీ సరిచేసి బాబుని బ్రతికించగలిగితే తర్వాత మామూలు జీవితాన్ని గడపగలడన్న నిజాన్ని అతడు విస్మరించలేదు.
బాబు ఏడుపు అతన్ని ఆలోచనలనుండీ బయటికి తెచ్చింది. చూస్తుండగానే మామూలు ఏడుపునుండీ గుక్క తిప్పుకకుండా ఏడవడం మొదలెట్టాడు. ఏడుపు పెరుగుతున్నకొద్దీ బాబు శరీరం గులాబీ రంగు నుండి క్రమంగా నీలంరంగులోకి మారిపోతోంది. బాబు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు.
