Previous Page Next Page 
డెత్ సెంటెన్స్ పేజి 12


    బాబుకి ఏడవటానికి కావాల్సినంత శక్తినిచ్చే ఆక్సిజన్ అందడంలేదు! ఆ పని చేయాల్సిన గుండెకీ, ఊపిరితిత్తులకీ మధ్య సమన్వయం చెడిపోయింది.

 

    తనకూ ఊపిరాడనట్లు ఫీలయ్యాడు శరత్ చంద్ర. గతంలోని చేదు జ్ఞాపకం తాలూకు 'గాఢత' మనసుని మెలిపెట్టింది.

 

    ఒక్క ఉదుటున బాబుని చేతుల్లోకి తీసుకుని ఆక్సిజన్ అందించడం కోసం రికవరీ రూమ్ లోకి పరిగెట్టాడు.

 

    మరో పదిహేను నిమిషాల తర్వాత బాబు కాస్త కోలుకున్నాడు. తర్వాత, శరత్ చంద్ర బయటికివచ్చి ఖాదర్ తో మాట్లాడిన విషయం వింటూనే.... రవళి చేతిలో స్టెత్ జారి క్రిందపడింది!


                                                 *    *    *    *


    డాక్టర్ భగవంతం కార్డియో థొరాసిక్ సర్జరీ డిపార్ట్ మెంట్ లో మరో ప్రొఫెసర్! అతను హెడ్డాఫ్ ద డిపార్ట్ మెంట్ కూడా.

 

    సీనియారిటీ ప్రకారం హెడ్ కావాల్సినవాడు శరత్ చంద్ర.

 

    డిపార్ట్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ పనులతో ఏకాగ్రత తగ్గుతుందేమోననీ దానివలన తను ప్రాణప్రదమైన హార్ట్ సర్జరీకి న్యాయం చేయనేమోననీ అనుమానంతో ప్రమోషన్ వదులుకున్నాడు శరత్ చంద్ర!

 

    ఇప్పుడతని స్థానంలో భగవంతం హెడ్ అయ్యాడు!

 

    ప్రమోషన్ వదులుకున్న శరత్ చంద్రని, కొలీగ్సంతా ఓ పిచ్చివాణ్ణి చూసినట్లు చూశారు. వాళ్లనేమాత్రం పట్టించుకోలేదు శరత్!

 

    అనుకోని విధంగా డిపార్టుమెంట్ కి హెడ్ అవడం అతనికెంతో సంతోషాన్ని కలిగించినా, సర్జరీ విషయంలోనూ, ప్రమాదకరమైన కేసులని ఛాలెంజ్ గా తీసుకోవడంలోనూ శరత్ చంద్ర ఎంతో ముందడటం అతన్నెంతో క్షోభకి గురి చేస్తుంటుంది.

 

    తన గదిలో ఏదో ఫైల్ తిరగేస్తూ కూర్చుని ఉన్నాడు భగవంతం.

 

    "సార్!" అంటూ ఎమ్.సి.హెచ్ స్టూడెంట్ లోపలికొచ్చాడు. అతనిపేరు శంకర్. ప్రతి ప్రొఫెసర్ కి ఇద్దరు అసిస్టెంట్స్, కొద్దిమంది ఎమ్.సి.హెచ్ స్టూడెంట్స్ వుంటారు. శంకర్ ఎమ్.బి.బి.ఎస్, ఎమ్.ఎస్ పూర్తిచేసి ఆ సంవత్సరమే ఎమ్ సి హెచ్ లో చేరాడు.

 

    అతను కొంత అమాయకుడు. సబ్జక్టుకన్నా బయటి విషయాలంటే కుతూహలం ఎక్కువ. విషయాలని హెడ్డుకి చెప్పడంవల్ల అతనికి చాలా దగ్గరైపోవచ్చని కూడా అనుకొంటాడు.

 

    "సార్! టెట్రాలజీ ఆఫ్ ఫాలూ కేసు శరత్ చంద్ర సార్ సర్జరీ చేస్తానన్నారట సార్!" లోపలికొస్తూనే చెప్పాడు.

 

    "ఆహా.....!" అన్నాడు భగవంతం, పెద్ద విశేషం కానట్లు.

 

    "రోజుల పాపకి సార్!" మళ్ళీ అన్నాడు శంకర్, 'రోజుల' అన్న దగ్గర వత్తి పలుకుతూ.

 

    పైకి లేవబోయిన కనుబొమ్మల్ని బలవంతంగా ఆపి,

 

    "ఆపరేషన్ చేసి పిల్లని బ్రతికిస్తాడటనా?" అన్నాడు.

 

    ప్రశాంతంగానే అన్నట్లున్నా ఆ మాటలోని ఎగతాళిని అర్ధం చేసుకున్న శంకర్ మాట్లాడలేదు. అతనికి శరత్ చంద్రంటే వ్యతిరేకతేం లేదు.

 

    "కేసు దొరికితే చాలు, కొయ్యాలనుకొంటాడు 'కత్తిపిచ్చి' మానవుడు" అని ఓ క్షణం ఆగి -

 

    "పిల్లాడు బ్రతికితే పార్టీ ఇస్తానయ్యా!" అంటూ నవ్వాడు ఆ నవ్వులో డిస్ కంఫర్ట్ ని దాచుకోలేకపోతున్నాడు.

 

    నవ్వలేక నవ్వలేక అతనితో శృతికలిపిన శంకర్ ని వార్డులో పేషంట్ ని చూడమని పంపించేశాడు.

 

    ఏదో అశాంతి అతన్నక్కడ నిలబడనీయడం లేదు.

 

    'ఏదో చెయ్యాలి!! పసిపిల్లలకి కూడా సర్జరీ చేయడం మొదలెడుతున్నాడా? ఒకసారి మొదలుపెడితే ఇహ ఆగుతాడా?? ఇతన్ని ఇక్కడితోనే ఆపెయ్యాలి! ఒక్కటి.... ఒక్కటి సక్సెస్ అయితే చాలదూ పేరు రావడానికి!?'

 

    ఆలోచించిన కొద్దీ అశాంతి ఎక్కువయిపోతోంది! అయిదు నిమిషాలు ఆలోచించి అక్కడనుండీ కదిలాడు!


                                             *    *    *    *


    ఆ రోజు ఆపరేషన్స్ పూర్తిచేసి, వార్డుల్లోకి రౌండ్స్ కి వెళ్ళబోతున్నాడు శరత్ చంద్ర.

 

    "సార్! మిమ్మల్ని డైరెక్టర్ గారు రమ్మని కబురు చేశారు!" మెసేజ్ అందించింది సెక్రటరీ.

 

    "అర్జంటా?"

 

    "అవున్సార్!"


                                               *    *    *    *


    హాస్పిటల్ డైరెక్టర్ పరమేశ్వరం ఛాంబర్ లో కూర్చుని శరత్ చంద్ర కోసం ఎదురుచూస్తున్నాడు.

 

    డాక్టర్ భగవంతం చెప్పిన విషయం అతన్ని చికాకుపరుస్తోంది! ఏమిటీ శరత్ చంద్ర! పసిపిల్లల్ని పట్టుకొని ఆపరేషన్ చేస్తానంటాడు. ఇప్పటికే అతను అతి ప్రమాదకరమయిన కేసులని ఆపరేట్ చేస్తూనే వున్నాడు. వాటిలో కొన్ని పోయినా, కొన్ని బ్రతికి హాస్పిటల్ ప్రతిష్టని పెంచాయి!

 

    పోయిన కొద్ది కేసుల గురించి కూడా ఇతర హాస్పిటల్స్ వాళ్ళు నోరుమూసుకు కూర్చోడం లేదు.

 

    తమ హాస్పిటల్ కి పెరుగుతున్న ప్రతిష్ట వాళ్ళందరికీ కంటకింపుగా ఉంది, ఈ హాస్పిటల్ కొచ్చే గుండెరోగుల సంఖ్య చూసి కాంపిటేషన్ తట్టుకోలేమోనని ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను.

 

    ఇప్పటికే, పోయిన ఏ కేసునీ వాళ్ళు వదలడం లేదు. పేషంటు పేరు, అడ్రసులతో సహా సేకరించి హాస్పిటల్ నిర్లక్ష్యంవల్లే చనిపోయాడని ప్రచారం చేస్తున్నారు.

 

    ఈ పరిస్థితుల్లో శరత్ చంద్ర పసిపిల్లల గుండెలకి ఆపరేషన్ చేస్తానంటాడేమిటి??

 

    'గుండె' మనిషికి ఆయువు పట్టే కాదు. అతి సున్నితం కూడా! కాలికో చేతికో ఆపరేషన్ చేసి ఫెయిలయితే మళ్ళీ చేసుకోవచ్చు! లేదా, కాలోచెయ్యో లేకుండా పోతుంది! అంతే!

 

    కానీ, ఇది కాలోచెయ్యో కాదే! గుండె! ఏ చిన్న ఒడిదుడుకు జరిగినా మళ్ళీ చూసుకోడానికి మనిషే మిగలడే!!

 

    ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పెద్దవాళ్ళే లోపలికెళ్ళాక ఆపరేషన్ పూర్తయి బయటికి వచ్చేవరకూ నమ్మకం ఉండదు!

 

    ఇహ పసిపిల్లలు బ్రతకడం ఎంతశాతమో తెలీడంలేదా శరత్ చంద్రకి?? ఇతనికి పిచ్చిగానీ పట్టలేదు కదూ!? అనుకొంటూ చికాకు పడిపోతుండగా.... స్ప్రింగ్ డోర్ తెరుచుకుని విష్ చేస్తూ లోపలికొచ్చాడు శరత్ చంద్ర.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS