"ఎక్కింది నీకు" అంతే బింకంగా అన్నాడు సూరి. "ఇప్పుడు నాకు నీ కారు కీస్ ఎలాగూ అవసరంలేదు కాబట్టి, మిగిలిన ఆ కిస్ సంగతి ఆలోచిద్దాం...
"సూరీ...." శౌరి చేయి గాలిలోకి లేచింది.
ఆదిత్య అడ్డం పడ్డాడు. "శౌరీ....ప్లీజ్..." శౌరి చేతిని పట్టుకుని అభ్యర్ధనగా చూశాడు ఆదిత్య.
సూరి ఆగలేదు. వేగంగా ప్రబంధని సమీపించాడు. "నువ్వేమంటావ్ మిస్ ప్రబంధా? ముఖ్యమంత్రి కూతురుగా నువ్వు రాజసాన్ని ప్రదర్శిస్తావా? లేక మాట నిలబెట్టుకునే యువతిగా ఆదిత్యకి ముద్దు పెడతావా?"
ఏ యువతికీ ఎదురుకాకూడని పరీక్ష అది! అది అహమో లేక ఇందాకటి ఓటమి మూలంగా కలిగిన కలవరపాటో, అదీ కానినాడు ఇంతమంది విద్యార్ధుల ముందు ఇప్పుడెదుర్కుంటున్న స్థితికి బిడియమో- ఆమె కళ్ళలో నీళ్ళు గిర్రున తిరుగుతున్నాయి.
"మన స్టూడెంట్సంతా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. డిసైడ్ యువర్ సెల్ఫ్."
"ఓకే..." ప్రబంధ స్థిరంగా అంది తల వంచుకునే "నేను మాట తప్పను. ఐయామ్ ప్రిపేర్డ్ ఫరిట్."
తలపైకెత్తి చూసింది నెమ్మదిగా.
ఆదిత్య లేడు.
అటూ ఇటూ దిక్కులు చూశారంతా.
ఆదిత్య అదృశ్యమైపోయాడు.
శృతిమించిన చైతన్యంతో వందలకొద్దీ విద్యార్ధులు ఉత్తేజంగా ఎదురుచూస్తున్న సన్నివేశంలో తను పాత్రకాలేక, పురివిప్పి ఆడే ఓ అహంకారానికి ఉరిశిక్ష వేసినట్టు వున్నట్టుండి అంతర్దానమైపోయాడు.
"నిన్ను గెలిచిన ఆదిత్య తన సంస్కారంతో కూడా నీ అహంకారంపైన విజయం సాధించాడు ప్రబంధా! గుడ్ లక్!"
ఇది గాయపరిచింది శౌరిని మాత్రమే కాదు- ప్రబంధని కూడా.
అన్ని వందలమంది విద్యార్దులలో ప్రబంధని చూసి జాలిగా కలవర పడింది ఒకే ఒక్క వ్యక్తి.
ఆమె ప్రణయ అదే యూనివర్శిటీలో ఎకనమిక్స్ పీజీ చేస్తున్న ఓ విద్యార్ధిని.
"ఏమిటలా పారిపోయావ్?"
ఇంట్లో అడుగుపెడుతూనే ఆదిత్య నడిగాడు సూరి.
గెలిచిన ఉత్సాహంలో సూరి బాగా తాగాడు. తాగి సరాసరి ఆదిత్య దగ్గరికి వచ్చాడు.
లోపల అనిత వంట చేస్తూంది.
లక్ష్మమ్మ అప్పుడప్పుడూ దగ్గుతున్న చప్పుడు అస్పష్టంగా బయటి గదిలోకి వినిపిస్తూంది.
"ఇట్సే మార్వలస్ శౌరి యూనివర్శిటీలో ఇక తలెత్తుకోలేడు." సూరిలో పట్టలేని ఆనందం.
"యూ హావ్ బికమ్ హీరో ఆఫ్ అవర్ యూనివర్శిటీ!"
ఆదిత్యలో చలనంలేదు.
తల వంచుకుని నేలకేసి చూస్తుంటే ఒళ్ళు మండిపోయిందేమో "గర్వంగా తలెత్తుకోలేక ఆ నేల చూపులేమిటి?"
"సూరీ!" నిర్లిప్తంగా అన్నాడు ఆదిత్య. "నీ గెలుపుని నీవు కోరుకోవడం తప్పుకాదు. ఆ గెలుపు మరొకరి అభిమానాన్ని దెబ్బకొట్టేదిగా మార్చుకోవాలనుకోవడం దారుణం!"
ఏ విషయం గురించి ఆదిత్య అంతగా కలతచెందుతున్నదీ అర్ధమై పోయింది.
అంతర్ముఖుడిలా బ్రతకడమే అలవాటైన ఆదిత్య తన విజయానికి పొంగిపోలేదు కాని సూరి తనకి ముందే చెప్పని షరతు గురించి చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నాడు.
"నీ ఆలోచనల్ని నేను అర్ధం చేసుకుంటున్నాను ఆదిత్యా! వయసులోవున్న ఒక గొప్పింటి అమ్మాయిని అలా కించపరచడం నా అభిమతం కాదు. అసలు నా ఆలోచన అది కానే కాదు. బహుశా అంతదాకా వస్తే నేనే అద్దం పడేవాడినేమో కూడా."
"అసలు ఆ స్థితిదాకా డ్రైవ్ చేయాలనుకోవడం కూడా నేరమే."
"కాదనను కాని, అక్కడ నేను కోరింది ఆమె అహాన్ని చల్లార్చడం."
"దానివలన చల్లారదు. ఏ ఆడపిల్లయినా అక్కడే అతిగా గాయపడుతుంది."
"నీ అనాలిసిస్ కి నా జోహార్లు కాని ఒక్క విషయం గుర్తుంచుకో. పందేనికి ముందుగా సిద్దపడింది తను. నేను కాదు. నీకు ముద్దిమ్మని ముందు అడిగింది నేను కాదు. నేను కారు డ్రైవర్ ని కావాలని ఆమె కండిషన్ పెట్టాకనే ఇలాంటి షరతుకి నేను సిద్దపడింది." ఆదిత్యని ఆప్యాయంగా భుజంమీద తడుతూ అన్నాడు. "మనం గెలిచాం కాబట్టి, గెలిచాక ఆమెను నలుగురిముందూ నిలదీశాను కాబట్టి నువ్వలా రియాక్ట్ అవుతున్నావు. ఒకవేళ మనం ఓడితే శౌరి ఎంత రాద్దాంతం చేసేదీ నువ్వూహించలేవు. వెల్! ఇదంతా జరిగాక నేను సంతృప్తి పడుతున్నది ఒక్కదానికే. ఒక సమస్య నన్ను కంగారుపెట్టినా కాకతాళీయంగా నువ్వు ప్రొజెక్టయ్యావు."
"ఐ డోంట్ థింక్ సో..." తన పనేదో తను చేసుకుపోయే ఆదిత్యకిదంతా ఆనందంగా లేదు. "దీనివలన మనం కొందరికి శత్రువులమయ్యాం."
"నాన్సెన్స్!" ఖండించాడు సూరి. "ఒకటి రెండు రోజుల్లో శౌరి కూడా సర్దుకుపోతాడు చూస్తుండు."
"సర్దుకుపోవాలి అంటే ప్రబంధని పర్సనల్ గా మీటవ్వాలి సూరీ. అహంకారి అయితేనేం? చాలా తెలివిగల అమ్మాయి మాగ్నానిమస్."
"ఐ కంగ్రాచ్యులేట్యూ!"
"దేనికి?"
"జీవితంలో తొలిసారి ఓ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నందుకు."
* * *
ఇక్కడ చర్చ చాలా యధాలాపంగా జరిగినా, ఆ మరుసటిరోజు ఈ వార్త ఓ దినపత్రికలో ప్రచురితం కావడంతో అది ముఖ్యమంత్రి వాసుదేవరావు దృష్టిని ఆకర్షించింది.
