Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 10


    
    "స్త్రీ జాతిపై సానుభూతి వర్షించనక్కరలేదు. ప్రశ్న క్లియర్ గా అడగండి" ఉక్రోషంగా అంది ప్రబంధ.
    
    "ది టాలెస్ట్ లేడీ ఇన్ ది వరల్డ్."
    
    "చైనా దేశానికి చెందిన జెంగ్ జియాలియాన్ ఆమె పెరిగిన ఎత్తు ఎనిమిది అడుగుల ఒక అంగుళం."
    
    "ఫైన్..." వెంటనే అడిగాడు.
    
    "మిరపకాయలు ఎందుకంత మంట పుట్టిస్తాయి?"
    
    "అందులో మంట పుట్టించే కేప్సికిన్ అనే ఓ కెమికల్ వుండబట్టి."
    
    ప్రబంధ మేధను అప్పటికిగాని అంచనావేయలేని ఆదిత్య వాచ్ కేసి చూశాడు.
    
    ఇక్కడ టెస్ట్ లో విజయం నిర్ణీతమయ్యేది అరగంట వ్యవధిలో ఎన్ని ప్రశ్నలకు జవాబు చెప్పగలిగారూ అన్న విషయంపైన కాదు. ఎన్ని ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోయారూ అన్న అంశంపైన.
    
    ఇంకా విజయంవేపే ప్రయాణిస్తున్న ప్రబంధని అరనిమిషంపాటు తదేకంగా చూస్తూ కొన్ని ప్రశ్నల్ని మననం చేసుకున్నాడు ఆదిత్య.
    
    "ప్రపంచంలోని ఓ మహానగరంలో ఓ రాత్రి పూర్తిగా విద్యుచ్చక్తి పోవడం మూలంగా తరువాత తొమ్మిది నెలలకి జననాల సమాఖ్య పెరిగిందన్నది ఓ మోడరన్ లెజెండ్... ఆ నగరం ఏది?"
    
    "న్యూయార్క్!" టక్కున చెప్పింది. "అలా ఓరాత్రి విద్యుచ్చక్తి పోయింది. 1965 నవంబరు తొమ్మిదో తేదీన' కాని తొమ్మిదినెలల తరువాత బర్త్ రేట్ పెరిగిందన్న విషయాన్ని డెమోగ్రాఫర్స్ తోసిపుచ్చారు."
    
    "హుర్రే" శౌరి ఉద్విగ్నంగా అరిచాడు. నేపధ్యంలా చప్పట్లు వినిపించాయి.
    
    సూరి సన్నగా కంపిస్తున్నాడు.
    
    మిగిలింది తొమ్మిదిన్నర నిముషాలు.
    
    "జంతు ప్రపంచంలో ఒక జంతువు తండ్రి స్థానంలో వుండి పిల్లలకి జన్మనిస్తుంది."
    
    "ఉలిక్కిపడింది ప్రబంధ తొలిసారి. "వ్వాట్?"
    
    "ఎస్... తల్లి జంతువుకాదు. తండ్రే పిల్లల్ని కంటుంది. ఆ జంతువు పేరు..."
    
    ఒకటి... రెండు... మూడు... నలభై సెకండ్లు గడిచాయి.
    
    "తెలీదు."
    
    "సముద్రపు గుర్రం."
    
    "రైట్!" ఓ ప్రొఫెసర్ వెంటనే అన్నాడు- "ప్రొసీడ్!"
    
    ఉన్నట్టుండి అక్కడ వాతావరణం వేడెక్కిపోయింది.
    
    ఇంతవరకూ ఇద్దరు ప్రత్యర్ధులూ సమానంగానే వున్నారు.
    
    "ప్రపంచంలో ఇంతవరకూ ఉన్న కాస్టిలీయెస్ట్ డ్రెస్?"
    
    "1977 పారిస్ లో ఓ ఫ్యాషన్ షోలో ప్రదర్శితమైంది. దాని ఖరీదు మిలియన్ పౌండ్స్ ఆ తరువాత ఓ అరబ్ రాజకుమారి కొనుక్కుంది."
    
    "జెడ్ అనే ఇంగ్లీషు అక్షరంతో మొదలయ్యే ప్రపంచదేశాలు ఎన్ని? వాటి పేర్లు?"
    
    "జైర్, జూంబియా, జింబాబ్వే అనేమూడు దేశాలు."
    
    ఆదిత్య నుదుటిపైన స్వేదం పేరుకుంటూంది.
    
    "నెపోలియన్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా మరణించాడు?"
    
    "క్రీస్తుశకం 1821 లో సెంట్ హెలేనా దీవిలో తన ఏభై రెండవ ఏట చనిపోయాడు. ఆర్సెనిక్ విషం పూసిన వాల్ పేపర్స్ అతడి గదిలో వుంచారనీ ఆ పేపర్స్ స్లో పాయిజన్ లా పనిచేసి అతడి ప్రాణం తీశాయని అంటారు."
    
    సూరిలో ఉత్కంఠ ఉధృతమవుతూంది.
    
    ఇక మిగిలింది ఒక్క నిముషం మాత్రమే!
    
    ఆదిత్య నిట్టూర్పులా గాలిని పీల్చి తన చివరి ప్రశ్న అడిగాడు- "ప్రాణహాని కలిగించే స్థితిలో సంపర్కానికి సిద్దపడి పిల్లలని కనే ప్రాణి ఏది?"
    
    ప్రబంధ సాలోచనగా చూస్తుంది ఆదిత్యనే.
    
    "మరోసారి అడగనా?"
    
    "అక్కర్లేదు. అర్ధమైంది."
    
    "ఆ ప్రాణికి వాత్సాయనుడి కామసూత్రాల గురించి తెలీదు. కాని తన జాతి వృద్దికి సిద్దపడుతుంది. అదీ ప్రాణాపాయకరమైన స్థితిలో."
    
    ప్రబంధ తల వాలిపోయింది.
    
    "టైం ఈజ్ అప్."
    
    ఆడిటోరియం దద్దరిల్లిపోయింది.
    
    "జవాబు చెప్పేదా?"
    
    ప్రబంధ క్షణంపాటు ఆదిత్యని చూసి తల తిప్పుకుంది.
    
    అప్పటికే ఆడిటోరియం కుర్చీలపైన మోదుతున్నారు.
    
    "కుడోస్ టు ఆదిత్యా" స్టూడెంట్స్.
    
    "హిహిప్ హుర్రే!"
    
    "బ్రేవో ఆదిత్యా!"
    
    "మేగ్నానిమిస్!"
    
    ఉప్పెనలాంటి హోరు.
    
    ఆదిత్యని పైకెత్తుకున్నారు చాలామంది విద్యార్ధులు.
    
    ఆదిత్య చెప్పలేకపోయింది ఒక్క జవాబు కాని ప్రబంధ రెండు ప్రశ్నలకి బదులివ్వలేకపోయింది.
    
    ఆదిత్యని విజేతగా నిర్ణయించిన అయిదుగురు ప్రొఫెసర్స్ వెళ్ళిపోయిన మరుక్షణం అక్కడ మొదలైంది అసలు పోరాటం.
    
    "ఆగు మిస్టర్ శౌరీ!"
    
    ద్వారం దాటబోయిన శౌరి సూరి పిలుపుతో రోషంగా వెనక్కి తిరిగాడు.
    
    "మన పందెంలో అతి ముఖ్యమయిన ఘట్టాన్ని నువ్వూ చూడాలి."
    
    ఆదిత్యకిదేమిటో అర్ధంకాలేదు. అసలు తను ఓడితే జరిగేదేమిటో చెప్పాడు తప్ప, గెలిస్తే  ప్రబంధ ఏం చేసేదీ, ఏం చేయాలని షరతుగా పెట్టిందీ సూరి ఆదిత్యకి చెప్పలేదు.
    
    "మిస్టర్ సూరీ!" దూకుడుగా రెండడుగులు ముందుకేసిన శౌరి ఏ క్షణంలో అయినా కలియబడేట్టున్నాడు. "పొగరు తలకెక్కనీకు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS