Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 12


    ఇంతకన్నా చాలా జటిలమైన సమస్యల్ని సునాయాసంగా పరిష్కరించడం అలవాటైన వాసుదేవరావు, దీన్ని మామూలుగా తీసుకోలేకపోయాడు.
    
    ఒక మామూలు స్థాయినుంచి ఎదిగిన వాసుదేవరావుకి నీతికన్నా ఖ్యాతి ముఖ్యం. ఖ్యాతికన్నా పదవి అవసరం. కేవలం ఈ రెండు సూక్తులపైనే తన రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్న వాసుదేవరావు, అందరికన్నా తన కుటుంబాన్ని ఎక్కువ ఇష్టపడితే, ఆ కుటుంబంలో తనను పోలిన కూతురంటే మరీ ప్రాణంలా చూసుకుంటాడు.
    
    ఈ వార్తతో ప్రతిపక్షాలు అవకాశం తీసుకుంటాయని కాదు.
    
    ప్రజలు పనులు మానుకుని దీనిగురించే చర్చించుకుంటారనీ కాదు. పెళ్ళి కావాల్సిన ప్రబంధ ఒకవేళ నిజంగా ఎవర్నయినా ముద్దుపెట్టుకున్నా ఇక పెళ్ళి కాదేమో అన్న ఆలోచన కాదు.
    
    ప్రబంధ కూడా బయటికి బింకంగా కనిపించినా ఓటమిని అస్సలు సహించలేదు.
    
    వెంటనే వైజాగ్ కు ఫోన్ చేశాడు.
    
    ప్రబంధే అందుకుంది.
    
    "నేను పబ్బీ!"
    
    "డాడ్!" ప్రబంధ గొంతులో చాలా నిస్త్రాణ వినిపించింది- "ఆర్యూ ఓ.కె.డాడ్!"
    
    "ఓ.కె. నాకు ఇబ్బందేముందమ్మా" ఓటు విలువ తెలీని జనాభా ఈ రాష్ట్రంలో ఉన్నంతకాలం, మేమేం చేస్తున్నది అర్ధంకాని నిరక్షరాస్యులు ఈ నేలపైన పెరుగుతున్నంతకాలం, మమ్మల్ని కాదని ఎదిరించినవాళ్ళ నోరు నొక్కే పోలీసు యంత్రాంగం మా అధీనంలోనే వున్నంతకాలం, నా సీటుకిందికి నీళ్ళు లేకుండా డబ్బులు తీసుకుని వందిమాగధుల్లా నాకు తాళంవేసే ఎమ్మెల్యేలు వున్నంతకాలం-నాకేం ఢోకాలేదు" క్షణం ఆగాడు. "అయినా ఏమిటీ... యూనివర్శిటీలో ఏదో చిన్న..."
    
    "అదేం లేదు డాడ్!"
    
    "ఏమీ లేకపోతే పేపర్లో ఎందుకు పడుతుందమ్మా? సరే, ఆ అబ్బాయెవరు? అదే... ఆదిత్య... ఏం చేస్తున్నాడు?"
    
    "ఇంజనీరింగ్ స్టూడెంట్..."
    
    "అయితే మాత్రం నీతో పోటీ పడటమా? నువ్వెవరో తెలిసే ఈ పని చేశాడూ అంటే చాలా సాహసం చేశాడన్నమాట!"
    
    తండ్రి సంగతి తెలిసిన ఆడపిల్లలా వెంటనే అంది- "అది కాదు డాడీ..."
    
    "మళ్ళీ అలా కాకూడదు పబ్బీ! ఈ రాష్ట్రం మనది... కాదు నీది. కాబట్టి ఇక్కడ అన్నీ నీకు అనుకూలంగా జరిగిపోవాలి. జరక్కపోతే జరిగేట్టు చూడాలి. అవునా? తప్పయిందని నీ కాళ్ళపైన పడేట్టు చేయనా?"
    
    "అవసరంలేదు డాడీ. నేను నీ కూతుర్ని... ఏదన్నా నాకు నేనుగా సాధించగలను. మరొక్క అవకాశం.... అది చాలు..."
    
    ఫోన్ క్రెడిల్ చేశాడు చీఫ్ మినిస్టర్ వాసుదేవరావు. ప్రబంధ మానసికంగా ఎంత నలిగిపోతున్నదీ సులభంగా గుర్తించాడు.
    
    మరొక్క అవకాశం అంటే మరోసారి పోటీపడి గెలవటానికి అవకాశం రావాలి.
    
    అదెంతసేపు? నవ్వుకున్నాడు వాసుదేవరావు.
    
    ఎప్పుడో పంచాయితీ ప్రెసిడెంట్ గా రెండోసారి ఎన్నిక కాలేక ఓడిపోయిన తను ఆ తరువాత ఎమ్మెల్యే కాగలిగాడు. రెండోసారి ఎమ్మెల్యే కాలేని తను మూడోసారి ఎమ్మెల్యే కావడమేగాక మంత్రిపదవినీ పొందాడు. ఆ తరువాత పార్టీ అద్యక్షుడుగా ఓడిపోయి మరోసారి ముఖ్యమంత్రి అయ్యాడు.
    
    అంటే ప్రతిసారీ ఓటమినుంచే తను ఎదిగాడు. ఇప్పుడు తన కూతురూ తనలాగే ఆలోచిస్తూంది.
    
    వెంటనే పి.ఏ.ని పిలిచాడు.
    
    అది తిరుగులేని 'అవకాశం' కోసం.
    
                                                              * * *
    
    యూనివర్శిటీ కాంపస్ లో నడుస్తున్న ఆదిత్య పక్కన కారు ఆగడంతో తల తిప్పి చూశాడు.
    
    "హల్లో!" డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఓ అమ్మాయి మృదువుగా నవ్వింది- "రండి... మీ కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తాను."
    
    సందిగ్ధంగా నిలబడిపోయాడు.
    
    సంస్కారపూరితమైన నవ్వుతోబాటు వెలుగుకేతనాల్ని రువ్వుతున్న నేత్రాలు, కౌముదీ శీతల కిరణ రేఖలు జాల్వారుతున్న చెంపల్లో అస్పష్టంగా కనిపిస్తున్న నిశాంత నీహారకణాలు.
    
    దృష్టి మరల్చుకోలేకపోయాడు అరక్షణంపాటు.
    
    మరోసారి ఆమె అడగలేదు. కాని ఆమె డోర్ తెరవగానే ఆదేశించినట్టు ఫ్రంట్ సీట్ లో ఆమె పక్కగా కూర్చున్నాడు.
    
    "నా పేరు ప్రణయ... ఎకనమిక్స్ స్టూడెంటుని..." డ్రైవ్ చేస్తూ అంది. "మొన్న ఐక్యూ టెస్ట్ లో మిమ్మల్ని చూశాను. ఆ రోజే మిమ్మల్ని కలుసుకోవాలనుకున్నాను కాని హఠాత్తుగా అదృశ్యమైపోయారు."
    
    ఇది అలవాటులేని స్థితి అతనికి.
    
    అసలు ఇలా ఒక అమ్మాయి పరిచయంకోసం ఆలోచించటంకాని, ఆశపడటంకాని తెలీని ఆదిత్యకిది జీర్ణించుకోలేని సన్నివేశంలా వుంది. అలా ఎందుకనిపిస్తుందో అతడికీ తెలీదు.
    
    చివరిలో పారిపోయారేం?" కారుని లైబ్రరీ పక్కనుంచి మళ్ళిస్తూ అడిగింది.
    
    "ప్రబంధని చూసి భయపడ్డారా?" అలల్రిగా కాహ్డు- యధాలాపంగానే అడిగింది. అయినా కాస్త బిడియమనిపించింది.
    
    "అందంగానే వుంటుందిగా?"
    
    అప్పటికీ జవాబు చెప్పలేదు.
    
    ఒక అమ్మాయి ముందు ఏ యువకుడైనా ఇలాంటి ఓ స్థితిని ఎదుర్కోవాల్సిరావడం ఎంత ఇబ్బందికరమో ఇప్పుడు అర్ధం చేసుకుంటున్నాడు.
    
    "మీరు నిజంగా ఇంటెలిజెంట్ అనిపించింది."
    
    ప్రణయ స్టేట్ మెంట్ నచ్చలేదు ఎందుకో.
    
    "కాబట్టే ఐదుగురు ప్రొఫెసర్స్ ని సైతం తప్పుదోవ పట్టించగలిగారు."
    
    "అర్ధం కావటంలేదు" అప్పటికి పెదవి విప్పాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS