"ఇండియా, జపాను."
"ఏ దేశం సాధించింది?"
"జపాన్"
"రైట్!"
"కొలంబియా దేశపు కరెన్సీ ఏది?"
"డాలర్"
"కొలంబియా కరెన్సీని 'పెసో' అంటారు"
"నౌ ఎవరెస్ట్ శిఖరానికి ఆపేరెలా వచ్చింది?"
"మన దేశంలో ఒకప్పుడు పనిచేసిన సర్వేయర్ జనరల్ సర్ జార్జి ఎవరెస్ట్ మూలంగా"
"ప్రత్యేకించి ఆ పేరు ఏర్పడ్డానికి కారణం?"
"ఎవరెస్ట్ శిఖరం ఎత్తుని కొలిచింది ఆయన సర్వేయర్ గా పనిచేసిన రోజుల్లోనే కాబట్టి."
"ఫైన్. ఎల్ సాల్వ్ డార్ దేశం రాజధాని."
"సాన్ సాల్వాడార్."
"సౌత్ ఆఫ్రికాలో అతిపెద్ద నగరం?"
"జోన్స్ బర్గ్"
"రైట్! అమ్మన్ ఏ దేశపు రాజధాని."
"జోర్డాన్"
"పెరీ కరెక్ట్ మిస్టర్ రమేష్"
అభినందనగా అని "అమెరికాలో స్త్రీలకి తొలిసారి ఓటువేసే హక్కు ఇవ్వబడింది ఏ సంవత్సరంలో.
"క్రీ. శ. 1920"
"రైట్! బజర్ మోగడంతో వెంటనే "రెండు నిమిషాల గడుపు ముగిసిపోయింది మిస్టర్ రమేష్, నౌ ఇట్స్ టర్నాఫ్ మిస్టర్ రుత్వి" రుత్విని సమీపించాడు క్విజ్ మాస్టర్ వాచ్ చూసుకుంటూ.
క్షణంపాటు విజూష రక్తప్రసరణ స్తంభించినట్టయింది.
పొంతనలేని ప్రశ్నలు. ...
అప్పటికే వెనుకబడిన రుత్వి ఇప్పుడేం కాబోతున్నాడూ అన్న ఆదుర్దాతో బిగుసుకుపోయింది విజూష.
సశ్యలోనూ ఇంచుమించు అలాంటి ఉత్కంఠ
రేపిడ్ ఫైర్ రౌండ్ దాకా అందరిలోనూ వెనకబడి వున్నాడు.
కానీ ఇప్పుడు జగన్నాధ్ సురేంద్రలు ఒకటి రెండు జవాబుల మైనస్ మార్కులతో పది ప్రశ్నలు అడగకముందే రెండు నిమిషాల గడువు అయిపోవడంతోనూ - ఇంచుమించు రుత్వికి సమవుజ్జీగా వున్నారు.
ఆధిక్యతలో వున్నది రమేష్ మాత్రమే.
పరిసరాలను మరచిపోయి సశ్య విజూషతోపాటు స్పూర్తి కూడా ఏకాగ్రతగా గమనిస్తుండగా మొదలైంది క్విజ్ అతి ముఖ్యమైన ఘట్టం.
"మిస్టర్ రుత్వి....
అమెరికన్ ఇంటిల్లిజెన్స్ ఏజన్సీసి సి. బి. ఐ. అంటాం. ఇజ్రేల్ కి చెందిన ఇంటలిజెన్స్ ఏజన్సీ పేరు."
" మొస్సాద్"
"రైట్!
లివింగ్ గాడెస్ అనే పేరు విన్నారా?"
"నేపాల్ లోని హిందువులు పూజించే దేవత పేరు సజీవ దేవత" లివింగ్ గాడెస్ ని తెలుగులో తర్జుమా చేస్తూ అన్నాడు రుత్వి.
"అంటే నిజంగా బ్రతికే వుంటుందా?"
"అవును!
నేపాల్ లోని ఓ సాంప్రదాయం ప్రకారం ఓ కులానికి చెందిన మూడేళ్ళ పాపని దేవతగా మార్చి ఆమెను కుమారి, దేవి అనే పేరుతో ఆరాధిస్తుంటారు.
ఆ పాప అంత చిన్న వయసులోనే తన వాళ్లనుంచి వేరుచేయబడుతుంది.
ఒంటరిగా ఓ గదిలో అస్తిపంజరాల మధ్య పెరుగుతుంది.
అదీ ఆమె పుష్పవతి అయ్యేదాకా. ఆ తర్వాత ఆమె తన స్థానాన్ని కోల్పోతే మరో మూడేళ్ళ అమ్మాయిని వుంచడం జరుగుతుంది.
నేపాల్ రాజకుటుంబం సైతం ఆరాధించే ఈ కుమారిదేవి చీకటి గదిలోనుంచి ఆరుబయటకి వచ్చేది ఎడాదికి ఓసారి మాత్రమే"
"గుడ్! శరీరంలో ఏ భాగాల్ని ఉపయోగించటానికి మెదడు ఎక్కువ వినియోగించబడుతుంది"
"బొటనవేలు" టక్కున జవాబు చెప్పాడు రుత్వి.
"రైట్!"
"ఓ ప్రాణి, తండ్రి గొంతునించి ప్రాణం పోసుకుని ప్రపంచంలో అడుగుపెడుతుంది. అదేమిటి?"
"డాల్విన్ ఫ్రాగ్. ఈ కప్ప దక్షిణ అమెరికాకి చెందింది."
"తండ్రి గొంతులో ఎలా ప్రాణం పోసుకుంటుందీ చెప్పగలరా?" అడిగాడు క్విజ్ మాస్టర్.
"ఆడకప్ప అయిదునించి పదిదాకా గుడ్లు పెట్టగానే వాటి రక్షణ కోసం తండ్రి కప్ప మింగి గొంతులో ఓ మూల దాచుకుంటుంది.
తర్వాత కొంతకాలానికి గొంతులోనే పొదిగి కప్ప పిల్లల్ని బయటికి విడిచిపెడుతుంది. "
ఆడిటోరియంలో నుండి కరతాళ ధ్వనులు టీవీలో నుండి స్పష్టంగా వినిపిస్తున్నాయి.
ఆ క్షణంలో విజూష ఆలోచిస్తున్నది ఒక్కటే.
రుత్వి ప్రశ్నలకి జవాబు చెప్పగలుగుతున్నాడుగానీ ప్రతి జవాబునీ వివరణగా చెప్పడానికి ఎక్కువ వ్యవధి అవసరమవుతూంది.
ఇలా అయితే పది ప్రశ్నలు పూర్తికాకముందే రుత్వికిచ్చిన రెండు నిమిషాల గడువు పూర్తయిపోతుంది.
పైగా ప్రశ్నలు చాలా కష్టంగా వున్నట్టు అనిపిస్తుంది.
"సగటున ఒక మనిషి తన జీవితకాలంలో తినే ఆహారం, తాగే నీళ్లు ఎంతుంటుంది విజ్ఞానశాస్త్రం?"
"ఏభై టన్నుల ఆహారం, ఏభై వేల లీటర్ల నీళ్లు తాగుతారు."
