Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 108


    "మీరిప్పుడు లా చేస్తున్నారట కదా?" అంది.
    "లేదు. లా లో అడ్మిషన్. ఇంకా పుస్తకాలు తెరిచి చూడలేదు. క్రితం రెండు వారాలూ కాలేజీ లేదుగా__ అదేమిటో రమీజాబీ అట. ఫైరింగ్ మరణాలు స్టూడెంట్లకెందుకు? అవన్నీ పోలీసుల దినచర్య పనులు"
    "ఇప్పుడే వస్తా వన్ మినిట్" అని లేచి లోనకి నడిచింది.
    ఆ లేవటంలోనూ నడవటంలోనూ నాట్యభంగిమలున్నాయి. 'మామూలుగా అవి అంతగా వుంటాయా కదలికల్లో' అనుకున్నాడు శ్రీపతి.
    టీపాయ్ మీది ఫెమినా తీసి చూస్తున్నాడు.
    మూడు నిమిషాలు.
    వెండి ట్రేలో అందమైన లేత ఆకుపచ్చరంగు ప్లేట్లు నాలుగైదు__ వాటిల్లో యాపిల్ ముక్కలు, ద్రాక్షపళ్ళు, వేయించిన జీడిపప్పు.
    కూర్చుని, "తీసుకోండి" అన్నట్లుగా కళ్ళతో సూచించింది. అభినయానికి అలవాటుపడిన కళ్ళకి యేదైనా చూపుతో సూచించటం సుళువు.
    ఒక యాపిల్ ముక్క తీసుకుని "మీరుకూడా" అన్నాడు.
    "మీకు కంపెనీ కోసం" అని తీసుకుంది.
    "వీటిలో వేటికీ శరీర నాట్యాకృతి చెడదు" అని నవ్వాడు.
    "చెడేటందుకు వుంటే గద"
    పరిశీలనగా ఆమెవంక చూశాడు. ఎరుపు కలిసిన జరీ అంచు కోరా రంగు గద్వాల్ చీర. అదే బట్ట అదే అంచుతో బ్లౌజు. కొత్తగా మళ్ళీ ఇప్పుడిప్పుడే వస్తున్న పొడవు చేతులకి అనుగుణంగా __ బ్లౌజు చేతులనంటే ఆరు అంగుళాల జరీ అంచు.
    మన శిల్పాల నాట్యభంగిమల ఆకృతి కాదుగానీ యీ కాలపు నాజూకు ఆకారం. నడుం మరీ సన్నగా వుండటం వల్ల నడుంకి పైనా కిందా లావుగా నిండుగా వున్నట్లుగా భ్రమ కలిగిస్తోంది__అనుకుని,
    "వుందో లేదో నాట్యం చేసినప్పుడైనా తెలుస్తుందిగా" అన్నాడు.
    "మీకు నా నాట్యం ఏమి తెల్సు?"
    "రెండు మూడుసార్లు చూశాను. మీ నాట్యంలో లాలిత్యం పాలు యెక్కువ" అన్నాడు.
    "అట్లా కాదు. మీ ఒక్కరికోసం మీ యెదుట నాట్యం చెయ్యాలనిపించింది" అంది ఇంగ్లీషులో.
    "యెప్పుడనిపించింది?" అన్నాడు.
    "నిన్న మిమ్ముల్ని అక్కడ పెయింటింగ్ ఎగ్జిబిషన్ లో ఫస్ట్ టైం చూడంగానే" అంది.
    పనిమనిషి టీ పట్టుకొస్తే బల్లమీద పెట్టకముందే తను చేత్తో అందుకుంది.
    అందమైన ఖరీదైన టీ సెట్టు.
    కప్పులో డికార్షన్ వంపుతోంది.
    ఆమె ముఖంవంక చూశాడు. సన్నటి దంతం పొరతో చేసిన పువ్వులా అనిపించింది. 'దంతంతో మలచటం విశేషం. మలచటమూ బావుంది. కానీ యింకా సోయగాల్ని నింపాల్సింది__' అనుకున్నాడు.
    కప్పులోకి పాలు వొంపుతోంది.
    శ్రీపతి చెంచాతో చక్కర తీసి వెయ్యబోయాడు. ఆ చెంచా కింద అరిచెయ్యి పెట్టి చేతులో వొంపమన్నట్లు చూసింది.
    వంపేసి, మళ్ళీ తీసి కప్పుల్లో వేస్తున్నాడు.
    అరచేతిలోని చక్కెరను నాలిక కొసతో అద్దుకుని తింటూ "యిది మీ మహా ప్రసాదం__" అని అతని ముఖంలోకి చూసింది.
    ఆ మాట, ఆమాట కంటే ఆ చూపు__ శ్రీపతికి ఇబ్బందిగానూ బాగానూ అనిపించింది.
    "మీ ఫాదర్ వున్నారా?" అన్నాడు.
    "ఫాదర్ వూరెళ్ళిన్రు. మమ్మీ క్లబ్ కెళ్ళినది, మీరు వచ్చేదానికి హాఫెనవర్ ముందు"
    "ఏ క్లబ్బు?"
    "లేడీ హైదరీ"
    "ఏం చేస్తారక్కడ?"
    "ఏ పనీ లేని పన్లు" అంది.
    "మీరు వెళ్ళరా?"
    "లే."
    "అందునా అసలు వయసుకంటే చిన్నగా కనిపిస్తారు డాన్సర్లు"
    "మీ గురించి వై.వి.యల్.యన్.వి.ప్రసాద్ గారు చెప్తే తెల్సు" అంది.
    "అతను తెలుసా?"
    "విమల తెలుసు. మ్యారేజ్ తరవాత ఆయన__"
    టెలిఫోను మోగింది. అందుకుని చెప్పింది యేదో.
    "మా ఫాదర్ కోసం" అని కూర్చుని "మీరు రారేమోనని భయపడిన" అంది.
    "రాకపోతే భయందేనికి?"
    "భయమంటే భయమని కాదు__" అని ఆగి, "సమ్ ఫీలింగ్. ఎక్స్ ప్రెస్ చెయ్యటం రాకున్నది" అంది.
    మళ్ళీ ఫోను మోగింది. అందుకుని యేదో చెప్పింది.
    "మమ్మీ కోసం. యిక్కడ కూర్చుని వుంటే ఈ ఫోన్ న్యూసెన్స్. అటుపక్క గదిలో కూర్చుందాం" అని లేచింది. అతనూ లేచాడు.
    "మిద్దె మీద కూర్చుందాం. కామ్ గా వుంటది." అంది.
    మెట్లెక్కుతున్నారు. ఆమె వెనక అతను. మెట్లెక్కుతూంటే కనిపిస్తున్న పాదాలు. కండతో చర్మంతో ఏర్పడిన పాదాలలా కాక దంతంతో మలిచిన పాదాలలాగా అనిపించింది.
    "ఈ పిల్ల శరీరం__ జనమంతా__ కనీసం యాభయ్యేళ్ళదాకా నాట్యానికి అనువుగా వుండిపోయినా ఆశ్చర్యపడక్కరలేదు_" అనుకున్నాడు.
    ఒక గదిలోకి దారితీసింది. అది ఆమె పడకగది.
    "మీరు అట్ల కూర్చోండి" అని మంచం మీద కూర్చోబెట్టింది. అంచున కూర్చున్నాడు.
    అవతలగా వున్న సోఫాలో కూర్చుంది. అతని కళ్ళలోకి ఆర్తిగా చూసింది.
    'యీ పిల్లకి మగపొడ అసలుకే గిట్టదని విన్నాను!' అనుకున్నాడు.
    "మీరింతకాలం పెండ్లెందుకు చేసుకోలేదు? అంది.
    "చేసుకోలే."
    "ఎందుకు చూసుకోలే"
    "వూకెనే" అన్నాడు.
    గలగలా నవ్వి, "మా లెక్క అన్నరు" అంది. ఆమె గలగలా నవ్వితే, __ సన్నటి రాగితీగల చుట్టమీద పసిపిల్లడు సైకిలు చువ్వతో కొట్టినట్లుగా అనిపించింది.
    "మీరు మర్లా యెప్పుడు కనిపిస్తరు?" అంది.
    "మళ్ళీనా? యెప్పుడో సందర్భపడినప్పుడు"
    "నాకు మిమ్మల్ని మరలా రేపే చూడాల్ననిపిస్తున్నది" అంది.  
    అతను మౌనంగా వుండిపోయాడు.
    "ఆల్ వేస్. ఆల్ ది టైం" అని అతని కళ్ళలో తన చూపు కలిపింది.
    "నాక్కూడా పెండ్లి చేస్కోవాల్ననిపించినది నిన్న. నాకే సర్ప్రైజింగ్ గా వున్నది" అంది.
    'అఁహా' అన్నట్లుగా నిశ్చలంగా నవ్వాడు.
    "నేనెట్లా వున్నాననిపించింది మీకు" అంది ఇంగ్లీషులో.
    "యు లుక్ ఫైన్. ఎ ఫైన్ బాడీ. ఎ ఫైన్ సోల్__ ఇఫ్ దేర్ ఆర్ సోల్స్"
    సంతోషంతో పొంగిపోతూ లేచి, పేముకుర్చీ మంచం వైపుకి జరిగి దాన్లో కూర్చుని "శ్రీపతిగారూ" అని అతని ముఖంలోకి చూసింది.
    అతను, చూపు ఆమె తలమీదుగా గోడమీద అన్నాడు.
    __చూడగా యీ పిల్ల ప్రేమ సుడిగుండంలో పడినట్లుంది. నాకే యిదీ లేకపోయినా__ రక్షించటానికి చెయ్యి అందుకున్నా, విచక్షణలేని సుడిగుండం, ఆమెతోపాటు నన్నూ లోనకి లాగిపారేస్తుంది. నేనుత్త తిరుగుబోతునని చెబుతాను. వుత్త....
    "మీకు నన్ను అర్పించుకోవాలనుకుంటున్నాను" అంది ఇంగ్లీషులో.
    "నాకా అర్హత లేదు" అన్నాడు.
    "మీ అర్హత సంగతి నేను కదా చెప్పాల్సింది" అంది ఇంగ్లీషులో.
    అతని చేతిని అందుకుని వేళ్ళమీద పెదాలు అద్దింది.
    శ్రీపతి మనసులో__ఆమె నాట్యం చూసినప్పటి కొన్ని నాట్యభంగిమలు మెదిలి, అతని కళ్ళలో ఆమె రూపం వూరిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
    మరుక్షణంలో, "సారీ" అని చెయ్యి వదిలేసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS