Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 104


    "కంగ్రాట్స్ టు బోత్ ఆఫ్ యూ!"
    
    అరగంట గడిచినట్టు తెలియచేస్తూ స్కోర్ వివరాల్ని అందించాడు "చెరో ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయిన ఆదిత్య సత్యేంద్రలు ఇద్దరూ నూట ముఫ్ఫై మార్కులతో సమానంగా వున్నారు. అంటే సమ ఉజ్జీలే"
    
    స్కోర్ వివరాలను విన్న విద్యార్ధులు ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు.
    
    "నౌ, విడి విడిగా అరగంట గడువు పోటీ ప్రారంభమైంది. ముందు ప్రారంభిస్తున్నది...." రెండు లిప్తల విరామం తర్వాత చెప్పాడు రోహిత్ "మిస్టర్ ఆదిత్యతో..."
    
    "కీపిటప్ ఆదిత్య!" సూరి కేకపెట్టాడు.
    
    ప్రేక్షకుల ఉత్సాహాన్ని గమనించిన రోహిత్ ఓ నిముషం అవకాశం కల్పిస్తూ నిశ్శబ్దంగా వుండిపోయాడు.
    
    కేకలూ, కేరింతలూ!
    
    ఇదేసమయంలో వేదికపైన సైడ్ వింగ్ నుంచి ఆదిత్యకి ఓ స్లిప్ అందింది.
        
    ఆ గొడవలో అందించిన వ్యక్తి ఎవరో కూడా గమనించలేదు ఆదిత్య. తల వంచుకునే స్లివ్ లోని అక్షరాల్ని చదివాడు.
    
    "ఆదిత్యా! నీ చెల్లెలు అనిత మా అధీనంలో వుంది. ఈ విషయం నువ్వు గ్రహించటం మాత్రమే కాదు. బయటకి పొక్కనివ్వకూడదు. ఆవేశపడి పోటీ నుంచి విరమించుకున్నా లేక ఈ విషయం మరెవరికయినా తెలియజెప్పినా అనిత బ్రతకదు. బుద్దిగా వేదికపైనే పోటీ ముగిసేదాకా నిగ్రహాన్ని పాటించు. కాకపోతే నువ్వు చేయాల్సింది ఒక్కటే నీ చెల్లికోసం ఓడిపోవాలి నిన్ను రోహిత్ అడిగే ప్రశ్నలకి జవాబు తెలిసినా తెలియదన్నట్టుగా వుండాలి. నీ పెళ్ళి కన్నా చెల్లి ముఖ్యం అనుకుంటే ఆచరించక తప్పదు."
    
    ఆదిత్య నుదుటిపైన స్వేదం పేరుకుపోయింది. ఇది పంపిందెవరో గ్రహించటానికి అట్టే వ్యవధి అవసరం లేకపోయింది.
    
    ప్రబంధనుంచి మాట తీసుకుని తనను ఓడించడం ధ్యేయంగా పెట్టుకున్న వాసుదేవరావు ఇలాంటి తెలివిని ప్రదర్శించాడని తెలిసినా ఉద్రేకంగా లేవలేకపోయాడు.
    
    తను వేదిక దిగకూడదు. ఉండి, ఓడిపోవాలి! లేనినాడు అన్నయ్యగా అనితని కోల్పోతాడు.
    
    సన్నగా కంపిస్తూ ఆడిటోరియం వైపు చూశాడు. ఎవరికీ చెప్పుకోలేని, చెప్పుకోకూడని స్థితి కల్పించిన వాసుదేవరావు అవహేళనగా చూస్తున్నాడు రెప్పవాల్చకుండా, శౌరి జాడ లేదు.
    
    గొంతు పిడచకట్టుకుపోయింది.
    
    తన గెలుపుక్సోం ఆశగా ఎదురుచూస్తున్న ప్రబంధకన్నా, తను గెలిచితీరాలన్న ప్రణయ తనముందు కూర్చుని తనకన్నా ఎక్కువ అలజడితో తననే గమనిస్తోంది.
        
    "మిస్టర్ ఆదిత్య!"
    
    రోహిత్ కంఠం వినిపించిన ఆడిటోరియంలో నిశ్శబ్దం ఆవరించినా ఆదిత్య గుండెల్లో నిగ్రహించుకోలేని హోరు.
    
    "ఇప్పుడు మీకు ఇస్తున్న అరగంట వ్యవధిలో సుమారు ముప్పై ప్రశ్నలకి జవాబు చెప్పగలగాలి."
    
    ప్రశ్నలక్కాదు, జీవితమంతగా విస్తరించిన సమస్యకి.
    
    "తొలి ప్రశ్న..."
    
    వినిపించలేదు ఆదిత్యకి కాదు, వినిపించుకోకూదనుకున్నాడు.
    
    "తెలియదు"
    
    అదిరిపడింది ప్రబంధ కారణం ఇంకా అడగని ప్రశ్నకి ఆదిత్య ఇప్పుడు తెలియదన్నాడు ముందుగానే.
    
    ఒక్క ప్రబంధ మాత్రమే కాదు, మొత్తం ఆడిటోరియం విస్మయంగా చూస్తోంది.
    
    "వాట్ హేపెండ్ మిస్టర్ ఆదిత్యా?" అడిగింది ప్రణయ కాదు, ప్రబంధ కాదు రోహిత్!
    
    "ఆర్యూ ఓకే?" పరామర్శలా దగ్గరకొచ్చాడు రోహిత్ "ఏమిటి పరధ్యానంగా వున్నారు?"
    
    తల పైకెత్తలేదు ఆదిత్య.
    
    అప్పటికే సూరి వేదికపైకి వచ్చాడు.
    
    జేవురించిపోయిన ఆదిత్య మొహం చూస్తూ "ఏమైందిరా! ఏమిటలా వున్నావు?" ఉద్విగ్నంగా అడిగాడు.
    
    జవాబు లేదు.
    
    "మాట్లాడవేం?" ఉక్రోషంగా రెట్టించాడు సూరి.
    
    "ప్లీజ్!" క్విజ్ మాస్టర్ రోహిత్ హెచ్చరికగా అన్నాడు. "పోటీ మధ్యలో పార్టిసిపెంట్ నిలా డిస్టర్బ్ చేయడం నియమానికి విరుద్దం ప్లీజ్ గో ఎవే."
    
    సూరి కిందికి నడిచాడు. ఉన్నట్టుండి ఆదిత్యలో ఈ మార్పేమిటి? ఏం జరిగింది?
    
    శౌరికోసం చూశాడు. లేడక్కడ. ఏ అనుమానం అతడిని కలవరించిందో వెంటనే బయటికి నడిచాడు.
    
    ఒక రాజకీయ నాయకుడి పథకం గాని, కుట్రగాని ఏ స్థాయిలో వుండేదీ గ్రహించిన సూరి, వెంటనే మోటార్ బైక్ స్టార్ట్ చేసి ఆదిత్య ఇంటికి బయలుదేరాడు.
    
    అనిత లేదు ఇంటి దగ్గర, అనుమానం దృఢపడింది. హాస్పిటల్ కి వెళ్ళాడు. అక్కడాలేదు. అనిత అసలు రాలేదంది ఆదిత్య బామ్మ లక్ష్మమ్మ.
    
    సరిగ్గా ఎనిమిదిన్నర నిముషాలలో అంత దూరం ప్రయాణించిన సూరి చివరగా శౌరి ఇంటివైపు బయలుదేరాడు ఆందోళనగా.
    
    ఆదిత్య ఓటమికి ఏర్పాటు జరిగిపోయింది పటిష్టంగా.
    
    ఆడిటోరియం లో కలకలం మొదలైంది.
    
    ఆదిత్య దారుణంగా ఓడిపోతున్నాడు. అరగంట వ్యవధిలో అప్పుడే ఆరు నిముషాలు గడిచిపోయాయి. అడిగిన అయిదు ప్రశ్నలకి జవాబు తెలీదన్నాడు.
    
    అతడి ప్రస్తుత మానసిక స్థితి తెలీని ప్రణయ అలజడిగా చూసింది ప్రబంధ వైపు.
    
    ముగ్ధ కవితా పంక్తుల ముద్దబంతుల నుంచి రాలిపడుతున్న రేకుల్లా ప్రబంధ కళ్ళలో అశ్రువులు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS