వెన్ను విరిగిపోతున్న విజయంలో ముక్కలవుతున్న గెలుపుకోసం జీవితం నుంచి విడిపోయి సాగిస్తున్న అన్వేషణ.
నీ ప్రేమకైనా ఇది పరీక్ష కాదు. స్వయంవారంలో వరుల్ని దక్కించుకోవడానికిది త్రేతాయుగం అంతకన్నా కాదు. కాని ప్రబంధ మాటకి నిలబడే యువతి.
అది ఆమె బలహీనత కావచ్చు. కానీ అది తెలిసిన ఆమె తండ్రి దాన్నే క్యాష్ చేసుకోవాలనుకుంటే, ఇదుగో ఇక్కడిలా పరాజయమౌనాన్ని గుండెనిండా పాతుకుని నిశ్శబ్దంగా కలవారపడుతూంది.
అదొక్కటే కాదు ప్రణయని కలతపెట్టింది. వాసుదేవరావ్ పెదవులపైన అస్పష్టంగా కనిపిస్తున్న లాస్యం.
ఆదిత్య ఓటమి అతడికి చాలా విజయగర్వాన్ని అందిస్తూంది.
"మిస్టర్ ఆదిత్యా! ఆరో ప్రశ్న "రోహిత్ అడిగాడు వుత్సాహంగా జనాభాని పొట్టన పెట్టుకోగా, కేవలం యిద్దరు మాత్రం ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. అది ఏ నగరం, ఆ పర్వతం పేరేమిటి?"
"తెలీదు"
జవాబు చెప్పాడు రోహిత్ "మార్టినిక్ బలెండ్ లోని సెంట్ పీరె సిటీ అది ఆ పర్వతం పేరు మోంట్ పీలి... తరువాత..." మరో ప్రశ్న అడిగాడు రోహిత్ "కారు ప్రమాదంలో మరణించిన నోబుల్ బహుమతి గ్రహీతయిన ఫ్రెంచి రచయిత ఎవరు?"
ఆదిత్య ఆలోచించడంలేదు. తెలిసింది ఒకే ఒక్క జవాబు అన్నట్టుగా "తెలీదు" అన్నాడు.
"ది మిత్ ఆఫ్ సిసిఫస్ రాసిన ఆల్బర్ట్ కామస్!" జవాబు చెప్పాడు "1964వ సంవత్సరం టోకియో ఒలింపిక్స్ లో షార్క్ కార్నర్ హిట్స్ తో పదకొండు గోల్సు చేసిన ఇండియన్ హాకీ టీమ్ ఆటగాడెవరు?"
"తెలీదు."
"ప్రీతిపాల్ సింగ్ నౌ.... మరో ప్రశ్న ఆంగ్లంలో అంత్య నియమం వుండే పధ్నాలుగు పంక్తుల పానెట్ పద్యం రాసిన తొలి కవి ఎవరు?"
"తెలీదు."
"ఇటలీ దేశపు పిట్రార్క్ నెక్స్ట్ - సుప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త సోక్రటీసుకు దుర్భర జీవితాన్ని అందిస్తూ కలవరపెట్టిన అతడి భార్య పేరు?"
"తెలీదు."
"క్యాన్ తిప్పీ!" జవాబు చెప్పాడు రోహిత్ "పూల్ అనే ఇంగ్లీషు పదానికి మూలం ఏది?"
"తెలీదు."
"ఫోలిస్ అనే లేటిన్ పదం" "సూపర్ సానిక్ అంటే అర్ధం?"
"తెలీదు."
"శబ్దంకన్నా అమితమైన వేగాన్ని సూపర్ సానిక్ అంటారు."
సరిగ్గా అప్పుడు చూశాడు ఆదిత్య ఆడిటోరియంలోకి సౌదామిని అడుగుపెట్టింది. అది కాదు అతడ్నంతగా కదిలించింది. సౌదామినితో పాటు అనిత కూడా వుంది.
ఉద్విగ్నంగా చెల్లిని పిలవబోయాడు. "అ... న్న... య్యా!" అని కేకపెట్టలేదు అనిత. ఓ నిశ్శబ్ద సంగీతంలా ఆపదనుంచి క్షేమంగా తిరిగి వచ్చిన సంతోషంతో అందించిన అమరసందేశంలా పెదవుల్ని కదిలించింది.
రెప్పలార్పకుండా చూస్తున్నాడు ఆదిత్య ఎలా జరిగినా కాని ఓ అద్భుతాన్ని సాధించిన సౌదామిని అనితతో తిరిగి వచ్చింది.
ఇదేమీ పట్టించుకొని సౌదామిని వాసుదేవరావు పక్కన కూర్చుంది ఏమీ జరగనంత మామూలు ప్రసన్నతని అభినయిస్తూ.
ఆవేశంగా పైకి లేవబోయాడు వాసుదేవరావు. అనుకున్న పథకం విఫలమైపోయింది. వెళ్ళిపోయేవాడేమో కూడా.
"కదలకు వాసుదేవరావ్" నెమ్మదిగా అంది సౌదామిని "వెళ్ళటానికి ప్రయత్నిస్తే నువ్వు చేసిన నిర్వాకమేమిటో వెంటనే అందరికీ తెలియాల్సి వుంటుంది. అప్పుడు అందరి మాటా అటుంచితే, నీ కూతురే నిన్ను నలుగురి మధ్యా కడిగేస్తుంది."
వాసుదేవరావు పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఎవరూ తమ చర్యని గుర్తుపట్టలేనంత నిగ్రహాన్ని పాటిస్తూనే అన్నాడు- "అంటే మరోసారి నా వలయంలోకి అడుగుపెట్టావు."
"అవును! ప్రేమ రాహిత్యంలో బ్రతికిన నేను ప్రేమను నిలబెట్టాలనుకున్నాను. అయినా నువ్వీమాత్రం తెలివిని ప్రదర్శిస్తావని, అలా ప్రదర్శించటానికే పోటీ ఏర్పాటుచేశావని నేను గుర్తించలేనని ఎలా అనుకున్నావ్?" వ్యంగ్యంగా నవ్వుతూ అంది. "శౌరి పోలీసు కస్టడీలో వున్నాడు క్షేమంగా అనితని కిడ్నాప్ చేసి తీసుకువెళుతుంటే పోలీసులు వెంటాడి పట్టుకునేట్టు చేసింది నేనే. ఎవరికీ చెప్పను. ఇంటికెళ్ళాక నిశ్శబ్దంగా విడిపించుకో ఓకే?"
చప్పట్ల హోరులో ఆడిటోరియం ప్రతిధ్వనిస్తుంటే, చర్చనాపి ఇద్దరూ వేదిక వేపు చూశారు.
"విజ్రుంభించాడు మిస్టర్ ఆదిత్య!" రోహిత్ అభినందనంలా చెప్పుకుపోతున్నాడు "మొదటి పన్నెండు ప్రశ్నలకి జవాబు చెప్పని మీరు తరువాత ఎనిమిదింటినీ స్కోర్ చేశారు. మీలో హఠాత్తుగా ఈ మార్పేమిటో అర్ధంకాని నేను, మిగతా పది ప్రశ్నల్నీ అడుగుతున్నాను."
వాసుదేవరావు అప్రతిభుడయ్యాడు. అంటే? అనితని చూసిన ఆదిత్య ఆ వుత్సాహంతో చెలరేగిపోతున్నాడు. కాబట్టే, తను తేరుకునేలోగానే ఎనిమిది ప్రశ్నలకి సునాయాసంగా జవాబు చెప్పగలిగాడు.
అయినా మృదువుగా నవ్వాడు వాసుదేవరావు మొదటి పన్నెండు ప్రశ్నలకి జవాబు చెప్పని ఆదిత్య ఇప్పటికే ఓటమికి సిద్దంగా వున్నాడు. సత్యేంద్ర గెలుపుకి ఈ మాత్రం పరిధిచాలు.
"మిస్టర్ ఆదిత్యా!" రోహిత్ ఇరవై ఒకటో ప్రశ్న అడిగాడు. "ప్రపంచంలో ఎక్కువ ఆయుః ప్రమాణం గల దేశమేది?"
"జపాన్!"
"రైట్ 'చాలా దూరం ఆలోచించనివాడు ఆపదని ద్వారం దగ్గరే దాచుకుంటా'డన్న తత్వవేత్త ఎవరు?"


