"నీకెట్ల తెలిసె? ఇన్ని దినాల తర్వాత బయటికెట్లొచ్చె?"
"పోలీస్ జాబ్ కదా!" అన్నాడు విలియం.
విలియం సబ్ ఇన్స్ పెక్టర్ గా చేస్తున్నాడు. యేదో కేసు గురించి కూపీ తీస్తుంటే, తీగలాగితే డొంకంతా కదిలినట్లు, సుచిత్ర మరణం వివరాలు దొరికాయి.
"మరి మన హాకీ ఛాంపియన్ ని అరెస్టు చెయ్యకపోయారా?" అన్నాడు రంగారెడ్డి ఇంగ్లీషులో.
"అంత ఆధారాల్లేవు. కాగా అతనికి అన్నిరకాల బలమూ వుంది. చాలాకాలంగా అటువాళ్ళ ప్రాంతంలోనే వుంటున్నాడు. పెళ్ళి అయింది. ఇద్దరు పిల్లలు కూడా" అన్నాడు విలియం ఇంగ్లీషులో.
"మీకు తెల్సిన డీటెయిల్స్ చెప్పు."
"వీడు ఆమెను కాశ్మీర్ తీస్కపోయిండు. ఆడికెల్లి ఆగ్రా__ఫ్రమ్ దేర్ నాగ్ పూర్. అక్కడ వీళ్ళిద్దరికీ ఏదో జగడమైంది. అప్పటికి ఆమెకు ఫోర్త్ మంత్. వీడు ఆమెను అక్కడ్నె వదిలిపెట్టి గప్ చిప్ వచ్చేసిండు. సిటీకి గూడ రాకనే వాళ్ళ వూరికి పోయిండు. ఆ పోరి ఆడ సూసైడ్ చేసుకున్నది. ఐతే సర్కమ్ స్టాన్షియల్ ఫ్యాక్టర్స్ వల్ల అట్లని తెలియలేదు. వూహిస్తే అర్ధమైతది కేస్ పుటప్ చేసేదానికి ఆధారాలు లేవు" అన్నాడు విలియం.
"ఆమె అన్న ప్రమోద్ ఎక్కడున్నాడు?"
"నైజీరియా పోయిండు."
ఇద్దరూ లేచి బయటికొచ్చారు.
"దోస్త్ వి నీమీద ఏదన్నా కేస్ పెట్టాలనిపిస్తున్నది!"
"నేను ఆడదాన్నయితే బ్రోతల్ కేసు బనాయించే స్కోప్ వుండేది. అప్పుడు కస్టమర్ వి నువ్వే!" అని నవ్వాడు రంగారెడ్డి.
"సీయూ"
రంగారెడ్డి నడుస్తున్నాడు. స్వెట్టర్ తొడుక్కుని ఇరవై నిమిషాలకి వెంకటావధానింటికి చేరాడు. తలుపు తీసే వుంది.
"అవధానీ" అని పిలిచాడు.
"యెవరూ?" అని లోపల్నుంచి వెంకటావధాని గొంతు.
"నేను రంగారెడ్డిని."
"హలో యెన్నాళ్ళకి! రా లోపలికి!" అని కర్ర కాలుతో లేచి ముందు గదిలోకి రాబోతూంటే, గబగబా అడుగులు వేసి రంగారెడ్డి మధ్య గదిలోకి వచ్చాడు.
"యెప్పుడొచ్చావు?" అన్నాడు వెంకటావధాని.
"వారం దినాలాయె."
"వుంటావా కొన్నాళ్ళు?"
"లే రేపే పోవాల. ఏమిటి ముచ్చట్లు? అట్లున్నవేమి? జయంతి వున్నదా లోన? యు ఆర్ ఎ లక్కీ ఫెలో టు గెట్ సచ్ ఎ నైస్ వైఫ్" అన్నాడు రంగారెడ్డి.
నిట్టూర్చాడు వెంకటావధాని.
"ఏమిటి అట్లయిపోతివి జయంతి ముచ్చట తేవగానే? మీ ఇద్దరికీ జగడమయ్యేనా? ప్రణయకలహం!"
"నా బతుకు చెప్పుకునేలాగా లేదు, రంగారెడ్డి__ జీవితంలో అన్నీ అపశృతులే, అశాంతులే."
"ఛఛా. ఏమిటట్లా ఇదైపోతావు_పరిస్థితులను చక్కబరుచుకోవాలి గానీ__" అన్నాడు రంగారెడ్డి ఇంగ్లీషులో.
"నా మనసులో బాధ యెవరికీ చెప్పుకోలేనిది!"
"ఎవరికి సంబంధించిన ముచ్చట? మీ పేరెంట్స్ వాండ్ల విషయమేమైననా?"
"వాళ్లెప్పుడో నన్నొదిలేశారు గాలికి. జయంతి విషయం."
"ఆర్ యూ సస్పెక్టింగ్ హర్? ఐ విల్ కిల్ యు? అన్నాడు రంగారెడ్డి.
"లేదు ఎంత మాత్రమూ అనుమానించడం లేదు. నేనంటే యెంతో యిదిగా వుంటుంది. కుంటివాడినైనా, జీవితంలో చితికిపోయినా నాకెంతో అండగా తృప్తి కలిగిస్తూ వుంటుంది. కానీ__"
"కానీలు దమ్మిడీలు మీ ఆంధ్రాలోగూడ లేవిప్పుడు! ఏమన్న విషయముంటే చెప్పు. ఆమె నాకు మన నిజాం కాలేజీ టైం నుంచి మంచిగ తెల్సు.
"కొందరు జయంతి గురించి రకరకాలుగా వ్యంగ్యంగా అదోలా అంటూండగా వింటున్నప్పుడు నా మనసులో యేదో వొక భావం కలిగింది. ఈమె గత జీవితాన్ని అసహ్యించుకునే, వీళ్ళ వాళ్ళెవరూ ఈమెతో సరిగా మాట్లాడరట."
"వాండ్లకు ఈమె పెండ్లి చేసుకోవటం యిష్టంలేదు. ఈమె జాబ్ చేసి తెచ్చే పైసలన్నీ వాండ్లు తీస్కొనేటోళ్ళు. అందుకోసం వాండ్ల ముచ్చటంత నా కెరికనే. జయంతిని ఏమని అన్నారసలు?"
"వాళ్ళకోసం చదువుకునే రోజులో లాడ్జీల కెళ్ళేదని__"
పకపకా నవ్వి, "ఇదేమి కొత్త ముచ్చటోలె చెప్పవడ్తివి! ఆ దినాలలోనే కాలేజ్ ల అనుకునేటోళ్ళు. తండ్రి చనిపోయె. ఈమెకోసం ట్రై చేసి ఫెయిలై పోరగాళ్ళు పుకార్లు పుట్టించెటోళ్ళు" అన్నాడు రంగారెడ్డి.
"అంతేనంటావా?"
"అనుటేమి! నాకంతా యెరికనే గదా! నేను తిరగని లాడ్జి గాని తావు గాని వున్నదా! యాడనన్న కండ్లపడి వుండాల గద!"
"అంతేనంటావా?"
"అది సింపుల్ ఫాక్ట్__అది సరే అవధానీ, నేనొక ముచ్చట అడుగుత చెప్తవా?"
"అడుగు రంగారెడ్డీ. నీకు చెప్పకూడనిదేముంటుంది! నా శ్రేయస్సు కాంక్షించే మిత్రుడివి."
"నీ కాలెందుకు ఇరిగిపోయినది? మీ వాండ్లు నిన్నెందుకు వదిలేసిన్రు?"
"నీకు తెలియని సంగతులు కావు. దేనికి అడుగుతావు? స్వయంకృతాపరాధం."
"అట్లజేసి, కుంటోనినయ్య. నీ వాండ్లందరు తరిమేస్తే, విజయ్ కుమార్ వాండ్ల దగ్గర బతకాల్సి వచ్చెగద. అసుమంటి నిన్ను మరి ఆమె ఏమనుకోవాల?"
"లేదు రంగారెడ్డీ! యీ విషయంలో జయంతి దేవతనుకో?"
"అట్లనే ఒకవేళ జయంతి, ఒక ఐడియల్ నెసిసిటీకోసం ఏమైనా అట్లిట్ల వుండిన గూడ తప్పేమున్నది? నీకంటే మేలేగదా!"
"అవుననుకో__"
"అసలు ఏమీ లేనిదానికి యిట్ల సోంచాయించుడేం మంచిగ లేదు. ఏమన్న వున్నాకూడ ఇట్ ఈజ్ రీజనబుల్ టు ఇగ్నోర్. అవధానీ నీదసలు బేసిక్ గా డర్టీ మైండ్. అన్ని డర్టీ గానే ఆలోచిస్తుంటవు. ఇంతకు జయంతి యాడికి పోయింది? కూరగాయలు గిట్ల దినాం నువ్వే తెస్తున్నవా? ఆమె తెస్తదా?"
