Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 99


    "అతనికి యే కామన్ వెల్త్ ఫెలోషిప్పో యిచ్చి పంపతగినవాడు" అన్నాడు శ్రీపతి.
    "అటు నుండి వస్తున్నది ప్రొఫెసర్ పీచుపాటి__వాడి సోదితో యిప్పుడు మన ప్రాణం తినగలడు పట్టుకుని పద పోదాం లోనకి" అన్నాడు రామ్మూర్తి.

                            117

    రంగారెడ్డి భుజాన ఉన్ని స్వెట్టర్ వేసుకుని రాయల్ టాకీస్ పక్కనుంచి యిటు వస్తుంటే జయంతి కనిపించింది.
    సుల్తాన్ బజార్లో కూరలు కొనుక్కుని, ఒక చేతిలో కూరల సంచి ఇంకో చేతిలో ఫోం లెదర్ హ్యాండ్ బ్యాగ్. దాన్లో ఖాళీ టిఫిన్ బాక్సు పెన్నూ గట్రా. జయంతి చాలా కాలంగా బ్యాంకులో క్లర్కుగా చేస్తోంది.
    "ఏం జయంతీ బ్యాంక్ నుండా" అని పలకరించాడు రంగారెడ్డి.
    "అవును కూరలు కొనుక్కుని"
    "యేమి అట్ల డల్ గా వున్నావు?"
    "లేదే బాగానే వున్నానే."
    "యెట్లనో కండ్లవడ్తున్నావు. సంగతేమి చెప్పరాదు?"
    "యేముంది మామూలు కథే. అవసరం తీరినాక తమ్ముడికీ, చెల్లెలికీ అందరికీ పనికిరాని దాన్నయ్యాను. నన్ను వాళ్ళ అక్కనని చెప్పుకోవడం కూడా యిష్టంలేదు వాళ్ళకి. మీకు తెలిసిన పాత విషయమేగా__యిప్పుడు ఇంట్లో__" అని ఆగిపోయింది.
    "అది నేచురల్. అంత మంచితనం పనికిరాదు. తనకు మాలిన ధర్మము తగదని ఆయనెవరో అన్నాడు. యేమి జరిగింది? అవధాని ఏమన్నా అన్నాడా?"
    నడుస్తున్నారు.
    "యేదో విన్నట్లున్నారు. బాధపడుతున్నట్లుగా అనిపిస్తోంది."
    "అనుమానిస్తున్నాడా?"
    "అట్లాగూ అనుకోను."
    "నేనొచ్చి మాట్లాడత" అన్నాడు రంగారెడ్డి.
    "అమ్మో!"
    "భయం దేనికి?"
    "నా పాత జీవితం గురించి చెప్తారా?"
    "చెప్పనైతే చెప్పనుగాని, మంది అట్లా అనుకుంటే నీకేమి? ఐతే మాత్రమేమి? యిప్పటి ముచ్చట కాదు గదా అని అడుగుతా."
    "అమ్మో. ఇంకేమన్నా వుందా!"
    "యేమో? ఆయన ముచ్చటేమి? కాలుగూడ పోగొట్టుకున్నాడు."
    "నాతో రాకండి. నేను చెప్పి తీసుకొచ్చాననుకుంటారు" అంది.
    వెంకటావధానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చి యేడాది కావస్తోంది. సుబ్రహ్మణ్యం సిటీకి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. యిద్దరూ ఒకే బ్యాంకు యీ డిశంబరు నుంచి ఒకే బ్రాంచిలో. జయంతి వేరే బ్యాంకులో. సుబ్రహ్మణ్యం వాళ్ళ అమ్మా, నాన్నా, అన్నా, వదినా అందరితో అదే యింట్లో శాంతతో ప్రశాంతంగా గడుపుతున్నాడు. వొక మగ సంతానం. మళ్ళీ కడుపుతో వుంది.
    "యీ పూట మీకు తీరికేనా?" అంది జయంతి.
    "నాకు యెప్పుడు గూడ పనీ లేదుమ తీరికా లేదు. వచ్చి వారం దినాలాయె. వూకెనే వొస్తి. మర్ల వూరికి పోవాల"
    "పొలం పనులా?"
    "అది గూడ లేదు. నాయ్ననే చూస్కుంటడు. వూకెనన్న వుండాల."
    "యీ రోజు__మా పక్కవాటాలో ఆవిడ__వాళ్ళాయన వూరెళ్ళాడు పొద్దుట రేపు వస్తాడు. నేను వెళ్ళి వంట చేసి ఆవిడతో కాలక్షేపం చేస్తుంటాను. మీరు యింకో గంటకో గంటన్నరకో రండి" అని అంతలోనే "యెందుకో భయంగా వుంది. మీరు నా పాత జీవితం చెప్పకండి దయచేసి" అంది.
    "మేలు జరుగుతదనుకుంటే చెప్త. అదంతా నాకు యిడిసిపెట్టు జయంతీ. అవధాని నాకు బాగా తెలుసు కదా. ఐ కెన్ సెట్ హిమ్ రైట్" అన్నాడు.
    జయంతి ముందుకు నడిచి వెళ్ళింది.
    రంగారెడ్డి వెనక్కి తిరిగి సుల్తాన్ బజార్ వైపు అడుగులు వేసి __ సెంటర్లో బాటా షాపు ముందు నిలుచుని జనాన్ని చూస్తున్నాడు.
    ఐదు నిమిషాలు.
    "యే గోరీ మేరీ ప్యారీ" అన్నాడు వొకామెని. పక్కకి తిరిగి చూసి  ఆగింది.
    "యీ రోజు తీరికేనా?" అన్నాడు ఉర్దూలో.
    "లేదు. ఒకరికి వస్తానని చెప్పాను" అంది ఉర్దూలో.
    "నేను రేపు వూరికి వెళుతున్నాను. వీలైతే చెప్పు మరి?" అన్నాడు.
    "వంద రూపాయలు" అంది.
    "వందా! యాభయ్యేగా?"
    "రేపు ఐతే. ఇవ్వాళ మాటిచ్చిన బేరం వదులుకోవాలి."
    "మరీ అంత అన్యాయానికి పోతే రోగాలతో చస్తావు" అన్నాడు.
    "ఇప్పుడు సరిపడా లేకనా?" అంది.
    "ఐతే పాతిక చాలు!" అని నవ్వాడు.
    "మందుల కోసం ఇంకో పాతిక" అని నవ్వింది.
    "నాక్కూడా తీరిక లేదు యీపూట. రేపు వూరెళుతున్నాను. యీసారి వచ్చినప్పుడు" అన్నాడు.
    "మీలాంటివాళ్ళ పుణ్యం!" అని ముందుకు వెళ్ళిపోయింది. జనాన్ని చూస్తూ నుంచున్నాడు.
    వొక గుడ్డి అతను కర్ర టిక్కుటిక్కు లాడిస్తూ కాలిబాట మీద ఆగాడు, రోడ్డు దాటటానికి. ట్రాఫిక్ రద్దీ వల్ల నిలుచునిపోయాడు.
    రంగారెడ్డి అతని చెయ్యి పట్టుకుని, "ఆ పక్కకు పోవాల్నా?" అని రోడ్డు దాటించి__ అటు కాలిబాట మీద నుంచుని జనాన్ని చూస్తున్నాడు.
    "హలో రంగారెడ్డీ"
    "హలో విలియం"
    "రా. తాజ్ ల కూర్చుందాం జరంత టైం. చాలా దినాలకు కండ్లవడ్తివి" అన్నాడు విలియం.
    నడిచి__తాజ్ లోకి కాక ఇండియా కాఫీ హౌస్ లోకి వెళ్ళారు.
    అవీ యివీ కబుర్లు.
    "సుచిత్ర డెత్ నేచురల్ కాదట. సూసైడ్ చేసుకున్నదట" అన్నాడు విలియం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS