Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 101


    "తనే తెస్తుందయ్యా! నాకు యే పనీ అప్పగించదు. పక్క పోర్షనులో ఆవిడతో మాట్లాడుతూ వుందేమో పిలుస్తానుండు" అని లేచి కర్రకాలుతో నడుస్తూ, ముందు గుమ్మంలోకి వెళ్ళి, "జయంతీ" అని పిలిచాడు వెంకటావధాని.
    "ఆఁ, వొచ్చే" అని చెంగున వచ్చి, "పిలిచారా?" అంది జయంతి.
    "వూఁ మన రంగారెడ్డి వచ్చాడు."
    "అట్లాగా. మీ క్లోజ్ ఫ్రెండ్" అంది.
    "భోజనం వేళయింది. మనతోపాటు భోజనానికి కూర్చోమందాం. సరదాగా కలిసి తిందాం ముగ్గురం. ఏమన్నా స్పెషల్ తయారుచెయ్యి అతనికి" అన్నాడు వెంకటావధాని.
    అంతలో అక్కడికి వచ్చిన రంగారెడ్డి, "స్పెషల్ గిషల్ అంటే భోజనం చెయ్య" అన్నాడు.
    ముందే ప్రత్యేక వంటచేసి వుంచిన జయంతి, "సన్నిహితులకి మనతోపాటు ఏదుంటే అదే" అంది.
    "చూస్తివా అవధానీ నీకు బుద్దిలేదు. జయంతి యెంత మంచిమాట అన్నదో చూడు" అన్నాడు రంగారెడ్డి.
    జయంతి వంక తృప్తిగా సంతోషంగా చూశాడు వెంకటావధాని.

                             118

    పంది కడుపున కుక్కపిల్ల పుట్టి బతికి వుంటేనో, రెండు తలలు యెనిమిది కాళ్ళతో జంతువేదో పుట్టి బతికి వుంటేనో, అలాంటిదేదో జరిగినప్పుడు__జన్మ తండోపతండాలుగా వచ్చి చూసి పోతుంటారు. ఆ తరవాత రోజూ కొందరు. యాత్ర ప్రజలా వచ్చి చూసి పోతుంటారు. అట్లా, ఇందిరా కాంగ్రెస్ వాళ్ళు ఇండిపెండెంట్లు జనతా పార్టీలోకి చేరిపోయారు. చేరిపోతూనే వున్నారు. డిశంబరు మూడో వారంలో కాంగ్రెస్ మరోసారి చీలి, ఆ ప్రభావం రాష్ట్రాలమీదా పడింది. ఎంతో ఐశ్వర్యమూ సంపదా వున్న మనిషి స్వరం కోల్పోయి కట్టుబట్టల్తో నిలుచున్న స్థితిలో ఆమె వుంటే, చవాన్ తదితరులు కాంగ్రెస్ ని చేజిక్కించుకోవాలన్నట్లుగా ప్రవర్తించి__కాసు బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ గా ఇందిరాగాంధీకి ప్రత్యర్థి కాంగ్రెస్ యేర్పడింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వెంగళ్రావు అటూయిటూ వూగిసలాడి, ఆ స్థితిలో వున్న ఇందిరాగాంధీని వదిలి, బ్రహ్మానందరెడ్డితో వున్న విభేదాలను సరిచేసుకుని, "కాసు కాంగ్రెస్"లో చేరటంతో ఏ.పి.సి.పి. ఇందిరాగాంధీ నాయకత్వాన్ని తిరస్కరించింది. దాంతో, రాష్ట్రంలో ఇందిరా కాంగ్రెస్ పాలన కాక కాసు చవాన్ ల కాంగ్రెస్ పాలన వచ్చినట్లయింది.
    యీ పరిస్థితిలో రాజకీయులు అటు జనతాలోనో యిటు కాసు కాంగ్రెస్ లోనో చేరటం సహజం. కాంగ్రెస్ ప్రముఖంతా వెంగళ్రావు కాయకత్వంలో వున్న కాసు కాంగ్రెస్ లో వుండిపోయారు. ఇందిరా కాంగ్రెసులో ఎవరూ మిగిలిలేరు__పి.వి. లాంటి ఒకరిద్దరు తప్పించి. యీ తరుణంలో గోవర్ధన్ రెడ్డి కాసు కాంగ్రెసులోనే వుండిపోయాడు. యింకా జనతాలో చేరని కొందరు జనతాలో చేరిపోయారు. రవికి తన నియోజకవర్గంలో పలుకుబడి వుండటమేకాక తనని సమర్ధించే ఇండిపెండెంట్ శాసనసభ్యులున్నారు. వాళ్ళలో కొందరిని కలుపుకుని ఇందిరా కాంగ్రెసులో చేరాడు. యింత తెలివైనవాడు అటు జనతాలో అయినా యిటు కాసు కాంగ్రెసులో అయినా చేరితే సముచిత స్థానం పొందగల స్థితిలో__ మునుగుతున్న వోటి పడవలో చేరాడు. తెలివితక్కువగా అన్నారు. అసలు అలా ఇండిపెండెంటుగా వుండిపోతే తన విలువ ప్రత్యేకత ఇనుమడించును__అనీ అన్నారు.
    ఫిబ్రవరిలో దక్షిణాది రాష్ట్రాలలో ఎన్నికలు ప్రకటించినందున సీట్ల వేటలో__ అటు జనతాలోనూ, యిటు కాసు_వెంగళ్రావుల అధికార కాంగ్రెస్ లోనూ సీట్లు సంపాదించలేని అనామకులు ఇందిరా కాంగ్రెస్ లో చేరారు__ గెలుస్తామని లేకపోయినా, రాజకీయపు దురదకొద్దీ.
    కాంగ్రెస్ చిహ్నం ఆవుదూడ అధికార కాంగ్రెస్ కి వెళ్ళింది. ఇందిరా కాంగ్రెస్ కి హస్తం గుర్తు ఇచ్చారు. ఏనాటినుంచో కాంగ్రెస్ కి రాట్నం, ఎద్దులు కాడీ, ఆవూదూడ లాంటి చిహ్నాలు వుంటూ గాంధీ ధోరణికీ చూచ్యంగా వుంటున్నాయి. హస్తం గుర్తు సాముద్రికానికో, బెదిరింపుకో సూచ్యంగా అనిపించవచ్చు. కాదంటే, అభిమానానికి సూచ్యం కావచ్చు__ తనే దిక్కూ దరీ లేక బెంబేలు పడుతున్నట్లుగా దైన్యస్థితిలో వున్నట్లుగా వున్న మనిషి అభయహస్తం చూపెడితే నవ్వొస్తుందేమోగానీ మరెలాగూ అనిపించకపోవటం సహజం.
    వుత్తర భారతం అంతటా జనతా గాలి ఉధృతంగా వీస్తోంది. కేంద్రంలో జనతా పాలన ఆంధ్రప్రదేశ్, కర్నాటకలలో జనతాకీ ఆ తరవాత అధికార కాంగ్రెస్ కీ వస్తాయనీ ఇందిరా కాంగ్రెస్ వంగి యేరుకున్నట్లుగా చిల్లరమల్లార పోగుచేసుకుంటుందనీ__ రాజకీయ కోవిదులే కాక, విద్యాధికులూ, తదితరులూ అనుకున్నారు.
    ఎలక్షన్లు ముగిశాయి. రవి తన నియోజకవర్గం నుంచి ఇండిపెండెంటుగా పోటీ చేసినా, యే పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినా గెలవటం తథ్యం. జనతానీ అధికార కాంగ్రెస్ నీ రకరకాల కోణాలనుంచి విమర్శిస్తూ ఉపన్యాసాలిచ్చాడు, వివిధ వర్గాలలో వివిధ రీతుల్లో. తన ఓటర్లలో సంపన్నులు చాలా తక్కువ.
    ఆ పార్టీల వాళ్ళు, ఎమర్జన్సీలో ఇందిరాగాంధీ చేసినదంటూ వర్ణించే ఘాతుకాలను, రవి సందర్భ అనివార్యతలుగా వివరించాడు. ఒంటరిదాన్ని చేసి యీ పెద్దలంతా ఎలా హింసిస్తున్నారో వివరించాడు. యిదంతా తన తరపున వుండే అభ్యర్థుల నియోజకవర్గాలలో. తన నియోజకవర్గంలో యే పార్టీ ప్రసక్తీ తీసుకురానక్కరలేదు. తను వ్యక్తిగా, వొక అభ్యర్థిగా యే వాడకట్టున యెలా మాట్లాడాలో అలా మాట్లాడితే చాలు.
    ఫిబ్రవరి ఇరవై యెనిమిది. ఎన్నికల ఫలితాలు.
    ఫలితాలు అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశాయి. కర్నాటకలోనూ అంతే జనతా పరిగేరుకున్నట్లుగా కొన్ని సీట్లు గెలుచుకుంది. అధికార కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోయింది. ఇందిరా కాంగ్రెస్ కి ఎబో ల్యూట్ మెజారిటీ వచ్చింది. అనామకులంతా శాసనసభ్యులయ్యారు వాళ్ళకై వాళ్ళు యేమీ కాలేనివాళ్ళు. అంటే ఇందిరాగాంధీకి ప్రజలు ఓటు వేశారని నిర్దారించక తప్పదు. చెంబు గుర్తో, చెప్పు గుర్తో ఇవ్వాల్సింది, అని కొందరన్నారు అక్కసుగా. ఆ గుర్తు యిచ్చినా అన్ని ఓట్లూ వచ్చివుండును. ఇప్పుడు హస్తం ఇందిరమ్మ అభయహస్తం. మూలపుటమ్మ అభయహస్తం అయింది. అప్పుడు చెప్పు గుర్తు రామపాదుకలుగానూ భగవత్పాదుకలు గానూ ఐవుండును.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS