"మధ్యాహ్నం నువ్వే చెయ్యాలి" కోపంగా అంది.
"ఆ మాటే నోటి నుంచి రాలితే ముత్యాలు రాలిపోతాయా? ప్రపంచంలో ఎవరికీ కొత్తగా పెళ్ళవనట్లు, ఈవిడగారొక్కరికే అయినట్లు" అనుకుంటూ వెళ్ళిపోయాడు.
"చూడండి... వీడు నా పేషెన్స్ పరీక్షిస్తున్నాడు."
"నీదేకాదు, అందరిదీ."
అతను రడీ అయి ఆఫీస్ కెళ్తూంటే అతనితోపాటు బయటి వరకూ వచ్చిందామె.
"నేను చెప్పినవన్నీ గుర్తున్నాయిగా?"
'ఓ ఫైవ్ స్టార్ హోటల్ నుంచి ఇరవైమందికి డిన్నర్ హోమ్ డెలివరీ ఆర్డరివ్వాలి, ఆ తర్వాత దేవిగారికి ఓ మాంఛి గిఫ్ట్, ఇవిగాక ఓ అందమయిన పూలదండ. అంతేకదా?"
"అసలయింది మర్చిపోయారు. చూశారా?"
"ఏమిటది?"
"సాయంత్రం నాలుగ్గంటలకల్లా ఇంటికి రావటం."
"ఓ! ఐయామ్ సారీ... తప్పకుండా వచ్చేస్తాను."
గోపాల్రావ్ ఆఫీస్ కొచ్చేశాడు.
వస్తూనే రిసెప్షన్ లో కొత్త అమ్మాయి కూర్చుని ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు.
"హలో! మీరు కొత్తగా వచ్చారా?" వద్దనుకుంటూనే అడిగాడు.
"అవున్సార్!" చిరునవ్వుతో అంది.
అహా! ఎంత బ్యూటిఫుల్ గా వుంది నవ్వుతూంటే.
"ఐయామ్ గోపాల్_ వైస్ ప్రెసిడెంట్ సేల్స్."
"గ్లాడ్ టు మీట్ యూ సర్! మైనేమ్ ఈజ్ సురేఖా."
"ఒండర్ ఫుల్ నేమ్. మీకో విషయం చెప్పనా?"
"వెల్ కమ్ సర్."
"యూ ఆర్ వెరీ బ్యూటిఫుల్."
"ఓ... థాంక్యూ సర్."
గోపాల్రావ్ తన ఛాంబర్లోకి వచ్చేశాడు.
సీట్లో కూర్చున్నాక ఆశ్చర్యం కలిగింది.
కొద్దిగంటల క్రితమే తను చెంపలు వేసుకున్నాడు. ఇంక జన్మలో ఏ ఆడపిల్లతోనూ మాట్లాడకూడదని, ఇంకెప్పుడూ సీతకు కోపం తెప్పించకూడదని.
కానీ ఎదురుగా ఆడపిల్ల కొంచెం ఎట్రాక్టివ్ గా కనిపించేసరికి మొత్తం గాలికొదిలేశాడు.
లోలోపల భయం వేసిందిగానీ అంతలోనే ధైర్యం తెచ్చుకున్నాడు.
తన భ్రమగానీ ఆఫీసులో విషయాలు సీతకెలా తెలుస్తాయ్?
లైఫ్ లో ఈ మాత్రం ఎడ్వంచర్ లేకపోతే ఎలా? అతనికి రాత్రి ఎగ్జిబిషన్ లో జరిగిన సీన్ కళ్ళముందు కనిపించింది.
"నో... వద్దు... ఎ బర్డ్ ఇన్ హాండ్ ఈజ్ వర్త్ టూ ఆర్ త్రీ ఇన్ ది బుష్."
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ విజయ్ వచ్చాడు హడావుడిగా.
"గురూ_ సిగరెట్."
గోపాల్రావ్ సిగరెట్ యిచ్చాడు.
"ఆ రోజు మా ఇంట్లో పార్టీ కొచ్చినప్పుడు మా ఇంటికెదురుగా కనిపించిన బ్యూటీ క్వీన్ గుర్తుందా?" సిగరెట్ వెలిగించుకుని అన్నాడు.
"భలే ఫిగర్ గురూ! ఎలా మర్చిపోతాం?"
"ఆ ఫిగర్తో నిన్న సినిమాకెళ్ళాను."
గోపాల్రావు అదిరిపడ్డాడు.
"నో... నేన్నమ్మను."
"నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకటే."
"కానీ ఇంటికెదురుగా వ్యవహారం_ మీ మిసెస్ కి తెలిస్తే?"
"తెలిస్తే తెలీనీ గురూ! నాల్రోజులు గొడవచేసి వూరుకుంటుంది. దాని కోసమని లైఫ్ లో స్వీట్ ఎఫైర్స్ ఎలా వదులుకుంటాం_"
"అదృష్టవంతుడివి.. మీ మిసెస్ నాల్రోజుల గొడవతో వదిలేస్తుంది. మా మిసెస్ భూమీ ఆకాశం ఒకటి చేసేసి ఆ తర్వాత అవి రెండూ జన్మలో కలుసుకోకుండా విడగొట్టేసి ముక్కలు ముక్కలు చేసేస్తుంది."
"పెళ్ళయిన కొత్తలో అలాగే వుంటార్లే_ తర్వాత నార్మల్ అయిపోతారు."
అతను వెళ్ళిపోయాడు.
గోపాల్రావ్ ఆఫీస్ వర్కులో పడిపోయాడు.
సరిగ్గా మూడింటికి ఆఫీస్ నుంచి బయటపడ్డాడు.
ఓ గంటసేపు షాపింగ్ చేసి సీత బర్త్ డే గిఫ్ట్ కొనుక్కుని ఇంటికెళ్ళిపోవటమే.
మిగతా ఏర్పాట్లన్నీ ఫోన్ మీద చేసేశాడు.
షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరకొచ్చేసరికి కొత్తగా ఓపెన్ చేసిన ఐస్ క్రీమ్ గార్డెన్ పార్లర్ లో ఓ అందమయిన అమ్మాయి ఒంటరిగా ఐస్ క్రీమ్ తింటూ కూర్చోవటం చూసి కొంచెం టెంప్ట్ అయ్యాడు.
అదివరకులాగా అమ్మాయిలను పలుకరించకపోయినా, ఆ అమ్మాయిల పక్కన కూర్చుని అందాల్ని ఆస్వాదించటంలో తప్పు లేదనిపించిందతనికి.
నెమ్మదిగా వెళ్ళి ఆమెకు సమీపంగా ఉన్న ఖాళీ బెంచ్ మీద కూర్చున్నాడు.
బేరర్ వచ్చి మెనూ కార్ట్ యిచ్చాడు.
* * * *
ఇన్ స్పెక్టర్ రాంబాబుకి వెంటనే తెలిసిపోయింది. విక్కీని పోలీసులు అరెస్ట్ చేశారని. ఎక్కడలేని ఆనందం కలిగిందతనికి.
ఇంక ఆ వజ్రాలన్నీ తనవే_ అడ్డు కాస్తా తొలగిపోయింది.
మధ్యాహ్నం రెండు గంటలకు వజ్రాలు దాచిన ఆ ఇంటి దగ్గరకు చేరుకుని డూప్లికేట్ తాళం చేతులతి ఇనుపపెట్టె ఓపెన్ చేసి, లోపల ఖాళీగా కనిపించేసరికి_ షాక్ తిన్నాడు.
వెనుక నుంచి కిలకిల నవ్వు వినిపించి అదిరిపడి వెనక్కు తిరిగాడు.
రాణి విరగబడి నవ్వుతోంది.
"ఇన్ స్పెక్టర్ గారూ! తెలివితేటలు మీ బాబుగాడి సొంతం కాద్సార్! విక్కీ మీకన్నా రెండు రాబరీలు ఎక్కువ చదివిన వాడు."
"అంటే?"
"మీకన్నా ముందే కాజేశాడు."
"నీకెలా తెలుసు?"
"మరీ ఇంత బిలో యావరేజ్ పోలీసేమిటి సార్ మీరు? ఎలా తెలుసేమిటి? ఇనప్పెట్టె ఖాళీగా కనిపిస్తూంటే అర్థం ఇదే కదా?"
రాంబాబు ముఖం పాలిపోయింది.
కోపం, నిస్సహాయతలో కొద్ది క్షణాలు ఏమీ మాట్లాడలేకపోయాడు.
హఠాత్తుగా రాణివైపు అనుమానంగా చూశాడు.
"నువ్వెలా వచ్చావిక్కడికి?"
"అదిగో పోలీస్ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. నీమీద నమ్మకం లేక నిన్నే కనిపెడుతున్నాను. నువ్వు జీప్ లో ఇటు తిరిగేసరికి నాకర్ధమైపోయింది. నువ్వు విక్కీకన్నా పెద్ద దొంగవని! మా ఇద్దరికీ హాండిచ్చి వజ్రాలు కొట్టేయబోతున్నావని. అందుకని ఆటోలో వెంటపడి వచ్చాను."
