తర్వాత ఎప్పటికో భర్త లోపలికి వచ్చాడు. రాగానే అలసటగా నా పక్కన వాలి పడుకుని అన్నాడు- "మనం సినిమాకి వెళ్ళి తప్పుచేశామేమో కదూ!"
నేనేం మాట్లాడలేదు. ఇంకేదో ఊహించుకున్నాను. నిశ్చయంగా ఆ ప్రశ్న కాదు...
అంతలో అతనన్నాడు- "నాకు గిల్టీగా వుంది. నేను పెళ్ళయ్యాక వాళ్ళ గురించి సరిగ్గా పట్టించుకోవట్లేదేమోనని...."
నాకిక వినాలనిపించలేదు. కొద్దిగా చెమర్చిన అతని కళ్ళను చూస్తుంటే నాకు ఎంత ఆవేశమొస్తుందోనని భయపడి అతని మొహంకేసి చూడకుండా లేచి "భోజనానికి వస్తారా?" అని అడిగాను. "వద్దు...నాకు మూడ్ లేదు. అలసిపోయాను".
నేనేం బ్రతిమాలలేదు. నిశ్శబ్దంగా డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచాను. అందరూ అప్పటికే తినేసినట్లున్నారు. రెండు ప్లేట్లు మాత్రం టేబుల్ మీద బోర్లించి వున్నాయి. నా ప్లేట్లో వడ్డించుకుని తింటున్నాను. నేనేం తింటున్నానో కూడా నాకు తెలియటం లేదు. కేవలం అతని ఫీలింగ్స్ గురించి నాకేం పట్టదన్న విషయం అతను తెలుసుకోవటం కోసమే తింటున్నాను. నేను పెరుగు వడ్డించుకుంటూ వుండగా నా ఆడపడుచు ఫ్రిజ్ లోంచి రెండు ఆపిల్స్, పాలు నా గదిలోకి తీసుకెళ్ళడం గమనించాను. నాకు మరింత ఒళ్ళు మండిపోయింది. నేను స్వార్థపరురాలినన్న విషయం ఇన్ డైరెక్టుగా తెలియచేసే ప్రయత్నమా ఇది? లేక భార్యకన్నా మేమే ఎక్కువ అని అన్యాపదేశంగా చెప్పే చర్యా?
నా ప్లేట్ సింక్ లో వేసి చేతులు కడుక్కుని, టేబుల్ తుడిచే గుడ్డ కోసం వెళ్తూండగా నా అత్తగారు టీవీ లో వచ్చే 'ఫ్యాషన్ షో' చూస్తూ కనపడింది. నాలో బలవంతంగా అణుచుకున్న ఆవేశం ఏదో మళ్ళీ రాజుకున్నట్లైంది. నా భర్తని లాక్కొచ్చి ఆ దృశ్యం చూపిద్దామనిపించింది. కానీ అతనంటాడు- "సరైన టైంలో మనం పట్టించుకుని టాబ్లెట్ ఇచ్చి, బామ్ రాయడంవల్ల తలపోటు ఉధృతం కాకుండా తగ్గిపోయింది చూశావా?" అని.
నాకు నిస్పృహ కలిగింది.
తడి చేతుల్ని టవల్ కి తుడుచుకుంటూ గదిలోకి ప్రవేశించిన నాకు ఆడపడుచూ, నా భర్త మంచంమీద పడుకుని కబుర్లు చెప్పడం కనిపించింది. నా ఆడపడుచు మా....న....సి....కం....గా అలసిపోయిన అతని పొట్టమీద చెయ్యేసి, అతని షర్ట్ బటన్ తో ఆడుకుంటోంది. నా భర్త ఆ అమ్మాయి జుట్టు నిమురుతున్నాడు. టేబుల్ మీద వుంచిన మల్లెపూలు నన్ను అపహాస్యం చేస్తూంటే, నేను నిశ్శబ్దంగా ఆ గదిలోంచి బయటికి వచ్చేశాను. బయట వెన్నెల నన్ను చూసి జాలిగా నవ్వుతోంది. నాకు ఆలోచించాలనిపించలేదు. ఏముంది ఆలోచిస్తే? భవిష్యత్తుపట్ల నిరాశా, ప్రస్తుతం దుఃఖం తప్ప....!
ఒక కొత్త పెళ్ళికూతురు భయం భయంగా అత్తగారింట్లో అడుగు పెట్టినప్పుడు- అక్కడ వున్న వారందరూ ఆమెమీద తమ అధికారం ఎలా నాజూగ్గా ప్రదర్శించి, ఆమెని మానసికంగా బలహీనురాల్ని చేసి, తమ తమ స్థానాల్ని నిలబెట్టుకుంటారో నాకు అర్థమవుతోంది.
డ్రాయింగ్ రూంలో వున్న సోఫాలో పడుకున్నాను. టీపాయి మీద వున్న పత్రికను చేతిలోకి తీసుకున్నాను.
చదువువైపు నా మనస్సుని మళ్ళించుకోవాలనే న కోరిక అప్పుడు బలపడింది.
7
మా ఇంట్లో పుస్తకాలకేం తక్కువలేదు. అయితే అవి చదవడానికి మాకే టైముండదు. తీరిక సమయాల్లో కూడా నేను ఖాళీగా వుండదల్చుకోలేదు. దానివల్ల మనస్సుని మరింత కలత పరచడం తప్ప మరో ప్రయోజనం వుండదని నాకు అర్థమయింది.
నా దినచర్యలో కూడా మార్పొచ్చింది. పొద్దున్నే ఐదింటికి నిద్రలేవడం నేర్చుకున్నాను. ఏడింటి వరకూ పడుకునేంత నిద్ర కూడా రావడంలేదు. చల్లగాలికి ఇంటిముందు కాసేపు నడుస్తున్నాను. జాగింగ్ కి వెళ్దామనే వుంది. కానీ చీరలోనో, నైటీలోనో వెళ్ళడం కుదరదు. కనుక వూరుకున్నాను. ఆ ఉషోదయం, ఇంటి ముందు మొక్కలు, సూర్యోదయం, దూరంగా గుళ్ళో సుప్రభాతం నా మనస్సుకి స్వాంతనని చేకూరుస్తున్నాయి. తరువాత నా పనుల్లో మునిగిపోతున్నాను. పేపర్ వచ్చే సమయానికి నన్ను నేను ఫ్రీగా వుంచుకుంటున్నాను. నా భర్తకి కాఫీ చేసి వంటింట్లో అలా వుంచేస్తాను. కప్పు తీసుకుని గదిలోకి వెళ్ళి నా భర్తకి మేలుకొలుపు పాడడం అనేది మెల్లిగా నా దినచర్యల్లోంచి తొలగిపోయింది. అది అతన్ని బాధించిందని కూడా నేననుకోను.
అప్పుడే నాకో ఆలోచన వచ్చింది.
* * *
మరుసటి రోజు చాలా క్యాజువల్ గా చెప్తున్నట్టు "నా రీసెర్చి మొదలు పెట్టాలనుకుంటున్నా"నని నా భర్తతో చెప్పాను.
అతను కాసేపు ఆలోచనలో మునిగినట్లుగా కన్పించాడు, "రిసెర్చి అంటే నువ్వు బయటి కెళ్ళాల్సొస్తుంది. చాలా టైము చదువుకి కేటాయించవలసి వస్తుంది. సంసారమూ, చదువూ రెండూ మానేజి చెయ్యాలంటే కష్టమవుతుందేమో కదా!" అన్నాడు బాగా ఆలోచించి. "సంసారం కాదు; పనీ, చదువు అనండి" అందామనుకున్నాను కసిగా. కానీ అతనితో గొడవ పడటం నా ఉద్దేశ్యం కాదు. "కష్టమే మరి. కానీ కష్టపడకుండా ఏదైనా ఎలా సాధించగలం?" అన్నాను. అతనికి నా చదువు విషయం రుచించలేదని నా కర్థమయింది. నేను 'ఇంట్లో పని' తప్ప మరేది చేసినా అతనికి ఇష్టం వుండదని నాకు తెలుసు.
"సర్లే... నీ ఇష్టం. ఇంట్లో పనీ, చదువూ రెండూ గొడవలు రాకుండా చెయ్యగలిగితే నాకె సమస్యా లేదు" అన్నాడు.
"సరే... సరే...." అని సంతోషంగా ఒప్పేసుకున్నాను.
"అంతేకాదు... నీవు పగలంతా యూనివర్శిటీ చుట్టూ తిరగడం మొదలుపెడితే ఇంట్లో ఇబ్బందిగా వుండొచ్చు. అందుకే సాధ్యమయినంతగా ఇంట్లోనే వీలుచూసుకుని రిఫర్ చేసుకుంటూ వుండు" అని కూడా అన్నాడు. అలాగేనని అప్పటికి తలూపేశా కానీ, దానివల్ల మరిన్ని ఇబ్బందులొస్తాయని అప్పట్లో వూహించలేకపోయాను.
యూనివర్శిటీలో గైడ్ ని కుదుర్చుకోవాలన్నా, జర్నల్స్ లో రెండు ఆర్టికల్స్ పబ్లిష్ అవ్వాలన్నా, బోలెడన్ని పుస్తకాలు తిరగేయాలన్నా మొదట్లో చాలా తిరగాల్సొస్తుంది. మా ఇంట్లో నా చదువుకి ఎలాంటి అభ్యంతరాలూ బాహాటంగా మాత్రం రాలేదు. (ఏవి మాత్రం అలా వచ్చాయనీ మా ఇంట్లో?)
"ఈ రోజెందుకమ్మాయి? రేపు దశమి... మంచి రోజు. రేపే మొదలెట్టొచ్చుగా!" ఓ రోజు. "ఈ రోజు కాస్త సాంబారు పొడి, కూరపొడి దంపుకోవాలి. కాస్త ఇంట్లో వుండి సాయపడ్దూ" అని ఇంకో రోజు. "ఈ రోజెవరో చుట్టాలొస్తున్నారమ్మాయ్... ఇంటి కోడలివి, నువ్వు లేకపోతే ఎలా చెప్పు?" అనీ అడ్డుపడేది నా అత్తగారు.
అన్ని అడ్డంకులూ తప్పించుకుని నేనేదో బయటపడ్డా ఆవిడ సర్వవిధాలా నన్నాపడానికి ప్రయత్నించేదని నాకు అన్పించేది. లైబ్రరీ పుస్తకాలన్నీ ఇంటి కివ్వరు. కొన్ని అక్కడ కూర్చుని చదువుకోడానికి మాత్రమే అనుమతిస్తారు. నాకు చీటికీ మాటికీ వెళ్ళడానికి కుదిరేది కాదు. వెళ్ళినా గంటా. అరగంటా సరిపోదు. అందుకే నేను కొన్ని ముఖ్యమైన పుస్తకాలు కొనుక్కోవాలనుకున్నాను. అవి చాలా ఖరీదైనవి.
మొహమాట పడుతూనే పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బుకావాలని నా భర్తని అడిగాను. "ఎంత కావాలి?" అని అడిగాడతను.
"సుమారు నాలుగు వేలు". చెప్పడానికి నాకెంతో ప్రయత్నం కావాల్సొచ్చింది.
"ఇలాగైతే నీ చదువు సాగడం కష్టమేమో!" అన్నాడతను.
"మీరేమో బ్యాంక్ ఉద్యోగి. పదేళ్ళ సర్వీసుంది. మీరు మీ భార్యకోసం నాలుగువేలు ఖర్చు పెట్టటం కష్టంగా తోస్తోందా?" అని అడిగాను ఉక్రోషంగా.
"అది అనవసరమైన ఖర్చు అని నా ఉద్దేశ్యం. రీసెర్చివల్ల ఏం ఉపయోగం?" అన్నాడు.
'జ్ఞానం వల్ల ఏ ఉపయోగం' అని అడిగితే నేనేం చెప్పను?
"వంట చేసుకునేదానికి రీసెర్చి ఎందుకని అడుగుతున్నారా? ఉద్యోగం చేయటానికి వున్న చదువు చాలుకదా అని అడుగుతున్నారా?" అన్నాను.
"ఇంట్లో ఏం చెప్పను?"
"హనీమూన్ ఖర్చు అని చెప్పండి" వెక్కిరిస్తున్నట్టు సమాధానం ఇచ్చాను. అతడు మొహమాటంగా "చూద్దాంలే" అన్నాడు. మరుసటిరోజు ఆ విషయం తల్లికి చెప్పినట్టున్నాడు. ఆవిడ మా ఆడపడుచుతో, "నీ పెళ్ళి ఇప్పట్లో చేస్తామా తల్లీ?" అనటం వినిపించింది. షాక్ తగిలినట్టయింది. నేనిక్కడ ఉమ్మడి కుటుంబాల్లో మానవ సంబంధాల గురించీ, మాతృ-పితృస్వామ్య వ్యవస్థల గురించీ చర్చించబోవటం లేదు. కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చినట్టు నాకు ఉద్యోగం వచ్చింది.
8
నాకు ఉద్యోగం వచ్చిందని మా అమ్మ మా ఇంటినుంచి ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను మొదట నమ్మలేదు. పెళ్ళికి ముందు నేను సర్వీస్ కమిషన్ పరీక్ష పాసయ్యి, ఇంటర్వ్యూకి వెళ్ళటం వల్ల ఆ విషయం అప్పుడే మరిచిపోయాను.
నా ఆనందానికి అవధులే లేవు. ఇప్పుడు నేను లెక్చరర్ని! ప్రపంచమంతా నా పాదాల ముందున్న గర్వం కలిగింది.
నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమై ఇక ముందంతా మంచిరోజులే నన్న భావన (భ్రమ?) కలిగింది.
స్త్రీవాదులు వ్రాసే ఆర్థిక స్వాతంత్ర్యం లభించింది నాకు....
... నా ఉద్యోగానికి మా ఇంట్లో అభ్యంతరాలేం రాలేదు. "పోన్లే నీకీ ఇంటిపనుల నుండి కాస్త తెరపి" అంది నా అత్తగారు.
అదేదో నన్ను దెప్పుతున్నట్లుగా తోచింది. అయినా నా ఆనందంలో అదేం నేను పట్టించుకోలేదు. నా భర్త, ఆడపడుచు, తోడికోడలు అందరూ నన్నభినందించారు. నేను మనస్ఫూర్తిగా వాళ్ళ అభినందనల్ని స్వీకరించాను. "స్వీట్స్ తెప్పించాలి" అని పట్టుపట్టింది నా ఆడపడుచు.
సాయంకాలం ఏడింటికి ఇంటికి వచ్చిన నా బావగారికి ఈ శుభవార్త చెప్పి స్వీట్స్ అందించాను నేను.
"ఓ, రియల్లీ? కంగ్రాట్స్!!" అని చాలా ఆనందంగా స్వీటందుకున్నాడాయన.
ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో నన్నభినందించినంత ఆనందం కలిగింది. అన్ని వివరాలడిగి తెలుసుకున్నాడాయన. నాకు షేర్ల గురించి తెలుసునని విని, ఆశ్చర్యంగా "నీ సబ్జెక్టు సైన్సు అయితే నీకీ స్టాక్ మార్కెట్లో అభిరుచి ఎలా కలిగింది?" అనడిగాడాయన. నేను బిజినెస్ ఇండియాలు, కాపిటల్ మార్కెట్ పుస్తకాలు చదువుతూ వుండటం, అందులో అక్కడక్కడా అండర్ లైన్ చేయడం బహుశా ఆయన గమనించివుంటాడనుకున్నాను నేను. నాకా అలవాటు మానాన్న, అన్నయ్యల నుండి వచ్చింది. వాళ్ళు చాలా డబ్బు షేర్లు, డిబెంచర్లలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అందుకే ప్రతిరోజు మార్కెట్ స్టడీ చేసేవాళ్ళు. అదే చెప్పానాయనతో.
"గుడ్!" మెచ్చుకోలుగా చూసి, "ఏదో బ్రోకర్ చెప్పినవి విని, కొనడమేగానీ మొత్తం మార్కెట్ ని పరిశీలించగలిగేంత తీరిక నాకు దొరకదు. నీకీ రంగంలో ఆసక్తి వుండడం నా అదృష్టం. ఇకనుండీ నీ దగ్గర్నుంచి టిప్స్ తీసుకోవచ్చన్నమాట. ఐయామ్ గ్లాడ్" అన్నాడాయన.
