"ఒకలా అయితే మనం తక్కువపాటి శిక్షతో తప్పించుకోవచ్చు" అన్నాడు.
"ఎలా?"
"తప్పువప్పుకొని క్షమాభిక్ష అర్ధించటం ద్వారా."
ఉలిక్కిపడ్డాను.... చెయ్యని తప్పు వప్పుకొని క్షమాభిక్ష అర్ధించటం....?!
మళ్ళీ అతనే లేస్తూ, "రేప్పొద్దున్నవరకూ నాకు టైమివ్వండి, ఈ విషయం గురించి ఆలోచించి చెబుతాను" అని వెళ్ళిపోయాడు. నేను ఆలోచనలో పడ్డాను. ఎటూ నాకు శిక్ష తప్పదు. తప్పు వప్పుకోవాలా?.... వప్పుకోకుండా ఎక్కువ శిక్ష అనుభవించాలా?
మరునాడు నన్ను కోర్టులో తీసుకెళ్ళబోయేముందు అతను దాదాపు పరుగెత్తుకొంటూ వచ్చాడు. వస్తూనే "గుడ్ న్యూస్" అన్నాడు, ఏమిటని అడిగాను.
"మనం పెట్టిన కేసుకి కోర్టు వప్పుకుని వాళ్ళకి సమన్లు పంపింది. నీ చెల్లెల్ని పెళ్ళి చేసుకొమ్మని కోర్టు అతడిని ఆదేశించేరోజు దగ్గిరలోనే వుంది. అలా కాని పక్షంలో బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద అతడికి జైలు శిక్ష పడవచ్చు! కానీ అతడి తండ్రి అంత రిస్కు తీసుకోడు. బహుశా రాజీకి వస్తాడు, మీ మీద కేసు ఉపసంహరించుకోవచ్చు కూడా!"
చాలాకాలం తరువాత సంతోషించాను. నా చెల్లి జీవితం బాగుపడితే చాలు! నా విషయంలో కళ్ళు లేకుండా పోయినా కోర్టు, కనీసం అతడి విషయంలో నాలుగు కళ్ళతో న్యాయాన్ని పరిరక్షిస్తే చాలు.
....జడ్జిముందు__ ఆ రోజు కోర్టులో నేను తప్పు వప్పుకున్నాను. నా తరపు లాయరు దీన్ని మొదటి తప్పుగా క్షమాపణ వేడుకున్నాడు.
తరువాత జడ్జిమెంటు వచ్చింది.
"పట్టపగలు ముద్దాయి ఎందుకు ఆ ఇంట్లో ప్రవేశించాడో, బయట తలుపు తీసి వుండగానే రేప్ చెయ్యటానికి ఎలా ప్రయత్నించాడో ప్రాసిక్యూషన్ సరిగ్గా నిరూపించలేకపోయింది. ముద్దాయికి రత్తి ఇంతకుముందే తెలుసా? ఇదేమీ కనుక్కోలేదు. ఇంతగా లూజ్ గా జరిగింది ఇన్వెస్టిగేషను. మామూలుగా అయితే కొట్టెయ్యవలసిన కేసు అది. కానీ ముద్దాయి స్వయంగా తను రేప్ ప్రయత్నము చేసినట్టు వప్పుకున్నాడు కాబట్టి చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ముద్దాయిని గిల్టీగా నిర్ధారించి అయిదు సంవత్సరాలు కఠినశిక్ష విధిస్తున్నాను. ముందు ముందు ప్రాసిక్యూషను మరింత జాగ్రత్తగా కేసులు డీల్ చేస్తుందని ఆశిస్తున్నాను."
బోనులో కుప్పలా కూలిపోయాను. మేము ఎంత తప్పుచేసేమో అర్ధమయింది. నాకు చూపించలేక మొహాన్ని చేతుల్లో దాచుకొని లాయరు బయటకు పరుగెత్తాడు.
అయిదు సంవత్సరాలు....
ఈ లోపులో నా చెల్లెలు ఏమవుతుంది? అసలిదంతా ఇలా ఎందుకు జరిగింది? ఇంత తెలివితక్కువగా ఎలా ప్రవర్తించాం?
ఇద్దరు పోలీసులు నన్ను చెరో రెక్క పట్టుకుని బయటకు తీసుకొచ్చి వ్యాన్ ఎక్కించబోతున్నారు.
అప్పుడే వచ్చాడు అక్కడికి అతడు.... పపట్ లాల్.
నా చెల్లెలిని మోసం చేసినవాడు.
నన్ను చూసి నవ్వాడు. నాకు అతడిని చూస్తే కోపం రాలేదు. కోపం తెచ్చుకోవటానికి ఇది సమయం కాదు. నా పట్టుదలనీ, నా ఆత్మగౌరవాన్ని సడలించుకుని అతడి చేతులు పట్టుకుని అర్ధించాను. "....నాకు శిక్ష పడింది. అయినా ఫర్లేదు.... నా చెల్లెలు ఒంటిదయిపోయింది. అందులోనూ అది నిండు గర్భిణీ! దాన్ని పట్టించుకునేవాడేలేడు. మానవత్వంతో దాన్ని చేరదీయటం నీ కర్తవ్యం. ఒక్కసారి ఆలోచించు. జరిగినదంతా మర్చిపోదాం" అన్నాను. నా కళ్ళనుంచి నీళ్ళు కారసాగాయి. అయితే అవి వేదనవల్ల వచ్చినవి కావు. నా చెల్లి భవిష్యత్తు ఏమవుతుందో అన్న దిగులు వల్ల వచ్చినవి.
అతడు చేతులు విడిపించుకోలేదు. నావైపే చూస్తున్నాడు.... నా స్వరం గద్గదమైంది. "నీకు కావల్సింది నా ఓటమే అయితే నీ కాళ్ళు పట్టుకుంటాను. నా చెల్లెలికి అన్యాయం చెయ్యకు" అన్నాను వేడికోలుగా.
"అంత బాధ ఎందుకు? నా మీద కోర్టులోనే చర్యతీసుకోవచ్చుగా" అన్నాడు హేళనగా.
"మనిషి మనసుని కోర్టు మార్చలేదు. నీ ఉత్తరాలు నీకిచ్చేస్తాను. నీమీద కేసు కూడా ఉపసంహరించుకుంటాను. నేనూ లేక, నువ్వూ లేక ఆ ఒంటరి ఆడదాన్ని అడవి మృగాల్లాంటి మనుష్యుల మధ్య వదిలెయ్యకు. నీకు గానీ నా మీద కక్ష వుంటే నేను ఆనందంగా శిక్ష అనుభవిస్తాను. దీనివల్ల నీవు బావుకునేది ఏదీలేదు. రేపు నీ కేసు కోర్టుకి వచ్చినప్పుడు నువ్వూ ఇదే ఇరకాటంలో పడతావు."
కోపంగా ఒక్కసారి అతను చేతులు విదిలించుకోవటం వల్ల__ నా చేతులకి సంకెళ్ళు వుండటంతో తూలి ముందుకి పడ్డాను. అతడు కాళ్ళు వెనక్కి తీసుకున్నాడు.
మోకాళ్ళమీద కూర్చుని నేను తలెత్తి అతడిని అర్ధించాను. "అనవసరమైన ఆవేశంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావు! దీని పరిణామాల్ని గ్రహించి నువ్వు తప్పు దిద్దుకొనేసరికి సర్వనాశనమై పోతుంది. నా చెల్లెలు మిగలదు. అందుకే ఈ అభ్యర్ధన. ఇక్కడ ఎవరు గొప్ప- ఎవరు తక్కువ అన్న పంతాలు వద్దు. తెలివితక్కువల తారతమ్యం వద్దు."
అతడు నవ్వి, "ఇంత జరిగినా నువ్వు ఇంకా తెలివైన వాడివే అనుకుంటున్నావా?" అంటూ తలతిప్పి పక్కకి చూశాడు. పోలీసు వ్యాను పక్కనుంచి ఒక వ్యక్తి చేతిలో చిన్న కవరుతో వచ్చాడు.
అతడిని చూసి నేను అవాక్కయిపోయాను. మిన్ను విరిగి మీద పడినట్టయింది. భూమి చలనం ఆగిపోయింది. నా కళ్ళు నన్నే మోసం చేస్తున్నాయా?__ అన్న భ్రమలో అచేతనుడయ్యాను.
ఆ వచ్చింది నా తరపున వాదించిన కుర్ర లాయరు!!!
అతడందించిన కవరులోంచి నా చెల్లికి తను వ్రాసిన ఉత్తరాలు బైటకు తీశాడు. తాపీగా మరో జేబులోంచి అగ్గిపెట్టె తీసి, పుల్ల వెలిగించి ఆ ఉత్తరాల్ని అంటించాడు. అవి మండుతూ వుంటే అన్నాడు....
"చాలా తెలివైనవాడివి అనుకున్నావు కదూ.... పాపం 'మేకువి!!!' కానీ మేకు ఒకసారి గోడక్కొట్టేస్తే అలా పడివుంటుంది. పపట్ లాల్ అలాక్కాదు. పైకి మామూలుగా కనిపిస్తూ లోపల వాడిగా వుంటాడు. ఇంకెప్పుడూ నీ గురించి నువ్వు ఎక్కువ అంచనా వేసుకోకు!" అంటూ వెళ్ళిపోయాడు అక్కణ్ణుంచి లాయరుతో కలసి.
నేనింకా షాక్ నుంచి తేరుకోలేదు....
పోలీసులు నన్ను వ్యాన్ లో ఎక్కించటం తెలియలేదు. జైలు సెల్లోకి తొయ్యటం తెలియలేదు. చాలాసేపటికి అయోమయం నుంచి కొద్ది- కొద్దిగా బైటపడసాగాను. నా చెల్లెల్ని ఆత్మహత్య మిషమీద లాయరుగా నా దగ్గిర తనని తను పరిచయం చేసుకొని కోర్టులో ఫైలు చేస్తానని చెప్పి అతడు ఇంత బ్రహ్మాండమైన నాటకం ఆడాడన్నమాట. ఎవరైతే ఇంతకాలం నా గుప్పెట్లో వున్నారనుకున్నానో అతడి మీద కోర్టులో కేసు వేయబడనేలేదు. కేసువరకూ ఎందుకు? అసలు సాక్ష్యాధారాలే కాల్చివేయబడ్డాయి. నేనే ఒక మూర్ఖుడిలా వాటిని 'వాళ్ళ' చేతికి అందజేసాను.
మొదట కలిగిన విస్మయం మంచులా విడిపోయిన కొద్దీ నాకు కసి పెరగసాగింది పగ....పగ....పగ. అది తప్ప ఇంకేమీలేదు. నా చెల్లెలు ఏమయిందో తెలీదు. ఏమవుతుంది__ నా అనేవాళ్ళు లేని ఆడపిల్ల.... చేతిలో పైసాలేని అభాగిని.... మొదట్లో రెండు నెలలు వచ్చి తన కష్టాలు చెప్పుకుని ఆ తరువాత ఒక్కసారి కూడా నన్ను చూడటానికి రాకపోవటంతో నా అనుమానం నిజమైంది.... నా కేడుపు రాలేదు....పగ. అంతే..అదే మిగిలింది. అయిదు సంవత్సరాలు పాటూ దాన్నే మననం చేసుకుంటూ జైల్లో గడిపాను. చివరకు నేను విడుదల అయ్యే రోజు వచ్చింది.
విడుదల అయ్యాను.
మనసులో ఆశ చావక, మా పాత ఇంటికి వెళ్ళాను. నేను వూహించింది కరెక్టే. చెల్లి చచ్చిపోయింది. అది విని కూడా నేను మామూలుగా వుండటం చూసి ఆ వార్త చెప్పినవాళ్ళు ఆశ్చర్యపోయారు.
అక్కణ్నుంచి బజారుకి వెళ్ళాను.
మంచి పదునైన కత్తి కొనుక్కుని 'అతడి' ఇంటికి వెళ్ళాను. అప్పుడు సాయంత్రం అయిదయింది. ఈ సాయంత్రమే 'పని' పూర్తయి పోవాలి.
అతనిల్లు అలాగే వుంది. ముందు చిన్న తోట. గేటు దగ్గిర గూర్ఖా. వయసుతోపాటు మరింత లావయ్యాడు అతడు. వళ్ళో పాపని కూర్చోబెట్టుకుని ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్న వ్యక్తి ఒకప్పుడు నా తరపున వాదించిన లాయరు. నేను జైలుకి వెళ్ళాక, ప్రాక్టీసు మానేసి, మంచి జీతానికి ఇతడి దగ్గిర మేనేజరుగా చేరినట్టు తెలిసింది.... మంచిదే.... ఒకే కత్తితో రెండు హత్యలు.
ఒకడిది స్థూలకాయం-మరొకడు అర్భకుడు.
గూర్ఖా ఎక్కడో గేటు దగ్గిర వున్నాడు. నా కాళ్ళ వేగం మీద, నా చేతులు బలంమీద ఆకు నమ్మకం వుంది. మెరుపుకన్నా వేగంగా పరుగెత్తటాన్నీ, కనురెప్పపాటులో పొడవతాన్నీ జైల్లో అయిదు సంవత్సరాల పాటు, అదే నా జీవిత లక్ష్యంలాగా ప్రాక్టీసు చేశాను.
అది నిరూపించుకునే సమయం ఇప్పుడొచ్చింది.
గోడమీద చేతులు ఆన్చి లోపలికి దూకబోతూంటే ఒక ఆలోచన స్పురించింది. ముందు చిన్న ఆలోచనే. కానీ క్షణంలో అది మనసంతా నిండుకుంది.
గోడమీద నుంచి చేతులు తీసేశాను.
గోడ అవతలికి మరోసారి పరకాయించి చూశాను.
కూతురితో ఆడుకుంటున్న అతని కళ్ళల్లో సంతోషం కొట్టొచ్చినట్టు కనపడుతూంది. ఏ సంతోషాన్ని నా చెల్లెల్తోపాటు నేను కోల్పోయానో అదే సంతోషం.
పొడిచేస్తే ఏముంది? 'అమ్మా' అంటాడు. ప్రాణం పోతుంది. అదికాదు కావల్సింది. ఇంట్లో ఒక ఆడపిల్ల కడుపుతో తిరుగుతూ వుంటే, ఆ కడుపుకి కారణమయిన వాడు, నేను చేసుకోను పొమ్మంటే ఆ బాధ ఎలాంటిదో రుచి చూపించాలి. ఆగుతాను ఫ్రెండ్! నీ కూతురికి ఇరవయ్యేళ్ళు వచ్చేవరకూ ఆగుతాను. ఈ లోపులో నేను కాస్త నిలదొక్కుకుంటాను. తరువాత ట్రంప్ కార్డ్ నేను వేస్తాను. గోడక్కొట్టేసిన మెకు అలానే వుండిపోదని, ఎత్తుకు పై ఎత్తు వేస్తుందనీ సోదాహరణంగా నిరూపిస్తాను! ఏ మాస్టర్ ప్లాన్ తో నువ్వు నన్ను జైలుకి పంపావో, అంతకన్నా పెద్ద ప్లాన్ వేసి నిన్ను చిత్తు చేస్తాను. ఎవరికీ చెప్పుకోలేని బాధతో నువ్వు విలవిల లాడేటట్టు చెయ్యకపోతే నా పేరు ప్రసాదరావే కాదు.
ఆ రోజు రాత్రే బోంబే వెళ్ళిపోయాను.
* * *
బోంబేలో నా జీవితం చాలా నికృష్టంగా ప్రారంభం అయింది. నేను చదువుకున్న మాట నిజమే. కాని నాలా చదువుకున్న వాళ్ళు అక్కడ లక్షలు. రెండ్రోజులు పస్తున్న తరువాత బూట్ పాలీష్ ప్రారంభించాను. మొదటిరోజు సంపాదించింది పన్నెండు రూపాయలు. ఖర్చులు పోను ఆరు రూపాయలు మిగిలింది. రెండ్రోజులుగా పేరుకుపోయిన ఆకలి ఆ డబ్బును చూడగానే ఒక్కసారిగా విజృంభించింది. హోటల్లోకి పరుగెత్తబోయి- మళ్ళీ ఆగిపోయాను.
నా పగ!
మొదటిరోజు నుంచే నేను దానికి నీళ్ళుపోసి పెంచి పెద్ద చెయ్యకపోతే నెమ్మదిగా వాడి, నశించే ప్రమాదం వుంది.
ఆ రోజు నుంచే నేను నా సంపాదనలో సగంతీసి పక్కన వుంచటం ప్రారంభించాను. ఎంత ఆకలి వేసినా, ఎంత అవసరం వచ్చినా ఆ డబ్బు నుంచి నా కోసం ఒక్కపైసా కూడా వాడుకోలేదు. ఈ రోజుక్కూడా నేనేమైనా సంపాదిస్తే తినటం- లేకపోతే పస్తులుండటం....అంతే.
అలా కూడబెట్టిన డబ్బు మూడులక్షలయ్యేసరికి నాకు దాదాపు ఇరవై సంవత్సరాలు పట్టింది. ఇరవై సుదీర్ఘమైన సంవత్సరాలు పైసా పైసా కూడబెట్టుకుంటూ ఒకే ఒక లక్ష్యంతో జీవించసాగేను! నిద్రలో కూడా నా గమ్యం పగ! అప్పుడప్పుడు వచ్చి ప్రత్యర్ధి ఎలా వున్నాడో దూరం నుంచి చూసి వెళుతూ వుండేవాడిని. అతడి కూతురు కాలేజీలోచేరి చదువు పూర్తి చేసింది, ఈ లోపులో!
ఇక నా ప్లాన్ అమలు జరపవలసిన సమయం ఆసన్నమైందని గ్రహించి బోంబేనుంచి పూర్తిగా తిరిగి వచ్చేసేను. ఇదిగో ఈ ఇల్లు తీసుకున్నాను.
అప్పటికే అతను కోటీశ్వరుడయ్యాడు! అయినా నా ప్లాన్ కేమీ భంగంరాదు.
ఆ తరువాత దాదాపు నాలుగు నెలలు అనుక్షణం అతడికి తెలియకుండా, అతడి నీడలాగా వెంటాడి అతడి దినచర్య తెలుసుకున్నాను. అతడి కూతురి మనస్తత్వమూ, అభిరుచులూ- ఇష్టాఇష్టాలూ అన్నీ కనుక్కున్నాను. ఇక రంగంలోకి దూకడమే తరువాయి.
