Previous Page Next Page 
సంపూర్ణ ప్రేమాయణం పేజి 9


    అలాంటి రుజువులు సంపాదించాలి!

    రాజ్యాన్ని అదే కోరాను. ఎలాగైనా ఆ కుర్రవాడి చేతివ్రాతతో రెండు మూడు ఉత్తరాలు సంపాదించమని చెప్పాను. మొదట వప్పుకోలేదు. బ్రతిమాలి, కోప్పడి ఎలాగైతేనేం దాన్ని వప్పించాను. అతి కష్టంమీద నాక్కావలసిన ఉత్తరాలు లభించాయి. ఆ కుర్రవాడు పెళ్ళి విషయం 'కమిట్' అయ్యాడు. ఇదంతా జరగడానికి రెండు నెలలు పట్టింది.... కాలం ఆగదు. అది పాపం రూపంలో రాజ్యం కడుపులో పెరుగుతూనే వుంది. దానికిప్పుడు అయిదో నెల. ఈ విషయం ఇంకా కుర్రవాడికి తెలీదు. రాజ్యం నన్ను దెప్పి పొడవసాగింది. తన ప్రేమికుడు అలాంటివాడు కాదనీ, ఈ విషయం తెలిసిన మరుక్షణం పెళ్ళి చేసుకుంటాడనీ, దీనికింత ప్లాను అనవసరం అనీ వాదించింది. సరే, వెళ్ళి చెప్పమన్నాను. అప్పటికే నాక్కావలసిన ఆయుధాలన్నీ సిద్ధం చేసుకున్నాను.

    ఆ సాయంత్రం వాళ్ళిద్దరూ కలుసుకున్నారు.

    అయిదు నిముషాల్లో ఏడుపు మొహంతో తిరిగివచ్చిన నా చెల్లెల్ని చూస్తే జరిగిందేమిటో చెప్పకనే అర్ధమయింది. ఇద్దరు ప్రేమికులు కలుసుకున్నప్పుడు నెల తప్పటం గురించి అనుమానం వెలిబుచ్చటం వేరు ఇంకో మూడునెలల్లో నీకు బాబునో, పాపనో, కని యిస్తానని చెప్పటం వేరు. ఆ కుర్రవాడి అదిరిపోయాడు. ముందు తనకేం తెలీదని బుకాయించటానికి ప్రయత్నించాడు. తరువాత ఈ సమస్యని సులభంగా 'పరిష్కరించుకోవటం' గురించి మాట్లాడసాగాడు. రాజ్యానికి ఇది ఊహించని షాకు. ఏడుస్తూ తిరిగి వచ్చింది.

    అది ఊహించిన విషయమే కాబట్టి నేను అంతగా ఆశ్చర్యపోలేదు. నేను రంగంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైంది అనుకున్నాను. ఆ మరుసటిరోజే అతడు వ్రాసిన ఉత్తరాలు పట్టుకుని తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అతడే వున్నాడు ఇంట్లో. అదే మొదటిసారి అతడిని పరీక్షగా చూడటం. డబ్బు సంపాదించి పెట్టిన వెన్న తినీ-తినీ మెదడు మొద్దుబారి- ఒళ్ళు లావుబారి, మొద్దుగా వున్నాడు. ఇలాంటి వాళ్ళని బ్రతిమాలటం కన్నా రాబోయే పరిణామాలు సూచిస్తే పనులు జరుగుతాయి. ఒకసారి మూడుముళ్ళు పడితే ఇక భార్యతో సవ్యంగానే కాపురం చేయటం మొదలు పెడతారు. వీళ్ళకి డబ్బు సంపాదించటంలో వున్న తెలివితేటలు మిగతా విషయాల్లో వుండవు.

    "నీ నాన్నగారున్నారా?" అని అడిగాను.

    "లేరు. నువ్వెవరివి?" అన్నాడు.

    "రాజ్యలక్ష్మి అన్నని" అన్నాను. అతడిలో ఉలికిపాటు స్పష్టంగా కనబడింది.

    "ఎ....ఎందుకొచ్చావ్ ఇక్కడికి? ఏం కావాలి?" అని అడిగాడు కుర్చీలోంచి లేస్తూ.

    "నువ్వే__నా చెల్లెలికి భర్తగా" అన్నాను రెండు ప్రశ్నలకి ఒకే సమాధానంగా.

    "రాజ్యలక్ష్మి ఎవరో నాకు తెలీదు" అన్నాడు బింకంగా.

    "నేను నవ్వాను. సరిగ్గా ఇలాంటి సమాధానమే ఇస్తావని నాకు తెలుసు. నీవు వ్రాసిన ఉత్తరాలు నా జేబులో వున్నాయి. మీ నాన్నని పిలువు. ఈ ఉత్తరాలు బైటపడితే ఏమవుతుందో నీకన్నా ఆయనకే బాగా తెలుస్తుంది. కొడుకు భవిష్యతు గురించి ఆయనే చూసుకుంటారు" అన్నాను.

    "ఏ ఉత్తరాలు?" అన్నాడు. ఈసారి అతడి కంఠంలో భయం స్పష్టంగా కనబడింది.

    "నువ్వు నా చెల్లెల్ని పెళ్ళిచేసుకోని పక్షంలో నిన్ను వ్యాయస్థానంలో నిలబెట్టే ఉత్తరాలు" అంటూ నవ్వేను. "నా చెల్లెలు అమాయకప్పిల్ల తెలివిగా దాన్ని మోసం చేశావు. అంతవరకూ బాగానే వుంది. కానీ నీకన్నా తెలివైనవాణ్ణి దాని వెనుక 'మేకు'లా వున్నానని మర్చిపోయావు. నీకు లీగల్ పాయింట్లు సరిగ్గా తెలియవేమో! పపట్లాల్ బాగా ప్రేమ గురించి కమిట్ అయ్యావు. నీకు వయసైతే పెరిగింది కానీ తెలివి పెరగలేదు. మీ నాన్నగార్ని పిలువు. ఆయన నీకన్నా నిశ్చయంగా తెలివైనవాడూ- లోకజ్ఞానం తెలిసినవాడూ అయివుంటాడు. నీ నిర్వాకం న్యాయస్థానం వరకూ వెళ్ళకముందే గుట్టుచప్పుడు కాకుండా నా చెల్లెల్ని కోడల్ని చేసుకుంటాడు" అన్నాను.

    "ఈ విషయం నాన్నగారికి తెలియటానికి వీలులేదు" అన్నాడు అతను.

    "అయితే మనమే సెటిల్ చేసుకుందాం. ముందు రిజిస్టారాఫీసులో వివాహం చేసేసుకోండి. తరువాత ఆయన కాదనడు. నా చెల్లి నిన్ను ఎంతగానో ప్రేమిస్తూంది. దాని ప్రేమని పొందిన నువ్వు అదృష్టవంతుడివి. దాని అన్నగా చెప్పటం కాదు__ రాజ్యం అమాయకప్పిల్ల. ఆ విషయం మనసు లోతుల్లో నీకూ తెలుసు" అన్నాను వేడికోలుగా.

    "నాన్నగారివరకూ వెళ్ళకూడదన్నది ఈ విషయం కాదు. అసలు మొత్తం విషయమే వెళ్ళకూడదు. నువ్వన్నట్టూ మనమే సెటిల్ చేసేసుకుందాం. చెప్పు- ఎంత కావాలి?"   

    కోపాన్ని అణుచుకుంటూ నవ్వాను. ఇటువంటి సన్నివేశంలో మోసం చేసినవాడు ఈ మాట అనటం ప్రతిసారీ వస్తున్నదే. దానికి సమాధానంగా స్త్రీ- "ఛీ! నువ్వింత నీచుడివనుకోలేదు. నిన్ను ప్రేమించటం నాదే పొరపాటు. మన ప్రేమని ఇలా డబ్బుతో కొలుస్తావా?" అని గిరుక్కున తిరిగి వెళ్ళిపోవటం ఆనవాయితే.

    కానీ ఇక్కడున్నది నా చెల్లి కాదు, నేను! నాకు ప్రపంచం తెలుసు. త్యాగాలూ, తిరస్కారాలూ కూడు పెట్టవు. అన్నిటికన్నా మించి__నా దగ్గిర సాక్ష్యాధారాలున్నాయ్. ఆ విషయమే చెప్పాను.

    "నీ దగ్గరవున్న సాక్ష్యాలు ఇచ్చెయ్యటానికే అడుగుతున్నాను. నాన్నగారు విదేశాల్నుంచి తిరిగి వచ్చేలోపులో ఈ మాటర్ సెటిల్ అయిపోవాలి. కొంచెం తెలివిగా బిహేవ్ చేసి, ఎంత కావాలో చెప్పు! ఇంత చిన్న విషయం నాన్నగారి వరకూ వెళ్ళటం అంత బావోదు." పపట్ లాల్ ఇంత ధైర్యంగా మాట్లాడతాడని అనుకోలేదు.

    లేచి, "అయితే మనం మాట్లాడుకోవాల్సింది ఏదీలేదు. కోర్టులో కలుసుకుందాం" అంటూ వెనుదిరిగాను.

    "ఆగు" అన్నాడు చప్పున. ఆగాను. "నాకో అయిదు నిముషాలు ఆలోచించుకోవటానికి టైమ్ ఇవ్వు" అన్నాడు.

    అతడివైపు కన్నార్పకుండా చూశాను. అతడిలో ఏం తేల్చుకోవాలన్న మధన కొట్టిచ్చినట్టూ కనబడుతూంది. "నా కభ్యంతరం లేదు! కూర్చుంటాను" అన్నాను.

    అతడు కాఫీ పంపాడు. మూడు నిమిషాలు....నాలుగు....అయిదు నిమిషాలు గడిచినయ్! అంతలో గేటు దగ్గిర శబ్దం వినిపించింది. తలతిప్పి చూసేను! పోలీసు వ్యాను లోపలికి వస్తూ కనిపించింది. నా మనసు కీడు శంకించి, కుర్చీలోంచి లేవబోయాను! ఈ లోపులో లోపల్నుంచి ముప్పై ఏళ్ళావిడ, పిచ్చిదానిలా వచ్చి నన్ను వాటేసుకుని, విడిపించుకోబోయే లోపులో చేతిని గట్టిగా కొరికింది! అంతా కన్నుమూసి తెరిచేలోపులో జరిగిపోయింది! బాధతో నా కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. వళ్ళు తెలియని కోపంతో దాని జుట్టు పట్టుకున్నాను. అదే సమయానికి ఇన్ స్పెక్టర్ లోపలకు ప్రవేశించాడు. మరో వైపు నుంచి అతను కూడా!

    "ఇంట్లో దొంగతనానికి ప్రవేశించీ ఎవరూ లేకపోవటం చూసి వంట మనిషిని 'రేప్' చెయ్యటానికి ప్రయత్నించినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను" అన్నాడు ఇన్ స్పెక్టర్.

    నా చెల్లెల్ని మోసం చేసినవాడు, నేను అనుకున్న దానికన్నా కాస్త తెలివైనవాడే. "థాంక్స్ ఇన్ స్పెక్టర్" అన్నాడు. "మా రత్తి చాలా మంచి నటీమణి. రేపు కోర్టులో కూడా ఏమీ బెదరకుండా సాక్ష్యమిస్తుంది లెండి. అసలు నేను చెయ్యాల్సింది చెప్పగానే, అక్కడికక్కడే వంటికి గాట్లు పెట్టుకుంది" అన్నాడు.

    ఇన్ స్పెక్టరు నా దగ్గరికి వస్తూంటే అతను తిరిగి అన్నాడు, "ఇన్ స్పెక్టరుగారూ! మనం ఫోన్ లో సెటిల్ చేసుకున్నట్టూ వీడికి ఎన్నేళ్ళు శిక్షపడితే మీకన్నివేలు. మీకు ఇందాక ఫోనులో చెప్పని విషయం ఇంకోటి వుంది. అఫ్ కోర్స్, అది నా పర్సనల్ విషయం అనుకోండి! వీణ్ణి లాకప్పులోకి తీసుకెళ్ళబోయేముందు వీడి జేబులో ఒక కవరు వుంటుంది. దాన్ని మాడ్చి మసి చేసెయ్యాలి. అది నా కిచ్చేయండి! దానికో పదివేలు ఎక్స్ స్ట్రా" అన్నాడు.

    నేను ప్రతిఘటించలేదు. ఇన్ స్పెక్టర్ నా జేబులోంచి కవరు దాదాపు లాక్కొన్నాడు. ఆ కుర్రవాడు అగ్గిపెట్టిలోంచి పుల్ల బయటకు తీశాడు. ఇన్స్ పెక్టర్ అందించిన కవరులోంచి కాగితాలు తీసి అంటించబోతూ షాక్ తగిలిన వాడిలా ఆగిపోయాడు.

    అవి ఫోటో స్టాట్ కాపీలు. అసలు ఉత్తరాలు కావు.

    అప్పటివరకూ నిశ్శబ్దంగా వున్నవాణ్ణి ఒక్కసారిగా బిగ్గరగా నవ్వాను. "నేను మేకులాంటివాడినని ముందే చెప్పానుగా పపట్ లాల్! నీ దగ్గరకు వస్తూ ఒరిజినల్ ఉత్తరాలు తీసుకొస్తానని ఎందుకు అనుకున్నావు? జరిగిందానికి క్షమాపణలు చెప్పుకుని నా చెల్లెల్ని చేసుకో...." అన్నాను! అతడి మొహం తెల్లగా పాలిపోయింది.

    "వీణ్ణి తీసుకెళ్ళండి ఇన్స్ పెక్టర్ గారూ!" అన్నాడు. 

    ఆ మరుసటిరోజు ఆవేశం తగ్గాక అతడు వస్తాడని అనుకున్నాను. ఎందుకంటే నా దగ్గిరవున్న ఉత్తరాల సాక్ష్యంతో అతడు నా చెల్లిని చేసుకోకుండా తప్పించుకోలేడు. లేదా నాతోపాటే జైలుశిక్షన్నా అనుభవించి తీరాలి. రెండోది జరగటం అసంభవం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా అతడు రాజీకి రావాలి__తప్పదు.

    కానీ నేను అనుకోని ప్రమాదం మరోవైపు నుంచి వచ్చిపడింది! నేను లాకప్పుకి వెళ్ళడంతో నా చెల్లి బెదిరిపోయింది. దానికితోడు ఉట్టి మనిషి కూడా కాదు. ఇన్ని సమస్యల్ని తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది! అయితే అదృష్టవశాత్తూ ఒక యువకుడు ఆమెని రక్షించి లాకప్పులో వున్న నా దగ్గరకు తీసుకొచ్చాడు. మా కధ విని కరిగిపోయి నా తరపున వాదిస్తానన్నాడు. అతడో లాయరు, నాలాగే కుర్రవాడు! అయినా చురుకైనవాడు. అతడి కళ్ళు విజ్ఞానంతో మెరుస్తున్నాయి!  

    నామీద 'రేప్' కేస్ కోర్టుకెళ్ళే సమయానికి అతడి మీద నా చెల్లెల్ని మోసం చేసినందుకు కేసు వేసేము! లాకప్ లో వుండే పవర్ ఆఫ్ అటార్నీ మీద సంతకం పెట్టి ఉత్తరాలు కోర్టులో ఫైలు చేయించాను లాయరు ద్వారా__

    మొదట నా కేసు వచ్చింది. రత్తికి ఎంత యిచ్చాడో తెలీదు కానీ జడ్జీ హృదయం కరిగిపోయేటట్టు అది నాటకమాడింది! 'పపట్ లాల్'__ తను ఇంటికివచ్చే సమయానికి ఇంట్లోంచి కేకలు వినబడుతున్నాయనీ, బైట తలుపు గొళ్ళెం పెట్టి పోలీసులకి ఫోన్ చేసేననీ సాక్ష్యం చెప్పాడు. ఇన్స్ పెక్టర్ దానికి వంత పాడేడు! నా మీద చాలా పకడ్భందీగా కేసు అల్లబడింది. నా తరపు లాయర్ శక్తివంచన లేకుండా వాదిస్తున్నాడు! కేసు ఫైనల్ హియరింగ్ కి వచ్చింది.

    ఆ సాయంత్రం మా లాయర్ నన్ను కలుసుకున్నాడు! అతడి మొహం కళాహీనంగా వుంది. "మనం ఓడిపోతామేమో.... చాలా జాగ్రత్తగా ప్రాసిక్యూషన్ సాక్ష్యాలు తర్ఫీదు ఇవ్వబడ్డాయి" అన్నాడు.

    "మరేం చేద్దాం!" అన్నాను.

    "అదే అర్ధం కావటం లేదు."

    "నేను ఏ తప్పూ చేయలేదు. కేవలం ముగ్గురు కలసి ఒక నిర్దోషిని జైలుకి పంపగలరా? న్యాయస్థానం అంత గుడ్డిదా?" అన్నాను ఆవేశంగా. అతడు జాలిగా నావైపు చూసి, "న్యాయస్థానం గుడ్డిదేకాదు_ చెవిటిది కూడా. జడ్జి ఆర్గ్యుమెంటు అసలు వినిపించుకోవటంలేదు" అన్నాడు.

    ఆ మరుసటిరోజే జడ్జిమెంట్ చెప్పేది! ఏం చెయ్యడం?

    "ఎన్నేళ్ళు శిక్ష పడవచ్చు?" అని అడిగాను.

    "ఎనిమిది సంవత్సరాలదాకా పడవచ్చు."

    ఎనిమిది సంవత్సరాలు....ఎనిమిది సుదీర్ఘమైన సంవత్సరాలు!

    లాయరు నావైపు చూసి, "నన్ను క్షమించండి! నేను చేయగలిగినదంతా చేసాను" అన్నాడు. నేను నొచ్చుకుంటూ, "దీనికి ఎవరు మాత్రం చేయగలిగిందేముంది?" అన్నాను. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS